సాహిత్యము-సౌహిత్యము – 57 : అభూతిం అసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః|
09—06—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము~57″|
ఈ వారం మానవజాతియొక్క సామాజికస్థితి-గతులని అమానుషంగా శాసిస్తున్న “దారిద్ర్యం” లేక “పేదరికం” గురించిన విషయాలు సంక్షేపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
శ్రుతినుంచి ఉద్ధరించబడిన “శ్రీసూక్తమ్ ” లోని, 8వ మంత్రంలో, సాధకుడైన భక్తుడు సర్వసంపదలకి ఆశ్రయస్థానమైన లక్ష్మీదేవితో ఈ విధంగా తన వేదనని విన్నవించుకుంటున్నాడు.
“క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీః నాశయామ్యహమ్ |
అభూతిం అసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ “||
“ఆకలి-దప్పికలబాధలతోబాటు, ఆకలి-దప్పికలవలన కలిగే అనేక మాలిన్యాలు లేక దోషాలు (బాహ్యమైనవి మరియు అంతర్గతమైనవి) తో కూడుకున్న దారిద్ర్య దేవత, సర్వసంపదలకి ఆశ్రయమైన లక్ష్మీదేవియొక్క ఉనికిని నిరోధించేది ఐన జ్యేష్ఠాదేవిని నేను స్వధర్మాచరణనిర్వహణద్వారా నిర్మూలిస్తాను. అన్నివిధాలైన సంపదల లేమిని, కొరతని నా ఇంటినుండి ఓ లక్ష్మీమాతా! నీవు నశింపజేసి నన్ను అనుగ్రహించు, అమ్మా!”
ఈ జ్యేష్ఠాదేవి, అంటే దారిద్ర్యప్రేరణదేవతయొక్క ఆవిర్భావమూ, లక్షణాలూ, ఆవిడ విధులూ(portfolio) మొదలైన వివరాలన్నీ, “పద్మపురాణమ్ ” లోని ఉత్తరఖండంలో విశదంచెయ్యబడ్డాయి.
ఒక మహాకవి దారిద్ర్యాన్నిగురించి ఒక గొప్ప శ్లోకం చెప్పేరు! అది, ఇది:—
“దగ్ధం ఖాండవ మర్జునేన చ వృథా దివ్య ద్రుమైః భూషితమ్ |
దగ్ధా వాయుసుతేన హేమ రచితా లంకా వృథా స్వర్గ భూః|
దగ్ధః సర్వసుఖాస్పదశ్చ మదనో హా హా వృథా శంభునా|
దారిద్ర్యం మమ తావదీదృశమహో! కేనాపి నో దహ్యతే||”
“మహా మహిమాన్వితమైన వృక్షసమూహాలతో వర్ధిల్లే ఖాండవ వనాన్ని అర్జునుడు అనవసరంగా దగ్ధంచేసేడు. అలాగే, సువర్ణమయమైన భూతలస్వర్గం వంటి లంకానగరాన్నికూడా హనుమంతుడు నిరర్థకంగానే దహించేసేడు. ఆ పైన, శంకరమహదేవుడు వ్యర్థంగానే జీవులకి సంసారసుఖాన్నికలిగించే మన్మథుడిని భస్మీపటలం చేసేడు. అటువంటి అక్కరమాలిన పనులు చేయడంకంటె, నన్ను పట్టి పీడించే నా ఈ దారిద్ర్యాన్ని దగ్ధంచేస్తే బావుండేదికదా!”
ఈ సంస్కృత శ్లోకానికి ఇంచుమించు అనువాదంవంటి ఒక తెలుగుపద్యం కూడావుంది. అది, ఇది:—
“నరుడనువాడు ఖాండవ వనంబు వృథా దహనంబు చేసె, వా
నరవరుడైన ఆ పవన నందనుడూరక లంక కాల్చె, ఆ
హరుడు పురంబులార్చెనన, అంతియె, కాని, మహాదరిద్ర వి
స్ఫురణను కాల్చువాడొకడు భూమి జనింపకబోయె, అక్కటా!”
గోన బుద్ధారెడ్డిగారు తమ “రంగనాథరామాయణం“లో, ‘యుద్ధకాండ’లో, అందరికీ అర్థం అయ్యే రీతిలో దారిద్ర్యం లేక లేమి గురించి ఇలాగ వెల్లడి చేసేరు:-
“లేమియే నరకంబు, లేమియే రుద్ర
భూమియు, లేమియే భూరి శోకంబు,
లేమియే రోగంబు, లేమియే మృతియు,
లేమియే రాగంబు, లేమియే జ్వరము,
లేమియే కష్టంబు, లేమియే కరవు,
లేమియే దైన్యంబు, లేమియే వగపు,
లేమియే సకలమాలిన్యంబు తలప
లేమియే సర్వంబు – – – – – – – – – – “
ఇటువంటి పేదరికం అనే పెనుమహమ్మారి ఎందువలన మానవులని పట్టి పీడిస్తుందో, ఏమిచేస్తే ఈ పీడ విరగడ ఔతుందో మన పెద్దలు ఇలాగ వివరించేరు:—
“అదాన దోషేణ భవేత్ దరిద్రః దారిద్ర్య దోషేణ కరోతి పాపమ్ |
పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రో పునరేవ పాపీ”||
“కలిగివుండికూడా, కేవలం లుబ్ధత్వంవలన, లేమిలోవున్నవారికి ఎవ్వరికీ ఏమీ ఇవ్వనివాడు, దరిద్రుడై పుడతాడు. పేదరికం ప్రేరేపించడంవలన పాపకర్మని చేస్తాడు. అలాగ పాపకర్మని చెయ్యడంవలన నరకానికి వెడతాడు. మళ్ళీ దరిద్రుడుగానే పుడతాడు. మళ్ళీ పాపకర్మని చేస్తాడు.” అని చెపుతూ, అది తప్పించుకోలేని ఒక వృత్తాకార మానవజీవాత్మ యానం(an inescapable cyclical journey of a human soul)గా వర్ణించేరు.
అందువల్లే, మన తెలుగులో, వాళ్ళు “పెట్టి పుట్టేరు”, దేనికైనా “పెట్టి పుట్టాలి”, “చేసినధర్మము, చెడని పదార్థము| చేరును నీవెంట” వంటి అనేకమైన పలుకుబడులు పుట్టుకోచ్చేయి!
“బృహదారణ్యకోపనిషత్తు“లోని, పంచమాధ్యాయాంతర్గత ప్రాజాపత్యబ్రాహ్మణం లోని ప్రజాపతి తన సంతానమైన
(1)దేవ,
(2)మానవ,
(3)అసుర సంతాన పరంపరకి అందించిన ఉపదేశాలు మూడూ, వరసగా,
(1)ఇంద్రియనిగ్రహం పాటించండి,
(2)లుబ్ధత్వాన్ని విడిచి ఉన్నంతలో ఇతరులకి ఇవ్వడం అలవరచుకోండి,
(3)అందరిని కనికరంతో చూడడం నేర్చుకోండి అని ఉన్నాయి.
మానవులకి ముఖ్యబలహీనత పిసినిగొట్టుతనం. దానినుంచి బయటపడాలంటే ఔదార్యాన్ని, ఈవిని అంటే దానగుణాన్ని తప్పక అలవాటుచేసుకోవాలి. తమ భాష్యంలో జగదాచార్యదేవులైన ఆదిశంకరులు ఆదేశించినట్లు, ఈ మూడు సందేశాలు సత్త్వ-రజస్ – తమోగుణాలు మూడింటికి సంకేతంగా దేవ-మానవ-అసుర పరంపరని అర్థంచేసుకుని, మానవులందరూ మూడు ఉపదేశాలూ తమకేనని గ్రహించి ఆచరించాలి!
స్వస్తి||
బాధలందు లేమి బాధయే పెద్దగు
బ్రతుకు చితికి పెను భార మవ్వు!
కరుణ చూపి పరుల కష్టాలు తీర్చేటి
జనుల కోరు కొందు జగము నందు.
పరుల లేమి చూసి బాధనొందనివాడు
దానమియ్యకుండ దాచిపెట్టు.
లోభియైన వాడు లోకాన భారమ్ము!
కొలువ లక్ష్మి దేవి కొరత తీరు.