శారదా సంతతి ~ 53 : రోచిర్లీలా గానవైభవ యోగం ~ రోషనారా బేగం

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
29—07—2018; ఆదిత్యవాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“శ్రీశారదా సంతతి ~ 53″| రోచిర్లీలా గానవైభవ యోగం ~ రోషనారా బేగం| (సుమారు 1917వ సంవత్సరప్రాంతం నుండి 06—12—1982 వరకు)

అది 1920వ సంవత్సరప్రాంతం! కలకత్తా మహానగరంలోని ఒక కోఠీ ప్రదేశంలో ఒక సన్నని సందు. ఆ సందులోని ఒకపాతమేడలో, ఒక వాటాలోనుంచి, మంచి సుశ్రావ్యమైన పాటని ఆ ఇంటి గృహిణి పాడుతోంది. ఆమె పాటని అనుసరిస్తూ ఐదుసంవత్సరాలలోపు వయస్సున్న ముద్దులు మూటగట్టే బొద్దుగావున్న పాప కూడా-కూడా సుమధురకంఠంలో యథాతథంగా పాడేస్తోంది. ఆ పెద్దామెకి పాతికేళ్ళుంటాయేమో! ఆమె పేరు చందాబాయి(చంద్రికాబాయి అనడంకూడా కద్దు). ఆ పసికూన ఆమెబిడ్డే! చిన్నప్పటినుంచీ సంగీతమన్నా, పిల్లులని, ఇతర పెంపుడు జంతువులని పెంచడమంటేను ఆ పిల్లకి వల్లమాలిన యిష్టం!

అందువల్ల చందాబాయి పిల్లిపిల్లలని పెంచడంలో విశేషప్రీతిగల తన పిల్లని, పిల్లి అరుపైన “మ్యావు, మ్యాcవు” ధ్వనికి అనుకరణ రూపంగా, “మామూ” అనే ముద్దుపేరుతో పిలిచేది. మామూ పాటలలోనేకాక, ఆడపిల్లలు ఆడుకునే అప్పటి కాలానుగుణమైన అందమైన బొమ్మలాటలలోకూడా ఆరితేరినదే!అలాగ తన ఆటలలో నిమగ్నమైపోయి తల్లి పిలుపులని పెడచెవినిపెట్టిన కొన్ని సందర్భాలలో చందాబాయి కాస్తంతైనా భయ-భక్తులలో పెట్టకపోతే పిల్ల భవిష్యత్తు బాగుండదని భావించి మామూని బెదిరిస్తూ కొట్టడానికి వచ్చేది. వారి ఇంట్లోని విశాలమైన పెరటిలో ఒక పెద్ద వేపచెట్టు ఉండేది. మామూ తన తల్లికి అందకుండా ఆ వేపచెట్టు చుట్టూ పరుగులు పెట్టేది. చందాబాయి  పిల్లవెనక పరుగుపెట్టలేక ఆయాసంతో రొప్పుతూ పెరటిలోని సిమెంటు తిన్నె మీదకూర్చుని నిస్సహాయంగా మామూకేసి చూస్తూవుండిపోయేది. ఈ లోగా  పక్కింటి సజనీబాయి, “చందూ! ఎందుకొచ్చిన కోపం? మామూ ఏమంత తప్పు చేసిందని? ఆ వయస్సులో మనమందరమూ ఇరుగు-పొరుగు పిల్లలతో కలిసి మహాకోలాహలంగా ఇల్లుపీకి పందిరి వేసేవాళ్ళం! మన తలి దండ్రులు మనతో నెగ్గుకురాలేదూ? అంతేకాక మామూ ఆటలాడుకోవడంతప్ప పాడుపనులు చెయ్యదు. మన సందులోని అల్లరిమూకలతో చేరదు. తన మానాన తాను ఒక్కత్తీ ౘక్కగా సన్నని గొంతుకతో కూనిరాగాలు తీస్తూ, అందంగా పాటలు పాడుకుంటూ మనందరి మనస్సులకి విందుచేస్తూ హాయిగా ఆడుకుంటుంది. తన పాటలు పాడుకోవడంలోవున్న ఏకాగ్రత తన ఆటలలోకూడావుంది. అంతేకదా! అదేమైనా అంతటి తగని నేరమా, చెప్పు చందా జాన్ ? పైగా నీకు ఉన్నది ఈ  ఒక్కబిడ్డేకదా! మామూ వెనకా-ముందూ ఇంకెవ్వరూలేరుకదే చందాజాన్! నేను ఈ రోజు అనే ఈ మాట తప్పక నిజమై తీరుతుంది. మన మామూ తన గాత్రసంగీతంతో లోకంలోని సంగీతరంగంలో మకుటంలేని మహారాణిగా పేరు తెచ్చుకుని మనందరికీ కీర్తిని తెచ్చిపెడుతుంది” అనగానే చందాబాయి నవ్వుతూ “అల్లాః దయవలన మామూ అంతటిది అవ్వాలి. కాని ఒకే ఒక్క బిడ్డకనక నా గారాబంవలన పాడవ్వకుండా నీ వంటివారి ఆశీస్సులతో సంగీతరంగంలో రాణించి నాలాగ ఈ పాట్లన్నీ పడకుండా మంచి స్థితి-గతులుపొందాలి, సజనీ జాన్ !” అంటూ చందాబాయి ఇంట్లోకి వెళ్ళి పోయేది, అనేక సందర్భాలలో!

అసలు ఆ పిల్లకి “మెహరున్నీసా” అనే పేరు పెట్టేరు. ఐతే, కాలాంతరంలో, మహాపురుషుడైన ఒక ‘వార్సీ ఫకీరు” (సిద్ధుడు) వారి ఇంటికివచ్చి సంగీతగానంలో బాలమేధావి(child prodigy) అయిన మెహరున్నీసా పాటని విని ముగ్ధుడైపోయి, “ఈమె రాబోయే కాలంలో లోకంలో శాస్త్రీయసంగీతంలో మహాగాయనీమణిగా పేరుపొంది, సంగీతప్రపంచంలో క్రొత్త వెలుగులని వెదజల్ల బోతోంది. అందువల్ల ఈ చిన్నారి పాటలపాప “రోశ(ష)నారా బేగం” అనే పేరుతో విశ్వవిఖ్యాతినిగడిస్తుంది” అని ఆశీర్వదించి వెళ్ళిపోయేడు. అప్పటినుంచి ఆమె పేరు,”రోశ(ష)నార“, అంటే, “(సంగీతం)ప్రసిద్ధిని శోభింపజేసేది” అని అర్థం చెప్పవచ్చు!

సహజ సంగీతగాన ప్రతిభతో పుట్టిన సంగీతశారదాతనయ రోషనారా బేగం!
(1) దైవదత్తమైన గానయోగ్య అపూర్వ కంఠప్రజ్ఞ,
(2) గొప్ప గురువు లభించడం (కిరానా ఘరానా సంగీత దైవం, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాc సాహెబ్ రోషనారాజీకి గురువుగా లభించడం సంగీతసరస్వతీదేవి అనుగ్రహించిన వరం),
(3) అపారమైన ఆసక్తితో, అమేయమైన శ్రద్ధతో నిరంతర సాధనని చేయడం,
(4) కళాకారిణికి/కళాకారుడికి తనయొక్క విద్యయందు, తనదైన ఆత్మీయముద్రతో కూడిన అజరామరమైన కళాభివ్యక్తీకరణలోను, రసజ్ఞులముందు తన కళాప్రదర్శనలోను సంపూర్ణ అంకితభావం కలిగివుండడం అనే ఈ నాలుగు విషయాలు రోషనారాబేగంని ఒక మహాగాయనిగా తీర్చి దిద్దేయని ఆమె స్వయంగా ఒక పాకీస్థానుదేశంలోని దూరదర్శనకేంద్రం(T.V.)వారి ఇంటర్వ్యూలో తెలియజేసేరు.

% % % % % % % % % % % %

రోషనారాకి తొమ్మిదేళ్ళ వయస్సున్నప్పుడు, ఆమె తన తల్లి దగ్గరికివెళ్ళి తనకి శాస్త్రీయసంగీతం నేర్పించమని అడిగింది. వెంటనే తల్లి గారు తనకి బాగా తెలిసిన ఉస్తాదు, సారంగీ వాద్యనిపుణుడు అయిన ఉస్తాద్ లద్దన్ ఖాc వద్ద ఇంట్లోనే సంగీతం పాఠాలు ప్రారంభించే ఏర్పాటు చేసేరు. కలకత్తాలో  శాస్త్రీయసంగీతవిద్యకి సంబంధించిన మంచి వాతావరణం అప్పుడూ-ఇప్పుడూ కళాకారులకి, కళారసజ్ఞులకి అనుకూలంగాను, ప్రోత్సాహకరంగాను ఉంది. ఆ విధంగా సంగీతంలో ప్రారంభవిద్యని శ్రద్ధాసక్తులతో రోషనార నేర్చుకునేది. అలాగ నాలుగేళ్ళు గడిచేయి. ఒకరోజు సంగీతపాఠం ౘక్కగా నడుస్తోంది. ఆ సమయంలో ఉస్తాద్ లద్దన్ ఖాcగారి మిత్రుడు ఉస్తాద్ బహాదుర్ ఖాc వచ్చేరు. ఆయనవస్తూనే అమృతమయమైన వార్తని తీసుకువచ్చేరు. మిత్రులమధ్య సంభాషణ ఇలాగ జరిగింది:—

బహాదుర్జీ:—
మిత్రమా ఎలా ఉన్నావు? పాఠాలు ఎలా సాగుతున్నాయి? రోషనారా?  నామిత్రుడిదగ్గర సంగీతవిద్యని రెండు చేతులతోనూ జుర్రేస్తున్నావా?

లద్దన్ జీ:—
అల్లాః దయవల్ల అందరం బాగానేవున్నాం మిత్రమా! పాఠాలు చెప్పడానికి నాకు నాలుగు మూఖాలుంటేతప్ప ఈ పిల్ల సంగీతక్షుధ తీరేలాగ లేదు. ఇంతకాలం ఏమైపోయేవు? ఆ మధ్య మీ ఇంట్లో అడిగితే బొంబాయి  వెళ్ళేవనిచెప్పేరు. అప్పటినుంచీ బొంబాయేనా, లేక వేరే ప్రాంతాలనికూడా దర్శించి దేశయాత్రవంటిది జరిపి వస్తున్నావా?

బహాదుర్జీ:—
నాయనా! ఎంతకాలమైనా బొంబాయి విడిచిపెట్టిరావడం నా వల్లకాలేదనుకో! ఇప్పటికైనా ఖాcసాహెబ్ మీరజ్ వెళ్ళడంవలన ఇలాగ ఊడిపడగలిగేనయ్యా! బొంబాయిలో అనేకస్థలాలలో ఆ ఉస్తాద్జీ మహామహిమాన్వితమైన గానంవినిన నా మట్టుకునాకు గంధర్వలోకంనుంచి ఎవరో మహాగంధర్వగాయకోత్తముడు హఠాత్తుగా శాపవశాననో, రసజ్ఞలోక తపఃఫలరూపమైన వరంగానో లేక ఆ రెండు కారణాలవలననో ఈ భూలోకంలోకి వచ్చి పడ్డారేమో అనిపిస్తోంది. ఏం సంగీతం? ఏం గానం? ఏం రసికజన హృదయ రంజకత్వం? అసలు భూమి మీద అలాంటి సంగీతం సాధ్యమేనా? అది వినిన నేనెంత ధన్యుడిని? ఆ వివరాలు వింటున్న మీరందరూ ఎంత పుణ్యాత్ములోకదా! జీవితంలో ఒక్కసారైనా వినకుండా తనువు చాలెంచే రసజ్ఞుల జన్మ వృధా ఐపోయినట్లేకదా! ఆ మహానుభావుడి శిష్యులేకాక, ఆ శిష్యులయొక్క శిష్యులుకూడా మహాగాయకులైపోయి లోకంలో ధనాన్ని, యశస్సుని ఆర్జించడంతోబాటు సంగీతరంగంలో తమకి శాశ్వతస్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఉదాహరణకి ఆ ఉస్తాద్జీకి తగిన శుశ్రూషచేస్తూన్న ఉస్తాద్జీ శిష్యులైన పండిత్ సవాయి గంధర్వ(రాంభావు కుండుగోల్కర్ ), సవాయిగంధర్వ శిష్యులైన మాస్టర్కృ ష్ణారావ్ ఫూలాంబ్రికర్ ఇప్పటికే సంగీతప్రపంచంలో పేరు-ప్రఖ్యాతులని, తమకంటూ ఒక విశిష్టస్థానాన్ని సంపాదించుకున్నారు.

లద్దన్జీ:—
అయ్యా! మీ స్వప్నలోకంలోంచి ఎకాఎకీగా ఈ కలకత్తా గల్లీలోని ఈ ఇంటి హాలులోకి అడుగుపెట్టేసినట్టున్నారు! కాస్సేపు ఆ కవిత్వధోరణిని కట్టిపెట్టి, అసలుసిసలైన ఆ ముచ్చటని మా అందరికీ స్పష్టంగా అర్థమయ్యే భాషలో, మా వంటి సామాన్యులకి అందుబాటులోవుండే మాటలలో చెప్పండి! ఏమిటాసంగీతం? పాడినాయన ఎవరు? ఆ పాటలోని అంతటి విలక్షణత ఏముంది? మొదలైన విశేషాలేవీ వివరించకుండానే మీరు అలా అద్భుతవర్ణనలు చేస్తూ పరవశించిపోవడం ఎలావుందంటే, చెట్టు పేరు చెప్పడం మానేసి ఆ చెట్టుయొక్క పండ్లరసాన్ని, దాని రుచిని అదేపనిగా స్తుతిస్తూవెళ్ళిపోతున్నట్లుగా ఉంది మహాప్రభో!

బహాదుర్జీ:—
లద్దూభాయ్ ! నీవా సమయంలో నా ప్రక్కనేవుండివుంటే నన్ను విడవకండా ఆ ఉస్తాద్జీ వెనకపడి మీరజ్ తీసుకుపోయేవాడివి. అసలు విషయం సిసలైన మాటలలో చెపుతున్నాను, విను! ఆయన పేరు ఖాcసాహబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాc! వారిది కిరానా ఘరానా గాయకీ అంటారు. ఆ ఘరానాని ఆ విధంగా పాడడంలో ఆయనే ఆద్యుడు. అందుకని ఆయనని కిరానా ఘరానాకి మూలపురుషుడిగాకూడా ఎందరో అభిమానులు ఆరాధిస్తున్నారు. అందరి గాయకులలాగ ఆయన పాడడంలేదు. ఒక అపూర్వ, అలౌకిక ఆరాధనా పూర్ణ దైవకైంకర్యభావంలో తన్మయులై ఆయన గళం విప్పేసరికి సంగీతామృతరసం వెన్నెలవాకలై వారి నోటినుండి ౙాలువారుతూ రసజ్ఞశ్రోతల హృదయాలలోకి ప్రవహించి, వారిని పరవశింపజేసి, వారి అరమోడ్పు కన్నులనుంచి ఆనందమై పెల్లుబుకుతోంది. సంగీతంయొక్క పరమావధి అంటే, అలాగ రసికవరశ్రోతలందరిని నాదసమాధిస్థితిలోకి తీసుకువెళ్ళ గలగడమేకదా! మనలో కరుడుకట్టుకుపోయిన మన కాఠిన్యం, కార్పణ్యం, కాపట్యం వంటి కఠోర కాలుష్యాలనన్నీ కరీంఖాcసాహెబ్జీ సంగీతం ఎంతో కొంత ప్రక్షాళణచేసి, వారి అలౌకికగానానికి కరిగి కన్నీటి మిన్నేరు కాగలిగిన యోగ్యతని మన మనస్సులకి కలుగజేస్తోందని నాకు అనిపిస్తోంది. సంగీతం అంటే అదే!

అటువంటి అపూర్వసంగీతం పాడుతూన్న ఆ ఉస్తాద్జీ ధన్యులు! అటువంటి సంగీతం విని తమ నయనాంబుధారలతో ఆ సంగీతశారదాపాదపయోజాలని ప్రక్షాళించి అర్చించే రసికవరశ్రోతలు ధన్యులు!! అటువంటి పరమపవిత్రగాన పరంపరకి అనుయాయులు కాగలిగిన ఆ ఉస్తాద్జీ శిష్యపరంపర అంతా మహా ధన్యమయమే!!! అటువంటి పునీత వృత్తాంతాన్ని స్మరించుకోగలుగుతున్న మన పురాకృత పుణ్యసంస్కార సంచయం ధన్యమయం!!!! అన్నింటినీ మించి ఇంత చిన్న వయస్సులోనే అటువంటి సంగీత రససిద్ధుడు, మౌసికీ కి ఔలియా గురించి వినగలుగుతున్న మన చిన్నారి రోషనారా అందరికంటే ధన్యురాలు!!!!!

లద్దన్జీ:—
బహాదుర్జీ! మీ మాటలు వినగానే నా మనస్సుకూడా పరవశించిపోతోంది. నాకు వయస్సు మించిపోతోంది. లేకపోతే అటువంటి మహానుభావుడి శుశ్రూషచేసి తప్పక ఇహలోక తరుణోపాయం పొందే ప్రయత్నం చేసి ఉండేవాడిని.

ఈ సంభాషణలన్నీ ఎంతో ఉత్తేజంతో వింటూన్న రోషనార అక్కడేవున్న తన తల్లిగారితో ఇలాగ అంది:—

“అమ్శా! నన్ను ఆ ఉస్తాద్జీ వద్దకి పంపించి వారివద్ద సంగీతం నేర్పించండి. వారివద్ద సంగీతవిద్యని నాకు చేతనైనంతబాగా నేర్చుకుని శాస్త్రీయసంగీతరంగంలో నేనుకూడా నాకు తగిన స్థానాన్ని పొంది, అందరిచేత ఔననిపించుకోవాలనివుంది. నాకు నా జీవితంలో ఇంకేమీ అక్కరలేదు. గురూజీ! మీరుకూడా మా అమ్మ గారికి చెప్పండి. మీ మాటంటే మా అమ్మ గారికి మంచి గురి నాకు తెలుసు!”

ఈ మాటలువిన్న లద్దన్ ఖాcజీ, ఆయనతోబాటు బహాదుర్ ఖాcజీ, ఇద్దరూ, రోషనారా కోరిక తీర్చవలసినదని చెపుతూ, ఆమెకి అంత మధురమైన కంఠాన్ని, ఆ అద్భుతమాధుర్యంతోబాటు సంగీతసంబంధమైన సూక్ష్మాతిసూక్ష్మ స్వరప్రయోగాలని అలవోకగా పాడగలిగన ఆ అమేయ గళప్రతిభని, ఆమెకి అల్లాః అందుకే ప్రసాదించేడని చెప్పేరు. అంతేకాక ఆమెకి అసలైన గురువు కాదగిన మహానుభావుడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాcసాహబ్ తప్ప మరొకరు ఎవ్వరూ మానవలోకంలో లేరనికూడా నొక్కిచెప్పి, రోషనారాని ఆశీర్వదించి, ఆమె తల్లి వద్ద సెలవుతీసుకుని ఆ ఉస్తాదులిద్దరూ వెళ్ళిపోయేరు.

= # = # = # = # = # = # = # =

రోషనార పినతల్లి బొంబాయిలోనేవుండడంవల్ల పని ౘాలా సుళువుగాను, సజావుగాను జరిగిపోయింది. ఒక ఉత్తరంద్వారా సమస్య పరిష్కారం ఐపోయింది. రోషనార ఎంతో ఆశతో, ఎన్నో అద్భుతమైన కలలతో, తల్లి చందాబాయిగారి సాయంతీసుకుని బొంబాయి చేరుకుంది.

ఉస్తాద్జీ తమ్ముడైన అబ్దుల్ లతీఫ్ ఖాcజీ మిత్రులద్వారా రోషనార, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాc సాహబు సన్నిధికిచేరి వారికి పాదాభివందనంచేసి ఒక ప్రక్కన ఒదిగి నిలబడింది.

తమ్ముడిద్వారా విషయం అంతావిని ఖాcసాహబ్ రోషనారవైపుచూడకుండా, ఆమెని ఉద్దేశించి ఇలాగ అన్నారు:—

“నాకు ఈ ముసల్మాను ఆడపిల్లలకి సంగీతం నేర్పడం ఇష్టం ఉండదు. వీళ్ళంతా మహా ఐతే, నాలుగైదేళ్ళు కష్టపడి గురుసేవ చేసి, సంగీతం బాగానే నేర్చుకుంటారు. ఆ తరవాత పెళ్ళి ఔతుంది. దానితో అంతవరకు నేర్చుకున్న అంతటి సంగీతమూ బుగ్గిపాలైనట్లే! ఆ నాలుగైదేళ్ళూ ఉస్తాద్జీ వెచ్చించిన అమూల్య సమయమూ, పడిన కఠోరశ్రమా రెండూ పూర్తిగా వ్యర్థమైపోయినట్లే! అందువల్ల ఆ అమ్మాయిని పంపించివెయ్యి. ఏమీ అనుకోవద్దను! నేను ముసల్మాను ఆడ పిల్లలకి సంగీతం బోధించను! ఇంకెప్పుడూ ముందు నన్ను అడగకుండా, నా అనుమతి తీసుకోకుండా, దయవుంచి ఇలాంటి పనులు చెయ్యవద్దు, లతీఫ్ !” అని తన తమ్ముడితో చెప్పి, ఉస్తాద్జీ లోపలికి వెళ్ళిపోయేరు.

ౘాలా నిరాశా-నిస్పృహలకి లోనైన రోషనార ముఖం చిన్నబుచ్చుకుని, బొంబాయి లోని లేమింగ్టన్ రోడ్ లోవున్న తన బసకి వెళ్ళిపోయింది. ఆ కాలంలో బొంబాయిలో హిందీ సినిమారంగంలో సింగింగ్ హీరోయిన్స్ హవా బాగా ఉండేది. అప్పటికి సినిమాలలో ప్లేబేక్ సింగింగ్ విధానం క్రొత్తగా వేళ్ళూనుకుంటోంది. అందులో ఇంతటి మధురగాయని, నవయౌవనంలో, అందాలుచిందించే ముఖకవళికలతో ఉండడంవలన రోషనారకి హిందీ చలనచిత్రాలలో అవకాశాలు వచ్చేయి. ఆమె నటించిన ఒక సినిమాలో, ఆమెచేత ఒక దాద్రాని, అంటే, ఒక ఉపశాస్త్రీయ సంగీత సంబంధమైన పాటని పాడించడం జరిగింది. ఆ కాలంలో ఆ పాట అనతికాలంలో మంచి జనాదరణని పొందింది. ఆ పాట రికార్డుని తీసుకువెళ్ళి, లతీఫ్ ఖాcజీ తన అన్నగారైన కరీంఖాcజీకి వినిపించేరు. ఆ పాటని విన్నంతనే ఉస్తాద్జీ ౘాలా అభినందిస్తూ, రోషనారని మరునాడు తనవద్దకి తీసుకురమ్మని తన తమ్ముడికి ఆనతిచ్చేరు. ఆ మరునాడు రోషనార ఉద్విగ్నభరితమైన ఉత్సాహంతో ఉస్తాద్జీ సమక్షానికివెళ్ళి, పాదాభివందనంచేసి వినయంగా నిలబడింది. అప్పుడు ఉస్తాద్జీ రోషనారాతో ఇలాగ అన్నారు.

“ఇలా నా ఎదురుగా ఈ తివాసీమీద కూర్చో అమ్మా, రోషనారా! ఇదిగో, ఈ తాన్పురా తీసుకుని, నీకు బాగావచ్చిన, నీ మనసుకి ౘాలా నచ్చిన నీవు నేర్చుకున్న ఒక బందిష్ (శాస్త్రీయ సంగీత కృతి) ఏదైనా వినిపించు. నిదానంగా పాడు. కంగారు పడకు. హాయిగా మనసారా పాడు. నాకు వినాలని ఉంది.”

వెంటనే తాన్పురాని చేతిలోకి తీసుకుని ఉస్తాద్జీ ఎదురుగా వారి పాదాలవద్ద కుదురుగా కూర్చుని, గురుపాదాలకి, తాన్పురాకి భక్తితో నమస్కరించి, తాన్పురా శ్రుతిని సరిచేసుకుని, తనదుస్తులు సర్దుకుని, కన్నులని మూసుకుని, కంఠం సవరించుకుని, కొంచెంసేపు ఆలాప్ పాడి, ఆ తరవాత మధ్యలయలో ఒక ఖయాల్ని ఇరవై నిమిషాలపైన పాడి, దానిలో తానప్రయోగాలు, స్వరప్రయోగాలు ౘక్కగాచేసి ఉస్తాద్జీకి వినిపించి తన గానాన్ని ముగించింది, రోషనారా

అంతవరకు ఆమె పాటని శ్రద్ధగాను, ఆసక్తితోను విన్న ఉస్తాద్జీ మెల్లిగా కళ్ళు తెరిచి, ఆమె వైపు చూస్తూ ఇలాగ అన్నారు:—

ఉస్తాద్జీ:—
“సుభానల్లాః! ఖయాలునే పాడేవన్నమాట! సంతోషం! ఇంతకీ ఏ రాగం పాడేవో చెప్పగలవా, తల్లీ!”

రోషనార:—
మెరిసేకళ్ళతో ఉస్తాద్జీని పూజ్యభావంతో చూస్తూ, “ఇది ముల్తానీ రాగం అండి, గురువుగారూ!” అంది.

ఉస్తాద్జీ:—
“ముల్తానీరాగం పాడితే మనదేశ వాయవ్యభూభాగంలోని ముల్తాన్ ప్రాతం యొక్క మృత్తికాపరిమళం ఆ రాగంలో గుబాళింౘాలి. ఏ ప్రదేశమైనా దానికి సంబంధించిన నేలలోని మట్టికి ప్రత్యేకమైన వాసన వుంటుంది. అలాగే ఆ-యా ప్రదేశాలకి చెందిన ఆ-యా రాగాలకికూడా దాని పరిమళం దానికి ఉంటుంది. అది సరే! నేను నీ ఈ గానం విన్నాక, నీకు మన కిరానా ఘరానా గానశైలిని ప్రతిబింబించే మన విలక్షణ గాయనఫణితిలో నీకు శిక్షణని ఇవ్వదలుచుకున్నాను. అటువంటి మధురమైన మహాగానరీతికి అనువైన కమ్మని కంఠం నీకు అల్లాః ఇచ్చేరు. అయితే, నీవు ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నావుటకదా! మరి నీ చలనచిత్రనటనని గురించి నీవు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు.”

రోషనార:—
“గురువుగారూ! నేను బొంబాయి వచ్చినది, తమ సేవలో కేవలం తమరి సంగీతశైలిని తమ ఆశీర్వాదంతో నేర్చుకోవడానికే తప్ప, సినిమాలలో నటనకి, పేరుకి, డబ్బుకి ఆశపడి రాలేదు. తమరు ఎలాగ ఆజ్ఞాపిస్తే అలాగే నడుచుకుంటాను.”

ఉస్తాద్జీ:—
“మంచిదమ్మా! అటువంటి ఏకాగ్ర అంకితభావం ఉంటేనే మన సంగీతశైలి అంతో-ఇంతో పట్టుబడుతుంది. అలాగైతే నీవు సినిమాల ప్రమేయం ఏమీ పెట్టుకోకు. సంగీతమే సర్వస్వం అన్నట్లుగావుంటే నీ సాధన సఫలీకృతమౌతుంది. నా శ్రమకికూడా అదే ప్రతిఫలం. విద్యని శిష్యులు నేర్చుకోవడం, గురువులు నేర్పడం, ఈ రెండూకూడా తపస్సే! నా జీవితమే నా సంగీత తపోదీక్షామయం! నా సంగీత తపోదీక్షే నాజీవితం! రెండింటికీ పిసరంతైనా తేడాలేదు! నీవుకూడా మునుముందు అటువంటి సంగీతభరిత తపోదీక్షతో నీ జీవితాన్ని పునీతం చేసుకొనడం అభ్యసించి, అంకితభావంతో సంగీతవిద్యని నేర్చుకోగలగాలి. అప్పుడే నీ కలలు ఫలిస్తాయి. తథాsస్తు!”

ఆ విధంగా సంగీతవిద్యని ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాcసాహబ్ వద్ద నేర్చుకోవడం ప్రారంభించింది రోషనార! ఆమె అద్దెకి ఉంటున్న ఇంటి చుట్టు-ప్రక్కల ప్రాంతాలలో ఇళ్ళు కావాలంటే అధికమైన బాడుగ చెల్లించి వవసతిదారులు పోటీపడిమరీ నివాసం ఉండేవారట! రోషనారా గానసాధనని వినడంకోసం కిరాయిదారులు ఆ విధంగా ఎక్కువ అద్దె చెల్లించడానికి సిద్ధపడేవారట, ఆ కాలంలో!

)( () )( () )( () )( () )( () )( () )( ()

శ్రీమతి రోషనారాబేగం ఖాcసాహెబ్ అబ్దుల్ కరీం ఖాcజీ శిక్షణలో ఆయన గాయనశైలిని సంపూర్ణ అంకితభావంతో అల్లాః అనుగ్రహంతో, గురుకృపతో స్వంతం చేసుకోగలిగేరు. రమారమి ఇరవైసంవత్సరాల వయస్సువచ్చేవరకు ఆమె గురు శుశ్రూషచేసి గురుహృదయాన్ని చూరగొని వారినుంచి అపార సంగీత గానవారిధిని కొంతైనా తమ వశంచేసుకున్నారు. 1937లో ఉస్తాద్జీ దివంగతులయ్యేరు.

(05—11—2017; ఆదివారం రోజున, “శారదా సంతతి—17” లోను; అదేరోజు “కదంబకం—19“లోను “ఖాcసాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాcగారిని గురించిన ప్రత్యేకరచనలు మన బ్లాగు “sriaim.com”లో లభ్యమౌతున్నాయి.
కావలసిన పాఠకులు వాటిని ౘదవవచ్చు. ధన్యవాదం!)

యుక్తవయస్సు వచ్చేక రోషనారాబేగం అప్పటి అఖండభారతదేశంలోని పశ్చిమపంజాబు(ఇప్పటి పాకిస్తానుదేశభాగం)లోని లాలామూసా అనే ఊరుకి చెందిన చౌధరి మొహమ్మదు హుస్సేనుని వివాహమాడేరు. 1947 వరకు బొంబాయిలోని ఆమె స్వగృహమైన పెద్దబంగళాలో నివాసం ఉండేవారు. దేశవిభజన అనంతరం, 1948లో, తమ భర్తగారి ఊరైన లాలామూసాకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయేరు. లాహోరు రేడియోకేంద్రంనుంచి అనేక సంగీత కార్యక్రమాలలో పాలుపంచుకుని అజరామరమైన అద్భుత గానాన్ని రేడియో రికార్డింగులద్వారావినిపించేరు. భారతదేశసందర్శనం చేసిన అనంతరకాలంలో, ప్రతిసారి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ నగరాలు విచ్చేసి అక్కడ సంగీతసభలలో పాడి రసజ్ఞలోకానికి అపారశ్రవణానందాన్ని కలిగించేరు. భారతదేశ “ఆకాశవాణి”లోను, “దూరదర్శనకేంద్రం”లోను తమ ప్రత్యేక సంగీత కార్యక్రమాల ప్రసారాలలో ఉత్సాహంగా పాల్గొని సంగీత రసజ్ఞలోకాన్ని ఆనందింపజేసేరు.

1982 డిసెంబరునెలో, 6వ తేదీని ఆమె తమ భౌతికకాయంవిడిచి, సంగీతసరస్వతిలో లీనమైపోయేరు.

సంగీతరంగంలో మన కాకినాడ నగరవైభవాన్ని ఇనుమడింపజేసిన లబ్ధప్రతిష్ఠులైన స్థానిక న్యాయవాది, కర్ణాటకశాస్త్రీయసంగీతగానంలో ప్రతిభావంతులు అయిన మాన్యశ్రీ ఆకెళ్ళ ప్రభాకరమూర్తివర్యులు, ఒక ఏడాది సరస్వతీగానసభ సంగీత కార్యక్రమాలలో, రోషనారాబేగంగారి అభిమానిగా తనని తాను పరిచయం చేసుకుని, నా సంగీత సంగ్రహాలయంలోవున్న ఆమె పాటలు వినడానికి తప్పక వస్తానని అనడం జరిగింది. కాని అది కార్యరూపం పొందేలోపుననే వారు దివంగతులు కావడం నన్ను బాధించింది. వారు ౘక్కని పరిణతితోకూడిన తమ గానంతో సంగీతరసికులని సంతోషహృదయులని చేసే సమయంలోనే దివంగతులుకావడం కాకినాడ సంగీతరంగానికి తీరని లోటు. ఈ రకంగా బేగంసాహిబా సంగీతవిభవాన్ని, అటువంటి సంగీతరసజ్ఞ-కళాకారులైన గొప్పగాయకులు శ్రీ ఆకెళ్ళ ప్రభాకరమూర్తిగారిని ఇక్కడ ఈ రమణీయసందర్భంలో, ఏకకాలంలో స్మరించుకోవడమే అస్మదాదుల ఆశయం! ఈ రూపంగా ఇద్దరికీ ఘననివాళి సమర్పించుకుందాం!

మధురమైన కంఠం, అద్భుతమైన రాగ-తాళ-లయ భావాలతో సమగ్రమైన ప్రజ్ఞకలిగిన గానప్రతిభ రోషనారాబేగం సొత్తు. రాగసంచారంలోను, బందిష్ గానంలోను, తానప్రయోగవైదగ్ధ్యంలోను, గమకవిన్యాసకళాత్మకతలోను, స్వరప్రస్తారవైభవంలోను, తాళపుష్టమైన లయాత్మకవైవిధ్యభరిత ప్రయోగాలలోను ఆమెకి ఆమే సాటి. వారు పాడిన అనేకరాగాలలోని ఖయాలులు, తరానాలు, ఠుమ్రీలు, దాద్రాలు మొదలైన అనేక శాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీత రచనలు రసికజనమనోహరంగా “యూ-ట్యూబు”లో ఉన్నాయి. ఇంక రసజ్ఞుల చిత్తం!

కిరానా ఘరానా” గాయనీ-గాయక మహాప్రతిభావంతులలో శ్రీమతి రోషనారాబేగం తమకి ఒక ప్రత్యేకస్థానాన్ని శాశ్వతంగాసంపాదించుకుని తమ జీవితాన్ని సంపూర్ణంగా సార్థకం చేసుకున్నారు.

మల్కా-ఎ-మౌసికీ“, “క్వీన్ ఆఫ్ మెలొడీ“, “శాస్త్రీయసంగీతగానలోక మహారాజ్ఞి” ఐన రోషనారాబేగం సాహిబా పాదాలవద్ద నతమస్తకులమౌదాము! ఆ విధి మన మహాపుణ్యానికి అవధి!

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    సంగీత మహాసాగరాన్ని ప్రయాసపడి శోధించి,
    అందులోని రత్నాలను వెతి(లి)కి తీసి, ఈతరం వాళ్ళకి
    అందచేస్తున్న క్రమంలో ఈ వారం అందించిన మరో
    ఆణిముత్యం– రోషనార.
    సంగీతం కోసమే అమెను భగవంతుడు సృష్టించుకున్నాడు.
    అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె మహా గాయని
    కాగలిగింది.
    ఉస్తాద్ కరీంఖాన్ వంటి దృఢమైన వ్యక్తిత్వంగల మనిషి
    మొదట కాదని ఆమెను తిరస్కరించినా, ఒక సినిమాలో
    రోషనారా పాడినపాట విని, తన శిష్యురాలిగా అంగీకరించడం
    ఉస్తాద్జీ గొప్పతనం తెలియచేయడమే కాదు… రోషనారా
    గానవైశిష్ట్యాన్ని విశదం చేస్తుంది. ఏదైనా చివరికి అది
    భగవన్నిర్ణయం అని అంగీకరించక తప్పదు.
    అత్యంత ఆకర్షణీయమైన రంగుల సినిమా ప్రపంచాన్ని
    కాదని, సంగీతానికి జీవితాన్ని అంకితం చెయ్యడం మామూలు
    విషయం కాదు. అది రోషనారాకి సంగీతంపట్ల గల తీరని తృష్ణ.
    ఉస్తాద్ కరీం ఖాన్ అన్నమాట– ‘ విద్యని శిష్యులు నేర్చుకోవడం,
    గురువులు నేర్పడం…. ఈ రెండూ కూడా తపస్సే!’అక్షర సత్యం.
    అన్నింటిలోకీ అద్భుతం….. రోషనారా సంగీత సాధన వినడానికి-
    ఆమె ఇంటి చుట్టుపక్క ఇళ్ళు , ఎక్కువ అద్దె ఇచ్చయినా సరే
    తీసుకోవడానికి పోటీలు పడడం!

  2. సి.యస్ says:

    బాల్యమందునె తనగాన ప్రతిభ చూపి,
    భావి కాలాన గడియించె బహుళ కీర్తి.
    భారతీయుల సంగీత పాటవమును
    లోకమునకెల్ల చాటించె రోషనార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *