శారదా సంతతి — 48 : సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ
17—06—2018; ఆదిత్యవాసరము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“శారదా సంతతి ~ 48″| సంగీతరసికులకి నిత్య ఆరాధనీయులు~శ్రీ జి. ఎన్ . జోషీజీ|(1909-1994)|
అది 1960వ దశకం! బొంబైలోని, కెన్నెడీ బ్రిడ్జివద్ద, వల్లభాయిపటేలు రోడ్డులోని ‘తవాయఫ్ ‘లు నివసించే ప్రాతం. అంటే, పాటకత్తెలైన ఆటవెలదులుండు ప్రాంతం. సామాజిక మాన-మర్యాదలంటే ప్రీతి, అపఖ్యాతి అంటే భయము ఉన్నవాళ్ళెవరూ ఆ దరి-దాపులకి వెళ్ళడానికి చొరవచెయ్యరు! గోవింద నారాయణ జోషీగారు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టవలసివచ్చింది. జోషీజీకి అప్పటికి 50 ఏళ్ళు దాటేయి. ఐనా, తెలిసినవారెవరి కంటపడినా ప్రమాదమే అని ఆయనకి భయం! కాని, ఆయన ఉద్యోగనిర్వహణవిధి అటువంటిది. “గ్రామఫోను కంపెనీ ఆఫ్ ఇండియా” (బాగా ప్రాచుర్యంపొందినపొడిమాటలలో చెప్పాలంటే HMV/ హెచ్ . ఎం. వి.—His Master’s Voice) సంస్థలో, రికార్డింగు విభాగానికి అధిపతిగా వారు ఉద్యోగంచేస్తున్నారు. ఆ ఉద్యోగవిధినిర్వహణలో భాగంగా ఆయన ఆ ‘తగని’ చోట సంచరిస్తున్నారు. ఉస్తాద్ అమీర్ ఖాc సాహబుగారి గాత్రసంగీతాన్ని రికార్డింగుచేయవలసిన పనిమీద ఉస్తాద్జీని అడిగి తగినతేదీని నిశ్చయంచేసుకోవడం కోసం ఖాcసాహబ్ ఇంటికి వారు వెడుతున్నారు.
అప్పటికే ఆ పనిమీద, ఉద్యమస్ఫూర్తితో, ౘాలామార్లు ఖాన్జీ ఇంటికి ఆయన వెళ్ళివచ్చేరు. ఎన్నిసార్లువెళ్ళినా ఉస్తాద్జీ ఏదో ఒక తేదీ ఇవ్వడం, తీరా ఆ తారీకు దగ్గరపడేసమయానికి ఏదో ఒక వంకపెట్టి తప్పించుకోవడం అనే తంతు పరిపాటిగా జరుగుతోంది. ఉస్తాద్జీని రికార్డింగుకి ఒప్పించడానికి, జోషీజీకి తాతలు దిగివచ్చేరు. ఆ తరవాత HMV వారి పారితోషికానికి ఒప్పించడానికి ముత్తాతలు కూడా దిగివచ్చేరు. అక్కడివరకూ జోషీజీ పడినపాట్లన్నీ ఒక ఎత్తు! ఆ పైన, రికార్డింగుతేదీలని ఉస్తాద్జీయే ఒప్పుకుంటూ, ఆయనే వాటిని మార్చివేస్తూ చేసే తతంగం అంతా గమనిస్తూ, ఇదంతా ఏవిధంగా పరిష్కరించాలో జాగ్రత్తగా ఆలోచిస్తూ, అనుకున్నది సాధించడానికి అనువైన కార్యదక్షతతో, సమస్యకి సమాధానాలు అన్వేషించే జోషీగారి సహనశక్తితోకూడిన తెలివితేటలకి పరీక్ష మరొక ఎత్తు!
ఈ కళాకారులంతా అతిసున్నితమైన మనస్తత్వంతోవుంటారు. వారంతా ఎంతటి మహావిద్వాంసులో, అంతటి చిత్ర-విచిత్రంగానూ ప్రవర్తిస్తూంటారు. ఉదాహరణకి, 1946లో దివంగతులైన ఏకైకమహాగాయకుడుగా సుప్రసిద్ధుడైన ఉస్తాద్ అల్లాదియా ఖాcసాహబ్ వారి గానాన్ని రికార్డింగు చెయ్యడానికి ఏమాత్రమూ అంగీకరించలేదు. అలాగే మరొక సుప్రసిద్ధ మహావిద్వాంసుడైన ఉస్తాద్జీ, అద్భుతమైన కచేరీచేసి, సభానంతరం అడిగినంత పారితోషికమూ పొంది, “ఇంకా ఏమైనాకావాలా?” అని నిర్వాహకులు అడిగితే, ఐదురూపాయలు “బక్షీ“(బహుమతి) అడిగిపుచ్చుకుని వేదికని విడిచి వెళ్ళేరట! అంతుబువాగా ప్రసిద్ధులైన పండిత్ అనంత మనోహర జోషీ ౘాలా పొదుపైన వ్యక్తి. భోజనంలో నెయ్యి వాసన సరిగాలేకపోయినా ఒక్కచుక్కకూడా వ్యర్థంకాకండా ఎలాగో అలాగ భుజించేసేవారట. కాని ఆయన పెంపుడుపిల్లికి మాత్రం ఎప్పటికప్పుడు మంచినెయ్యికాచి అన్నంలోవేసేవారట!ఆ పిల్లి శుద్ధ శాకాహారి. దాని idiosyncracies దానివి. అంటే స్వచ్ఛమైన నేతిభోజనమే చెయ్యడం, మూషికాహారవిసర్జనవ్రతమేకాక, శాకాహారదీక్షకూడాను! అంతుబువాగారు కోపంలో అగ్నిహోత్రావధానులేట! కాని శిష్యులకి సంగీతపాఠాలు చెప్పడంలో అంతటి ఓర్పు అరుదేనట! సరే! ఇంక అసలువిషయంలోకి వద్దాం! అమీర్జీ గురించి మనం ఇక్కడ ప్రస్తావనచేసుకుంటున్నాం!
అమీర్ఖాన్జీతో మరీ జాగ్రత్తగా మెలగాలి. ఆయన అసలు-సిసలైన జాట్ ముస్లిం! ఆయన ఎంత మృదుస్వభావో, అంతకిమించిన పట్టుదల మనిషి. ఏ మాత్రమూ తేడారాకండా చూసుకుంటూవుండాలి! మొదటిసారి వారున్నభవనంలోని మూడవ అంతస్తులోని, వారి గదిలో కలిసినపుడు, జోషీజీ ఉస్తాద్జీతో రెండు-మూడుగంటల సమయాన్ని ౘాలా ౘక్కగా గడిపేరు. జోషీజీ స్వయంగా మంచి గాయకుడు, సంగీతకారుడు, విద్యావినయసంపన్నుడు, ఎదుటి వ్యక్తి మనస్తత్త్వానికి అనుగుణంగా నడుచుకోవడంలో నేర్పరి, తన ఉద్యోగధర్మం యొక్క విధినిర్వహణనైపుణ్యంలోను – నిషిద్ధాంశదూరీకరణసామర్ధ్యంలోను ఆరితేరినవాడు, అన్నింటినీమించి మహానుభావులైన సంగీతవిద్వాంసుల అద్భుతకళాసంపదని ‘రికార్డింగు‘ ప్రక్రియద్వారా పరిరక్షించి, రాబోయే తరాలకోసం భద్రపరచడంకోసమూ, ఆ విధంగా సంగీతశారదాదేవిని సేవించుకోవడంకోసమూ తన జీవితాన్ని అంకితంచేసుకున్నవాడు ఐవుండడంవల్ల, ఉస్తాద్జీని విడిచి పెట్టకండా ఒక లాంగ్ ప్లేయింగ్ రికార్డు అంటే 45 నిమిషాల వ్యవధివుండే L.P. రికార్డింగుకోసం, పట్టువదలని భట్టుమూర్తిలాగ – విసుగుచెందని విక్రమార్కుడిలాగ తన ప్రయత్నాన్ని కొనసాగించేరు. ఉస్తాద్జీ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి, ఆయన నలుగురు ఆ చుట్టు-పక్కల ఆడపిల్లలకి(తవాయఫ్ లకి) పాఠాలు నేర్పుతున్నారు. జోషీజీని చూడగానే వాళ్ళని పంపించేసి, ఖాcజీ సాదరంగా ఎదురువచ్చి అతిథిని లోపలికితీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి, తానుకూడా వారి ప్రక్కన కూర్చుని తేనీటికి ఏర్పాటుచేసేరు. ఆ తరువాత వారిద్దరిమధ్య సంభాషణ ఇలాగ జరిగింది.
అమీర్జీ:—
నమస్కారం జోషీజీ! ఈ రోజో, రేపో మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకే పనిమీద ఇలాగ మీవంటి ఆత్మీయమిత్రుడిని తిప్పడం నాకు ఇబ్బందిగానే ఉంది. ఏంచెయ్యమంటారు చెప్పండి? నాకు సరైన ‘మూడ్ ‘ రావడంలేదు!
జోషీజీ:—
మీరు ౘాలా గొప్పవారు ఉస్తాద్జీ! మన ఇద్దరి మైత్రికోసం ఎన్నిసార్లుతిరిగినా నాకు ఇబ్బందిలేదు. కాని తరుచు ఒకే పనిపేరుచెప్పి, ఆ పని ఎప్పటికీ ఏమాత్రమూ పూర్తికాకండా వెళ్ళిరావడంవిషయంలో, ఆఫీసులోని నా పైవారికి సంజాయిషీ ఇవ్వడం నా వల్ల కావడంలేదు. “ఇంతకాలం ఇంత శ్రద్ధతో వెళ్ళివస్తూంటే గుళ్ళోని దేవుడైనా ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు. కాని మీ ఉస్తాద్జీకి కనికరం రావడంలేదా?” అంటూ వాళ్ళు మహా వెటకారంగా ప్రశ్నిస్తూంటే నా దగ్గర నిస్సహాయమైన మౌనంతప్ప మరొక సమాధానం ఉండడంలేదు.
అమీర్జీ:—
జోషీజీ!దయవుంచి నన్ను నమ్మండి! ఈ విషయంలో మీరుమాత్రం నన్ను సందేహించవద్దు. ఈసారి రికార్డింగుతేదీని నేను చెప్పను. ఈ వారంలో మీకు ఏ తారీకు అనుకూలమో మీరే చూసుకుని నాకు చెప్పండి. ఆ రోజు నేను మీ స్టూడియోకివచ్చి రికార్డింగుకి మీతో పూర్తిగా సహకరిస్తాను. నా ఈ మాటకి ఇంక తిరుగులేదు.
ఆ విధంగా 45 నిమిషాల అమీర్జీ మొట్టమొదటి LPకి బీజం పడింది. అన్న మాటని జవదాటకుండా అమీర్జీ స్టూడియోకి వెళ్ళి LP రికార్డు ఇచ్చేరు. దాంట్లో, వారికి ౘాలా ఇష్టమైన “మార్వా”, “దర్బారీకానడా”, “మాల్కౌస్ ” రాగాలని పరమరమణీయంగా ఆయన గానంచేసి, వారి పరమాద్భుత గానశైలిలో, ఆ లోకోత్తర రాగఝరుల ఔజ్జ్వల్యాన్ని వారు తరవాత తరాలకోసం శాశ్వతంగా భద్రపరిచేరు.
ఈ మొదటి LPకి అనూహ్యమైన గొప్ప స్పందన సంగీతాభిమానులనుంచి వచ్చింది. HMV యాజమాన్యానికేకాక, అమీర్ ఖాన్జీకికూడా ౘాలా సంతోష దాయకమైన సందర్భం అది. ఐనా అమీర్జీ మరొక స్టూడియో రికార్డింగుకి జోషీజీ తీవ్రంగా ప్రయత్నించడంవల్ల, రెండవ LPని మాత్రమే రికార్డింగు చేయడం వీలైంది. ఈ రికార్డులో “లలిత్ “, “మేఘ్ ” రాగాలు పొందుపరచబడ్డాయి. జోషీజీ చేసిన 10—15 సంవత్సరాల నిరవధిక ప్రయత్నంద్వారా అమీర్జీవి రెండు LPలు మాత్రం వెలువడ్డాయి. ఆ విధంగా రెండు రికార్డింగులు మాత్రమే చేయగలిగినందుకు, ఎన్ని ప్రయత్నాలుచేసినా, అటువంటి అనుపమాన గాయనచక్రవర్తి మహామనోరంజక గానసంపదని తగినంతగా భద్రపరిచగలిగిన అవకాశాలన్నీ చేజారిపోయినందుకు, మానవీయసన్నివేశాలు అనుకున్నట్లు కలిసిరానందుకు జోషీజీ ౘాలా నిరాశపడి, ఎంతగానో ఖిన్నులైపోయేరు.
— # — # — # — # — # — # — # — # —
పటియాలా ఘరానాప్రపంచానికి పరమప్రభువువంటి ఉస్తాద్ బడేగులాం ఆలీఖాcసాహబ్ జీ, జోషీజీకి ఆప్తమిత్రులు. కాని, “ఎక్కడైనా బావే కాని వంగతోటదగ్గర బావకాదు” అన్నట్టు, రికార్డింగు విషయంలో బడేగులాంజీకూడా జోషీజీని, అమీర్జీలాగ మూడుచెరువులు కాకపోయినా, మూడు గుండిగలో లేక మూడు పీపాలో నీళ్ళు రమారమిగా పుచ్చుకునే విధంగా చేసేరనే చెప్పాలి!
అది 1944వ సంవత్సరం! వేదిక బొంబై మహానగరం! బడేగులాంజీ మొదటి, బొంబై కచేరి జరిగిన సంవత్సరం అన్నమాట! ఆయన తన కచేరీలో “మార్వా” రాగం, ప్రధాన అంశంగా పాడేరు. చివర ఒక ఠుమ్రీ పాడేరు. ఆ అద్భుతగానం బొంబై నగర సంగీతరసజ్ఞులకి, బడేగులాంజీకి ఎడతెగని అనురాగబంధాన్ని ఏర్పరచింది. ఆ సభకి వెళ్ళిన జోషీజీ మంత్రముగ్ధులైపోయి, బడేగులాంజీతో పరిచయం చేసుకున్నారు. అనతికాలంలోనే వారిద్దరూ సంగీతబంధువులేకాక, ఆప్తమిత్రులై పోయి ఒకరి ఇంటికి మరొకరు తరుచు వెళ్ళేటంత సన్నిహితులైపోయేరు. అప్పటికి, బడేగులాంజీ వయస్సు 42 సంవత్సరాలు. జోషీజీకి 35 ఏళ్ళప్రాయం ఉంది. HMVలో కార్యనిర్వహణాధికారిగాచేరి, జోషీజీ ఆరేళ్ళ అనుభవం సంపాదించేరు. ఆ ఏడాది(1944) జోషీజీ బడేగులాంజీని ఒప్పించి HMV స్టూడియోలో, “యాద్ పియా కి ఆయే“, “కటేనా బిరహా కి రాత్ “, “తిరచ్చి నజరియాc కె బాణ్ “, “ప్రేంకె ఫందేమేc ఆకర్ సజనీ” వంటి సుప్రసిద్ధమైన ఠుమ్రీలన్నీ ఈ సందర్భంలో జోషీజీ, బడేగులాంజీచేత పాడించి రికార్డింగు చేసినవే!
1948వ సంవత్సరంలో బడేగులాంజీ బొంబై వచ్చి తక్కువ కాలమే అక్కడ వున్నారు. వ్యవధి తక్కువకావడంవలన, బడేగులాంజీ స్టూడియో రికార్డింగుకి సుముఖంగాలేరు. ఐనా జోషీజీ గట్టిగా పట్టుపట్టడంతో ఉస్తాద్జీ ఒప్పుకోక తప్పిందికాదు. రికార్డింగురోజున ఉస్తాద్జీ, జోషీజీకి దూరవాణిద్వారా తన ఆరోగ్యం పాటపాడడానికి అనువైన స్థాయిలోలేదని, మరొకమారు రికార్డింగు చేయవచ్చునని తెలియజేసేరు. జోషీజీ ఆయన చెప్పిన విషయాలన్నింటికి సానుకూలంగా స్పందించి, సాయంత్రం స్టూడియోలో స్నేహపూర్వకంగాకలిసి, ఆ సాయంత్రాన్ని మధురంగా గడపడానికి ఉస్తాద్జీని సులువుగానే ఒప్పించేరు. ఉస్తాద్జీకికూడా ప్రియమిత్రులతో సాయంత్రాలు గడపడం అంటే ౘాలా ఇష్టం! సాయంత్రం ఉస్తాద్జీని రంజింపచేసే రమణీయపానీయాలన్నీ జోషీజీ ఏర్పాటు చేసేరు. ఐతే, లోపల రహస్యంగా రికార్డింగుకి అవసరమైన ప్రక్కవాద్యాలు, ఇంజినీరింగ్ స్టాఫ్ మొదలైన ఏర్పాట్లన్నీ బందోబస్తుగా చేసేసేరు. ముందు గదిలో ఉస్తాద్జీ కూర్చొనడానికి తగిన ఏర్పాట్లు, పానీయాదికాలు అందించడానికి కార్యాలయం జవాను, ౘక్కగా శ్రుతిచేసిన రెండు తంబూరాలతో జోషీజీ సిద్ధంగావున్నారు. ఉస్తాద్జీ రాగానే పలకరింపులు అయ్యాక, ఆ మాట- ఈ మాట ఐపోయినతరవాత ఉస్తాద్జీకి మధుపాత్ర అందించి, ఆయన కబుర్లు చెపుతూ రెండు మూడుసార్లు లఘువుగా సేవించిన తరవాత, జోషీజీ ఒకతంబూరాని చేతిలోకి తీసుకుని మధురంగా మీటుతూ, ఉస్తాద్జీతో ఇలా అన్నారు.
జోషీజీ:—
ఖాన్సాహబ్ ! నాకో సందేహంవుంది. “లలిత్ రాగం”లో, కోమలధైవతప్రయోగం అంత మధురంగావుంటే, అదికాదని, గ్వాలియరు ఘరానావారు తీవ్రధైవతాన్ని ఎందుకు వినియోగిస్తారు?
ఖాన్సాహబ్ :—
(తాన్పురా శ్రుతికి అనుగుణంగా, కోమలధైవత ప్రయోగంతో లల(లి)త్ రాగాన్ని మృదుమధురంగా పాడి వినిపించి) జోషీసాహబ్ ! ఇంత మాధుర్యాన్ని కాదని మరొకవిధంగా నేనెలాగ పాడగలను?
జోషీజీ(సంభాషణని కొనసాగిస్తూ):—
కల్పవృక్షం సన్నిధిలోనే కోరికలనన్నీ తీర్చేసుకోవాలి, ఖాన్సాహబ్ ! “అడానారాగం”లో, కొందరు కళాకారులు తీవ్ర-కోమల నిషాదాలు రెండూ ప్రయోగిస్తారు. అది సక్రమమైన పద్ధతే అంటారా?
ఖాన్సాహబ్ (అందుబాటులోవున్న తాన్పురాని చేతిలోకి తీసుకుని, నిటారుగా కూర్చుని “అడానా రాగం” పాడి వినిపించి):— మీ సందేహం తీరిందా?
జోషీజీ:—
సాక్షాత్తూ సరస్వతీదేవి ఖాన్సాహబ్ రూపంలోవచ్చి, పాడి వినిపిస్తే ఇంక ఏమి సందేహాలుంటాయి, ఖాన్సాహబ్ ? ఈ రోజు మీ గాత్రమహిమ అలౌకిక సుధా మాధుర్యంతో నిండిపోయివుంది. ఈ పూట ఇటువంటి కమనీయగంధర్వగానం విని నేను ధన్యుడనైపోయేను. మరి ఇంక మన సంగీతరసజ్ఞులకి ఈ అపూర్వ మాధుర్యం ఎందుకు అందకూడదు, ఖాన్సాహబ్ ? ఈ పూట, మీ పాట, సరిసాటి లేని తేనె ఊట, ఖాన్సాహబ్ !
ఖాన్సాహబ్ :—
(చిరునవ్వుతో) ఈ పూట నా పాట మీకు అంతటి మేటి పాటగా అనిపిస్తే రికార్డింగు చేసుకుంటారా, మరి?
జోషీజీ:—
ఖాన్సాహబ్ ! తమ ఆదేశమే మాకు, మహాప్రసాదమూ, శిరోధార్యమూను!
ఆ సాయంత్రం ఖాన్సాహబ్ పరవశించి పాడేస్తుంటే, జోషీజీ మైమరచిపోయి, రికార్డింగుచేయించేరు. ఆనాటి పాటలలోనే విశ్వవిఖ్యాతిచెందిన గొప్ప పాటలు, “ఆయే న బాలమ్ కా కరూc సజనీ”, “నైనా మోరే తరస్ రహేహై”, “ప్రేమ్ కి మార్ కటార్ “ మొదలైన అత్యద్భుతమైన 12 పాటలని జోషీజీ రికార్డుచేసేరు. పదిపాటలు పూర్తిచేసినతరవాత, ఖాన్సాహబ్ , జోషీజీని, అప్పటికి ఎన్ని పాటలు రికార్డయ్యేయో వివరం అడిగేరట! జోషీజీ నవ్వుతూ, “ఇంక రెండు పాడేస్తే సరిగ్గా సరిపోతాయి” అన్నారట! వెంటనే ఖాన్జీ, “అంటే, ఇంకో రెండు పాడితే, మొత్తం ఎన్ని ఔతాయి?” అని అడిగేరట! సరిగ్గా, “రౌండ్ ఫిగర్ – 12” అన్నారట! ఇద్దరూ భళ్ళుమని నవ్వేసుకున్నారు. “జోషీజీ! మీరు నా మీద ఏదో మాయో, మంత్రమో ప్రయోగించేరు. నేను మీ వశుడిని ఐపోయేను” అన్నారు, ఉస్తాద్ బడే గులాం ఆలీఖాcసాహబ్ !
ఆ రోజు సాయంత్రం స్టూడియోబయట కుంభవృష్టి కురిసిందట! కాని HMV స్టూడియోలో సంగీత స్వర మహావృష్టి ౙాలువారిందని జోషీజీ వర్ణించేరు. ఐతే, స్టూడియో బయట పడిన వాన, ఆ పూటకే, ఆ స్థలానికే, ఆ జనానికే పరిమితం! స్టూడియో లోపల వర్షించిన రసరమ్య స్వరధారాపాతం, ప్రపంచవ్యాప్తమైన సర్వరసజ్ఞలోకానికి, శాశ్వత రసమయ దివ్యమహిమతో నిరంతర వరప్రసాదమై నిలిచిపోయింది.
“అన్ని సందర్భాలలోనూ, ఎల్లవేళలా, అందరు కళాకారులతోనూ జోషీజీ ఇలాగే అతలాకుతలమైపోయేవారా?” అంటే అది పూర్తిగా నిజంకాదు. ఒకే నాణేనికి జటిల సమస్యల పర్వం ఒకవైపుగావుంటే, హృదయానికి హాయిని కలిగించిన సన్నివేశాలు కొన్ని ఆ నాణెం రెండవవైపున లేకపోలేదు! 1971లో, ఉస్తాద్ బిస్మిల్లా ఖాc సాహబ్ , బొంబై వచ్చేరు. జోషీజీ, బిస్మిల్లాజీ రికార్డింగుని, ఒక శుక్రవారం ఏర్పాటుచేయవలసివచ్చింది. శుక్రవారం, ముసల్మాను సహోదరులకి, మాధ్యాహ్నిక ప్రార్థన, “జుమ్మా” ప్రధానమైనది కనక, ఆ ప్రార్థన సమయానికి కొంచెంముందుగా రికార్డింగు పూర్తిచెయ్యడంకోసం, ఆ రోజు ఉదయం గం.08—30ని. లకి అందరూ స్టూడియోలో కలుసుకునేటట్లు అందరూ ఏకాభిప్రాయానికివచ్చేరు. జోషీజీ సమయానికి స్టూడియోకి వచ్చేసేరు. వెనకనే, ప్రక్కవాద్యాల కళాకారులు, ఆ వెనుక విచిత్రంగా నల్లకళ్ళజోడుతో బిస్మిల్లాజీ వచ్చేరు. ఆయనని అలా చూడడం జోషీజీకి మొదటిసారి. అందువల్ల వారిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా నడిచింది:—
జోషీజీ:—
అయ్యో! ఖాన్సాహబ్ ! ఎప్పుడూలేనిది ఆ నల్లకళ్ళజోడు పెట్టుకున్నారేమిటి?
ఖాన్జీ:—
జోషీసాబ్ ! ఊళ్ళో అంతా కంటిజబ్బులున్నాయటకదా? నాకు నిన్ననే అంటుకుంది. రాత్రంతా కళ్ళమంట, ఒకేరకంగా నీరుకారడం, కంటిమీద కునుకేలేదనుకోండి!
జోషీజీ:—
అయ్యో! ఈ రోజు విశ్రాంతి తీసుకోవలిసింది. మరో రోజు రికార్డింగు చేసుకునేవాళ్ళంకదా?
ఖాన్జీ:—
అలాగ చేస్తే మీకు ఇచ్చినమాట బోటుపోదా? శరీరం అనుకూలించినంత వరకు, నమాజుని మానకూడదు. ఇచ్చినమాట నిలబెట్టుకోవడం, నమాజు తరువాత, అంతటిదే! అల్లాః అనుగ్రహంవల్ల అంతా సవ్యంగా జరిగిపోతుంది జోషీసాబ్ !
జోషీజీ:—
ఉపదేశశక్తితో ఉజ్జ్వలమైన ఉక్తిని సెలవిచ్చేరు, ఖాన్సాహబ్ ! ఐతే అన్నీ సిద్ధంగానేవున్నాయికనక, మీ అమూల్యసమయం వ్యర్థంకాకండా మన పనిలో మగ్నం ఐపోవచ్చు.
రెండు రసరమ్యరాగాలని, ఒక ఠుమ్రీని ఆ రోజు రికార్డింగుచేయడం జరిగింది. ఈ విధంగా కొందరు మహాకళాకారులు సరస్వతీదేవి అనుగ్రహించిన అలౌకిక వరప్రదానంలాగ తమంతతామే, రికార్డింగుకి సహకరించిన సందర్భాలుకూడా లేకపోలేదు.
జోషీజీ, తమ “Down Melody Lane” పుస్తకంలో, ఒక చోట, “బడేగులాం ఆలీ, అల్లాదియా ఖాc, అమీర్ ఖాc, కేసర్బాయి కేర్కర్ , రౙబల్లీ, అమానత్ ఆలీ మొదలైనవారంతా, పాతకాలపు భావాలతో, పరిమిత దృక్పథంతో, నిర్హేతుకమైన పట్టుదలతో తమ-తమ గానసౌభాగ్యాన్ని రికార్డుచెయ్యడానికి, ఆ మహా సంగీతసంస్కృతిని భవిష్యత్తుకోసం భద్రపరచడానికి ఏ మాత్రమూ అంగీకరించేవారుకాదు” అంటూ వాపోయేరు. అంతేకాదు! బడేగులాంజీ తమ్ముడైన బర్ఖత్ ఆలీఖాc సాహబ్ పాకిస్తానునుంచి బొంబై వచ్చి కొంతకాలం అక్కడవుండడం సంభవించింది. ఆ రోజులలో ఆయన గానాన్ని రికార్డుచేయడానికి బర్ఖత్జీ అంగీకరించినా, జొషీజీ పైన HMV వారి యాజమాన్యంలోవున్న ఒక వ్యక్తి, ఆ రికార్డింగు కార్యక్రమానికి ఒక”పరిమితి”ని విధించి, ఆ పైన రికార్డింగుకి అనుమతించనివ్వలేదట!
ఈ విధంగా, బిస్మిల్లా ఖాc, అల్లారఖా, అహ్మద్ జాన్ తిరఖ్వా, రవి శంకర్ , ఆలీ అక్బర్ ఖాc, బేగం అఖ్తర్ , ఓంకార్నాథ్ ఠాకూర్ , కె.ఎల్ .సైగల్ , డి.వి.పలూస్కర్ , కుమార గంధర్వ, విలాయత్ ఖాc, కేసర్బాయి కేర్కర్ , మొదలైన జాతీయ, అంతర్జాతీయ కళాకారుల సంగీతం HMV సంస్థవారి రికార్డులరూపంలో రసజ్ఞజన బాహుళ్యానికి విరివిగా లభ్యంకావడానికి శ్రీ గోవింద నారాయణ జోషీజీ ఒక కీలకమైన కారణంగా భావించవచ్చు.
$ % $ % $ % $ % $ % $ % $ % $ % $ % $
మహారాష్ట్రలోని విదర్భప్రాంతానికిచెందిన ఖేంగాcవ్ కి, చెందిన ఒక పెద్ద న్యాయవాదిగారి కుమారుడైన గోవింద నారాయణ జోషీ 1909, ఏప్రిల్ , 6వ తేదీన జన్మించేరు. ౘదువులో మంచి తెలివి-తేటలున్న జోషీజీ నాగపూరు విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై, బొంబై విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని, బొంబై హైకోర్టులో విజయవంతమైన న్యాయవాదవృత్తిచేస్తూ, సంగీతంవైపుకి ఆకర్షితులయ్యేరు. గ్వాలియరు ఘరానాకిచెందిన రాంభావు సోహొనీ, దినకర్రావ్ పట్వర్థన్ అనే విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీత గానానికి పునాదులు వేసుకున్నారు. 1—6—1938 వ తేదీన HMV సంస్థవారి బొంబై ప్రథానకార్యాలయంలో, కార్యనిర్వహణాధికారి గా, ఉద్యోగంలో చేరి, ఉద్యోగవిరమణపర్యంతమూ అక్కడే పనిచేసేరు.
పండిత్ జగన్నాథబువా పురోహిత్ గారి శుశ్రూషచేసి, వారి ప్రియశిష్యులలో ఒకరై రాణించేరు. మరాఠీ “భావగీత” ఉద్యమానికి జోషీజీ ఒక పునాదిరాయి. వారు స్వయంగా HMV వారి 78 RPM రికార్డులు పాడేరు. సుమారు 75 పాటలు వారు పాడేరు. యూ-ట్యూబులో కొన్ని లభ్యం ఔతున్నాయి.
01—06—1938వ తేదీన వారు HMVలో కార్యనిర్వహణాధికారిగాచేరిన రోజు ఎంత మంచిదో తెలియదుకాని, భారతీయ సంగీతరంగానికి, నాటకరంగానికి, జోషీజీ, అనేకరీతులలో, అనితరసాధ్యమైన శాశ్వతప్రభావంకలిగిన సేవలనిచేసేరు.
భారతీయసంగీతరంగానికి ఆయన చేసిన మహాసేవని మాటలలో వర్ణించపూనడం మానవశక్తి-సామర్థ్యాలకి మించిన పని. వారి నేతృత్వంలో విడుదలైన “A Night At The Taj”, “Call Of The Valley”, “Sitar Quintet”, “Raga : Jazz Style” మొదలైనవి వారి “మానసిక దుహితలు” అని అనడం అతిశయోక్తికి అమితదూరం! అలాగే వారి మార్గదర్శకత్వంలో విడుదలైన ౘాలా ‘జుగల్ బందీలు‘ సంగీతరసికులకి సర్వదా నేస్తాలే!
అటువంటి అపూర్వ శారదాతనయుడు, 1994, సెప్టెంబరులో, తమ 85 ఏళ్ళ వయస్సులో, ముంబైలోని, మాహింలోవున్న వారి స్వగృహం ఐన “రాగేశ్రీ” సంగీతశారదాసదనంలో, సంగీతసరస్వతీదేవిలో లీనమైపోయేరు. వారి పాదాలవద్ద నతమస్తకులమై మన సాష్టాంగ దండప్రమాణం సమర్పించుకుందాం!
స్వస్తి||
Thank you very much bava garu for such a valuable info
అష్ట కష్టములను ఇష్టమై భరియించి
వీధు లెన్నొ తిరిగి విసుగు లేక ,
పదిల పరచి జోషి పలువురి గాత్రాలు
ధన్యజీవి యయ్యె ధరణి లోన!
కార్యసిద్ధి కొరకు కట్టుబడినవారు
ఇడుము లెన్ని గాని ఎదురు కొండ్రు.
కాసు కొరకు కాక కళలకే బ్రతుకన్న
జోషి వరుల కివియె జోత లిడుదు.
My heartful respects to Sri Joshiji who has done remarkable service to the world of music and drama through HMV. His efforts in pleading the artists for their recordings to hand over the precious tresure to the next generation is amazing and fills one with gratitude towards the noble soul. His conversations with the great musicians of those days are very interesting as u have presented them. I am also excited to enjoy Joshiji’s music and other albums in the you tube