శారదా సంతతి ~ 49 : విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)
ఐం శ్రీశారదా మహాదేవ్యై నమోనమః|
24—06—2018; ఆదిత్యవాసరము|
శ్రీశారదాంబికా కారుణ్యకల్పవల్లికా|
“శారదా సంతతి ~ 49″| “విలక్షణ స్వరకావ్యరచనా విరించి ~ బేటోవెన్ (Beethoven)”| (16—12—1770 నుండి 26—03—1827 వరకు)|
అది, జర్మనీదేశంలోని రైన్ నదీతీరంలోవున్న బాన్ (Bonn) నగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలువుండే ప్రాంతం. రమారమి 1715 – 16 మధ్యకాలం. ఆ ప్రాంతంలో ఒక సందులో ఒక మేడ. క్రింది అంతస్తులో ఒక కుటుంబం ఉంది. దానికి పైన, మిద్దెమీద ఒకేఒక గది. ఆ గదికి ఒకేగుమ్మం, ఒక్కకిటికీ ఉన్నాయి. గదిలో ఒక చిన్నమంచం, ఒకమూల కీబోర్డు(పియానోవంటివాద్యం), దానిప్రక్క చిన్నబల్లమీద ఒక వయోలిన్ ఉన్నాయి. ఒక ఐదారేళ్ళపిల్లవాడు ఒక కుర్చీపీటపైన కూర్చుని కీబోర్డువాద్యంమీద ఒకేఒక సంగీతప్రయోగాన్ని (అంటే, musical phrase ని) ఆ ప్రయోగంలో పూర్తి ప్రావీణ్యాన్ని సాధించడంకోసం, అదేపనిగా అలాగే వాయిస్తూ అభ్యాసం చేస్తున్నాడు. వాయించి-వాయించి విసుగొచ్చి తను స్వంతంగా కూర్చిన స్వరసమూహ రచనని వాయించుకుంటూ సంతోషపడుతున్నాడు. ఈ లోగా అతడి రాత్రి భోజనం సమయందాటి, పడుకునే సమయం సమీపిస్తోంది. మేడమెట్లమీదనుంచి వచ్చే అడుగుల ౘప్పుడుని, తన సంగీతరచన వాయించుకోవడంలో నిమగ్నమైపోయిన ఆ బాలకళాకారుడు, గమనించలేకపోయేడు. గదితలుపుని ధడేలుమని బూటుకాలుతో తన్నుతూ, లోపలికి, తూలుతూ వచ్చిన ఆయన పెద్దనీడ దీపంవెలుగులో గోడపైన పడింది. వెంటనే ఆ బాలుడు కీబోర్డుపైనుంచి చేతులు తొలగించి, వెనక్కితిరిగి చూసేడు. ఆ బాలుడిపేరు లుడ్విగ్ వాన్ బేటోవెన్ (Ludwig van Beethoven). పెద్దాయన అతడి తండ్రి. ఆయన పేరు యోహాన్ వాన్ బేటోవెన్ (Johann van Beethoven). బాలుడి తల్లి పేరు మేరియా మేగ్డలీనా(Maria Magdalena). యోహానుకి అప్పటికి, 35—36 ఏళ్ళ వయస్సువుంటుంది. ఆయన అక్కడి స్థానిక ప్రభువు ఆస్థానంలో తారాస్థాయి పురుష గాయకుడు(Male tenor vocalist) గా ప్రభుత్వ ఉద్యోగంచేస్తున్నాడు. వయొలిను, కీబోర్డు వాద్యాలలో కూడా తగిన నైపుణ్యంవున్నవాడు కనుక, వాటి పైన తీరిక సమయాలలో వాదనచేస్తూ పైసంపాదన చేసుకుంటున్నాడు. ఆయన తండ్రికూడా సంగీతంలో దర్శకుడిస్థాయికి క్రమంగా ఎదిగిన కళాకారుడే! ఆయన పేరు, లుడ్విగ్ వాన్ బేటోవెన్ , ఆయన మనుమడైన బేటోవెన్ కి, పెట్టేరు. బేటోవెనుకి తమ్ముళ్ళు,చెల్లెలువున్నారు. మద్యపానానికి యోహాను ఎంత దాసుడంటే, యోహాను తన 52 ఏళ్ళవయస్సులో మరణించేడు. ఆ సందర్భంలో అతడి ఆస్థాన ప్రభువు అన్నమాటలివి: “అతడి మరణం వలన మద్యపానంమీద వచ్చే పన్నుకి తీరని పెద్ద నష్టం వాటిల్లింది!”
తన కొడుకు బేటోవెను నాలుగేళ్ళ వయస్సులోనే చేసిన స్వంత సంగీత రచనల ఘనతని గమనించి, యోహాను తన కొడుకులోదాగివున్న మహాకళాకారుడిని గుర్తించి, ఆ పిల్లవాడికి తగిన శిక్షణని ఇస్తే, అతడు తప్పక మరొక మోత్సార్టు(Mozart) ఔతాడని సంబరపడ్డాడు. సంగీతంలో ప్రారంభపాఠాలు తనే నేర్పేడు. త్రాగుబోతుతనమూ, విశృంఖలజీవితమూ, నియంతృత్వధోరణి, దుర్భాషలాడడమూ, అరుపులూ, కోపమూ, తట్టుకోలేని ఘోరశిక్షణ మొదలైన తండ్రియొక్క అరాచకలక్షణాలకి బేటోవెను బాల్యం నిర్దాక్షిణ్యంగా బలైపోయింది. వీటన్నింటికీతోడు, తల్లి అనారోగ్యబాధ ఆ పిల్లవాడి బాల్యంపైనేకాక, అతడి ఎదుగుదలపైన, యుక్తవయస్సుపైన ఆ మాటకి వస్తే జీవితాంతమూ అటువంటి దుర్భరబాల్యంయొక్క ప్రతికూలప్రభావం(negative influence) దారుణంగా వ్యక్తం ఔతూనే కొనసాగిందని ఆయన జీవనయానక్రమాన్ని పరిశీలించినవారికి స్పష్టంగా అవగతమౌతుంది.
ఇంతకీ, ఆ రోజు సాయంత్రం కొడుకు బేటోవెను తనుచెప్పిన అభ్యాసం విడిచిపెట్టి, స్వంతసంగీతం, అది ఎంతబాగున్నప్పటికీ, వాయించడంతో తండ్రి యోహానుకి కోపంవచ్చింది. తన ఆజ్ఞని తన కొడుకు అలాగ అతిక్రమించడం అతడి అహంకారాన్ని తట్టి లేపింది. వెంటనే కొడుకుతో కఠోర కంఠంలో తీవ్రక్రోధాన్ని వ్యక్తంచేస్తూ, గట్టిగా ఇలాగ అరిచేడు:—
యోహాను:—
“లుడ్విగ్ ! నేను నీకు ఈ ఉదయం ఇచ్చిన అభ్యాసం ఏమిటి? ఇప్పుడు నీవు వాయిస్తున్న సంగీతమేమిటి? నా మాట లెక్కలేకుండా, నీకు తోచినది వాయించుకుంటూపోతావా? ఇదేనా నేర్చుకోవడమంటే? జీవితంలో పైకి రావాలనుందా లేక ఎందుకూ పనికిరాని వ్యర్థజీవితం గడపాలనుకుంటున్నావా?”
లుడ్విగ్ (వల్లమాలిన భయంతో బెదిరిపోయి కంగారుగా ఇలాగ జవాబిచ్చేడు):—
“అదికాదు నాన్నగారూ! మీరుచెప్పిన పాఠం పొద్దుటినుంచీ పావుగంటక్రితం వరకు వాయిస్తూనేవున్నాను. అది బాగానే వచ్చిందికదా అని, కాసేపు ఇది వాయించాలనిపించి దీనిని మొదలుపెట్టేనంతే! మీరు చెప్పిన పాఠం వాయిస్తాను వినండి నాన్నగారూ!”
అంటూ, లుడ్విగ్ కీబోర్డుమీద తండ్రి అప్పటివరకుచెప్పిన పాఠాలనీ, ప్రత్యేకంగా ఆరోజు పాఠాన్నీ అద్భుతంగా వాయించి తండ్రికి వినిపించేడు. అంతావిని తండ్రి సంతోషంతో ఉబ్పి తబ్బిబ్బైపోయేడు. సంతోషాన్ని కప్పిపుచ్చుకుని, కాస్త ప్రసన్నతని తెచ్చిపెట్టుకుని, తనబింకం సడలనివ్వకుండా,కొడుకుతో ఇలాగ అన్నాడు.
యోహాను:—
“నాయనా! అంతా బాగానే వాయించేవు. ఐనా క్రొత్త సంగీతంవాయించాలనే వేళంవెర్రిలో పడకూడదు! ఎంతబాగావచ్చినా, ఎన్నిసార్లైనా ఇచ్చిన పాఠాన్నే వాయిస్తూవుండాలి. క్రొంగ్రొత్త సంగీతం వాయించడానికి నీకు బోలెడంత భవిష్యత్తు నీ ముందుంది. నాలుగేళ్ళ ప్రాయానికే నవనవలాడే నవీన సంగీతరచనలుచేసి పెద్దలందరినీ విస్మయపరిచేవు. నిన్ను ఎందరో మరొక మోత్సార్ట్ (Mozart) అనీ, కొందరు ఇంకొక హైడన్ (Haydn) అనీ, ఇంకొందరు ఇద్దరినీ మించిన వాడవనీ అంటూంటే నేను, మీ అమ్మ ఎంత పొంగిపోయేమో ఎవరూ ఊహించలేరు. ఒక సంగీతమహాకళాకారుడిగా నీ భవితవ్యం స్వర్ణమయమైపోవాలని నీ తాతగారి నిరంతరస్వప్నం. ఆ కలని నీవు నిజంచెయ్యాలని నా ఆరాటం! అందుకనే నిన్ను పాఠశాలలకికూడా పంపకుండా, ఆట-పాటలకి వెళ్ళనివ్వకుండా కేవలం సంగీతవిద్యా సముపార్జనకి మాత్రమే నిర్బంధించివుంచి, ఈ గదిలో నీకు ఈ ప్రత్యేక ఏకాంతాన్ని ఏర్పాటుచేసేను. నాకు వచ్చిన, నాచేతనయిన ప్రాథమిక సంగీతవిద్యని నీకు ఇంతవరకు నేర్పించేను. ఇంక నీకు నేర్పడానికి నావద్ద మిగిలినది తక్కువే! మా ప్రభువువారి ఆస్థానంలో పరిణతిపొందిన ఒక విద్వాంసుడు ఉన్నాడు. ఆయన నీకు ఇంతకన్న పైస్థాయి సంగీతం నేర్పడానికి అంగీకరించేడు. ఆయనపేరు క్రిస్టియన్ గాట్లాబ్ నీఫే(Christian Gottlob Neefe). ఆయన ఇంకొంతకాలం నన్నే నీకు నేర్పించమంటున్నాడు. అందువల్ల ఆ పాఠాన్నే ఇంకొంతసేపువాయించు. నేను మళ్ళీ వస్తాను.”
అంటూ యోహాను తూలుకుంటూ మెట్లుదిగి చీకటిలో కలిసిపోయేడు.
లుడ్విగ్ మళ్ళీ పాత పాఠం వాయించడంలో పడిపోయేడు. ఈ లోగా క్రింద మంచంమీద అనారోగ్యంతో బాధపడుతూన్న తల్లి, “నాయనా! లూడీ! క్రిందికివచ్చి భోజనంచేసి, ఇంక పైకి వెళ్ళి పడుకో! ఇప్పటికే రాత్రి పొద్దుపోయింది. నీ భోజనంవేళేకాదు, పడుకునే వేళకూడా దాటిపోయింది. ఉదయంనుంచి వాయించినదే వాయిస్తూ ౘాలా శ్రద్ధగా బాగా సాధనచేసేవు. ౘక్కగా వాయిస్తున్నావు. మధ్యలో నీవు సొంతంగా వాయించినది మరీ బాగుంది. మీ నాన్న అలాగే అంటారు. నేను చెపుతానులే, మీ నాన్నకి. నా మాట విని క్రిందకిరా!” అని సన్నని కంఠంతో లేని ఓపిక తెచ్చుకుని అరిచింది.
“అలాగే అమ్మా! వచ్చేస్తున్నాను” అంటూ లుడ్విగు క్రిందకి వెళ్ళేడు. అతడికి వాళ్ళ అమ్మ అంటే పంచప్రాణాలూను! అలాగే వాళ్ళ తాతఅన్నా వల్లమాలిన యిష్టం. తాతగారి వారసత్వమే తనకి సంగీతంలో అంతటి అభిరుచిని కలిగించిందని అతను ఎల్లవేళలా అనుకుంటూ ఆనందిస్తాడు!
= = = = = = = = = = = = = = = =
ఐదారేళ్ళపాటు కొందరు స్థానిక అధ్యాపకులవద్ద లుడ్విగు సంగీతం నేర్చుకున్నాడు.
లుడ్విగుకి 12 ఏళ్ళ వయస్సు వచ్చింది. క్రిస్టియను(Christian) గారి వద్ద అధ్యయన-అభ్యాసాలు ౘక్కగా జరుగుతున్నాయి. అప్పటికే లుడ్విగు, వయొలినిస్టు(Violinist)గాను, పియానిస్టు(Pianist)గాను, ఆర్గనిస్టు (Organist)గాను అప్రతిమాన ప్రతిభాపాటవాలతో ప్రపంచప్రసిద్ధిని పొందేడు. ఆ వాద్యాలలో అతని ప్రజ్ఞకి ముగ్ధుడైన క్రిస్టియనుగారు, లుడ్విగు “రెండవ మోత్సార్టు“గా అవతరించబోతున్నాడని ప్రచారం చేసేవాడు. ఆయావాద్యాలలో లుడ్విగు సంపాదించిన సాటిలేని ప్రావీణ్యం మాత్రమే బయటకి కనిపిస్తోందికనుక క్రిస్టియనుగారికి అంతకన్న గొప్ప ఆలోచన తోచలేదు. మోత్సార్టు, హైడనులవంటి మహామహులకికూడా అందని అద్భుత అపార సంగీత సృజనాత్మకశక్తి అప్పటికే అవ్యక్తంగా లుడ్విగులో దాగివుండడం ఏ ఒక్కరూ గమనించలేకపోయేరు. అ అపూర్వ రోచక రచనా సామర్థ్యం అందరికీ అందేదికాదు. లుడ్విగు సృజనాత్మకశక్తిని గురించి వివరిస్తూ, హెరాల్డ్ సి. షోన్బెర్గ్ (Harold C. Schonberg) ఇలాగ అన్నారు:—
“అతడి(లుడ్విగు) అపూర్వ సృజనాత్మకత అతడిని మిగిలిన అందరికన్న భిన్నమైనవానిగా మనకి తెలియజేస్తుంది. అతడు ఒకానొక ప్రాకృతిక మహాశక్తి! అతడిని నియయమ-నిబంధనలనే పంజరాలలో బంధించడం అసాధ్యం హైడన్ , బహుశః మోత్సార్ట్ , వంటి ఆ కాలంనాటి ఉత్తమశ్రేణి సంగీతకారులనుంచి ౘాలా తక్కువ సంగీతపాఠాలు అతడు నేర్చుకున్నాడు. కాని ఆ ఉత్తమశ్రేణి సంగీతకారులపట్ల అతడికి అసంతుష్టి కలిగింది. ఆ పాఠాలవలన అతడికి ఒరిగినదీ ఏమీలేదు. అంతటి సృజనాత్మకతని కలిగిన బేటోవెనుని సంగీతరంగంలో విద్యార్థిగా తీర్చిదిద్దడం అంత సులువైన పనికాదు. శాస్త్రసంబంధమైన నియమ-నిబంధనలపైనకంటె, సహజమైన అతడి స్వయంప్రతిభమీద బేటోవెను ఎక్కువ ఆధారపడేవాడు.”
అంటే లోకంలో శాస్త్రంపేరున అప్పటికే పాతుకుపోయిన అశాస్త్రీయమైన అంధవిశ్వాసాలని పారద్రోలి, పాశ్చాత్య సంగీతకళారంగానికి నవీనదిశానిర్దేశం చేయడానికి అవతరించిన అపూర్వ శారదాతనయుడు లుడ్విగ్ వాన్ బేటోవెన్ !
21 సంవత్సరాల వయస్సుకి బేటోవెను ఆస్ట్రియాదేశ ప్రధాననగరమైన వియన్నాకి వెళ్ళిపోయి, జీవితాంతపర్యంతము అక్కడేవుండిపోయేడు. ఆయన వివాహం చేసుకొనలేదు. తన జీవితాన్నంతా సంగీతరంగానికే అంకింతం చేసుకున్న మహాపురుషుడు, ఆయన!
పియానోవాద్యకారులలో బేటోవెను వాదనశైలి అబ్బురమైనది. వియన్నా సంగీతరసజ్ఞులకి మోత్సార్టు, హమ్మెలు(Hummel) వంటి సున్నితమైన వాద్యకారుల శైలి మాత్రమే సుపరిచితమైనది. బేటోవెను శక్తివంతమైన వాదనశైలి వారికి పూర్తిగా అపరిచితమైనది. ఆయన తన శక్తివంతమైన వాదనకోసం ప్రత్యేకమైన పటిష్ఠనిర్మాణంతోకూడిన పియానోని పురమాయించి చేయించుకునేవారు. స్థానికమైన వియన్నీస్ పియానోని ఆయన “స్వరమండలి” అంటే “హార్ప్ – Harp” అని ఆక్షేపించేవారు. హార్ప్ అంటే సంగీతంలోని సరైన శ్రుతినిర్దేశానికి సహాయపడే మన తంబూరా వంటి ప్రాథమికవాద్యం! మోత్సార్టు, హైడను, హమ్మెలు మొదలైనవారిలాగ ప్రభువులకి, పాలకవర్గానికి, జమీందారులకు, ధనవంతులకి ‘దాసోsహం’ అనే దృక్పథంతో తమ సంగీతాన్ని వినిపించే భయ-భక్తులు కలిగిన ధోరణి బేటోవెనులో జన్మతః లేనేలేదు. ఆయన తనని ఒక సృజనాత్మక కళాకారుడిగానే భావించుకుని మిగిలిన రసజ్ఞులకి, వారి సామాజికమైన స్థాయీభేదాలు, ఇతర తారతమ్యాలతో నిమిత్తం లేని సంగీతశ్రోతలకివుండే ఏకైకస్థాయిని మాత్రమే ఇచ్చి రసజ్ఞులకి తగిన గౌరవాన్ని అందించేవారు. బేటోవెనుకి ముందు కళాకారులందరూ తాము కళాకారులమని, కళాకారులంటే సమాజంలో గౌరవనీయశ్రేణికి చెందినవారని, సంపన్నుల దయాధర్మాలమీద ఆధారపడిన దీన-హీనజన్ములు కారని, అందువలన సంపన్నుల అభిరుచుల పరిమితులకి లోబడి తమ సృజనాత్మకతని ౘంపుకుని, తమ రచనలస్థాయిని, వారి అల్ప అభిరుచులస్థాయికి సంగీతరచనా సామర్థ్యాన్ని దిగజార్చుకోవలసిన దుఃస్థితి కళాకారులకిలేదని ఊహకికూడా తెలియని దయనీయమైన పరిస్థితిలోవుండేవారు.
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతకారుల జీవితచరిత్రల సారస్వతాన్ని పరిశీలిస్తే, మొట్టమొదటిసారిగా, బేటోవెను వ్రాసిన లేఖాసాహిత్యంలో తరచుగా, “కళ(Art)”, “కళాకారుడు(Artist)”, “కళాకౌశలం(Artistry)” వంటి పదాలు మనకి తారసపడుతూవుంటాయి.
మోత్సార్టు మొదలైన ముందుకాలం సంగీతకారులంతా తమని ఆ విధంగా కళాకారులుగా సంభావించుకోలేదు. వారంతా వారి సమకాలీనసమాజంలోని సంపన్న సంగీతాభిమానుల అభిరుచులమేరకి అనువైన సంగీతరచనలనెడి ౘవకబారు బజారు వస్తువులని తయారుచేసేవారిగానే అనుకునేవారు.
మొట్టమొదటి సారిగా పాశ్చాత్య సంగీత లోకంలో, బేటోవెను అనే మహాకాంతిమండలరూపుడైన కళాకారుడు ఉద్భవించి, తన సంపూర్ణసృజనాత్మక శాశ్వత సంగీత రసమయరచనలతో సంగీతకారుడి మానవ సామాజిక పాత్రకి సరిక్రొత్త నిర్వచనాన్ని ప్రసాదించి సంగీతకళాకారుల ఆత్మౌన్నత్యాన్ని, సామాజిక గౌరవాన్ని సుప్రతిష్ఠితంచేసేడు.
బేటోవెనుకిముందు, సంగీతకళాకారులు, సంపన్నులైన ప్రభువులవెంట వెళ్ళినప్పుడు, ప్రభువుల సేవకులతోబాటేవుంటూ, భోజనాదికాలు సేవకులతోకలిసి చేసేవారు. బేటోవెనుమాత్రం, తనకి ఆతిథ్యమిచ్చే ప్రభువు సరసన భోజనాదికాలు నిర్వహించుకునే స్థాయిలోనే ఉండేవాడు. బేటోవెను అంటే ప్రభువులతోసహా అందరికీ భయ-భక్తులు ఉండేవి. ఆయన ౘాలా నిరంకుశంగావుండేవాడు. ఆయన మాటకి రాజశాసనంకన్న విలువవుండేది. ఆయనకి ఎవ్వరూ ఎదురు చెప్పడానికి వీలువుండేదికాదు! తనతండ్రి తనబాల్యంలో తనపైన విధించిన కర్కశమైన నియంతృత్వాన్నంతా ఆయన పెరిగి పెద్దైనతరవాత తన చుట్టు-ప్రక్కలవారందరిమీద, వారు ఎవరైనా-ఎంతటివారైనా, వారిపైన అంతటి అనుల్లంఘనీయమైన ఆజ్ఞలని విధించేవారు.
ఆయనకి 21 ఏళ్ళ వయస్సు దాటినతరవాత ఆయన జీవితంలోని అసలైన విషాదానికి బీజాలు ఏర్పడడం మొదలైంది. ఆయన వినికిడిశక్తి క్రమంగా తగ్గిపోవడం ప్రారంభించింది. ఆ కాలంలోని గొప్ప వైద్యులంతా ఆయనకి ఈ విషయంలో ఏ విధంగానూ సహాయపడలేకపోయేరు. దానితో వారి మానసికవేదనకి అంతు లేకుండాపోయింది. సుమారు 32 ఏళ్ళ వయస్సులో ఆయన, బాన్ నగరంలోని తన బాల్యమిత్రునికి వ్రాసిన ఒకలేఖలో తన సంగీతరచనావ్యాసంగంగురించి, సంగీతకారునిగా తనకి వియన్నాలో లభిస్తున్న యశస్సు, సంపదలరూపంలోని అపార జనాదరణగురించి వర్ణించేరు. మరొకలేఖలో తనని నానాటికీ వేధిస్తూన్న బధిరత్వసమస్య, చెవిటివాడినని చెప్పుకోలేని నిస్సహాయ నికృష్ట పరిస్థితి గురించిన హృదయవిదారకమైన విషయాలు ౘదవడానికికూడా ౘాలా కష్టంగానేవుంటాయి.
ఆయన జీవితంలో చివరి 22 ఏళ్ళు, ఆయనకి ౘాలా దుర్భరంగా గడిచినా, ఆ సమయాన్ని ప్రపంచ పాశ్చాత్య సంగీతచరిత్రలో స్వర్ణాధ్యాయంగానే పరిగణించాలి. ఒకవైపు చెవుడు, ఇతర వ్యక్తిగత అనారోగ్య సమస్యలు ఆయనని సతమతంచేస్తూండగా, మరొకవైపు ఆయన తమ్ముడి మరణానంతరం, తమ్ముడి కొడుకైన తొమ్మిదేళ్ళ కార్ల్ (Karl) యొక్క బాధ్యత తమ్ముడి వీలునామా ద్వారా ఆయనకి సంక్రమించడం వలన తలెత్తిన కోర్టువ్యవహారాల చిక్కులని ఆయన ౘట్టబద్ధంగా పరిష్కరించుకోవలసిన దుష్కర పరిస్థితులు తలెత్తేయి. 1815 నుంచి 1820 వరకు ఆయన కార్ల్ సమస్యతో అతలాకుతలం ఐపోయేరు. ఆ సమస్య ఆయన స్వభావంవల్ల మరింత జటిలమైపోయింది. ఇరవైఏళ్ళ కార్ల్ , తన పెదతండ్రి అమిత ప్రేమతోకూడిన విపరీత చర్యలకి, అలవిమీరిన కట్టుబాట్లకి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంచేసి, ఎలాగో బ్రతికి బయటపడి ఆయననుంచి విడిపోయేడు. ఈ సంఘటన ఆయనని మానసికంగా ౘాలా క్రుంగదీసింది.
దీర్ఘకాలికమైన, వైద్యంకూడాలేని, కొన్ని వ్యాధులు వారిజీవితాన్ని బలితీసుకుని, వారి సృజనాత్మకశక్తిద్వారా అనితరసాధ్యంగాను, నిరంతరాయంగాను ప్రవహించే పాశ్చాత్య శాస్త్రీయ సంగీత మహారసధునికి ఆటంకమైపోయేయి. 26—03——1827వ తేదీన వారు తమ పార్థివదేహాన్నివిడిచి, సంగీతశారదలో లీనమైపోయేరు. రమారమి 20,000 లమంది అభిమానులు వారి భౌతిక దేహానికి నివాళులు అర్పించేరని చరిత్రద్వారా తెలుస్తోంది.
తొమ్మిది సింఫనీలు(9 Symphonies), పియానో సొనాటాలు(Piano Sonatas), Overtures, Operas, Concertos మొదలైన అనేక సంగీతరచనలని వారు మనవంటి సంగీతాభిమానులకోసం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళేరు. అవన్నీ “యూ-ట్యూబు”లో లభ్యం ఔతున్నాయి.
వారి సంగీతరచనలని విమర్శకులైన చరిత్రకారులు మూడు విభాగాలుగా వేరుచేసి వివరించేరు.
1) వారు చిన్నతనంలో చేసిన రచనలు వారికి పూర్వకళాకారులయొక్క ప్రభావంతో చేసినవి. అందువల్ల, ఆ రచనలపైన మోత్సార్టు ప్రభావం బలంగావున్నట్లు కనిపిస్తుంది.
2) వారి మధ్యవయస్సులోని రచనలన్నీ పరిణతిపొందిన సంగీతరచనాకౌశలంతో వారి పరిపూర్ణ సృజనాత్మకశక్తిని పుష్కలంగా వ్యక్తంచేస్తూ ఉంటాయి.
3) వారి జీవిత చరమదశలోని రచనలన్నీ ప్రత్యక్షంగా కేవలం సంగీతసరస్వతీదేవి నుంచి ఈ లోకానికి ప్రవహించిన సంగీతవియద్గంగారసరమ్యధునిగానే సంగీత రసజ్ఞుల రసమయ అనుభవరూపంలో దర్శనమిస్తాయి. అవి కేవల మానుష ప్రజ్ఞా జనిత రచనలు కానేకావు అని విమర్శకుల అభిప్రాయం.
ఆ నిరుపమ సంగీతరచనావిరించికి నతమస్తకులమై సాష్టాంగదండప్రణామం సానందంగా సమర్పించుకుందాం!
స్వస్తి||
పడమటి దేశాల సంగీతానికి మూలపురుషుడు
అనదగిన మహా సంగీతకారుడు బెటోవిన్ గురించి
అందించిన విశేషాలు చదువుతుంటే విస్మయం కలుగుతోంది.
లలితకళలన్నింటికీ మహారాణి అనదగిన సంగీతానికి అతను
మహాసామ్రాట్టు.
స్వీయ జీవితగమనం ఒడిదుడుకుల మధ్య సాగినా, తన
అసాధారణ ప్రతిభాసంపత్తితో లోకానికి అత్యద్భుతమైన
సంగీతం అందించి, తద్వారా ఎందరి ఆత్మలనో మేలుకొలుపి
వారిని తరింపచేసిన కారణజన్ముడు బెటోవిన్ ని గురించి మంచి
సమీక్ష చేశావు.
తను వినలేకపోయినా జనం కోసం అంతటి మధురమైన సంగీతాన్ని
అందించిన బెటోవిన్ మహాయోగి.
గతమునందున వెలిగిన ఘనుల కథలు,
వారు పంచిన వెలలేని భవ్య సుధలు…
శారదా సంతతి నిటుల చాల తెలిపి
మనసు నింపుచుంటివికద మధుర హృదయ!