సాహిత్యము—సౌహిత్యము~62 : కోప ఉపశమనము — సాధకజన ప్రయత్నము
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః||
21—07—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము ~ 62″| “కోప ఉపశమనము — సాధకజన ప్రయత్నము”|
మన ఆర్ష అధ్యాత్మవిద్యకి సంబంధించిన శాస్త్రాలలో అధ్యాత్మవిద్యార్థులకి (1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం, (5) మదం, (6) మాత్సర్యం — ఈ ఆరింటిని కలిపి అరిషడ్వర్గం అని బోధ చెయ్యడం ఆ శాస్త్రబోధనకి సంబంధించిన ప్రణాళికలో భాగం! ఇక్కడ, అరి=శత్రువు, షట్ = ఆరు, వర్గం=సముదాయం, అంటే సాధకులందరికీ వారిసాధనకి అంతరాయం కలిగించే వారిలోని ఆరు ప్రతికూల గుణాల సమూహం అని మనందరికీ తెలిసిన విషయమే! ఈ వివరాలు పూర్వం మన “పెద్ద బాలశిక్ష“లో ఉండేవి. ఈ అరిషడ్వర్గం లోని “క్రోధం” లేక “కోపం” అనే విషయం గురించి ఇక్కడ, అధ్యాత్మ విద్యా సాధకులమైన మనం, ఈ వారం పాఠంగా సంక్షిప్తంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం!
“అమరకోశం” మొదలైన సంస్కృత నిఘంటువులలో ‘క్రోధం’ లేక ‘కోపం’, అనే పదాలు పర్యాయపదాలుగానేకాక, సమానార్థకాలుగాకూడా ఉదహరించబడ్డాయి. కాని, కోపం/క్రోధం/రోషం మొదలైన పదాలు సాహిత్యంలో వినియోగించబడిన సందర్భాలలోను, మన నిత్యవ్యవహార ప్రయోగంలోను, ఒకదానిబదులు మరొక మాటని ఉపయోగించడానికి (intrechangeable usageకి) అనుకూలత ఉండకపోవడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి, సత్యభామకి రోషం లేక కోపం అనే సహజలక్షణం ఉంది అంటాంకాని, క్రోధలక్షణురాలని అనం! అలాగే “మా అమ్మాయి ఇప్పటినుంచీ ఉత్తినే మాటంటే పడదండీ! దానికి రోషం ఎక్కువ!” అంటామేతప్ప, క్రోధం ఎక్కువ అని అనం! “నేను చేసిన తప్పుకి మా నాన్నగారికి కోపం రావడం సహజం” అన్నచోట కోపం బదులుగా క్రోధం అనే మాటని వాడం! “పంచతంత్రం”లో ఆరుగురు దుఃఖభాగులు ప్రస్తావించబడ్డారు. వారు, క్రమంగా,
(1) ఈర్ష్యాళువు, (2) జుగుప్సావంతుడు, (3) నిస్సంతోషి, (4) క్రోధనుడు, (5) నిత్యశంకితుడు, (6) పరభాగ్యోపజీవి
అని చెప్పబడ్డారు. వారిలో నాలుగవవ్యక్తి “క్రోధనుడు” అయి ఉండడం గమనార్హం. ఇందువల్ల ‘క్రోధం’ పూర్తి ప్రతికూల భావమయంగాను, ఆ కారణంగా అనాదరణీయమైన, దూష్యమైన మానసిక వికారంగాను ఇక్కడ స్పష్టమౌతోంది. అందువల్ల కోప-రోషాలు కోమలస్థాయిలో ఉంటే అవి నిరాదరణీయం కాకపోగా, “పారిజాతాపహరణం” వంటి ముగ్ధ మనోహర కావ్యాలలో కవిత్వరమ్యతని సమకూర్చే ౘక్కని ముడిసరుకుగా మహాకవుల మహనీయ సృజనాత్మక హస్తాలలో మన్ననని పొందడం జరిగింది.
“రసార్ణవసుధాకరః” అనే సంస్కృత గ్రంథంలో, “క్రోధం” అనే పదం సూచించే మానవ (ప్రతికూల)మనోభావానికి స్థాయీభేదంవుందని విశదంచేయబడింది. ఆ-యా-స్థాయిలని అనుసరించి, వాటికి తర-తమభేదాన్ని వ్యవస్థీకరించిన ఆ శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది:—
“వధావజ్ఞాదిభిః చిత్త జ్వలనం క్రోధ ఈరితః|
ఏష త్రిధా భవేత్క్రోధ, కోప, రోష, ప్రభేదతః”||
(ఇతరులవలన) దెబ్బలు తినడం, అవమానించబడడంచేత (మనుజులలో కలిగే మానసిక ప్రతికూలభావం-negative feeling) క్రోధం అనబడుతోంది. ఈ మానసిక వికృతిని (1) కోపం, (2) రోషం, (3) క్రోధం అని (ఆ వికృతిభావం యొక్క తీవ్రత(sharpness)ని, గాఢత(intensity)ని పరిగణనలోకి తీసుకుని) మూడు రకాల స్థాయిలలో విభజించడం జరిగింది. ఈ మనోవికారం రజోగుణపూరితమైనది.
(1) కోపం అంటే Indignation! అంటే, అటువంటి వికృతిభావంకలిగించే తగినంత బాహ్యకారణంవుండడం, ఐనా మనస్సులో కలిగిన వికృతిభావం వ్యక్తియొక్క అదుపులోవుండి బాహ్య ప్రదర్శన లేకపోవడం, ఆ భావప్రభావంనుంచి అనతికాలంలోనే వ్యక్తి సామాన్యస్థితికి రాగలగడం, దానిని “కోపభావం” లక్షణం అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో రజోగుణం అచిరకాలంలోనే సత్త్వగుణంయొక్క అదుపులోకి వెళ్ళిపోతుంది.
(2) రోషం అంటే Ire! అంటే, కోపంకంటే ఎక్కువ తీవ్రమైన అంతర్గత స్పందనని పొందడం, ఎంతో-కొంత బాహ్యవ్యక్తీకరణని కలిగివుండడం, సామాన్యస్థితికి రావడానికి అటు స్వల్పకాలంలోను లేక ఇటు దీర్ఘకాలంలోను కాక మధ్యమ కాలంలో మళ్ళీ సామాన్యస్థితికి రాగలగడంవుంటుంది. రజోగుణం తమోగుణంవైపుకి చూసినా, సత్త్వగుణప్రాంగణంలోకే వెళ్ళిపోతుంది.
(3) క్రోధం అంటే Rage! అంటే, పైన వివరించబడిన అంశాలతోబాటు, తీవ్రమైన బాహ్యప్రదర్శన ప్రధానంగావుంటుంది. ఉచితానుచితాల ప్రసక్తి అంతరించిపోతుంది. ఇక్కడ, రజోగుణం, తమోగుణాశ్రయంపొందినా, కొంత సమయం తీసుకుని, తమోగుణంనుంచి బయటపడి, సత్త్వగుణచోదితమార్గనిర్దేశం పొంది, మళ్ళీ, సామాన్యస్థితిని పొందుతుంది.
ఈ పై మూడు స్థాయలలోనేకాక నాలుగవ స్థాయి ఒకటుంది. అది, ౘాలా తక్కువమందిలోనే అయినా, ఆ కొందరిలో రజోగుణప్రేరితమైన క్రోధం వ్యక్తి బ్రతికి ఉన్నంతకాలమూ తమోగుణాన్నే సమాశ్రయించుకుని సుస్థిరంగా నిలిచిపోతుంది.
ఈ విషయాన్నే నీతిశాస్త్రకోవిదులు ఈ విధంగా సూత్రీకరించేరు:—
“ఉత్తమే క్షణకోపః స్యాత్ , మధ్యమే ఘటికా ద్వయమ్ |
అధమే స్యాత్ అహోరాత్రం పాపిష్ఠే మరణాంతకమ్ ||
ఆమరణాంతాః ప్రణయాః కోపాః తత్ క్షణభంగురాః|
పరిత్యాగాశ్చ నిశ్శంకాః భవంతి హి మహాత్మనామ్ “||
“ఉత్తమునియందు కోపం ఒక క్షణకాలం(తాటాకు మంటలాగ) ఉంటుంది. మధ్యమునిలో రెండు గడియలకాలం అంటే ఒక గంటలోపు కోపముంటుంది. అధముడిలో కోపం ఒక రోజు ఉంటుంది. బలిష్ఠమైన పాపకర్మఫలసంచయం కలిగిన వాడియందు కోపభావం బ్రతికి ఉన్నంతకాలమూ ఉంటుంది.
“మహాత్ములైనవారి ప్రేమభావాలు ఆజన్మాంతమూ ఉంటాయి. కోపాలు క్షణకాలంలో మటుమాయమౌతాయి. వారి త్యాగాలన్నీ అవ్యాజరమణీయంగా ఉంటాయి”
మొదటి శ్లోకంలోని భావానికి మనం పైన వివరించుకున్న శాస్త్రవిషయం పునాదిరాయి.
సాధకజనులకి, తమ మానసికశక్తి సత్త్వగుణప్రధానమైన సంతోషాది సుకృతి-ధర్మాన్ని, లేక రజోగుణ-తమోగుణ ప్రధానమైన క్రోధాది వికృతి-ధర్మాన్ని పొందడానికి మూలవస్తువుకావడం నిత్యానుభవమే. మంచివైనా, చెడ్డవైనా వీటినన్నింటినీ నిర్మూలించడంద్వారామాత్రమే భక్తులకి ఇష్టదేవతా పూర్ణానుగ్రహ ప్రాప్తి, యోగులకి పరమాత్మానుభవమయసమాధి, జ్ఞానులకి పరబ్రహ్మ-అభిన్న- అపరోక్షానుభూతి కలగడం సంభవిస్తుంది.
భక్తియోగ మార్గగాములైన సాధకులు, ప్రథమంగా, తీవ్రక్రోధాన్ని కోమలకోపంగా పలచన అయ్యే ప్రయత్నం చేసి, ఆ తరవాత మెల్లిగా దానినికూడా కడతేర్చాలి. సాధకులైన మానవులుకూడా ఎల్లవేళలా సంతోషాన్నికాని, క్రోధాన్నికాని కలిగివుండడం అసాధ్యం. అందరూ జీవితంలో ఎక్కువ కాలం, ఈ ద్వంద్వాతీత సామాన్యస్థితిలోనే తమ మనస్సువుండడాన్ని అనుభవంలో కలిగివుంటారు. అది మానసిక సమతౌల్యస్థితి(a state of mental equilibrium) అని అనవచ్చు. అటువంటి స్థితిలో ఉంటూనే క్రమంగా సాధకజనులు బాహ్యవస్తు-ప్రపంచ ప్రమేయంలేని ప్రసన్న మానసిక స్థితి(a state of mental cheerfulness)ని పొందగలగాలి. ఇది సదా భగవన్నామస్మరణం, సద్గ్రంథ అధ్యయనం, సత్సంగం, ఆధ్యాత్మిక ప్రవచన శ్రవణం, వినిన విషయాన్ని మననం, ఆ పైన, ఆ ఆధ్యాత్మిక విషయాలమీద ధ్యానం వంటి సత్త్వగుణప్రధాన సాధనలని ఆచరించడంద్వారామాత్రమే సాధ్యం. వీటికి వ్యతిరేక విషయాలపట్ల ఉదాసీనవైఖరిని అలవరచుకోవాలి. ఈ సాధనాప్రణాళికద్వారా కోపోపశమనం చేయడం ప్రారంభించి, క్రమంగా కోపాది వికృతులకి సంబంధించిన మౌలిక కర్మాశయాన్ని పరిపూర్ణ ఇష్టదైవ కారుణ్యంతో(వ్యవసాయక్షేత్రంలో కలుపు మొక్కలని మొదట్లోకి పెరికివేసినట్లు) నిర్మూలనం చేయాలి. అరిషడ్వర్గంలో ఒకటి నిర్మూలించబడితే క్రమంగా ఇష్టదేవతాదయావిశేషంవల్ల మిగిలినవికూడా అంతరించిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
తథాsస్తు||
సర్వేషాం స్వస్తిః భవతు| సర్వేషాం శాంతిః భవతు| సర్వేషాం పూర్ణం భవతు||
అరిషడ్వర్గాలలోని ‘ క్రోధం ‘ గురించి చేసిన విశ్లేషణ
సాధకజనులకే కాక సామాన్యులకి కూడా చాలా
ఉపయుక్తంగా ఉంటుంది.
నైఘంటికార్థం తీసుకుని, సోదాహరణంగా వివరించడం
స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా క్రోధంలో ఉండే స్థాయీ భేదాల్ని
బట్టి వాటికి గల పేర్లనీ, లక్షణాల్ని వివరించడం వల్ల ప్రతిదాన్నీ
కోపం కింద జమ కట్టకూడదని అర్థమైంది.
కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా కోపం రావచ్చు…. కానీ దానికి మనం బానిస కారాదు…మనమే దానిని శాసించే స్థాయికి రావాలి అని చాలామంది పెద్దలు చెబుతుంటారు.
కోపం అవసరమైతే ప్రదర్శించాలి కానీ అది నీ స్వభావం కాకూడదు అని అనేక సందర్భాల్లో నువ్వు చెప్పిన విషయమూ గుర్తుకొచ్చింది.
అసంకల్పితంగా, ఒక్కోసారి అనివార్యంగా వచ్చే కోపాన్ని నిగ్రహించుకోగల మార్గాలు సూచించడం బాగుంది.
కోపమందు నరుడు కోల్పోవు ధర్మంబు
తప్పు మాటలాడి తగవు పడును.
శాంత గుణము లేక సౌఖ్యంబు లేదయా
పాడు కోపమెపుడు పరువు తీయు.
Chala chakkaga cheppavu…istadaiva karunyamtho nalo kuda kopam nirmulimpabadali.
An important message oriented article this week for Sadhaks. The meaning elaborated for Arishadvargam is so clear and simple to understand. How a sadhak shud over come rage or Krodha is presented at its best . The levels of Krodha depending on the category of people,Uttama , Madhyama and Athama as mentioned help to self introspect oneself as to where we stand. The crème of the article is the ways explained to over come Krodha , that of Nama smarana , Satsang , holy books and spiritual discourses. May we all put this into practice with the grace of our chosen diety.
బాగుంది. చక్కటి విశ్లేషణ. వివరణ బాగుంది.