శారదా సంతతి — 46 : శ్రీకృష్ణాంశ సంభూత వైణ(వి)కుడు(Flutist)~శ్రీ శరభశాస్త్రిగళ్

ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః|
03—06—2018; ఆదిత్యవాసరము|

శ్రీశారదాంబికా దయాచంద్రికా|

“శారదా సంతతి ~ 46” – శ్రీకృష్ణాంశ సంభూత వైణ(వి)కుడు(Flutist)~శ్రీ శరభశాస్త్రిగళ్ (1872-1904)|

వేణుగానానికి, దక్షిణభారత శాస్త్రీయ సంగీతలోకంలో, ప్రత్యేకప్రతిపత్తినిచ్చే సభాగౌరవాన్ని ప్రప్రథమంగా కలిగించిన కారణజన్ములు శ్రీ శరభశాస్త్రివరిష్ఠులు. ఉత్తరభారత శాస్త్రీయ సంగీతప్రపంచంలో, వేణువుకి ఏకైకవాద్యసభాపూజ్యతని, శ్రీ పన్నాలాల్ ఘోష్ 20వ శతాబ్ది ప్రధమార్థంలో కలగజేసేరు. కాని శరభశాస్త్రిగారు, అటువంటి తమ పునీత జీవిత కర్తవ్యాన్ని 19వ శతాబ్ది చివరి చతుర్థపాదంలోనే మహాపూర్ణమయ వైభవంతో పూర్తిచేసేరు. అంతకిముందు, వేణువు, ముఖ్యంగా, నాట్యప్రదర్శనలలోను, దేవాలయసేవలలోను మొదలైన కొన్ని సందర్భాలలోను, సహకారవాద్యంగా మాత్రమే పరిమిత ప్రయోగ యోగ్యతని కలిగి వాయించబడేది. శరభశాస్త్రిగారి అపార సంగీతవిద్యావైదుష్యమూ, అమేయ సృజనాత్మకశక్తి, వారి వాద్య-వాదన కౌశలప్రతిభ, వారి అనంత గురుభక్తి మొదలైన గొప్ప గుణాలు వేణువుయొక్క ఆధునిక సంగీతజీవితానికి సరిక్రొత్త ఊపిరులు ఊదేయి. ఏకైక ప్రత్యేక వాద్యప్రతిపత్తి(solo-performance-musical instrument) ని, వేణువుకి, దక్షిణభారతసంగీతవేదికలపైన కలగజేసిన మహానుభావులు శ్రీ శరభశాస్త్రిగారే!

శరభశాస్త్రిగారు 1872వసంవత్సరంలో, కుంభకోణంలో, అష్టసహస్ర(ఎనిమిదివేల) శాఖకిచెందిన తమిళబ్రాహ్మణకుటుంబంలో జన్మించేరు. ఆయనకి రెండేళ్ళప్రాయంలోనే అంధత్వం కలగడం, వారితండ్రిగారిని అమితంగా బాధించింది. కాలానుగుణంగా, కొడుక్కి పదేళ్ళు వచ్చేయి. కొడుకు భవిష్యత్తుకి సుందర-సుస్వర ప్రణాళికని రచించపూనుకున్న తండ్రిగారిని, పెరటిలోని వేణుకుంజం(వెదురుపొద), విమలహృదయంతో పిలిచింది. ఆ ఆత్మీయమైన ఆహ్వానంలోని ఆంతర్యరసభావాన్ని అంతలోనే ఆనందంగా అందుకున్న తండ్రిగారికి, తగినంత వ్యాసవైశాల్యం(diametrical space) కలిగివున్న, ఆ వెదురుపొదలోని, శ్రీకృష్ణవేణువుయొక్క వారసత్వ సంపద పొందిన ఒక సన్నని వెదురు చువ్వ(వేణు యష్టి), దధీచిమహాముని పరమానుగ్రహానికి పాత్రమైనట్లుగా, తనని తాను శరభశాస్త్రిగారి పెదవుల స్పర్శతోను, వ్రేళ్ళ సాహచర్యంలోను తరింపజేసుకోవడానికి, ఆత్మసమర్పణ తాదాత్మ్యభావంతో, ఆయన చేతిలోకి చేరింది. దాని సర్వ అర్హతలనీ గ్రహించిన ఆయన, దానిని పొదనుండి జాగ్రత్తగా వేరుచేసి, ౘక్కని సంగీతవాదనానికి అనువైన వేణువుగా రూపుదిద్ది, తన ప్రియపుత్రుడి సంగీతామృతమయ హస్తాలలో దానినిపెట్టి, పదేళ్ళ ప్రాయమున్న అతడికి ఆ మురళితో, నిరంతర వేణుగాన విద్యామైత్రిని కూర్చేరు.

దానిని ఆప్యాయంగా అందుకున్న మరుక్షణమే శరభశాస్త్రిగారు, ఆ మురళిని ఆనందంతో ఊదడం ప్రారంభించేరు. జన్మాంతర సఖ్యఫలమేమో అన్నట్లు, ఆ మురళి, శరభశాస్త్రిగారి చేతులలో ఒదిగిపోయి, ఆయన ఊదడం ప్రారంభించడం తరవాయిగా తాను పరవశించిపోవడమే కాకుండా, వారి హృదయగత సంగీత మాధురీఝరిని, శ్రోతల రసమయ మనఃకేదారాలలో అనతికాలంలోనే అలవోకగా ప్రవహింపజేసి,వారందరినీ పరవశింపజేసేది. తండ్రిగారు తాను నేర్పగలిగిన అభ్యాస సంగీతాన్ని ౘక్కగానేర్పించేరు.

ఆ పైన, మంచి పారంపరిక దక్షిణభారత సంగీత విద్యా కోవిదుడిగా శాస్త్రిగారిని తీర్చిదిద్దే బాధ్యతని, తండ్రిగారు, మానాంబుౘావడి వేంకట సుబ్బయ్యగారికి అప్పజెప్పేరు. అత్యల్పకాలవ్యవధిలోనే, శాస్త్రిగారు, సుబ్బయ్యగారివద్ద అద్భుతవిద్యాశుశ్రూషచేసి, అనేకరాగాలలోవున్న వివిధ త్యాగరాజకృతులని, కీర్తనలని నిర్దుష్టంగాను, అనితరసాధ్య అవగాహనాశక్తితోను నేర్చుకున్నారు. చిన్న వయస్సునుంచే గురువుగారి ఆశీర్వచనబలంతో స్వతంత్రంగా కచేరీలుచేసి, యశస్సుని ఆర్జించేరు.

వారి సంగీతవిద్యాప్రతిభ, వారి వేణుగానకళా ప్రాభవము వాఙ్మయ వర్ణనాప్రజ్ఞకి అందే విషయాలుకావు. వారికి మధురమైన కంఠం ఉండేది. వారి సంస్కృతభాషా వైదుష్యం అకళంకమైనది. వారు వాయులీన, మృదంగ విద్యలలో ఆరితేరిన కోవిదులు. ఆ వాద్యాలమీద సభలలో కచేరీలు చేయగల సామర్థ్యం ఉండేది. సంస్కృతం, తమిళం, తెలుగు, మరాఠీ భాషలలో అనర్గళ పాండిత్యం ఉండేది. సంస్కృతభాషలో కృతినిర్మాణదక్షతతోబాటు, సభలలో సంస్కృతోపన్యాసాలు ఇవ్వగలిగిన స్థాయిలోవుండేవారు.

వారి వేణుగాన ప్రతిభని వర్ణిస్తూ, “పద్మభూషణఆచార్య పి. సాంబమూర్తిగారు ఇలాగ వివరించేరు:—

“వారి మనోహరమైన వేణువునుండి ప్రవహించే సంగీతశ్రావ్యత మధురంగాను, ఆనందదాయకంగాను ఉండేది. శ్రోతల మనస్సులని దోచుకునే వారి వేణునాదంలో దివ్యత్వం గోచరించేది. వారి వేణుగానంలోని లయభావశక్తిని గ్రహించినవారికి, శాస్త్రిగారు, నటరాజస్వామివారి నాట్యానికి మృదంగంవాయించే చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో పుట్టినవారేమో అనిపించేది. వారి సమకాలికులైన తాళకళతెలిసిన మహానుభావులు పళని ఘటం కృష్ణయ్యరు, కంజీరా మాముండియా పిళ్ళై, దక్షిణామూర్తి పిళ్ళై, తిరువైయార్ సుబ్రహ్మణ్య అయ్యర్ , తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్ , తిరుమరుగల్ నటేశ పిళ్ళై, ఎట్టైయాపురం రామచంద్రభాగవతర్ , వీరందరూ ఏక కఠంతో, ‘తాళజ్ఞానంలోను, తాళప్రయోగవైదగ్ధ్యంలోను, ఈ రెండింటిలోను శరభశాస్త్రివర్యులతో సమానమైనవారెవ్వరూలేరు’ అని ప్రకటిస్తూ ప్రశంసించేరు”.

త్యాగరాజకృతులని నిష్కళంకమైన నైగనిగ్యంతో వేణువుపైన పలికించడానికి ఆయనకి ఆయనే సాటి. అటువంటి పూర్ణప్రజ్ఞని సాధించడానికి ఆయన, ఉమైయాళ్పురం సోదరులుగా లోకప్రసిద్ధిపొందిన కృష్ణభాగవతరు, సుందర భాగవతరు, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుల ప్రశస్తమైన గాయనశైలిని అనుసరించేవారు.

కచేరీలలో వారు వేణువుని వాయిస్తూన్నసమయంలో, సరిక్రొత్తసంగతులు, అప్పటికప్పుడు స్ఫురణకివస్తే, ఆ సంగతులని ఆయన అంతకుముందు ఎంతో సాధనచేసినంత నైపుణ్యంతో అలవోకగా ప్రయోగించేసేవారు. అటువంటి సంగతులు అనుపమానమైన అపురూప అందాలని ఆ కృతులలో అలంకరించి, రసజ్ఞశ్రోతలని మైమరపింపజేసేవిట.

వారి సహజసంగీతకోవిదత అమోఘమైనది. వారి వేణువుపైన వారు సాంకేతిక స్వరప్రయోగ నైపుణ్యం ప్రదిర్శించడంకన్న, కృతులలో నిబిడీకృతమైన సాహిత్యభావానికి ప్రాధాన్యతనిస్తూ వాయించడంవలన, వారి వాద్యవాదనకళ గాత్రధర్మానికి అత్యంత సన్నిహితంగావుండేదిట! మోహనరాగంలోని త్యాగరాజకృతి, “భవనుత”ని వాయించేసందర్భంలో వారి కల్పనాస్వరప్రయోగం సన్నజాజిపూల సున్నితపుౙడివానలాగ అంత సుకుమారంగాను, సులలితంగాను, సుమనోహరంగాను ఉండేదిట!

వారి వివిధరాగ-విభిన్నకృతినిధి లెక్కకి మిక్కుటంగావున్నా, వారు సర్వజన సంతోషకరమైన రాగాలని, కృతులని ఎక్కువగా వాయించేవారట!

ఆయన కూర్చిన సంగీతరచనలలో పరమానందకరమైన భావగరిమ ఉండేదట! 63 నాయన్మారులమీద, మరాఠీ-తమిళ భాషలలో సుమారు ఐదువందల కథాప్రధానమైన కీర్తనలని రచించేరట. సూలమంగళం వైద్యనాథభాగవతర్ గారు తమ నాయనార్ల “కథాకాలక్షేపం” కార్యక్రమాలలో, వాటిని విరివిగా పాడి, వ్యాఖ్యానించి, సభాసదులని భక్తిరసంలో ఓలలాడించేవారట!

వేణుగానశిరోమణిపల్లడం సంజీవరావుగారు, అష్టపుత్ర వెంకటరామశాస్త్రిగారు వారి శిష్యులలో పేరెన్నికగన్నవారు.

ఇప్పుడు, వారినిగురించి లోకప్రసిద్ధిపొందిన కొన్ని గొప్ప ముచ్చటలని తెలుసుకుని, సంతసిద్దాం:—

చెట్టినాడులోని కోనపట్టులో శరభశాస్త్రిగారు, వైద్యనాథభాగవతరుగారి వాయులీనం, పళని కృష్ణయ్యరుగారి ఘటం సహకారవాద్యాలతో, తమ వేణుగానం కచేరీని నిర్వహించేరట. ఆ సభలో తోడిరాగం ఆలాపనని విపులవైవిధ్యంతో వినిపించేరట! ఆ కాలంలో సుప్రసిద్ధ నాగస్వరవిద్వాంసుడు, తిరుమరుగళ్ నటేశన్ గారు, ఒక శ్రోతగా ఆ సభలోవున్నారు. ఆలాపన పూర్తికాగానే, నటేశన్ గారు, “ఆహా! పరమాద్భుతం! తోడిరాగాన్ని ఇంత అలౌకికమాధుర్యంతో ఇంకెవరు వాయించగలరు?” అన్నారట! సభానంతరం శాస్త్రిగారిని వారి బసకి దిగబెట్టడానికివెడుతూ, దారిలో, నటేశన్ గారు మళ్ళీ తమంతతామే ఆనాటి తోడి ప్రస్తావనని తెచ్చి, “అయ్యా! శాస్త్రిమహాశయా! ఈ రోజు నా అంతరాంతరాలనన్నీ కదిలించిన మీ మహామహిమాన్విత సంగీతం విన్నాక, నాబోటివారు సంగీతరంగంలో కొనసాగాలనుకోవడం దుస్సాహసమే!” అని అన్నారట!

శరభశాస్త్రిగారు ఏక’సంత’గ్రాహి! అంటే, ఏదైనా ఒకసారివింటేౘాలు, దానిని పట్టేసేవారు! ఒకసారి, సూలమంగళంగ్రామంలో, మేరట్టూరు వేంకటరామశాస్త్రిగారి యక్షగానం “ప్రహ్లాదచరిత్రం” మొదటినుంచి చివరివరకు పూర్తిగా శరభశాస్త్రిగారు విన్నారట! మరునాడు ఉదయం ఆ యక్షగానం మొత్తాన్ని, పాటలు-పద్యాలుతోసహా, ఎలావున్నది అలాగ వైద్యనాథభాగవతరుగారికి, వారి బంధు-మిత్రుల సమక్షంలో, శరభశాస్త్రిగారు ౘక్కగా పాడి వినిపించేరట!

ఒకసారి, ఒకపెళ్ళికి సంగీతసభలు నిర్వహించడానికి, ఉమైయాళ్పురం కృష్ణభాగవతర్ని, శరభశాస్త్రిగారిని ఆహ్వానించేరట! ముందురోజు రాత్రి, ఉమైయాళ్పురం కృష్ణభాగవతరుగారు, తమ కచేరిలో, సారంగరాగం, ఝంపతాళంలో, “నీవాడ నే గాన నిఖిలలోక నిదాన!” అనే త్యాగరాజకృతిని, రమ్యమధురంగా పాడి రసహృదయులనందరినీ ఆనందడోలికలలో ఓలలాడించేరట! మరునాడు రాత్రి శరభశాస్త్రిగారి వేణుగానసభ! అంతవరకు, శాస్త్రిగారు ఆ సారంగరాగకృతిని కనీసం ఒక్కసారైనా వినలేదట! కాని ఆ కృతి శాస్త్రిగారి మనస్సుకి ఎంతగాఢంగా పట్టేసిందంటే, వారి సభలోఆ కృతిని పరమ మనోరమంగా శాస్త్రిగారు తమ మహామధురవేణుగానంలో వినిపించేసరికి, సరసమనస్కులైన సదస్యులేకాక, కృష్ణభాగవతరుగారుకూడా ఆ వేణుగాన మాధుర్యానికి పరవశించిపోయి, “అయ్యో! ఇంత రసరమ్యంగాను, ఇంత అద్భుతమైన నగిషీ పనితనంతోను, ఇంత ముచ్చటగొలిపే మురిపెమైన రాగ-సాహిత్య సమైక్యభావుకతతోను కూడిన వారి కృతియొక్క ఆవిష్కరణని స్వయంగా చూసి ముగ్ధులైపోవడానికి, మా గురుదైవమైన త్యాగరాజస్వామివారు భౌతికంగా మనముందు లేకపోయేరుకదా!” అంటూ పదే-పదే వాపోయేరుట!

శరభశాస్త్రిగారు తమ వేణువుమీద “పున్నాగవరాళి”రాగం వాయిస్తే, చుట్టు-ప్రక్కలనుండి, త్రాచుపాములు వచ్చి పడగవిప్పి విని, లయాత్మకంగా రాగభావానికి అనుగుణంగా నాట్యంచేసి, శాస్త్రిగారు రాగగానం ముగించగానే ఎవ్వరికీ ఏవిధంగానూ హానిచెయ్యకుండా, వాటి నివాసస్థానాలకి అవి భద్రంగా వెళ్ళిపోయేవట! ఒకసారి, ఒక వివాహసందర్భంలో శరభశాస్త్రిగారు, తమ వేణుగానసభని నిర్వహించడానికి వెళ్ళేరు. శాస్త్రిగారి వేణుగానం, వారిప్రతిభ అప్పటికే దశదిశల వ్యాపించింది. సంగీతసభలోనేవున్న పెండ్లికూతురు వేణుగానం గురించిన సరయిన అవగాహనలేకపోవడంవలన, “ఈ కాస్త వెదురుగొట్టంనుంచి అంత గొప్ప సంగీతం ఎలాపుట్టుకొస్తుందో!” అన్నట్లుగా శాస్త్రిగారి వేణువుని అపహాస్యంచేసిందట! సాక్షాత్తూ శారదాస్వరూపంగా వేణువుని సుమారు రెండు దశాబ్దాలనుంచీ ఆరాధించుకుంటూన్న శరభశాస్త్రిగారి సున్నితమైన హృదయానికి ఆ పలుకులు ములుకులుగా గుచ్చుకున్నాయట! వారు మనసులో బాధపడి, తమ వేణువులోని నాదచైతన్యస్ఫూర్తికి, “వేత్తి గానరసం ఫణీ” (గానరసమాధుర్యం రుచి పాముకి తెలుసు!) అనిచెప్పబడినట్లు, త్రాచుపాములు స్పందించడం ఆయనకి అనుభవంలోవున్న విషయమే కనుక, కచేరి ఉత్తరార్థంలో “పున్నాగవరాళి” వాయించడం ప్రారంభించేరట!దగ్గరలోనేవున్న త్రాచుపాము శరభశాస్త్రిగారిముందు కూర్చుని, తలెత్తి, పడగవిప్పి, పాటని వింటూ, లయని అనుసరించి అద్భుతంగా నాట్యంచేసిందట! సభావరణలోవున్న వధువుతో సహా, అందరూ ౘాలా భయపడిపోయేరట! ఇంతలో, శాస్త్రిగారి సన్నిహితులొకరు, వారిదగ్గరకివెళ్ళి, వారి చెవిలో మెల్లిగా అక్కడ-అప్పుడు ఉన్న సన్నివేశం సూచించేరట!శాస్త్రిగారు క్రమంగా రాగాన్ని, లయానుగుణంగా పరాకాష్ఠకి తీసుకునివెళ్ళి, మరల క్రమంగా రాగ-లయాదుల ఉపసంహారం చేసేరట! అది జరిగినవెంటనే, త్రాచుపాము తన నెలవుకి తృప్తితో వెళ్ళిపోయిందట!

ఒకసారి, మదరాసునగరం, తిరువళ్ళిక్కేణి దివ్యక్షేత్రంలో వేంచేసివున్న శ్రీపార్థసారథిస్వామివారి ఆలయమహోత్సవాలలో భాగంగా, పల్లకిలో, స్వామివారి పెద్ద ఊరేగింపు మహాకోలాహలంగా జరుగుతోంది. ఆ దివ్యోత్సవానికి తిరుమరుగళ్ నటేశపిళ్ళైగారు, వారి బృందం, డోలు-సన్నాయి వాయిస్తున్నారు. ఊరేగింపు సింగరాచారివీధిలో కొనసాగుతోంది. నటేశపిళ్ళైగారు అద్భుతంగా తోడిరాగంలో, “రాజువెడలెc జూతాము-రారె కస్తూరిరంగ” అనే త్యాగరాజకృతిని వాయిస్తున్నారు. ఆ సమయంలో, పిళ్ళైగారి సహవాదకుడు, వారిచెవిలో మహామంత్రంలాంటి ఒకమాటని ఊదేడు. అక్కడికి దగ్గరలోనే ఒకచోట, శరభశాస్త్రిగారి కచేరి జరుగుతోందని చెప్పేడు.శాస్త్రిగారి వేణుగానానికి మహాభిమాని ఐన నటేశపిళ్ళైగారు, తన చేతిలోని సన్నాయిని తన సహాయకుడి చేతిలోపెట్టి, త్వరలోనే తిరిగివచ్చేస్తానని హామీయిచ్చి, శాస్త్రిగారి కచేరీని వినడానికి వెళ్ళిపోయేరు. తీరా సంగీతసభలోకి వెళ్ళి అక్కడకూర్చుని, శాస్త్రిగారి వేణుగానం వినడం ప్రారంభించిన నటేశులవారు పూర్తిగా ఆ నాదరసధునిలో మమైకం ఐపోయి అక్కడేవుండిపోయేరు. ఊరేగింపునుంచి కబురు వచ్చేవరకు ఆయనకి బాహ్యస్పృహలేదు. వేణుగానంలోనే లీనమైపోయి అక్కడి కచేరీలో ఆయన ఉండిపోయేరంటే, మహాకళాకిరుడికి-మహారసజ్ఞుడికి సహజంగావుండే రసానుబంధాన్ని, ఈ అద్భుతసంఘటన ప్రకటిస్తోంది.

32 సంవత్సరాల వయస్సులోనే తనువు ౘాలించి శ్రీశారదాంబికాదేవిలో లీనమైపోయిన శరభశాస్త్రివర్యులకి సాష్టాంగదండప్రణామం సమర్పించుకుందాం.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. Sampathkumar ghorakavi says:

    namaskaram guruvugaru. great person.

  2. సి.యస్ says:

    దివ్య శక్తులున్న దివ్యాంగుడే కాదు,
    వేణు వాద్యమునకు వెలుగు దారి.
    వయసు చిన్న నాడె వన్నెకెక్కినవాడు,
    శారదా తనయుడు శరభ శాస్త్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *