సాహిత్యము—సౌహిత్యము~60a : పాపము ~ పుణ్యము
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
07—07—2018; శనివారము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“సాహిత్యము—సౌహిత్యము ~ 60(A)”| “పాపము ~ పుణ్యము”| (ఈ అంశం గతవారం “మంచి – చెడు”కి అనుబంధవ్యాసం)
మానవ ప్రపంచంలో లెక్కకి మిక్కుటమైన మతాలు ఉన్నాయి. ఆటవికజాతుల మతాలు (tribal religions) నుంచి మహానాగరికమైన మతాలు (highly sophisticated religions) వరకు ప్రపంచంలోని మతాలన్నీ చేసే బోధనలన్నీ నీతినియమాలని విధిస్తూ, అన్యాయ-అక్రమాదులని నిషేధిస్తూ, మానవజీవన పరమావధి సగుణ-సాకార దైవానుగ్రహాన్ని లేక సగుణ-నిరాకార పరమేశ్వర సంప్రీతిని పొందడమేనని బోధిస్తాయి. ఇహలోకసంబంధంమాత్రమేకలిగిన రెండు పురుషార్థాలైన అర్థ-కామాలని మానవుడు నీతి-నియమాలకి లోబడి పొందడంద్వారా పరమేశ్వర అనుగ్రహం సంపాదించగలడని ప్రపంచమతాలన్నీ ఏకకంఠంతో బోధిస్తాయి. ఏ మతమైనా అసత్యాలని, అన్యాలని, దొంగతనాలని, దోపిడీలని, అక్రమమైన అర్థ-కామ సముపార్జనాన్ని, మద్యపానాన్ని, జూదాన్ని, పరస్త్రీగమనాన్ని, వ్యక్తిగతంగాకాని-సామూహికంగాకాని బలహీనులని బలవంతులు స్వప్రయోజనాలకి వినియోగించుకోవడం వంటి హీనకర్మలని, సభ్యత-సంస్కారాలని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా నిషేధిస్తుంది. అంతేకాని అలాంటి పనులకి వత్తాసు పలకదు! వాటిని ఏ మాత్రమూ ఆమోదించదు. నీతి-నియమాలకి పెద్దపీటవేస్తూ ప్రతిమతమూ మానవులలో అసూయ-ఈర్ష్య-వైరం-ద్వేషం-క్రోధం-మాత్సర్యం-మదం-దంభం-ఇతరులని లోకువగా చూడడం-అక్రమ అర్థ,కామ ఉపభోగం వంటి నింద్యమైన, దూష్యమైన అపాయకర దుష్టభావాలు, అసత్యభాషణం, ౘాడీలుచెప్పడం, వ్యర్థప్రసంగం మొదలైన ప్రతికూలవిషయాలని మానవసమాజంనుంచి పూర్తిగా నిషేధిస్తుంది. మానవులలో ప్రేమభావం-మైత్రి-కరుణ-నియమబద్ధమైన అర్థ,కామాలని అనుభవించడం-శాంతస్వభావం-సత్త్వగుణమయమైన అభిప్రాయాలపట్ల గౌరవం-సత్సంగం-పరోపకారపరాయణత-ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడం-ఉత్తమ ఆదర్శ ఆచరణ, పరిరక్షణ-సదాచార అనుష్ఠానం శిష్టాచారసంప్రదాయ నిర్వహణ, పరిరక్షణ మొదలైనఅనుకూలభావనలని మతం పరిపుష్టంచేసి పోషిస్తుంది. ఇతర ప్రపంచ మతాలలో కేవలం నీతి నియమ అనుసరణ ద్వారామాత్రమే మానవుడి శీలనిర్మాణం,మానవసమాజపరిరక్షణ ఆధారపడివుంటాయి. అందువల్ల ఆయా మతాల వ్యవహారపరిధి ఎక్కువగా ఇహలోకానికిమాత్రమే ప్రాముఖ్యతని ఇస్తూనే, పరమేశ్వర అనుగ్రహం అనే ప్రయోజనం బోధించడంద్వారా కొంతవరకు పరానికిగల ప్రమేయానికికూడా లోబడివుందని చెప్పాలి.
భారతీయ వైదికసంప్రదాయం లేక ఆర్షపరంపర, మనిషి ఇహలోకయానంకోసం అవసరమైన అర్థ-కామ విషయాల పరిధికి, మానవ జీవాత్మ యానంలో ఇహలోకానికివున్న పరిమితిని అనుసరించి, అవధులని ఏర్పరిచింది. అంతేకాక సృష్టి, సత్త్వరజస్తమోగుణమయమైనదికనక, దానిలో అర్థ-కామాలు రజోగుణ ప్రేరిత తమోగుణాలుకావడంవల్ల, వాటికి సత్త్వగుణచోదిత రజోగుణాత్మకమైన ధర్మం అనే ఒక యానకాన్ని(vehicleని)కూర్చి, కేవలం సత్త్వగుణమయమైన భావసౌష్ఠవంతో పొందడానికి వీలైన మోక్షం అనే అనుపమాన ఆదర్శాన్ని గమ్యస్థానంగా చేసేరు. ఆ విధంగా చతుర్విధపురుషార్థవ్యవస్థని వైదికసంప్రదాయం ఏర్పరిచింది. చట్టం ఇహలోకక్రియాకలాపాలకిమాత్రమే పరిమితమౌతుంది. లౌకికప్రయోజన ఆదర్శంకలిగిన సామాజికశాస్త్రాలుకాని, ఆరోగ్యశాస్త్రాలుకాని, శిక్షాస్మృతులుకాని ఇహలోకపరిధికిమాత్రమే పరిమితమైపోతాయి. అందువలన ఇటీవలకాలంలో బయలుదేరుతున్న పురుషుల సహజీవనం(gay culture), యుక్తవయస్సువచ్చిన స్త్రీ-పురుషులు వివాహవ్యవస్థయొక్క ప్రమేయంలేని సహజీవనం(living together of man and woman without marriage), స్త్రీలసహజీవనం(lesbian culture) వంటివి కొన్ని దేశాలలో ౘట్టబద్ధతని పొందుతున్నాయి. ఎందువల్లనంటే ఈ ౘట్టాలన్నీ లౌకికప్రమేయం మాత్రమే కలిగివున్నవి (exclusively secular legislations) అవ్వడంవలన ఆ ౘట్టాలు, అటువంటి ౘట్టాలని అనుసరించే న్యాయస్థానాలు అంతకంటే ఏమీ చెయ్యలేవు.
“ధర్మం“అనేది ఇహ-పరాలకి సేతువువంటిది. నాలుగు పురుషార్థాలలోను ధర్మం ఇహ-పర ప్రమేయం కలిగినది. అర్థ-కామాలు రెండూ కేవలం ఇహానికి మాత్రమే చెందినవి. మోక్షం కేవలం పరానికి చెందినది. ధర్మశాస్త్రం ప్రకారం విధులని ఆచరించడంవలన పుణ్యంవస్తుంది. నిషిద్ధకర్మలని ఆచరించకుండావుంటే పాపస్పర్శలేని జీవితాన్ని గడపవచ్చు. అలాగే విధులని అతిక్రమించడంవల్ల, నిషిద్ధకర్మలని ఆచరించడంవల్ల కూడా పాపం సంక్రమిస్తుంది. భగవదనుగ్రహం పొందాలన్నా, లేక, మోక్షాన్ని సాధించాలన్నా ధర్మబద్ధమైన అర్థ-కామాచరణని అనుసరించాలి. మానవుడికి పుణ్యసంచయంద్వారా సుఖప్రాప్తి, పాపసంచయం ద్వారా దుఃఖప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు, శిష్టాచారసంప్రదాయపరాయణులైన పెద్దలు చెప్పడం జరుగుతోంది. శిష్టాచారసంప్రదాయంలో ధర్మబద్ధమైన అర్థ-కామ ఆచరణని నిర్వహిస్తూ మానవజీవతంలో దైవానుగ్రహాన్ని పొందుతూ మోక్షంకోసం ప్రయత్నం చెయ్యాలి. ఈ వ్యవస్థలో సాధారణమానవులు నాలుగు పురుషార్థాలని సమగ్రంగా నిర్వహించే ప్రయత్నం చెయ్యడంద్వారా ఆధ్యాత్మికసాధకులుగా క్రమ-క్రమంగా పరిణతి పొందుతారు. అటువంటి ప్రయత్నంలో భాగంగానే “పరోపకారం చెయ్యడంవల్ల పుణ్యమూ, పరహింసచెయ్యడంవల్ల పాపము కలుగుతాయి” అని మనకి తెలుసు. ఐతే సాధారణమానవుల మానసికమైన స్థితి-గతులని మన పెద్దలు ఇలాగ వివరించేరు:—
“పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛన్తి మానవాః|
న పాపఫలమిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః”||
“మనుజులు పుణ్యకర్మఫలాన్ని కోరుతూనేవుంటారు. కాని పుణ్యకర్మలని చెయ్యడానికి ఇష్టపడరు. అలాగే, వారు పాపకర్మఫలాన్ని కోరుకోరు. కాని, పాపకర్మలని స్వేచ్ఛగానే చేస్తూవుంటారు”.
ఐతే ఆధ్యాత్మిక సాధకుడి నైజాన్నిగురించి అర్జునుడు, “భగవద్గీత“లో శ్రీకృష్ణభగవానులవారిని ఇలాగ అడిగేడు:—
“అథ కేన ప్రయుక్తోsయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః”||(భగవద్గీత:III:36)
“ఓ కృష్ణా! ఈ మానవుడు దేనిచేత ప్రేరేపించబడినవాడై, బలవంతం చేయబడినవాడిలాగ, తనకి ఇష్టంలేకపోయినా, పాపకర్మని చేస్తున్నాడు?”
ఇంచుమించు ఇటువంటి సందేహాన్నే ఉద్ధవులవారు, శ్రీకృష్ణభగవానుడిని “శ్రీమద్భాగవతమహాపురాణమ్ ” లోని, “హంస గీతి“లో ఈ విధంగా అడుగుతాడు.
“వదంతి మర్త్యాః ప్రాయేణ విషయాన్ పదమాపదామ్ |
తథాsపి భుంజతే కృష్ణ! తత్కథం శ్వఖరాజవత్ “||
(శ్రీమద్భాగవతమ్ – XI : 13 – 8)
“ఓ కృష్ణా! మనుష్యులు ఇంద్రియభోగసంబంధమైన విషయాలనన్నింటినీ ఆపదలకి నివాసస్థానాలని అనేకసందర్భాలలో చెపుతూనేవుంటారు. ఒకవైపు అలాగ అంటూనే, మరొకవైపు మతిమాలిన కుక్క, గాడిద, మేకలలాగ ఆ తుచ్ఛ ఇంద్రియసుఖాలని అనుభవిస్తూ, వాటికై వెంపరలాడడం చేస్తూంటారు. ఇది ఎలాగ సాధ్యమౌతోంది”?
“భగవద్గీత“లో శ్రీకృష్ణుడు, “జ్ఞానులయొక్క జ్ఞానాన్ని మహాబలీయమైన కామం కప్పివేసి, వారల మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని ఆక్రమించుకుని, వారి జీవాత్మని మోహవశం చేయడమే ఈ జటిలమైన సమస్యకి మూల కారణం. జ్ఞాని తన జ్ఞానంద్వారా కామ-క్రోధాలని నిర్మూలించి ముక్తిని పొందగలగాలి” అని చెపుతాడు.
“భాగవతం“లో శ్రీకృష్ణుడు, ఉద్ధవుడి సందేహం నివృత్తిచేస్తూ, “మనస్సుని అన్నివైపులనుంచి మరలింపజేసి సాక్షాత్తుగా నామీదనే ఏకాగ్రంగా నిలబెట్టాలి” అని మరొక ఉపాయాన్ని వెల్లడిచేసేడు.
అంటే, జ్ఞానయోగంద్వారాకాని, భక్తియోగంద్వారాకాని సాధకులకి పాపవిముక్తికి తరుణోపాయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఇలాగే కర్మయోగంద్వారాను, రాజయోగంద్వారాను కూడా వివిధ ఉపాయాలు ఉన్నాయి.
కలియుగంలో-“కలౌ స్మరణాన్ముక్తిః” — కలియుగంలో ఇష్టదేవతానామస్మరణని నిరవధికంగా ప్రీతిభావంతో చేసుకోవడంద్వారా భక్తులకి ముక్తి లభిస్తుంది అని ఆర్యోక్తి! అందుకనే అందరం కలిసి ఇలాగ భగవానుడిని భజిద్దాం:—
“నామస్మరణాత్ అన్యోపాయం న హి పశ్యామః భవతరణే|
రామహరే! కృష్ణహరే! తవ నామ వదామః సదా నృహరే!”||
“(ఈ కలియుగంలో) జనన-మరణరూపమైన, పుణ్య-పాప ఫల జనితమైన, మా జీవితాలకి తరుణోపాయం నీ నామస్మరణ తప్పితే మరొకదానిని మేము చూడలేము. ఓ రామహరీ! ఓ కృష్ణహరీ! ఓ నరహరీ! నీ నామాన్నే సర్వదా స్మరించుకుంటూనేవుంటాము“!
స్వస్తి|
‘పుణ్యకర్మ ఫలాన్ని కోరతాడు కానీ, మనిషి పుణ్యకర్మలు
చెయ్యడానికి ఇష్టపడడు. అలాగే పాపకర్మ ఫలాన్ని కోరడు..
కానీ స్వేచ్ఛగా పాపాలు చేస్తూ వుంటాడు’ అనే వాక్యాలు మానవ
నైజానికి అద్దం పడుతున్నాయి.
పాపాలు చెయ్యద్దు….పుణ్య కార్యాలు మాత్రమే చేయండి..
నీతి నియమాలతో జీవితం సాగించండి అనే అన్ని ధర్మాలూ
చెప్పినా, మానవతా విలువలను పరిరక్షించమని
మతాలన్నీ ఎంత బోధించినా, ఆ మతాల పేరుతోనే మనిషి
నీతి బాహ్యమైన పనులు చేయడం అత్యంత బాధాకరం.
ఇదంతా ఇందులో చెప్పినట్లుగా ఇంద్రియలాలస వల్లనే
జరుగుతోంది. ఇంద్రియాలని సుఖపెట్టాలనే కోరిక అతి
బలీయంగా ఉండడంవల్లనే మనిషి అక్రమ మార్గాలు
తొక్కుతున్నాడు. నిషిద్ధకర్మలు ఆచరిస్తున్నాడు.
ఇలాంటి వ్యాసాలు ఆత్మపరిశీలన చేసుకోవడం కోసం
ఎంతైనా అవసరం!
మతములన్ని మనిషి మంచినే కోరేను
పాడి తప్పకుండ బ్రతక మనుచు.
నీతి కలిగి జాతి నిఖిలమై విలసిల్లు
ధర్మ మొకటె నిలుచు ధరణి యందు.
“ధర్మమొకటె నిలుచు ధరణియందు”
అనే ఈ పద్యపాదం ఉదాహరణవాఙ్మయంలో ఉండదగినది. ఆంగ్లంలో ఇటువంటి వాక్యాలనే
“Quotable quotes” అంటారు.
Wonderful presentation of the most abstract and complicated theory, on which our ancient Rishis strived to give to mankind through Puranas and other scriptures . You have very simply and clearly stressed the importance of Dharma the only path suggested to attain the other three Purusharthas Artha Kama and Moksha. The importance of Nama Smarana quoting from Mahabharata and Uddhava Gita highlight today’s article .
జ్ఞాన-రాజాది మార్గాలని మన ఋషులు “మర్కట-కిశోరన్యాయంగా వర్ణించేరు. అంటే కోతిపిల్లని తల్లికోతి
పట్టుకుని బిడ్డబాధ్యతని తాను వహించదు. పిల్లకోతే ఆ బాధ్యతని తీసుకుని తల్లిని గట్టిగా పట్టుకునివుండాలి. తల్లి
ఒక కొమ్మనుంచి మరొక కొమ్మికి, ఒక చెట్టునుంచి మరొక చెట్టుకి
చెంగు-చెంగున దూకుతూ పోతూవుంటుంది. బిడ్డకోతి సరిగా
పట్టుకోకపోతే దానికి అంతంవచ్చినట్లే!
అదే మార్జాలకిశోరన్యాయంలో, బిడ్డపిల్లిని, తల్లిపిల్లి తన నోట
కరచి జాగ్రత్తగాపట్టుకుని బిడ్డని కాపాడుకుంటుంది. పిల్లిపిల్లకి
ఏ ప్రమాదమూలేదు. భక్తియోగం మార్జాలకిశోరన్యాయం వంటిది. భక్తుడు త్రికరణశుద్ధిగా తన బాధ్యతని పూర్తిగా
ఇష్టదేవతాపరం చేసేస్తాడు.
భగవద్గీతలోది మర్కటకిశోరన్యాయం.
భాగవతంలోది మార్జాలకిశోరన్యాయం.
కలియుగానికి పెద్దలు మార్జాలకిశోరన్యాయాన్నే ఉపదేశించేరు.