సాహిత్యము—సౌహిత్యము~59 : “విధి – మానవసంకల్పం” – “Fate vs Free-will”
ఐం శ్రీశారదాపరదేవతాయైనమోనమః|
23—06—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము~59″| “విధి – మానవసంకల్పం”| “Fate vs Free-will”|
సుప్రసిద్ధ ఆధునిక తెలుగు నాటకం, శ్రీ గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం“. ఈ నాటకంలో ప్రధాన పాత్ర ఐన గిరీశం, సాక్షాత్తూ దేవుడినికూడా తికమక పెట్టడానికి ఒక యుక్తిని ఉపయోగిస్తాడు. దేవుడు కనబడితే, గిరీశం ఆయనని, “ఓ దేవుడా! నీవు నన్ను డిపెండెంటుగా పుట్టించేవా, లేక ఇండిపెండెంటుగా పుట్టించేవా?” అని అడుగుతాడట! “డిపెండెంటుగా పుట్టిస్తే నీ సంకల్పం ప్రకారమే నేను అన్ని పనులుచేస్తున్నానుకదా? అప్పుడు నేను చేసే పాప-పుణ్యకర్మల ఫలాలకి నన్నెలా బాధ్యుడినిచేస్తావు? అలాగకాదు, ఇండిపెండెంటుగానే పుట్టించేనంటావా? అలాగ పుట్టిస్తే నా ఇచ్ఛానుసారంగా నన్ను నా పనులు చేసుకోవడానికి పుట్టించేవుకనుక ఆ విధంగా నన్ను చేసుకోనీ! అలాగ చేసుకోకుండా పాప-పుణ్య కర్మఫలాలంటూ ఈ ఆంక్షలన్నీ పెడితేఎలాగ? అలాగ పెడితే ఇంక నాకు ఇచ్చిన స్వేచ్ఛాసంకల్పశక్తి ఏ పాటిది?” అని అడుగుతాడట! గిరీశం తన లౌకిక ప్రయోజనాలకోసమే ఈ వితండవాదం చేస్తున్నాడనే విషయం లోకవిదితమే! ఐతే, ఆ విషయంతీసి ప్రక్కకి పెడితే, ఈ ప్రశ్నలో ఒక జటిలమైన తాత్త్వికసమస్య ఇమిడివుందనేది తథ్యం! అదేమిటో పరామర్శిద్దాం!
ఆదిమ మానవుడి నుంచి, ఆధునిక మానవుడి వరకు మనిషిజీవితంలో విధియొక్క ప్రమేయం గురించి, మానవ సంకల్పశక్తియొక్క పాత్రగురించి అనాది వివాదం అనంతంగా కొనసాగుతూనేవుంది.
ప్రాచీన గ్రీకుమేధావి, పైథాగొరసు(Pythagoras), “సృష్టిలో భాగమైన మానవజీవితం, ఆ సృష్టియొక్క ప్రణాళికలో ఒక అంశగానేవుంది. అందువల్ల మానవజీవితం విధి పరిధిని దాటలేదు” అని అభిప్రాయపడ్డాడు.
హెరాక్లిటసు(Heraclitus)కూడా మానవజీవితాన్ని విశ్వనిర్మాణసూత్రాలలో ఇమిడివుండే అంతర్భాగంగానే భావించేడు. అందువల్ల మానవసంకల్పం
విధికి బానిసగానేవుంటుందని అన్నాడు.
సోక్రటిసు ముందుకాలంలోని గ్రీకు తాత్త్వికులందరూ ఇంచుమించు ఇదే తరహా ఆలోచనలని ప్రతిపాదించేరు. కాని “సోఫిస్టులు(sophists)” అనబడే కేవల తార్కికులు మాత్రం ఈ వాదానికి భిన్నదిశలో తొలిఅడుగులు వేసేరు.
సోక్రటిసు(Socrates) కాలంనాటికి, మానవుడు తనపైన ప్రకృతి చలాయిస్తున్న అమిత ఆధిపత్యాన్ని ప్రశ్నించడమేకాక, అనువైనంతమేరకి ఎదిరించి తన స్వతంత్రతని గ్రహించి, దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం ప్రారంభించేడు. జ్ఞానసముపార్జన అనే విలక్షణశక్తికలిగిన మానవుడు, సామూహిక సామర్థ్యం ద్వారాను, ఆత్మస్థైర్యం ద్వారాను స్వయంసంకల్పశక్తిని గ్రహించుకుని తన జీవితాన్ని ౘక్కదిద్దుకోవడానికి యత్నించేడు. మానవ జ్ఞానశక్తియొక్క ఘనతని లోకానికి ౘాటిచెప్పిన మొదటితరం మహాత్ముడు “సోక్రటిసు”! ఆయన తన తత్త్వశాస్త్రంలో మానవ సంకల్పశక్తికి పెద్దపీట వేసేడు.
ప్లేటో(Plato), తనగ్రంథాలలో మానవ సంకల్పస్వేచ్ఛని ఎంతో ప్రతిభావంతంగాను, ప్రయోజనయుతంగాను విపులీకరించేడు. “మానవుడు మంచి చెడ్డలలో ఎదో ఒకదానిని ఎంచుకుని, దానిని ఆచరించడంద్వారా తగిన ఫలితాలు పొందుతాడు. అంతేకాక, తన గతానుభవజ్ఞానంద్వారా, భావిజీవితానికి సోపానాలు నిర్మించుకుంటాడు. అందువలన మనిషికి స్వయంనిర్ణయాధికారం ఉందని అర్థంచేసుకోవచ్చు” అని ప్లేటో బోధించేడు.
అరిస్టాటిలు(Aristotle) మానవసంకల్పానికి పట్టంకట్టేడని చెప్పాలి. “మానవుడిలోని నైతిక ఆలోచనాశక్తి, అతడి స్వయంనిర్ణయాధికారానికి చిహ్నమేకాని సృష్టి సూత్రాలకి లోబడిన యాంత్రిక చర్యకాదు!” అని అరిస్టాటిలు ఉపదేశించేడు. “మంచితనమంటే స్వేచ్ఛారూపమైన మానవస్వభావమే!” అని నిర్వచించేడు.
ఎపిక్యూరసు(Epicurus), అతడి అనుయాయులు మానవతని, అంధవిధి(blind fate)కి బానిసగాచేయడాన్ని పూర్తిగా తిరస్కరించేరు. మానవుడికి స్వయంసంకల్ప-వికల్పశక్తివుందని, స్వయంనిర్ణయాధికారాన్ని మనిషి శ్రేయోదాయకంగా వినియోగించుకోవచ్చునని, ఎపిక్యూరసు సిద్ధాంతీకరించేడు.
ఆ తరవాత వచ్చిన ఐరోపీయ తాత్త్వికులలో ఒకరైన ఫ్రాన్సిసు బేకను (Francis Bacon), మనిషి మేధని మతశృంఖలాలనుంచి, శాస్త్రాల సంకెళ్ళనుంచి విముక్తంచేయడానికి కృషి చేసేడు. మత-శాస్త్ర బంధనాలనుంచి బయటపడిన మనిషి దైవసంకల్పానికి లోబడి జీవించాలని చెప్పేడు.
థామస్ హాబ్స్ (Thomas Hobbes) దృష్టిలో “విశ్వమంతా కార్య-కారణ బద్ధమైన ౘట్రంలో ఇరుక్కున్న ఒక యాంత్రిక వ్యవస్థ మాత్రమే. అందులో భాగంగావున్న మానవుడి మనస్సులో కలిగే సంకల్ప-వికల్పాలుకూడా ఆ యాంత్రికచర్యలో అంతర్లీనమైన అంశాలే!” అని వాదించేడు.
ప్రసిద్ధ ఫ్రెంచి తత్త్వవేత్త ఐన దెకార్తె(Descartes) విశ్వపరంగాను, వ్యక్తిపరంగాను అప్పటివరకు ప్రచారంలోవున్న యాంత్రికవాదాలనన్నీ పూర్తిగా నిరాకరించేడు. “మనిషికి స్వతంత్ర సంకల్పశక్తి సహజంగానేవుందని, ఆ శక్తిని మనిషి తన శరీరప్రయోజనంకోసంకాని, విషయప్రపంచ ఆకర్షణతోగాని వినియోగిస్తే సత్ఫలితాలు పొందలేడు” అని వక్కాణించేడు.
ఇమ్మాన్యుయెల్ కాంట్ (Immanuel Kant) మానవుడిలోని సహజనైతిక చైతన్యం(natural moral sense) మనిషికి స్వయంసంకల్పస్వేచ్ఛ ఉన్నట్లు రుజువు చేస్తోందని బోధించేడు.
ప్రాచ్య-పాశ్చాత్య తత్త్వదర్శనకారుల ఈ నిరంతర వివాదాత్మక సమస్యకి, అవతారవరిష్ఠులైన భగవాన్ శ్రీరామకృష్ణగురుదేవులు ఒక అద్భుతమైన సమన్వయ పరిష్కారాన్ని అందించేరు:—
“ఒక గుంౙకి కట్టబడిన పశువుకి ఎంత స్వేచ్ఛ ఉందో సాధారణ మానవుడికి కూడా అంతటి స్వేచ్ఛవుంది” అని వారు చెప్పేరు.
గుంౙనుంచి తాడుయొక్కపొడవు అనుమతించే వ్యాసార్థంతో ఏర్పడే వృత్తపరిధిలో సంచరించే పశువుకివున్న స్వేచ్ఛవంటిదే మానవస్వేచ్ఛ అన్నమాట!అటువంటి పరిమితస్వేచ్ఛలో మనిషి ఉత్తమస్థాయి జీవితాన్ని శిష్టాచారసంప్రదాయపరాయణతతో నిర్వహించుకోగలగడంవలన సార్థకతకలిగిన జీవితాన్ని సాగించవచ్చు. అంటే మనిషికి సంపూర్ణస్వేచ్చ (absolute free-will) లేదుకాని, పరిమితస్వేచ్ఛ(restricted choice of will) ఉంది అని తేటతెల్లమయ్యింది. ఇది అర్థంచేసుకుని, ఆచరిస్తే సామాన్యమానవుడు ఆధ్యాత్మికసాధకుడిగా పరిణతిచెంది, తాను తరించి, ఇతరులకి తరుణోపాయాన్ని ప్రదర్శించినవాడౌతాడు.
స్వస్తి|
చాలా మంచి విషయం వివరించావు.ఈ స్వేచ్ఛ , మనుషుల కెంత వరకు , దీని పరిమితి?
ఈ సందేహం ఎప్పుడూ కలుగుతుంది.
చివరికి శ్రీ రామకృష్ణులు చెప్పిన దే అర్ధం చేసుకోవలసి వుంటుంది.
Very nice bava garu
విధి– స్వీయ సంకల్పస్వేచ్ఛ అనే అంశం మీద రాసిన
వివరణాత్మకమైన ఈ వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది.
అందులో ఈ విషయంపై వివిధ తత్త్వజ్ఞుల సిద్ధాంతాలని
ఉటంకిస్తూ విశ్లేషించిన తీరు అర్థవంతంగా వుంది.
ఎవరు ఎలా చెప్పినా , ‘ అన్ని దార్లూ రోమ్ నగరానికే ‘ అన్నట్టుగా
మనిషికున్న స్వయం సంకల్పస్వేచ్ఛని సద్బుద్ధితో సమాజ
హితం కోసం సత్కార్యాలు చేసేందుకు ఉపయోగించాలనే సందేశం
ఇమిడి ఉంది. ఇక ఆ స్వేచ్ఛకున్న పరిమితులను గురించి
గురుమహరాజ్ చెప్పింది అమోఘం!
The subject in this week’s episode is very important and thought provoking. Although the greatest western philosophers like Aristotle Plato and Socrates gave their best views on independence of man vs destiny, the simple and effective explanation given by Sri Ramakrishna makes us understand His divinity. It is He as an incarnation can explain the design of the creation with perfection. Salutations to the great sages and saints of India.
Nice analysis guruvugaru.
విధి బలీయమనుట విశ్వానుభవమేను
విధిని దాటలేరు వేవురైన.
స్వేచ్ఛ కలిగియున్న శ్రేష్ఠుండు జనులకై
విధిని గెలిచి చూపు వెలుగు దారి!