సాహిత్యము—సౌహిత్యము~63 : భారతీయ కళలు — శాస్త్రములు

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
28—07—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~ 63″| “భారతీయ కళలు — శాస్త్రములు“|

సాహిత్యం, సంగీతం, చిత్రకళ, శిల్పం, నృత్యం, నాటకం మొదలైనవాటిని మన పెద్దలు మహనీయమైన కళలుగా వర్ణించేరు. శ్రీలలితాంబికాదేవికి, “చతుష్షష్టి కళామయీ” అనే ఒక నామం “శ్రీలలితాసహస్రనామాలు“లో ఉంది. అది 236వ నామం. అలాగే “శాస్త్రమయీ” – అని 705వ నామం ఒకటి, “శాస్త్రసారా” – అని 845వ నామం మరొకటి కూడా శ్రీమాత సహస్రనామాలలో ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, సర్వకళలూ, సర్వశాస్త్రాలు శ్రీభువనేశ్వరీదేవి, శ్రీసౌభాగ్యదేవతాస్వరూపిణి అయిన శ్రీశారదాంబికలోని ఆంతరిక విభూతులేనని ప్రకాశితమౌతోంది.

మనిషి మనస్సు లేక హృదయం రకరకాలైన ఉద్విగ్నభావపరంపరకి నెలవు(a seat of human emotions)గావుంటే, మనిషి మతి లేక మస్తిష్కం లేక ధీశక్తి హేతుప్రమాణబుద్ధికి మూలస్థానం(a source of rationalistic intellect)గా పనిచేస్తోంది. కళలన్నీ మనస్సు లేక హృదయసంబంధమైనవిగాను, శాస్త్రాలు బుద్ధిప్రమాణజన్యమైనవిగాను మనం వివరించుకోవడం జరుగుతూంటుంది. (ఇక్కడ మనస్సు-హృదయం, సమానార్థకాలుగా వ్యవహరించబడుతున్నాయి. “హృదయం జీవితే, చిత్తే, వక్షస్యపి, చ మాతరి” అన్నట్లుగా ప్రస్తుతాంశంలో హృదయం, మనస్సు, చిత్తం సమానార్థాలలో ఉద్విగ్నతాజననస్థానంగా ఉపయోగించడం జరిగింది).

విశ్వవ్యాప్తంగా కళలన్నీ మానవుడి మనస్సుకి సంబంధించిన కష్ట-సుఖాలు, విషాద-సంతోషాలు, అనిష్ట-ఇష్టాలు మొదలైన అసంప్రీతి-ప్రీతి భావనలలోనుండి విచ్చుకునే విలక్షణ రసానుభావాతిరేకస్థితినుంచి జన్మించేవిగా పరిగణించబడుతున్నాయి. ఐతే ఈ ద్వందాలతో నిమిత్తంలేని కథలు, గాథలు, అనుపమ ఆనందస్థితులు, అలౌకిక అనుభూతులు మొదలైనవాటిని ఆలంబనగా చేసుకునికూడా కొన్ని సందర్భాలలో కొన్ని కళాంశాలు ఆవిర్భవిస్తాయి. ఐతే అవికూడా వ్యక్తిగత సృజనాత్మక ప్రతిభనుంచే ప్రాదుర్భవిస్తాయి. కనుక అవి హృదయసంబంధమైనవిగానే వర్గీకరించబడ్డాయి.

కళలైనా, శాస్త్రాలైనా పరంపరగా కొనసాగాలంటే నేర్పేవాడు, నేర్చుకునేవాడు కూడా ఉంటారు, ఉండాలి! బోధనరతి, అధ్యయనరతి ఉంటేనే వివిధకళలలోను పారంపర్య ఆచరణ సాధ్యం ఔతుంది. అటువంటి సందర్భంలోనే కళాధ్యాపనం, కళాధ్యయనం అనేవి శాస్త్రమర్యాదని పొందుతాయి. అదే విధంగా శాస్త్రాలూను! ఈ రకంగా కళలని శాస్త్రమర్యాదలని అనుసరించి బోధించడం, నేర్చుకోవడం అనే రెండు ప్రక్రియలని కలిపి భారతీయశిక్షణవిధానంలో “విద్య” అని అంటారు. ఉదాహరణకి “సంగీతం” అనే విద్యని పరిగణనలోకి తీసుకుంటే, సంగీతం మౌలికంగా కళాస్వరూపమే ఐనా అధ్యయన-అధ్యాపనాలలోను, పారంపర్య ప్రవాహంలోను శాస్త్రమర్యాదలని అనుల్లంఘనీయంగా అనుసరించే ఒక మహనీయ విద్యా సంప్రదాయంగా అభివర్ణించుకోవాలి.

ఉదాహరణకి, సంగీత విద్యని ప్రధానంగా (1) అభ్యాస సంగీతం, (2) సభా సంగీతం అని రెండు విభాగాలుగా విభజించి నేర్పడం, నేర్చుకొవడం జరుగుతోంది. ఇక్కడ ఒక మహారమణీయకళ శాస్త్రాలంబనని తీసుకుని పారంపర్యవిద్యగా, తరతరాలుగా కొనసాగుతోంది. అందువలన ఈ కళా-శాస్త్ర రంగాలు రెండింటికీ పరస్పర సహకారంద్వారా పరస్పర అభ్యున్నతి(symbiosis) జరుగుతోంది. అది శ్రీశారదావైభవస్వరూపమైన విద్యయొక్క ఔత్కృష్ట్యం.

అభ్యాస సంగీతంలో సరళీస్వరాలనుండి ఆరంభించి స్వరజతులు, వర్ణాలు వరకు ౘాలా విస్తృతమైన విద్యాప్రణాళికవుంటుంది. ఆ పైన సభాసంగీతంలో, స్వరజతులు, వర్ణాలనుంచి కృతులు, రాగం-తానం-పల్లవి వంటి కేవలం సంగీతప్రధానమైన గంభీర అంశంవరకు విపులమైన సంగీతసామగ్రి ఉంటుంది. (వీటినన్నింటిని మరిన్నివివరాలతో, మన “sriaim.com”బ్లాగులోని, 6:5:2018, ఆదివారం రోజున, “శారదా సంతతి~43″లో చర్చించబడిన “శ్రీ పైడాల గురుమూర్తి” గారిని గురించి వ్రాయబడిన వ్యాసంలో తెలుసుకోవచ్చు.)

అభ్యాస సంగీతమైనా, సభాసంగీతమైనా శాస్త్రప్రమేయంలేకుండా సంగీతకళ అనూహ్యం. సంగీతంలో శ్రుతి తల్లిగాను, లయ తండ్రిగాను సంభావించబడడం గమనార్హం (“శ్రుతిః మాతా లయః పితా“). ఆమాటకివస్తే అది శాస్త్రీయ సంగీతమైనా, ఉపశాస్త్రీయ సంగీతమైనా, లలిత-జానపద చలనచిత్ర సంగీతమైనా, జాజ్ / పాప్ / మోడర్న్ రాక్ / మెటాలికా/ సాంబా/ స్క్వాట్ / మొదలైన దేశీయ, అంతర్దేశీయ సంగీతాలు, నాట్యాలు అన్నీ వాటికి అనుగుణమైన పడికట్లూ, ప్రమాణాలు, విధులు, నిషేధాలు ఇత్యాది అంశాలతో పెనవేసుకుపోయి ఉంటాయి. అందువలన కళ తల్లివంటిది. శాస్త్రం తండ్రివంటిది. వారిద్దరి అన్యోన్యదాంపత్యఫలమే విద్య.

అదేవిధంగా విద్యలని నేర్పించడంలో, అంటే శాస్త్రనియమాలని బోధించడంలో ఆరితేరిన అధ్యాపకులలో “శిక్షణ” కళాత్మకంగా ఉంటుంది. సంస్కృతవ్యాకరణాన్ని కావ్యశైలిలో బోధించిన కవి-పండితులు లేక పండితకవులు ఉన్నారు.

ఈ విధంగా కళలు కళలుగాను, శాస్త్రాలు శాస్త్రాలుగాను వేటికి అవి విభిన్నమైన వ్యావహారిక ప్రదేశాలు (different well-defined operational domains) కలిగి ఉన్నా, అవి విద్యలస్థితిని పొందినప్పుడు ఈ ఎల్లలు చెరిగిపోతున్నాయి. విద్యాస్థాయిలో, హృదయజన్యమైన కళలు (emotionally created arts), మస్తిష్కసంభూతమైన శాస్త్రాలు (cerebrally generated sciences), ఈ రెండు పరస్పరసంపూరకాలు(mutually complementary items)గా ఉంటున్నాయి.

మన భారతీయ కళలు కేవలం హృదయాహ్లాదంకోసమూ, మన భారతీయ శాస్త్రాలు కేవలం మస్తిష్క సంతృప్తికోసమూ మాత్రమే పుట్టలేదు. ఇవన్నీ పారమార్థిక పరమ ప్రయోజనాన్ని కలిగివుంటూ, ఆనుషంగికమైన ఇతర ఉపయోగాలకికూడా దారితీస్తున్నాయి. భారతీయ సనాతన ఆర్ష సంస్కృతిలో కేవలం మనసుకి వినోదాన్ని, బుద్ధికి విషయప్రపంచ వివరాలని మాత్రమే అందించే కళలుకాని, శాస్త్రాలుకాని లేనేలేవు. ఉన్నవన్నీ ఆర్షధర్మనిర్వహణప్రకారం, ఇహ-పర అనుసంధాన ప్రమేయం కలిగినవీ, తాత్కాలికమైన ఇహంతోబాటు శాశ్వతమైన పరాన్నికూడా మానవుడికి సాధించిపెట్టే సామర్థ్యంవున్నవీను! మన వాద్యసంగీతం, గానం, నాట్యం మొదలైనవన్నీ దైవపూజామయమైన యజ్ఞాలలోను, క్రతువులలోను దేవతానుగ్రహంకోసం వినియోగించబడే దివ్యకళలుగానే ప్రయోజనాలని సంతరించుకున్నాయి. అదే విధంగా ఏక-ద్వి-త్రి-పరిమాణ రేఖాగణితశాస్త్రం (one-two-three dimensional geometry and such various geometrical relationships) యజ్ఞ-యాగాది క్రతునిర్వణ శాలలు, వేదికలు, హోమకుండాలు మొదలైనవాటి నిర్మాణాలకి వినియోగించబడింది. పైథాగొరసు సిద్ధాంతం “ఆపస్తంబ శుల్బసూత్రాలు” లో, అతడికన్న ౘాలా ముందుకాలంనుంచీ ఉందని పాశ్చాత్య శాస్త్రవేత్తలే అంగీకరించి ఉన్నారని ఋషిప్రవరులైన బ్రహ్మశ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు వారి “భారతీయ వైభవము“, “భారతీయ విజ్ఞానము” అనే పుస్తకాలలో విశదంచేసేరు. (శుల్బ సూత్రాలంటే యజ్ఞ-యాగాది క్రతునిర్వహణని వివరించే వైదిక-స్మార్త ప్రామాణికసూత్రాలు. పూర్వమీమాంసాదర్శనానికి అనుబంధమైనవి).

భారతీయ సమాహార కళాస్వరూపం (composite art form) అయిన “నాట్యం” (గానం, వాద్యం, నృత్తం అనే మూడు అంగాలతో కూడుకున్నది) “చాక్షుష క్రతువు” అంటే దర్శనీయ యజ్ఞం అంటే కంటితో చూడదగిన దైవపూజ అని మహాకవి కాళిదాసు తన “మాళవికాగ్నిమిత్రమ్ ” నాటకంలో అభివర్ణించేడు. అదే విధంగా సంగీతగానం, వాదనం శ్రవ్య క్రతువుగా చెప్పవచ్చు. అందువలననే యోగశాస్త్రం ఈ విధంగా ఉపదేశించింది:—

“యత్కించిత్ నాదరూపేణ, శ్రూయతే శక్తిరేవ సా|

యః తత్త్వాంతో నిరాకారః, స ఏవ పరమేశ్వరః”||

“నాదరూపంలో వినబడేది ఏ కొంచెమైనా అది అంతా శ్రీమాతయొక్కఅనంత ప్రజ్ఞా స్వరూపమే! శ్రీమాత పరమవిభూతులలో ఒకటైన ఆ నాదరూపంలోని సంగీతంయొక్క మౌలిక తత్త్వానికి పరమగమ్యస్థానం నిరాకారుడైన ఆ పరమేశ్వరుడే!”

అటువంటి నాదమయసంగీతాన్ని పరమప్రీతిభావంతో అంటే భక్తిగా పాడడంకాని, వినడంకాని చేస్తే చతుర్విధపురుషార్థ ఫలప్రదాయకమని మన మహర్షులు ఉపదేశించేరు. అటువంటి నాదారాధన పరమేశ్వరుడివద్దకి సాధకులని చేరుస్తుంది అని పైన ఉదహరించబడిన శ్లోకం మనకి సుస్పష్టంగా బోధపరుస్తోంది.

అందువల్ల భారతీయ కళలు, శాస్త్రాలు పూర్తిగా ఇహ-పర సాధకమైనవి. ఆ రెండూ విడి-విడిగా చూస్తే వేరు-వేరు అధ్యయనక్షేత్రాలుగా కనిపించినా, విద్యలుగా అవి రెండూ పరస్పర సంపూరకాలై పారమార్థికప్రజ్ఞలుగా విభవాన్ని పొందుతూ తమని అర్చించుకునే సాధకలోకాన్ని యుగయుగాలుగా తరింపచేస్తున్నాయి.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    లోతైన ఆలోచనకి అద్భుతమైన విశ్లేషణ.
    కళ హృదయగతమైనదని అంటే మనసుకి సంబంధించిన
    దనీ, శాస్త్రం బుద్ధికి సంబంధించినదని చెప్తూ, విద్యల స్థితి
    పొందినప్పుడు ఆ ఎల్లలు చెరిగిపోతాయని చెప్పడం మరింత
    గొప్పగా ఉంది. కళని స్త్రీమూర్తితో పోల్చి దాని సౌకుమార్యతని,
    శాస్త్రాన్ని పురుషుడితో పోల్చి దాని ఖచ్చితత్వాన్ని చెప్పినట్టు
    అయింది. మొత్తానికి హృదయాహ్లాదం కోసం, మస్తిష్కసంతృప్తి
    కోసం కళలు , శాస్త్రాలు ఉన్నాయని, చిట్టచివరికి పారమార్థిక
    ప్రయోజనం అంతిమ లక్ష్యం అనేది అద్భుతం.
    మంచి విషయాలు ముందుకు తీసుకొస్తున్నావు.

  2. సి.యస్ says:

    తండ్రి శాస్త్ర మైన తల్లియే కళయౌను
    విడిగ చూడకున్న విద్య యగును.
    పార మార్థికథయె పరమ ప్రయోజనం
    బనుచు విద్య నేర్వ వలయు గాదె!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *