శారదా సంతతి — 47 : సంగీత సరస్వతీదేవి సిగబంతులు ~ సింగరాచార్య సహోదరులు
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః|
10—06—2018; ఆదిత్యవాసరము|
శ్రీశారదా వాత్సల్య సుధానిధి|
“శారదా సంతతి ~ 47″| “సంగీత సరస్వతీదేవి సిగబంతులు ~ సింగరాచార్య సహోదరులు”|
పల్లవి॥ “నిన్నే కోరి యున్నార నెనరుంచి నన్నేలుకోరా!”
అనుపల్లవి॥ “పన్నగశయనుడౌ శ్రీ పార్థసారథి దేవ!”
చరణమ్ ॥ “సుమశరుని బారికోర్వలేరా!”
ఇది “వసంత” రాగం, ఆదితాళంలో కూర్చబడిన జగత్ప్రసిద్ధమైన “వర్ణం“. పాడేవారికేకాక, సంగీతరసజ్ఞులందరికి సుపరిచితమైనది, సుప్రియమైనది కూడాను! దీని వాగ్గేయకారుడు, తచ్చూరు పెద్దసి(శి)ంగరాచారిగారు. ఈ పెద్దసి(శి)ంగరాచార్యులుగారు, త్యాగరాజస్వామివారికి యువసమకాలీనుడు. వీరు, వీరి తమ్ముడైన అళహసింగరాచార్యులుగారు, ఉభయులూ బయకారులే! అంటే సంగీతకృతికర్తలే! అంతేకాక, సంగీత-సాహిత్యాలలో సృజనాత్మకరచనలు, శాస్త్రరచనలుచేసి సుప్రసిద్ధులైనవారు.
“గాయకపారిజాతం“, “సంగీతకళానిధి“, “స్వరమంజరి“, “గాయకసిద్ధాంజనం“, “గానేందుశేఖరం“, “గాయకలోచనం“, “భాగవత సారామృతం” లోకప్రసిద్ధిని పొందిన ప్రామాణిక రచనలని పండితులు ప్రశంసించేరు. ఈ గ్రంథాలన్నీ తెలుగు భాషలోనే సులభశైలిలో రచింపబడినవి. ఇంతేకాక, చెన్నై-తిరువళ్ళిక్కేణి నివాసులైన వీణావాదనకోవిదులు, రామానుజాచార్యులవారు రచించిన “సంగీత సర్వార్థసార సంగ్రహం” అనే గ్రంథాన్ని తచ్చూరు సోదరులు, “అనేక శాస్త్రీయ విషయాలతోను, వివిధ వాగ్గేయకారుల సంగీతరచనల ఉదాహరణలతోను పరిష్కరించి, ప్రకటించారు” అని డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు తమ సుప్రసిద్ధ “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” గ్రంథంలో వివరించేరు.
“స్వరమంజరి” ప్రాథమిక సంగీతవిద్యార్థులకోసం ఉద్దేశించబడిన ఆదర్శప్రాయమైన రచనగా పెద్దలు పరిగణిస్తారు. దానిలో, స్వరావళులు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు చేర్చబడ్డాయి. “గాయక పారిజాతం“లో, గీతాలు, వర్ణాలు, కృతులు ఉన్నాయి. “సంగీతకళానిధి” గ్రంథంలో పూర్వాధ్యాయాలలో, దక్షిణభారతశాస్త్రీయసంగీతానికి సంబంధించిన శాస్త్రవిషయాల కూలంకషవివరణ సులభశైలిలో అందించబడింది. ఇది విద్యార్థులనుండి విద్యాధికులవరకు అందరికి ప్రయోజనకరమైనది. తరువాత, భారతీయ నాట్యకళాకారులకి సంబంధించిన ప్రాథమిక వివరాలన్నీ పొందుపరచబడ్డాయి. చివరి భాగంలో దీక్షితులవారివి, త్యాగరాజుగారివి అనేక కృతులు చోటుచేసుకున్నాయి. ఆ పైన పదాలు, జావళీలు కూడా ఇవ్వబడ్డాయి. “గాయకలోచనం” గ్రంథంలో 330 కృతుల మూలరచనలని ప్రకటించడంజరిగింది. “గాయక సిద్ధాంజనం” గ్రంథంలో, రమారమి, ఒకవంద సంగీతరచనల స్వరాల కూర్పు ఇవ్వబడింది. “గానేందుశేఖరం“, 350 రాగాలకి లక్షణగీతాలని ప్రకటించిన అపూర్వగ్రంథరాజమని ఆచార్య డా. ఎస్ . రామనాథన్ గారు శ్లాఘించేరు.
“భాగవత సారామృతం” భగవద్భక్త వాగ్గేయకార చక్రవర్తులైన భద్రాద్రి రామదాసు కీర్తనలు, పురందరదాసుకీర్తనలు, త్యాగయ్యగారి దివ్యనామకీర్తనలు స్పష్టమైన స్వరరచనతోబాటు ప్రచురించబడిన గొప్ప పుస్తకము.
సింగరాచార్య సహోదరుల జీవితచరిత్రలకి సంబంధించిన వివరాలు, అంతంతమాత్రంగానే లభ్యమౌతున్నాయి. విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ఒకరైన శ్యామాశాస్త్రిగారి కుమారుడు, సుబ్బరాయశాస్త్రిగారివద్ద సహాయకుడిగా శిక్షణపొందుతున్న చంద్రగిరి రంగాచార్యులుగారికి, సింగరాచార్యసహోదరులు సన్నిహితబంధువులు. ఆ రంగాచార్యులుగారు, ఈ అన్న-తమ్ములిద్దరికి తగిన సంగీతశిక్షణని ఇచ్చినట్లు చరిత్రకారులు చెపుతున్నారు. ఆ తరువాత అన్న-తమ్ములిద్దరూ తంజావూరు సంగీతంబాణీని సర్వంకషంగా అధ్యయనంచేసేరు. వారిద్దరూ, చెన్నపట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకునివున్నా, విజయనగరంమహారాజా ఆనందగజపతి మహారాజుగారి ఆస్థానవిద్వాంసులుగానే ఉండేవారు. అందువలననే, పెద్దసింగరాచార్యులుగారు, తమ రచన “సంగీతకళానిధి” గ్రంథాన్ని, ఆనందగజపతిమహారాజుగారికి అంకితంచేసేరు. సంస్కృత, తమిళ, మరాఠీ భాషలలో ౘక్కని భాషాజ్ఞానం కలిగిన పెద్దసింగరాచార్యులుగారికి తెలుగుభాషలో సంపూర్ణ సాధికార జ్ఞానం ఉన్నందున, ఆ నాటి మదరాసుమహానగరంలోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేసేవారు.
సుబ్బరామదీక్షితులవారు తమ “సంగీత సంప్రదాయ ప్రదర్శిని” గ్రంథంలో సింగరాచార్యసోదరుల సంగీతరంగసేవనిగురించి ప్రస్తుతించడం గమనార్హం!
72 మేళకర్తల కర్ణాటకసంగీత రాగసంవిధానానికి ఇతోధికసేవచేసినవారిలో వీరిద్దరికి ప్రత్యేకస్థానంవుందని విమర్శకాగ్రేసరుల అభిప్రాయం.
ఆధునిక ముద్రణాలయాల సహాయసహకారాలని సంగీతరంగంలో సద్వినియోగం చేసిన మొదటితరం సంగీతకారులలో సింగరాచార్యసోదరులు ప్రథమశ్రేణికి చెందిన మహానుభావులు. శ్యామాశాస్త్రిగారి మూడు స్వరజతులని, త్యాగయ్యగారి ఐదు ఘనరాగ పంచరత్నకృతులని స్వరరచన అంటే Notation తోసహా ముద్రణచేయించి ప్రకటించిన ప్రప్రథములు (శి)సింగరాచార్యసహోదరులే!
ఇప్పుడు వారి రచనలనిగురించి సంక్షేప పరిచయం చేసుకుందాం.
కల్యాణి రాగం, రూపకతాళంలో, “దేవి! మీనాక్షి! ముదం దేహి మే సతతం” అనే కీర్తన, శహాన రాగం, ఆదితాళంలో, “శ్రీ శారదే! ధీవిశారదే! – – – ఈశ రమేశ సేవితే!“, అనే కీర్తన, ఈ విధంగా నాటకురంజి, శంకరాభరణం, తోడి, భైరవి, ఆనందభైరవి, బిలహరి మొదలైన అనేకరాగాలలో కీర్తనలనేకాక, జావళీలు మొదలైన ఇతర సంగీతప్రక్రియలనికూడా ప్రతిభావంతంగా నిర్వహించేరు. వారు రచించిన ౘాలా జావళీలు సంగీతసభలలో విరివిగా పాడబడడమేకాక, నాట్యవేదికలమీద ౘక్కగా అభినయంచేయబడుతున్నాయి. ఈ జావళీలు శృంగారరసప్రధానంగావున్నా, దైవపరమైన భావనతోవుండడంవలన ౘాలా మనోహరంగాను, బహుజనరంజకంగానువుంటాయి. జావళీలలో నాయకి తన ఇష్టసఖికి తన వియోగబాధనికాని, లేక తన విరహవేదననికాని విన్నవించుకోవడం ప్రధాన ఇతివృత్తమైవుంటుంది. ఉదాహరణకి తచ్చూరు సోదరుల “దేవమనోహరి రాగం“, చాపుతాళం లోవున్న ఈ సుప్రసిద్ధ జావళీని పరిశీలించవచ్చు:—
పల్లవి :—
సామినెడబాసి నేనెట్టు సైరింతునే
కోమలి! శ్రీరాజగోపాల ॥సామి॥
అనుపల్లవి :—
మరుడురమున విరిశరములనేసెనే
సరసిజాక్షి! ఇదే సమయము రమ్మనవే! ॥సామి॥
చరణము~1 :—
కలువలదొర పగ నాపై గావించెనే!
కలికిరో తమి నిలువ నా తరమటే! ॥సామి॥
చరణము~2 :—
శింగరనుతుడు మోసము చేసెగదే!
అంగనామణి! ఇపుడైనను పిలువవే! ॥సామి॥
సంగీతరంగంలో బహుముఖ ప్రజ్ఞావంతులైన తచ్చూరు శి(సి)ంగరాచార్య సహోదరులకి నతమస్తకులమై నమస్కరించుకుందాం.
స్వస్తి|
సింగరాచార్య సోదరుల గురించి న విశేషాలు ఇప్పుడే తెలిశాయి.
సంగీత మహా సముద్రం లో ఎందరో మహా రత్నాలు.
కచేరీలు చేసే వారు, వీరి రచనలు పాడే సమయాల్లో వీరి గురించి కొంచెం పరిచయ వాక్యాలు పలికితే బాగుంటుంది.
ఇన్నాళ్ళుగా అద్భుతమైన ‘వసంత’ వర్ణం వినడమే కానీ ,
అది కూర్చినది పెద సింగరాచారి గారనే విషయం ఈ వ్యాసం
చూసేదాకా తెలియదు. సంగీతానికి ఇంతటి సేవలందించిన
వీరి గురించి సంగీత విద్యార్థులకి సరే….ప్రసిద్ధ సంగీతకారులకే
తెలియకపోవడం శోచనీయం.
వారు చేసిన గ్రంథాల పరిష్కరణ ఎంతో శ్రమతో కూడుకున్నది.
కర్ణాటక శాస్త్రీయ సంగీతాభిమానులు– వారు చేసిన
మహోన్నతమైన సేవకి సదా ఋణపడి వుండాలి.
సాహితి అక్క చెప్పినట్టు , కచేరీలు చేసేవారు వారి రచనలు
పాడేముందు వారిగురించి చెప్పడం సమంజసం! సముచితం!
సింగరాచార్య వర్యుల సంగతులను,
వారి శాస్త్రీయ సంగీత వైభవమును,
తేట తెల్లమగునటుల తెలియపరచి
ముదము చేకూర్చినావయ్య హృదయమలర.