సాహిత్యము-సౌహిత్యము – 58 : సర్వభూతనివాసోsసి వాసుదేవ! నమోsస్తు తే
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః|
16—06—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము~58″|
ఈ వారంకూడా “తెలుగు చాటువు“లోని, వెన్నెలకంటి జన్నమంత్రి(1360-1420) రచించిన “దేవకీనందన శతకం“నుంచి ఉదహరించబడిన పద్యంగురించి ప్రస్తావన చేసుకుందాం!
“మత్తేభ విక్రీడితం” వృత్తంలోవున్న ఆ పద్యం యిది:—
“కరినేలింది హుళక్కి, ద్రౌపదకి కోకల్ మెచ్చి ఇచ్చింది ద
బ్బర, కాకాసురునిన్ కటాక్షమున చేపట్టిందబద్ధంబహో|
శరణన్నన్ పగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుటల్ కల్ల , ఈ
సరి, నన్నేలిన నిక్కమీ కథలు, కృష్ణా! దేవకీనందనా”||
“ఎప్పుడో ఏనుగుని రక్షించేవంటారు! అది అబద్ధం! ద్రౌపదీదేవి ఆర్తభక్తికి కరిగిపోయి ఆమెకి వలువలిచ్చి మాన సంరక్షణంచేసేవని చెపుతూవుంటారు!అదీ నిజం కాదు! సీతామాతకి చేటుచేయపూనిన కాకాసురుణ్ణికూడా కరుణించి కాపాడేవనికూడా విన్నాను! అది నమ్మశక్యంగాలేదు. నీ శరణాగతినిపొందిన విభీషణుడికి, రావణోద్ధరణానంతరం, లంకారాజ్యాభిషేకం చేసేవని లోకప్రసిద్ధంగా అనుకుంటారు. ఆ మాట నీటిమూటగానే అనిపిస్తోంది. దేవకీతనయుడవైన ఓ కృష్ణా! ఈ కథలన్నీ నిజమేనని నేను నమ్మాలంటే, నీవు తప్పక నన్ను ఈ సారి కాపాడి తీరాలి. అప్పుడే, ఇంతకిముందుజరిగిన గాథలన్నీ అందరమూ నమ్ముతాం!”.
భక్తిమార్గగాములైన భక్తులు అందరూ ఒకేఒకరకంగావుండరు. అటువంటి వివిధస్వభావాలుకలిగిన భగవద్భక్తుల తీరుతెన్నులుకూడా వేరు-వేరుగానే ఉంటాయి. వివిధభక్తులలో సఖ్యభక్తికలవారు కొందరుంటారు. ఈ సఖ్యభక్తిలో కూడా రకరకాల భక్తులున్నారు. స్నేహం అనేసరికి ౘనువుతీసుకోవడం సహజం! ఆ ౘనవులోకూడా, అతిౘనవు తీసుకునే భక్తులుకూడావుంటారు. అలాంటి అతిౘనువుభక్తులలో వెన్నెలకంటి జన్నమంత్రిగారు ఒకరు!ఆయన అంటున్న విషయం అందరికీ అర్థమయ్యేదే! జన్నమంత్రిగారిని తరింపజేస్తేనే దేవుడు కవిగారి మన్ననకి పాత్రమౌతాడు. లేకపోతే దేవుడిపరువు బజారుపాలైనట్లే! అంతకిముందు పురాణప్రసిద్ధకథలన్నీ బూటకమేనని కవిగారు “టాం-టాం” చేస్తారు. ఈ పద్యంలో ఆ మాటే అంటున్నాడు, కవి! అంటే, భక్తుడు తన ఇష్టదైవాన్ని “డివోషనల్ బ్లాక్ మెయిలింగ్ (devotional blackmailing)” చేస్తున్నాడన్నమాట! సరే! మరి ప్రేమలో ఏదైనా చెల్లుబాటు ఔతుందికదా!
ఈ పద్యంలో ఉపయోగించబడిన “హుళక్కి=దబ్బర=అబద్ధం=కల్ల” అనే నాలుగుమాటలకీ ‘అబద్ధం’ అనే అర్థం. అంటే ఈ పద్యంద్వారా నాలుగు పర్యాయపదాలుకూడా తెలుసుకున్నాం అన్నమాట!
భక్తిభావసాహిత్యంలో ఈ రకమైన భక్తిసాహిత్య ఉపవిభాగం మనకి క్రొత్త కాదు. పురాణకాలంనుంచి ఆధునికకాలంవరకు ఇటువంటి పద్యాలు, పాటలు మన సాహిత్యంలో అనేకంవున్నాయి. ఉదాహరణకి శ్రీమద్భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో శ్రీకృష్ణుడితో గోపికలు ఎంతో ౘనువుతో సంభాషించడం భాగవతప్రియులందరికీ తెలిసిన విషయమే! అలాగే, అనేక భక్తజనులజీవితచరిత్రలలో అటువంటి ఘట్టాలు మనకి ఎదురౌతూనేవుంటాయి. ఉదాహరణకి భక్తరామదాసు జీవితచరిత్రలో ఆయనకి జరిగిన ఇటువంటి అనుభవాలన్నీ పాటలరూపంలోను, పద్యాలరూపంలోను మనకి సుపరిచితమే! రామదాసుగారి పద్యం ఒకటి ప్రసిద్ధమైనదివుంది. అది చూద్దాం!
“రామ! ఇదేమిరా! నిరపరాధిని దుర్జనులేచుచుండగా
ఏమి యెరుంగనట్టుల సహించుక యున్న పనేమి? చెప్పరా!
నీమదికింత సహ్యమగునే? ఇక ఎవ్వరు నాకు రక్షకుల్ ,
కోమల నీలవర్ణ! రఘుకుంజర! మద్గతి జానకీపతీ!”
ఇది ౘాలక, “ఇక్ష్వాకు కుల తిలక!” అనే కృతిలో,
“కలికితురాయి నీకు పొలుపుగచేయిస్తి – రామచంద్రా!
కులుకుచు తిరిగెదవెవరబ్బ సొమ్మని – రామచంద్రా?”
“మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా – రామచంద్రా? – లేక,
మీ మామ జనకమహారాజు పంపెనా – రామచంద్రా?”
అని పెట్టినంతమేరకి తిట్టి, పెట్టుపోతలతో నిమిత్తంలేని తన హృదయస్థప్రేమతో,
“అబ్బ! తిట్టితినని ఆయాసపడవద్దు – రామచంద్రా! – ఈ
దెబ్బలకోర్వక ‘అబ్బ!’ తిట్టితినయ్య – రామచంద్రా!”
అంటూ తన ఆక్రోశానికి సంజాయిషీని సమర్పించుకున్నాడు, భక్తరామదాసు!
త్యాగరాజస్వామివారు కొంత సుతిమెత్తని పలుకుబడితో, “బహుధారి”
రాగం, ఆదితాళంలో, రఘురాములవారిని, సతర్కంగా ఇలాగ అడిగేరు:—
పల్లవి:—
“బ్రోవ భారమా! రఘురామ!
భువనమెల్ల నీవై నన్నొకని ॥బ్రోవ॥
అనుపల్లవి:—
“శ్రీవాసుదేవ! అండకోట్ల, కు
క్షిని ఉంచుకో లేదా, నన్ను, ॥బ్రోవ॥
చరణం:—
“కలశాంబుధిలో దయతో, అమ
రులకై, అదిగాక గోపి
కలకై, కొండలెత్తలేదా?
కరుణాకర! త్యాగరాజుని ॥బ్రోవ॥”
“రఘురామా! శ్రీవాసుదేవా!” అనే సార్థక సంబోధనలతో శ్రీరామచంద్రస్వామివారిని త్యాగయ్యగారు ఇరుకునపెట్టేరు. ఆర్తత్రాణపరాయణుడైన రఘుమహారాజు వంశానికిచెంది, శరణాగతరక్షణని దీక్షగా స్వీకరించిన “రఘురామా!” అనే సంబోధన మొదటిది.
“వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్ త్రయమ్ |
సర్వభూతనివాసోsసి వాసుదేవ! నమోsస్తు తే”||
“వాసుదేవుడి ఉనికివలననే ఈ మూడు లోకాలకి ఉనికి ఉన్నది. సర్వభూతాలకి నివాసస్థానమైన ఓ వాసుదేవా! నీకు నా నమస్కారము” అన్న శ్లోకంలో విశ్వానికంతటికి వాసుదేవుడే ఆశ్రయస్థానమని చెప్పబడింది. “అందువల్ల లోకాలనన్నీ భరించి, కాపాడేవాడివైననీకు నన్నొక్కడిని రక్షించడం కష్టమా? ఓ వాసుదేవా!” అని నిలదియ్యడం రెండవ సంబోధనలోవుంది.
“క్షీరసాగరమథనం” సందర్భంలో, దేవకార్యాన్ని నిర్వహించడానికి మంథర పర్వతాన్ని, కృష్ణావతారంలో గో,గోప,గోపీసంరక్షణార్థం గోవర్ధనగిరిని ఎత్తేవు. అంతేసి బరువులెత్తగలిగిన నీకు నా ఒక్కడిని ఆదుకోవడం అంతటి కష్టంకాదు కదా! అని భక్తిమయహేతువిద్యతో త్యాగరాజుగారు రాములవారిని అడుగుతున్నారు.
“భాగవతమహాపురాణమ్ ” లో, సప్తమస్కంధం, ప్రథమాధ్యాయంలో, నారద దేవర్షి, ధర్మరాజు సందేహాలు తీరుస్తూ ఇలాగ వివరిస్తాడు:—
“గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాత్ చైద్యాదయః నృపాః|
సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో!”||
ఈ శ్లోకభావాన్ని పోతనగారు తెలుగులోకి ఇంత అందంగా తెచ్చేరు:—
“కామోత్కంఠత గోపికల్ , భయమునన్ కంసుండు, వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ , సంబంధులై వృష్ణులున్ ,
ప్రేమన్ మీరలు, భక్తినేము, ఇదె, చక్రిన్ కంటిమెట్లైన, ఉ
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిc జెందన్ వచ్చు, ధాత్రీశ్వరా!”
భాగవతంలోని, షష్ఠస్కంధంలోవున్న “అజామిళోపాఖ్యానం”లోవున్న ఈ శ్లోకం భగవన్నామ స్మరణగురించి ఇలాగ అంటోంది:—
“సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా|
వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుః”||(భాగవతమ్ :VI:2—14)
“శ్రీహరి పేరుని ఇతరులకిపెట్టిపిలవడంద్వారాగాని, సరదాగాకాని, ఊతపదంగా కాని, వేళాకోళంగాకాని నోటితో ఉచ్చరించడం లేక స్మరించడం వలన అన్ని పాపకర్మసంచయాలు నిర్మూలించబడతాయని తత్త్వవిదులు అనుభవంతో చెపుతున్నారు”
అందువల్ల భక్తులకి ఇటువంటి స్నేహసంబంధం తమ ఇష్టదైవంతో ఉంటుంది. ఆ సందర్భంలో ఇటువంటి సౌందర్యపూరిత చమత్కారభరిత రసమయ భావాలు, వాటికి అనుగుణమైన అందమైన పలుకుబడులు అన్ని వాఙ్మయాలలోను లభిస్తాయి. ఇతర సంస్కృతులలోకూడా లోకంలోవున్న అనేక మానవసమాజాంతర్గత మతాలలో ఇటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి Jewish, Christian, Sufi mystics జీవితాలలో ఇటువంటి చిత్రమైన సన్నివేశాలు, సందర్భాలు అనేకంగా మనం గమనించవచ్చు.
స్వస్తి||
Harekrishna. chala baagundi guruvugaru.
భాష కందని భావాలు. చాలా బాగుంది.
భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. దాన్ని గురించి
చెప్పడానికి ఏకంగా పన్నెండు స్కంధాల భాగవతమే
చెప్పబడింది. ఇంకా నారద భక్తిసూత్రాలూ , శాండిల్య
భక్తిసూత్రాలు వంటివి ఉండనే ఉన్నాయి. నవవిధ భక్తి
మార్గాలలో భగవంతుని సేవించే పద్ధతి కూడా వివరించబడింది.
ఇక్కడ వివరించిన చాటువులో దేవుణ్ణి బెదిరించిన పద్ధతి
తమాషాగా ఉంది. తనని రక్షిస్తేనే అంతకు ముందు రక్షింపబడిన వారి
గాధల్ని నమ్ముతాడట. దేవుడు రుజువు చేసుకోవాలన్న మాట!
త్యాగరాజస్వామి, రామదాసుల కీర్తనలు కూడా apt గా ఉన్నాయి.
” నిందాస్తుతి” చాలామంది భక్తులు చేశారు. అవన్నీ మనం
వింటూనే ఉన్నాం.
“దేవునితొ నెయ్యమునుచేసి తెలివి మీర,
తనను కాపాడలేనిచో దైవమహిమ
కల్లగా ౘాట బెదిరించు ఘనుడు చూడ
భక్తిగా దేవుడినిచేయు “బ్లాకుమెయిలు”!