సాహిత్యము—సౌహిత్యము~60 : “మంచి—చెడు” / “Good vs. Evil”
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
30—06—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము ~ 60″| “మంచి—చెడు” / “Good vs. Evil”|
ఫ్రెంచి నవలాకారుడైన Anatole France, 1889లో, “THAIS” అనే ఒక నవలని వ్రాసి, ప్రకటించేడు. అదే ఇతివృత్తంతో హిందీలో శ్రీ భగవతీచరణవర్మ “చిత్రలేఖ” అనే పేరుతో ఒక గొప్ప నవలని రచించేరు. ఈ నవలని ఆధారంగా తీసుకుని ఎ.ఎ.నడియాడ్వాలా అనే హిందీ చలనచిత్రనిర్మాత 1964లో, “చిత్రలేఖ”ని హిందీ చలనచిత్రంగా రూపొందించి విడుదలచేసేరు. ఆ చిత్రానికి పండిత్ కేదారశర్మ సంభాషణలు, దర్శకత్వం అందించేరు. అందులో మీనాకుమారి వేశ్యచిత్రలేఖగాను, ప్రదీప్ కుమార్ బీజగుప్త సామంతరాజుగాను, అశోక్ కుమార్ బౌద్ధభిక్షువు యోగి కుమారగిరిగాను ప్రధానభూమికలు నిర్వహించేరు. ఆ చిత్రానికి రసమయసంగీతాన్ని అందించి, రోషన్ సాబ్ , పదికాలాలపాటు పదిలంగా శ్రోతలమదిలో నిలిచిపోయే అత్యద్భుతమైన పాటలని మహామనోహరరాగాలలో వరసకట్టి, సంగీతం అందించేరు. ఇంక కవి సాహిర్ లూధియాన్వీ రచించిన రమ్యకవితామయగీతాలు గురించి చెప్పడానికి మాటలు మూగపోతాయి.
“చిత్రలేఖ” సినిమాలో అన్నీ గొప్పపాటలే! కళావతి, కామోద్ , ఝుంఝూటీ, పీలూ, యమన్ , భైరవి వంటి మహనీయమైన జనరంజక రాగాలలో పాటలకూర్పు జరిగింది. వాటిలో ఒకపాట వేశ్యచిత్రలేఖ, యోగి కుమారగిరిని ఉద్దేశించి పాడుతుంది. ఆ పాట ఇది:—
పల్లవి:—
“సంసార్ సె భాగే ఫిర్ తేహో భగవాన్ కొ తుం క్యా పావోగే?”
ఈ పల్లవితోవున్నపాటలో ఒక చరణం ఈ విధంగావుంటుంది:—
“యహ్ పాప్ హై క్యా? యహ్ పుణ్య్ హై క్యా?
రీతోంపర్ ధర్మ్ కి మొహరీ హై?
యుగ్ యుగ్ సె బదల్తే ధర్మోంకో
కైసే ఆదర్శ్ బనావోగే?”|
“సంసారరూపంలోవున్న దేవుడి సృష్టినుంచి పలాయనంచేస్తూ తిరిగే నీకు ఆ దేవుడు ఎలాగ లభ్యం ఔతాడు? – – – – – ఫలానా పని పాపం అని, ఫలానా పని పుణ్యం అని మనం చేసే పనులమీద ధర్మశాస్త్రం ముద్రలు ఏమైనావున్నాయా? యుగ-యుగానికీ మారిపోయే మన ధర్మాలు, మనకి శాశ్వతమైన పుణ్య-పాప నిర్ణయం చెయ్యగలిగిన పరిపూర్ణ ఆదర్శస్థాయిలో ఎలాగ ఉండగలవు?” అని చిత్రలేఖ కుమారగిరితో వాదిస్తుంది.
ఇది గంభీరమైన తాత్త్వికచర్చ! కాలానుగుణంగా మారిపోయే ధర్మాన్ని ఆధారంగాచేసుకుని, మానవభావప్రపంచానికి శాశ్వత ఆదర్శాలు నిర్దేశించడం ఎలాగ, అనే ప్రశ్న ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే, మనిషి నిత్యజీవితానికి ఏ విధమైన ఆదర్శస్పర్శ లేకుండా విచ్చలవిడిగా పశుప్రాయమైన బ్రతుకుని అనుసరించడమేనా, అని మరొక ప్రశ్న తలెత్తుతుంది. ఇది ఒక ప్రక్కన వ్యక్తిగత నైతిక సమస్య(Individual moral problem), మరొకవైపు సామాజిక నైతిక సమస్య(Social ethical problem) రెండింటితోను, ఒక నాణేనికి రెండువైపులులాగ, ముడిపడివుంది. మానవజీవననైతికత పునాదులని స్పృశించే సమస్య యిది!
వివిధ మానవ నాగరిక, సాంస్కృతిక చరిత్రలలో మొదటినుండి ఈ “మంచి-చెడు” అనే సమస్యలు, ఏది పుణ్యం? – ఏది పాపం? వంటి ప్రశ్నలు మానవసమాజ శాస్త్రవేత్తలని, నీతిశాస్త్రకారులని, ధర్మనిర్ణయ కారులని, తత్త్వశాస్త్రవేత్తలని ఎడతెరిపిలేకండా వేధిస్తూనేవున్నాయి; వేధిస్తూనేవుంటాయికూడాను!
సామాజికంగా “మంచి-చెడులు”గా ఉన్నవే మతపరంగా “పుణ్య-పాపాలు”గా రూపుదిద్దుకున్నాయని మానవసమాజశాస్త్రజ్ఞులు భావిస్తారు. ఐతే, అది అంత సులువుగా చెప్పగలిగే విషయంగా కనిపించదు. ఉదాహరణకి, ఆరోగ్యశాస్త్ర పరంగా మద్యపానం ఒక ప్రత్యేక పరిమితిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే అని ఆరోగ్యశాస్త్రవేత్తలు చెపుతారు. మితిమీరిన మద్యపానం చెడ్డదని వారు అంటారు. అదేవిధంగా ౘట్టపరంగాకూడా, మద్యపాననిషేధంవున్నచోట మద్యపానం నేరమనీ, నిషేధంలేకపోతే, ఇతరులని ఇబ్బందికి గురిచేయకుండా మద్యసేవనం చేయడంలో తప్పులేదని చట్టం చెపుతుంది. కాని ప్రధాన ప్రపంచమతాల నీతిశాస్త్రాలప్రకారం మద్యపానం ఒక్క గుక్కెడు చుక్కైనా పాపప్రదాయకమే!
అందువలన ఈ సూక్ష్మ వివరణని తెలుసుకుని మసులుకోవాలి.
ఎందరెందరో ప్రపంచమేధావులు ఎంతెంతో అంతర్మథనంచేసి, ఈ మంచి-చెడులు లేక పాప-పుణ్యాలు గురించి తమ అమూల్యభావనలని లోకహితంకోసం అందించేరు.
సృష్టి స్వభావజన్యమైన సహజసూత్రాలకి అనుగుణంగా మానవజీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మనిషిలోని మంచికి నిదర్శనం అని హెరాక్లిటస్ (Heraclitus) వంటి ప్రాచీనగ్రీకు తత్త్వవేత్తలు బోధించేరు.
“లౌకికప్రమేయంలేని అంతర్గత ఆనందస్థితి, హృదయశాంతి మానవుడి మంచితనానికి గుర్తులు” అని డెమొక్రిటస్ (Democritus) అన్నాడు.
సోక్రటిసు(Socrates) మంచి-చెడులగురించి స్పష్టమైన సామాజిక అవగాహనతో, నిరంతర అన్వేషణని చేసేడు. ఆయన “జ్ఞానం” ఉత్తమపుణ్యఫలంగా నిర్వచించేడు. అందువలన వ్యక్తిగత లాభనష్టాలతో ప్రమేయంలేకండా జ్ఞానాన్వేషణామార్గంద్వారా మంచిని తెలుసుకోగలగడమే ఆదర్శజీవన విధానమని ఉద్బోధించేడు.
ఇంద్రియభోగప్రధానమైన లౌకికభావనలు చెడ్డవిగాను, ఆత్మజ్ఞానంద్వారామాత్రమే గ్రహించడానికివీలైన ఆదర్శజగత్తును గురించిన జ్ఞానానుభవమే మంచిగాను ప్లేటో(Plato) నిర్వచించేడు.
అరిస్టాటిల్ (Aristotle) “ఆత్మసిద్ధిద్వారా జీవుడు జన్మసాఫల్యం పొందడమే ఉత్తమపుణ్యఫలం” అని బోధించేడు. అటువంటి పుణ్యఫలాన్ని సాధించడానికి మనిషిచేసే ప్రయత్నం అంతా ఎప్పుడూ మంచిదే అని ఆయన వివరించేడు.
ఎపిక్యూరస్ (Epicurus) మానవజీవితంలో సంభవించే సంతోషాలని స్థూలమైనవిగాను, సూక్ష్మమైనవిగాను భిన్నంగా పరిగణించేడు. అంతేకాక తాత్కాలికమైనవి, నిరంతరమైనవి అనికూడా విభజించేడు. తాత్కాలిక సంతోషాన్ని కలిగించేవాటికన్న నిరంతర సంతోషమిచ్చేవి ఎక్కువ మంచివిగా పరిగణించేడు. అలాగే ఇంద్రియానందం(sensual pleasure) కలిగించేవాటికన్న మానసిక ఆనందం(mental pleasure)కలగజేసేవి ఉన్నతమైనవిగా పేర్కొన్నాడు. ఈ రెండింటికన్న బౌద్ధికానందం(intellectual pleasure) కలిగించేవి శ్రేష్ఠమైనవని వక్కాణించేడు.
“అజ్ఞానంవలనకాని, అల్పజ్ఞానంవలనకాని మనిషి లోకంలో పొరబాటు నిర్ణయాలుచేసి దుష్ఫలితాలు పొందుతాడు. అందువలననే మానవుడు చెడు చెయ్యడం జరుగుతోంది” అని దెకార్తే(Descartes) విశ్లేషించేడు.
“మన అల్పజ్ఞానంవలన, మన అజ్ఞానంవలన మనంచేసే పొరబాటుపనులు మనకి దుష్ఫలితాలని ఇస్తాయి. కాని అటువంటి దుష్ఫలితాలు అనుభవించిన మనిషి అటువంటి తప్పుపనులు మళ్ళీ చెయ్యకుండాను, మంచిపనులని చేసేవిధంగాను జ్ఞానాన్ని పొందుతాడు. తద్ద్వారా నిరంతరమూ మంచినే ఆచరించాలనే ప్రేరణకూడా కలుగుతుంది. ఆ విధంగా క్రమ-క్రమంగా మనిషి తనలోనే నివసించే దైవప్రతిబింబం దర్శించుకునే స్థాయికి పరిణతి పొందుతాడు. ఇదే ఆత్మదర్శనం(self-relisation)” అని స్పినోజా(Spinoza) తన దర్శనానుభవాన్ని వ్యక్తీకరించేడు.
“మనం చేసే పనులకోసం మనలని నిత్యం ప్రేరేపించే మన అంతరాత్మకి సంబంధించిన అంశ మనలని నియమిస్తూ, నియంత్రిస్తూ మనలోనేవుంది. మనలని నియమరూపంలో నియంత్రించే ఆ చైతన్యాంశయొక్క గమనం విశ్వానికంతటికీ ఆదర్శప్రాయంగా ఉండేవిధంగా మనం నిరంతరం సాధన చెయ్యాలి” అని ఇమ్మాన్యుయెల్ కాంట్ (Immanuel Kant) అన్నారు. మనిషి, తన సాటి మనిషిని ఏ పనికైనా పనిముట్టుగా పరిగణించకూడదని కాంట్ ఉపదేశించేరు.
ప్రాచీన భారతీయ ఋషులు “మంచి-చెడులు“గురించిన బోధని విస్తృతంగా చేసేరు. “యోగవాసిష్ఠం” అనే గ్రంథంలోని బోధ ఈ విధంగావుంది:—
“శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతీ వాసనా సరిత్ |
పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి”||
“మానవుడి మనస్సు జన్మాంతరాలలో చేయబడిన కర్మఫలాల వాసనలని అనుసరించి మంచి-చెడు లేక పాపం-పుణ్యం అని మనం అనుకునే శుభ-అశుభ మార్గాలలో సంచరిస్తుంది. (అలాగ జన్మతః వచ్చే వాసనలని యాంత్రికంగా అనుసరించే) అటువంటి మనస్సుని (ఉత్తమాదర్శ నిర్దిష్టమైన) మంచిదైన శుభమార్గంలో పురుషప్రయత్నంద్వారా (సాధకుడైన)మానవుడు సంచరింపచెయ్యాలి” అని ఈ శ్లోకభావం.
కృష్ణద్వైపాయన వ్యాసభగవానులవారిని వారి సమకాలీనులైన కొందరు ఋషులు లోకహితైషులై ఒకసారి ఈ విధంగా అడిగేరట:—
“ఆర్షమహోదయా! వ్యాసభగవత్పాద దేశికోత్తమా! వేదాలు, స్మృతులు, ఇతరగహనశాస్త్రాలు సామాన్యుల అధ్యయనానికి అందుబాటులో ఉండవని గ్రహించి ఆ మహాగ్రంథాల ఉపదేశసారాన్నే అష్టాదశపురాణాలు- అష్టాదశ ఉపపురాణాలు రూపంలో అందరికీ అందుబాటులోవుండే కథలుగాను, బోధలతోను తాము లోకానుగ్రహదృష్టితో విరచించేరు. వీటి అన్నింటి సారాంశాన్ని ఒకేఒక చిన్న పుస్తకంగా అందరికీ అర్థమయ్యే చిన్న మాటలలో బోధిస్తూ రచిస్తే అది లోకోత్తరసేవ ఔతుందికదా! రాబోయే కలియుగంలో అందరు మానవులకీ అందుబాటులో వుంటుంది కూడాను!”
ఆ మాటలువిని వ్యాసభగవానులవారు నవ్వుతూ, “ఎంత చిన్నదైనా పుస్తకం అంటేకూడా కలియుగంలో కష్టమే! అతిసూక్ష్మంలో అనంతఫలప్రదంగా ఉండాలని అందరూ ఆశిస్తారు. అందుకని ఓకే ఒక్క శ్లోకం చెపుతాను. దానిలో పూర్వార్థం విడిచిపెట్టి ఉత్తరార్థం ఒక్కటీ జ్ఞాపకంవుంచుకుని, ఆచరించేవారు అందరూ తరించి తీరతారు. ఆ శ్లోకం ఇదిగో, ఇది:—
“అష్టాదశ పురాణానాం సారం సారం సముద్ధృతమ్ |
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ “||
“పద్ధెనిమిది పురాణాల మూలసారం ఏకవాక్యంగా చెప్పాలంటే ‘పరోపకారంచేయడంవలన పుణ్యమూ, పరహింసచేయడంవలన పాపము కలుగుతాయి’ అని విశదంచేయవచ్చు”.
ఇదే విషయాన్ని వ్యాసభగవానులు, తమ మహాభారతమ్ సంస్కృతగ్రంథంలో మరొకవిధంగా ఇలాగ బోధించేరు:
“యదన్యైః విహితం నేచ్ఛేత్ ఆత్మనః కర్మ పూరుషః|
న తత్ పరేషు కుర్వీత జానన్నప్రియమాత్మనః”|| (మహాభారతం – శాంతిపర్వం – 259:20)
“తనకి ఇతరులు చేసేది హితమైనది, ప్రియమైనది కాకపోతే, అటువంటి పనిని తాను ఇతరులకి చేయకూడదు”.
ఇదే అర్థాన్నిచ్చే మరొక శ్లోకాన్ని, మరొక సందర్భంలో, మహాభారతంలోనే, వ్యాసమహర్షి ఈ విధంగా చెప్పేరు:—
“న తత్ పరస్య సందద్యాత్ ప్రతికూలం యదాత్మనః|
ఏష సంక్షేపతో ధర్మః (కామాదన్యః ప్రవర్తతే)”||
“తనకి ప్రతికూలమైనదానిని ఇతరులకు తాను చేయకపోవడమే ధర్మసారం” అని దీనికి భావం.
దీనినే, కవిత్రయ ఆంధ్ర మహాభారతంలోని శాంతిపర్వంలో, తిక్కనసోమయాజి ఒక అందమైన కందపద్యంలో సుందరబోధగా ఇలాగ చెప్పేరు:—
“ఒరులేయవి ఒనరించిన
నరవర! అప్రియము తన మనమ్మునకగు, తా
నొరులకు అవి సేయకునికి,
పరాయణము పరమధర్మ పథములకెల్లన్ “|| (ఆంధ్రమహాభారతము – శాంతిపర్వము – V : 220)
“ఇతరులు ఏమిచేస్తే మనకి కష్టం కలుగుతుందో, అటువంటి పనిని మనం ఇతరులకి చేయకుండావుండడమే ధర్మాలన్నింటిలోను పరమమైన ధర్మము” అనే అమృతమయబోధ ఈ అలతిపలుకులలో నిక్షేపించబడింది.
ఆధునిక కవివరులైన శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ గారు, తమ రచన అయిన “బాలాంత్రపు ఉపనిషత్తు” అనే ‘శతకత్రయి’లోని, “సుగుణకిరణాలు” శతకంలో, నాలుగవపద్యంలో ఇదే భావాన్ని ఇంత సుగుణసుందరంగానూ, అన్వయ సౌలభ్యంతోను, సుస్పష్టపదశోభతోను చెప్పేరు:—
“నీకు నొప్పి కలుగ నీ కెట్టులుండునో
పరుల కట్లె యంచు ఎరిగి మనుము!|
ధర్మములకు పరమధర్మమ్మిదే సుమా!
సూక్తి నాచరించు! సుగుణకిరణ!”||
స్వస్తి||
ఇటువంటి చక్కటి విశ్లేషణ తో అందించిన ఈ మంచి చెడు చర్చ అద్భుతంగావుంది. మీకు మా ధన్యవాదములు. ఒకటి కి రెండు సార్లు చదవదగ్గది ఈ ఎపిసోడ్.
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది ధర్మం ? ఏది అధర్మం?….అలాగే
ఏది మంచి? ఏది చెడు? అనే వాటిమీద అనంతంగా
నెలకొన్న విచికిత్సని ముఖ్యాంశంగా తీసుకుని , బహుగ్రంథ
పరిశీలన చేసి , అధ్యయనం చేసి తులనాత్మకంగా రాసిన ఈ
వ్యాసం చాలా లోతుగా విశ్లేషణతో ఉండి, ఆలోచింప చేస్తోంది.
నోబెల్ పురస్కార గ్రహీత అనటోల్ ఫ్రాన్స్ రచించిన ” థాయి” అనే
అద్భుతమైన నవలని, దాని ప్రభావంతో రాసిన “చిత్రలేఖ”నీ,
ఆ సినిమాలోని పాటనీ ఎత్తుగడగా తీసుకుని మొదలుపెట్టడం
….వ్యాసం చదవాలనే ఆసక్తిని కలిగించింది.
నిత్య జీవితంలో ప్రతివ్యక్తికీ ఎన్నోసార్లు ఇందులో సూచించిన
సందేహం తలెత్తుతూనే ఉంటుంది. నిర్ణయించుకోవడం కష్టం
ఔతుంది కూడా. అటువంటప్పుడు ఇలాంటివి చదవడం వల్ల
కలిగిన జ్ఞానం దారి చూపిస్తుంది.
మానవ స్వభావాన్ని మంచి మార్గంలో మలుచుకునేందుకు
గొప్ప తాత్త్వికులూ, చింతనాపరులు మనకి అందచేసిన ఎన్నో
విలువైన సందేశాలు నిండివున్న ఈ విషయాల్ని పదేపదే మననం
చేయవలసి వుంది.
ఇలను మంచి చెడుల నెంచి చూడంగాను
మనిషి తీరు బట్టి మారుచుండు
పరుల నొవ్వనీక బ్రతుకంత గడుపుచో
మంచి వేరె లేదు మహిని వెదక.