శారదా సంతతి ~ 51 : రాజిత రమ్య రాగ గాయక రాజరాజు—ఉస్తాద్ రజబల్లి ఖాc సాహెబ్
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
15—07—2018; ఆదిత్యవాసరము
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“శారదా సంతతి ~ 51″| రాజిత రమ్య రాగ గాయక రాజరాజు—ఉస్తాద్ రజబల్లి ఖాc సాహెబ్ (03—09—1874 నుంచి 08—01—1959 వరకు)
అది బహుశః 1940వ దశకంయొక్క ప్రారంభకాలం కావచ్చు! మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని “దేవస్ ” నగరం. దేవస్ సంస్థానంలో ఆస్థానగాయక రాజరాజు అయిన ఖాcసాహెబ్ ఉస్తాద్ రజబ్ ఆలీ ఖాc సాహెబ్ గారి నివాసభవనమైన హవేలీలో వారు ఉన్నారు. వారిని కొందరు ఆత్మీయులు “రజబల్లీ ఖాc సాహబ్ ” అని కూడా పిలుస్తారు. ఆ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో రజబల్లీజీ గానసాధన చేసుకుంటున్నారు. ఈ లోగా ఎవరో బంధువు దూరప్రాంతంనుంచి వచ్చారని పరిచారకుడు ఉస్తాద్జీకి తెలిజేసేడు. బంధు-మిత్ర ప్రీతి బాగావున్న రజబల్లీజీ, సాధనని ఆపి, తాన్పురా(తంబూరా)ని జాగ్రత్తగా దాని స్థానంలో పెట్టి, గబగబా కుతూహలంతో సింహద్వారందాటి, పెద-పెద్ద పాలరాతిమెట్లుదిగి, ఎదురుగా చూసేసరికి తనదూరపుబంధువైన బాల్యమిత్రుడికొడుకు గుర్రందిగి, గుర్రాన్ని ఆవరణలోవున్న ఒక చెట్టుమొదట్లోకట్టి, వచ్చి రజబల్లీజీ పాదాలకి నమస్కరించేడు. వెంటనే రజబల్లీజీ ఇంటిలోకి దారితీస్తూ, ఇలాగ అన్నారు.
రజబల్లీజీ:— అందరావో బర్ఖుర్దార్ ! లోపలికి రా నాయనా! మీ నాన్న, అమ్మ బాగున్నారా? ఈ ఆలీచాచా ఇన్నాళ్లకి గుర్తుకొచ్చేడనమాట, నీకు! నీ చిన్నతనంలో నిన్ను వదలలేక నేను తెగ ఎత్తుకు మోసేవాడిని. కాస్త పెద్దవాడివి అయిన తరవాత నాకు కాళ్ళు, నడుము ౘక్కగా ఒత్తుతూ ౘాలా సేవ చేసేవాడివి. ఇవి అన్నీ నీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. నాకుమాత్రం అప్పుడప్పుడు నీ చిన్నతనం, నీ ఆట-పాటలు, అస్తమానూ నన్ను వదలక నా చుట్టూ తిరుగుతూ ఉండడం గుర్తొచ్చి ఆ రోజుల గొప్పతనం కళ్ళకికట్టినట్లౌతుంది. అప్పటికి-ఇప్పటికి మీ నాన్న నన్ను అర్థంచేసుకున్నట్లు మరెవ్వరూ అర్థంచేసుకోలేదనిపిస్తుంది. ఈ లోకంలో ౘాలామంది, రజబల్లీ కోపిష్టివాడని, తలతిక్క మనిషి అని, క్షణ-క్షణానికి మనసు మారిపోయేవాడని, పరుషభాష మాట్లాడతాడని, గర్వి అని, పొగరుబోతని రకరకాలుగా అనుకుంటారు. ఆ లక్షణాలు అంతో-ఇంతో నాలో లేకపోలేదు. కాని ఆ లక్షణాలని ఎటువంటి సందర్భాలలో, ఎలాంటి వ్యక్తులపట్లు ప్రదర్శిస్తానో మీ నాన్నకి బాగా తెలుసు. ఎల్లవేళలా, అందరితోనూ అంత తలతిక్కగావుంటే రాజసంస్థానాలలోను, విభిన్న స్వభావాలు కలిగిన అనేకవిద్వాంసులు-కళాకారులు మధ్య, రసజ్ఞులమధ్య ఈ విధంగా నెగ్గుకురావడం అన్నది అసాధ్యంకదా!
మీ నాన్నకి నా గురించిన నిజాలన్నీ తెలుసు. నీకూ మీ నాన్న పోలిక వచ్చిందనుకుంటాను. ఆలీచాచాని చూడడానికి వచ్చేవు.
అని అంటూనే, ఇంటి నౌకరుకేసిచూసి, “మా జిలానీ గుర్రానికి పది కేజీలు జిలేబీ పట్టుకురా, రాజాభాయ్ !” అన్నారు, రజబల్లీజీ! ఆ మాట వినగానే ఆశ్చర్యంతో, ఆగంతకుడైన జిలానీ, “ఆలీచాచా! మన గుర్రానికి కాస్తంత పచ్చగడ్డి, మామూలు గుర్రాలదాణా తెప్పించు! సరిపోతుంది. దానికి అంత ఖరీదైన జిలేబీ ఎందుకు? జిలేబీ నేను తింటానులే!” అన్నాడు నవ్వుతూ! వెంటనే రజబల్లీజీ “ఛ!ఛ! ఇంత పేరు-ప్రఖ్యాతులున్న మహాకళాకారుడి ఇంటిలో కూడా సామాన్యుల కొంపలలోలాగ నీ గుర్రం గడ్డీ-గాదం తినడమేమిటిరా బర్ఖుర్దార్ ? మన దర్జాకి తగినట్టుగా జిలేబీయే పెట్టాలి. ఆలీచాచా ఇంటిలో గౌరవమర్యాదలని నీ గుర్రంకూడా రుచిచూడాలి” అని ఆ గుర్రానికి జిలేబీలు, మరికొన్ని ప్రత్యేకమైన తినుబండారాలు జిలానీ అక్కడున్న రోజంతా, రజబల్లీజీ తినిపించేరు.ఆ మరునాడు ఉదయమే జిలానీ తనకి పనివున్న ప్రక్క ఊరికి వెళ్ళిపోయేడు. అసలు ఆ ఊరికి వెళ్ళేదారిలో రజబల్లీజీని చూడడానికి మాత్రమే జిలానీ దేవాస్ నగరం వచ్చేడు.
అసలు విషయం ఏమిటంటే, రజబల్లీజీవద్ద గుర్రానికి కావలసిన మేతని కొనడానికికూడా తగినంత డబ్బులేదు. అంతేకాక తనకి నిత్యమూ అరువుగా సామానులిచ్చే షావుకార్లుకూడా ఎప్పటిలాగే తనకి అరువుయిచ్చే పరిమితి దాటిపోవడంవలన, పాతబాకీలన్నీతీర్చేవరకు, అరువు ఇవ్వడం తాత్కాలికంగా ఆపేసేరు. ఒకే ఒక మిఠాయిషాపువాడుమాత్రం ఇంకా అరువు కొనసాగిస్తున్నాడు. అందుకని గుర్రానికి జిలేబీ తినే అదృష్టం పట్టింది.
ఆ విధంగా ఊరిలో ఏ మాత్రమూ అప్పు పుట్టని పరిస్థితి వచ్చేవరకు ఊరుకుని, అటువంటి తప్పనిసరి పరిస్థితివచ్చాక, రజబల్లీజీ తన గానసభల యాత్రని అవసరాన్ని అనుసరించి ఐదారు వారాల కాలవ్యవధిలో కొనసాగించి, ఆ రోజులలోనే కనీసం ఏడు-ఎనిమిదివేల రూపాయల సొమ్ము లభించినవెంటనే, ఇంటికి తిరిగివచ్చి, షావుకారులందరికీ అణాపైసలతోసహా అప్పులన్నీ తీర్చివేసేవారు. తనవద్ద మిగిలిన నగదుని, నీ-నా-తన అనే భేదాలు లేకండా అందరికోసమూ ఖర్చులుచేసేసి, అందరికీ పంచిపెట్టేసి, ఆ డబ్బు ఖర్చైపోగానే మళ్ళీ ఊళ్ళో అప్పుపుట్టడానికివీలులేనంత అప్పులు చేసేసి, మళ్ళీ సంగీతం కచేరీలకి వెళ్ళి ధనసంపాదనచేసివచ్చి, అప్పులు తీర్చి, విచ్చలవిడిగా ఖర్చులుచేసి, మళ్ళీ అప్పులుచేసి, మళ్ళీ సంగీతసభాయాత్ర కొనసాగించడం జరిగేది. అంటే “పునరపి ఋణగ్రస్తః, పునరపి ఋణముక్తః” అన్నట్లుగా వారి జీవనయానం గడిచింది. అసలు దేశవ్యాప్తంగా సంగీతం కచ్చేరీలు చేయడానికి కొంతవరకు ఋణవిముక్తిప్రయత్నంకూడా ఒక ప్రేరణయేమో అనిపించేటంతగా ఆయన జీవనయానసరళి కనిపిస్తుంది
= = = = = = = = = = = = = =
అది 1947వ సంవత్సరం. మహారాష్ట్రసీమలోని కొల్హాపూరు రాజసంస్థానం. దేవాస్ సంస్థానానికి మాజీరాజుగారైన రాజా విక్రమసింగు పవార్జీ, కొల్హాపూరు సంస్థానానికి మహారాజుగా సింహాసనారూఢులయ్యేరు. పవార్జీ రాజైన శుభసందర్భంలో రజబల్లీజీని తనతో కొల్హాపూరు తీసుకువెళ్ళి, ఉస్తాద్జీ ౘక్కని క్రొత్తదుస్తులు కొనుక్కోవడంకోసం, 1,001/- రూపాయలు బహూకరించేరు. ఆ డబ్బు చేతికి చిక్కిందే తడవుగా ఉస్తాద్జీ మిత్రులందరికీ ఘనమైన విందులిచ్చేరు. ఖరీదైన బహుమతులుకొని మిత్రులకి బహూకరించేరు. అత్తరులకి, మద్యపానానికి మిగిలినదంతా కైంకర్యంచేసేసేరు. యథాప్రకారంగా చేతిలో చిల్లిగవ్వలేకుండా మిగిలేరు. అందువల్ల అప్పులు చేసి రాజావారి అభిమతంమేరకి ఖరీదైన దుస్తులు కొని, వాటిని ధరించి ఉస్తాద్జీ రాజదర్శనానికి వెళ్ళేరు. పవార్జీ క్రొత్తగా రాజైన సంబరంలో, ఉస్తాద్జీకి 2,001/- రూపాయలు మళ్ళీ మరొక నజరానాగా బహూకరించేరు. పవార్జీ కొల్హాపూరు సంస్థానానికి రాజైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఊరంతా మహా కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటోంది. రాజప్రాసాదంలో జరిగే మహోత్సవాలకి పరిమితులే లేవు!
దగ్గరలోనేవున్న “మిరాజ్ ” అనే ఊరునుంచి, అబ్దులుకరీం అనే సంగీతవాద్య నిర్మాణనిపుణుడు, సరిక్రొత్త సితారులు, సారంగీలు, సరోదులు, దిల్రుబాలు, తబలాలు మొదలై మహానాణ్యమైన వాద్యాలు తయారుచేసుకుని, క్రొత్త రాజావారి సంస్థానంలో మంచి గిరాకీవుంటుందన్న ఆశతో వాటిని తీసుకుని కొల్హాపూరువచ్చి రాజదర్శనార్థం ఉదయాది రాత్రిపర్యంతమూ రాజప్రాసాదం చుట్టూ రోజూ ప్రదక్షిణాలుచేస్తున్నాడు. సుమారు రెండువారాలు ఐపోయేయికాని ఫలితం శూన్యం! పట్టాభిషేకానంతర మహోత్సవాలలో ఎవరికివారే చెప్పలేనంత పనుల హడావుడిలో తలమునకలైవున్నారు. ఎంతమందిని ఆశ్రయించినా అబ్దులుకరీంకి అణువంతైనా ప్రయోజనంలేకపోయింది. మిరాజులో కొంతకాలంవుండి అక్కడ అందరిమన్ననలని పొందిన రజబల్లీసాహబ్ అక్కడేవున్నారని తెలిసుకున్న కరీం నేరుగావెళ్ళి ఆయనని రాజదర్శనంకోసం ఆశ్రయించేడు. ఆశ్రితజనవత్సలత కలిగిన ఉస్తాద్జీకి విషయమంతా వినేసరికి మనసు కరిగిపోయింది. వెంటనే ఆయన కరీంతో ఇలాగ అన్నారు:—
“కరీంభాయ్ ! నీవేమీ నిరుత్సాహపడకు. ఇప్పుడు నీకు రాజదర్శనం జరగడం కల్ల! అది మరిచిపో! అంతేకాదు! నేనుకాని మరొకరుకాని నీకు ప్రస్తుతం రాజదర్శనావకాశం కలిగించడం అసంభవం. ఐతే ఈ శుభసందర్భంలో సంగీతవాద్యాలు నీవు తీసుకురావడం మంచిపనే! నీవు వీటిని వెనక్కి తీసుకువెళ్ళడం శుభమూకాదు, రాజమర్యాదాకాదు! అలాగే నీవు ఖాళీచేతులతో తిరిగివెళ్ళడమూ, నిరాశపడడమూ మంచిదికాదు. నేను సంగీతగాయకుడిగా కళాకారుడినైతే, నీవు సంగీతవాద్యనిర్మాణకోవిదుడిగా ఒక కళాకారుడివే! నేను విక్రమసింగుమహారాజావారి దర్బారులో ఆస్థానగాయకుడిని. రాజావారికి సర్వదా సేవకుడిని. అలాగే సంగీతసరస్వతికి మనమిద్దరమూ సేవకులమూ, భక్తులమూను! రాజావారికి ఇవి సమర్పించుకుని వారి నజరానా అందుకోవడం కోసం ఇక్కడికి వచ్చేవు. మొత్తం వీటి అన్నింటిని నీవు బజారులో ఎంతకి అమ్ముతావోచెప్పు! నేను తేసేసుకుంటాను! ఈ వాద్యాలనన్నింటినీ నీవు వెనకకి తీసుకువెళ్ళిపోతే లోకంలో మహారాజావారి మర్యాదకి మన్ననకి భంగం కలుగుతుంది. అలా జరగబోతుండగా నా వంటి సంస్థానసేవకుడు చెయ్యగలిగివుండి ఏమీ చేయకపోవడం రాజభక్తీకాదు, రాజ్యానికి శ్రేయస్సూకాదు. నీవు రిక్తహస్తాలతో వెనకకి మరలిపోకూడదు. అందువల్ల నా ప్రశ్నకి సమాధానం చెప్పు. వీటి అన్నింటి వెల ఎంత?”
అబ్దులుకరీం ఆనందంగా ఉస్తాద్జీకి నమస్కరించి, “ఉస్తాద్జీ! మిరాజులో ఉండగానే మీ ఔదార్యంగురించి ౘాలామంది కథలు-కథలుగా చెప్పుకోవడం నేను విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. వీటన్నింటికి ఎంతలేదన్నా మిరాజు బజారు ధరప్రకారం నాలుగువందలరూపాయలు లభిస్తాయి, ఖాన్సాహబ్ !” అన్నాడు.
వెంటనే, రజబల్లీసాహబ్ , అతడితో,”కరీంభాయ్ ! ఇదిగో, ఈ ఐదువందలూ తీసుకో! ఆ వాద్యాలన్నీ నా లోపలిగదిలో భద్రంగాపెట్టు. అవన్నీ మనకి సరస్వతీదేవితో సమానంకదా! ఈ డబ్బు నాది అని మొహమాటపడకు! ఇది మహా ఉదారులైన మన మహారాజావారు నాకు దయతో ఇచ్చిన నజరానాలో భాగమే! తోడికళాకారుడివైన నీతో కళాకారుడినైన నేను పంచుకుంటున్నాను. మన మహారాజావారి ఔదార్యం అందరికీచెప్పు. మిరాజులో మన మిత్రులందరికీ నా హృదయపూర్వకశుభాకాంక్షలు అందించు. వచ్చేవారం నేను దేవాస్ కి, వెళ్ళేసమయంలో వారినందరినీ రైల్వే స్టేషనులో కలుస్తాను. నీవుకూడా తప్పక రా! మరొకమారు మనం కలవవచ్చు!” అని అంటూ కరీం చేతిలో ఐదువందల రూపాయలు పెట్టేరు, రజబల్లీఖాcసాహబ్ !
అబ్దుల్ కరీం “బహుత్ బహుత్ షుక్రియా, ఉస్తాద్జీ! అల్లాః ఆప్కో భలాకరేగా!” అంటూ ఆ సొమ్ముతీసుకుని ఉస్తాద్జీకి ఒంగి-ఒంగి సలాం చేసి సంగీతవాద్యాలు లోపలిగదిలో భద్రంగా ఒకమూలకి సర్ది వెళ్ళిపోయేడు.
దేవాస్ నగరంవెడుతూ, దారిలో, మిరాజ్ స్టేషను ప్లాట్ ఫాం మీద ఆ ఊరి మిత్రులందరితోబాటు, కరీంనికూడా ఉస్తాద్జీ కలిసేరు. అక్కడ వచ్చినవారందరికి రెండువందలరూపాయలు పంచిపెట్టేరు. ఈ విధంగా రాజావారు ఇచ్చిన రెండువేల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చుచేయడమేకాక, మిత్రులకి బహుమానంగా పంచిపెట్టేసరికి దేవాస్ చేరేసమయానికి చేతిలో చిల్లిగవ్వలేకుండా ఇంటిలో అడుగుపెట్టేరు. మళ్ళీ అప్పులు-అరువులు యథాపూర్వంగా ఉస్తాద్జీ మొదలు పెట్టేరు. అవన్నీ తలకిమించిన బరువు అవ్వగానే కచేరీల జైత్రయాత్ర ప్రారంభించేరు. ఆయన జీవితాంతమూ ఇదే తరహా కొనసాగిందని చెప్పవచ్చు!
® ® ® ® ® ® ® ® ® ® ® ®
ఉస్తాద్జీకి సుగంధద్రవ్యాలు, అంటే, అత్తర్లు పేరుచెపితే వల్లమాలిన ప్రీతివుండేది. ౘాలాడబ్బు ఖర్చుచేసి బాగా ఖరీదైన అత్తర్లుకొని వాడేవారు. అంతేకాదు. వారికి అత్తర్లకిసంబంధించిన పరిజ్ఞానం బాగావుండేది. వాటి గుణదోషాలన్నీ ఆయనకి కూలంకషంగా తెలుసు. ఊళ్ళో అత్తరుషాపులవారికేకాక లక్నోవంటి దూరప్రాంత సుగంధద్రవ్య వ్యాపారులకికూడా ఉస్తాద్జీ హవేలీ చిరపరిచితమైనది ఐపోయింది. ఒక్కొక్కసారి ఆయనదగ్గర డబ్బులేనప్పుడు అత్తరువ్యాపారులువస్తే, ఆయన వారి దగ్గరవున్న అన్ని అత్తరుల మచ్చు చూడడం, చూసి ఊరుకోకుండా, ఏ అత్తరు దేనితో ఏ విధంగా చేస్తారోచెప్పి, ఆయా అత్తరులలోని గుణదోషాలని ఏకరువు పెట్టడం, దీనితో వ్యాపారుల సమయమంతా ఒకపూట వృధాగా పోవడం జరిగేది. ఒకసారి ఒకస్థానిక సుగంధద్రవ్య వ్యాపారి ఉస్తాద్జీదగ్గర డబ్బులేని సమయంలోవచ్చి ఆయన బారిన పడ్డాడు. రెండు-మూడు గంటల వ్యాపార సమయమంతా నిష్ప్రయోజనంగా ఉస్తాద్జీ అన్ని అత్తర్ల గుణ-దోష విచారణల ఉపన్యాసంతో గడిచిపోయేసరికి విసుగెత్తిన వ్యాపారి తన బాధని అణుచుకోలేక “ఉస్తాద్జీ! మీరు ఈ రోజు కనీసం ఒక్కఅత్తరైనా కొంటారా? లేకపోతే ఇలాగ నా సమయమంతా వృధాచేస్తూనేవుంటారా? ఈ వేళ అసలు మీ దగ్గర డబ్బువుందా, ఏమైనా కొనడానికి? లేక డబ్బులేకపోవడంచేత ఏదో ఒక వంకని ఇలాగ అత్తర్లమీద ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారా? డబ్బుండి, కొనేటట్లైతే చెప్పండి. నాకు వ్యాపారం కావాలి. మీ ఉపన్యాసాలు నాకు వద్దు. నా వ్యాపారసమయం అంతా నిరర్థకంగా గడిచిపోతోంది. మీకు పనిలేకపోయినా నాకు బోలెడంత పనివుంది.” అంటూ విస-విసలాడుతూ అత్తరులన్నీ తన పెట్టెలో సద్దుకుని బయటకి వెళ్ళిపోయేడు. ఉస్తాద్జీకి అలవిమీరిన కోపం వచ్చిందికాని ఆవేశాన్ని అణుచుకుని, అనువైన సమయంకాదనుకుని మాట్లాడక ఊరుకున్నారు.
అనతికాలంలోనే ఉస్తాద్జీకి ఆయనంటే అమితఆదరాభిమానాలున్న ఇండోర్ మహారాజా తుకోజీరావ్ హోల్కర్ సాహెబ్ దర్బారులో గాత్రసంగీతసభ నిర్వహించవలసిందిగా ఆహ్వానం అందింది. మహారాజాసాహెబ్ దర్బార్లో గానంచేసిన ఉస్తాద్జీకి 850/- రూపాయలతో మంచి సమ్మానం జరిగింది. ఆ డబ్బుతో ఇంటికిచేరిన ఉస్తాద్జీ ఆ రోజు విశ్రాంతి తీసుకుని, మరునాడు తన శిష్యుడిద్వారా అవమానకరంగామాట్లాడిన అత్తురు వ్యాపారికి వెంటనే రమ్మని కబురుచేసేరు. శిష్యుడివెంట తన అత్తరులపెట్టెతో ఆ వ్యాపారి వచ్చేడు. ఆ వ్యాపారివైపు కోపంగాచూస్తూ ఉస్తాద్జీ గట్టిగా “ఆ అత్తరులపెట్టెఅంతా ఎంతకి ఇస్తావు?” అని గద్దించేరు. అతడికి విషయం అర్థమైపోయింది. ‘ఎంతచెపితే సమయోచితంగావుంటుందా?’ అని అతను ఆలోచిస్తున్నాడు. ఉస్తాద్జీ “ఏం? మాట్లాడవేం? మొన్న నా వద్ద డబ్బులేదని, ఏమీ కొనలేనని ఏదేదో నీ నోటికి ఏమివస్తే అది వాగేవుకదా? ఇప్పుడు నోట మాట రావడంలేదేం?” అంటూ మరింత క్రోధంతో గొంతు చించుకుని అరిచేరు. వెంటనే ఆయన ఆటకట్టించడానికి అన్నట్టు అత్తరు వ్యాపారి ఏమీ తడుముకోకుండా, “ఎనిమిది వందలు” అన్నాడు. వెనువెంటనే ఉస్తాద్జీ తన కోటుజేబులోనుంచి సొమ్ము మొత్తాన్ని బయటకితీసి, ఎనిమిదొందలు చేతిలో పట్టుకుని “ఆ పెట్టెని ఇక్కడ బల్లమీదపెట్టి, అప్పుడు ఈ ఎనిమిదొందలు లెక్కపెట్టు. నేను చెప్పేవరకు బయటకి వెళ్ళకు!” అని గట్టిగా మరొకసారి గద్దించేరు. అతడు ఆశ్చర్యంతో కిక్కురుమనకుండా ఆ అత్తరుపెట్టెని బల్లమీద పెట్టి, ఉస్తాద్జీ అందించినసొమ్ము తీసుకుని లెక్కపెట్టుకుంటున్నాడు. ఈ లోపుగా ఉస్తాద్జీ తన శిష్యులందరినీ ఆయన పాత పాదరక్షలతోసహా అన్ని చెప్పుల జతలని, శిష్యులందరి చెప్పులజతలని అన్నీ తీసుకునిరమ్మని ఆనతి ఇచ్చేరు. వాటినన్నింటిని వరసలలో పేర్చమన్నారు. ఈ హడావుడి అంతా డబ్బు జేబులో పెట్టుకున్న వ్యాపారి వింతగా చూస్తున్నాడు. ఉస్తాద్జీ అత్తరు పెట్టెలోనుంచి ఒక్కొక్క అత్తరుసీసాని బయటకితీసి, దానిలోని అత్తురుఅంతా ఒక్కొక్క జోడులోకి పొయ్యడం ప్రారంభించి, మొత్తం అన్ని సీసాలలోని అత్తర్లని చివరిబొట్టుదాకా ఆ జోళ్ళజతలలో ఒంపేసి అత్తరువ్యాపారితో ఇలాగ అన్నారు:— “చూడు! నీ అత్తర్లు అన్నీ ఇందుకు తప్పితే మరెందుకూ పనికిరావు. ఇదీ నీవు విర్రవీగే నీ అత్తర్ల విలువ! ఇది గ్రహించుకుని ఇంక నీవు వెళ్ళు” అని కోపంగా అరిచి అతడిని బయటకి పంపించివేసేరు.
< > < > < > < > < > < > < >
1874వ సంవత్సరం, సెప్టెంబరు, 3వ తేదీన ఉస్తాద్ రౙబ్ ఆలీ ఖాc సాహెబ్ , ఆ కాలంలో నరసింహగఢరాష్ట్రం(ఇప్పటి మధ్యప్రదేశ్ లోని భాగం)లో జన్మించేరు. వారికి ఉగ్గు-పాలతోనే సంగీతం అబ్బింది. ఇంటిలో ఎప్పుడూ శాస్త్రీయసంగీత వాతావరణం నెలకొనివుండేది. వారి తండ్రిగారైన ఉస్తాద్ము ఘల్ ఖాc సాహబ్ , గొప్ప గాయకులేకాక, సాంరంగీ వాదనంలో మహావిద్వాంసులుగా దేశవ్యాప్తంగా పేరు-ప్రఖ్యాతులు పొందిన కళాకారులు. అందువలన రజబల్లీజీ బాల్యంనుంచీ తండ్రిగారైన ముఘల్ ఖాc సాహబు దగ్గర ౘక్కని గాత్రసంగీత శిక్షణని పొందేరు. ఆ తరవాత సుప్రసిద్ధ జైపూరుఘరానా గానవిద్యాకళాకారులైన ఉస్తాద్ ముబారక్ ఆలీఖాcసాహబ్ వద్ద కూలంకషగాన శుశ్రూషచేసి, ముబారక్జీ మార్గనిర్దేశంలో సమగ్ర శాస్త్రీయ గాయన ఫణితిని రజబల్లీజీ తమ అపారసాధనతో అలవరచుకున్నారు. ఆ పైన తమ గానశైలికి అందమైన నగిషీలు దిద్దుకోవడానికి, బీన్ కార్ (ఉత్తరభారత సంగీతశైలిలో వాయించడానికి ఉపయోగించబడే ‘వీణ‘) ఉస్తాద్ బందే ఆలీఖాc సాహబ్ వద్ద కొంతకాలం రజబల్లీజీ శుశ్రూష చేసేరు. ఉస్తాద్ బందే ఆలీఖాcజీ కిరానాఘరానా సంప్రదాయానికి చెందినవారు. అందువల్లనే రజబల్లీజీ గానఫణితిమీద జయపూరు-కిరానా సంప్రదాయాల మిశ్రమ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రజబల్లీజీ గాయనవిద్యాకళలో మాత్రమేకాక, రుద్రవీణ, సితారు, జలతరంగిణి, తబలా వాద్య వాదనకోవిదులు కూడాను! అమన్ ఖాc, నివృత్తిబువా సర్నాయక్ , గణపత్ రావ్ దేవాస్కర్ , కృష్టరావ్ మజుందార్ , కృష్ణశంకరశుక్లా, రాజాభావుదేవ్ , యాసిన్ఖా c(సారంగీ), ఉస్తాద్ అమీర్ ఖాcసాహబ్ మేనమామ-సారంగీవిద్వాంసుడు అయిన ఉస్తాద్ అల్లాదియాఖాc, మేవాటీ ఘరానాకి చెందిన పండిత్ జ్యోతిరామ్ మొదలైన మహామహులు రజబల్లీజీ సుప్రసిద్ధ శిష్యులు. రజబల్లీజీ, కొల్హాపూర్ , దేవాస్ , నేపాల్ మొదలైన విశిష్ట మహారాజ సంస్థానాలలో రాజదర్బారుగాయకులుగా నియమింపబడి విశేషసమ్మానాలు, మన్ననలు అందుకున్నారు. 1954లో అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి చేతులమీదుగా భారత జాతీయ కేంద్ర సంగీత-నాటక అకాడమీ వారి విశిష్టగౌరవ పురస్కారాన్ని పొందేరు. 1909లో, మైసూరుమహారాజా, రజబల్లీజీకి “సంగీతరత్నభూషణ” బిరుదు ప్రదానంచేసి సమ్మానించేరు.
రజబల్లీజీ దేశవ్యాప్తంగా తమ సంగీతసభాయాత్రలని ౘాలాసార్లుచేసి భారతదేశం నలుమూలల ఉన్న సంగీతప్రియుల హృదయాలని పరవశింపజేసి వారి అభిమానగాయకులై విరాజిల్లేరు.
రజబల్లీఖాc సాహెబ్ గానం మనోహరమైన స్వచ్ఛ స్వరప్రస్తారాలతోను, వైవిధ్యభరితమైన తానప్రయోగ సౌందర్యంతోను, అపూర్వరాగాలనికూడా శ్రోతల హృదయాలకి పరమ ఆత్మీయ రమ్యభావన కలిగే రీతిలో పాడడంలోను, జైపూర్ – కిరానా – గ్వాలియర్ గాయనశైలిలని ఒకే సమయంలో అనితరసాధ్య మాధుర్యమహిమతో రసికజనమనోsభిరామంగా సభని రక్తి కట్టించడంలోను విశేష లోకప్రసిద్ధిని పొంది, అజరామరంగా ఉత్తరభారత గాత్రసంగీతప్రపంచంలో నిలిచిపోయింది.
1959వ సంవత్సరం, జనవరి 8వ తేదీన వారు తమ భౌతికకాయం విడిచిపెట్టి సంగీతసరస్వతీదేవిలో ఐక్యమైపోయేరు. వారి అద్భుతమైన గాత్రసంగీతం “యూ-ట్యూబు”లో రసజ్ఞశ్రోతలకి తగురీతిలో లభ్యమౌతోంది. బహాదురీతోడి, హేంకల్యాణ్ , బహార్ , బాగేశ్రీ, జోధన్ పురి, బేహాగడ, బసంత్ , శంకరా, జూంజ్ మల్హార్ మొదలైన రాగాలు రజబల్లీఖాcసాహబ్ గాయనశైలిలో విని రాగసంగీతరసికులు పరవశించి, తరించవచ్చు!
మహమ్మదీయ ప్రార్థనామందిరాలైన మసీదులలో ఉస్తాద్జీ ఎంత భక్తి-శ్రద్ధలతో నమాజు చేసుకునేవారో, అంతే ప్రేమాసక్తులతో హిందూమతసంప్రదాయ దేవాలయాలని సందర్శించుకుని, ఆయా దేవాలయాలలో దైవప్రార్థనలు ఆచరించేవారు.
ఆ శారదాతనయుడి గానవైశారద్యానికి మోకరిల్లి నమస్సుమాలు అర్పించుకుందాం!
స్వస్తి|
శారదాతనయుడి గానవైశారద్యానికి మోకరిల్లి నమస్సుమాలు అర్పించుకుందాం!
ఉస్తాద్ రజబల్లీఖాను గురించి చదువుతుంటే , ఆయన జీవితంలో
జరిగిన సంఘటనలు గొప్ప అనుభూతిని కలిగించాయి.
అంతటి నిస్వార్థతతో మనుషులు బతకడం ఎక్కడో కథల్లోనో,
సినిమాల్లోనో చూస్తాం. నిజజీవితంలో ఇలాంటి మనుషులు తారస
పడడం అరుదు. అంతేకాదు తనకి ఆశ్రయమిచ్చి పోషించే రాజు
గారి మర్యాదకి భంగం కలగకుండా, వాద్యాల నిర్మాతతో రజబలీఖాన్
వ్యవరించిన తీరు ఎక్కడా వినలేదు. నిజమైన కళాకారుడు దైవంతో
సమానం అనే నానుడి ఇటువంటి సందర్భాల్లోనే అర్థమవుతుంది.
అలాగే మిగిలిన సంఘటనలన్నీ కూడా అద్భుతం అనిపించాయి.
ఇక వారి సంగీత కళా కౌశలం, విశిష్టులైన వారి శిష్య పరంపర,
వారందుకున్న సన్మానాలు, సత్కారాలు, వారి మత విశ్వాసాలు
అన్నీ అత్యున్నతమైనవే. ఒక మహా “వ్యక్తి” గురించి మంచి పరిచయం
చేశావు… థాంక్స్.
పరుల బాగు కొరకు పరితపించిన వాడు
రాగ హృదయ మూర్తి రజబు ఖాను.
సాటి లేరతనికి సంగీత రంగాన ,
రాజభక్తి నెవరు రారు పోటి!