సాహిత్యము-సౌహిత్యము – 56 : నీ చరణాబ్జంబులు నమ్మినాను, జగదీశా! కృష్ణ! భక్తప్రియా
ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః|
02—06—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము~56″|
ఈ వారంకూడా “తెలుగు చాటువు” నుంచి మరొక మాణిక్యాన్ని మన్ననతో ఎన్నికచేద్దాం! 1220~1280 సంవత్సర వ్యవధికి చెందిన “ఆంధ్రమహాభారతం” రచించిన కవిత్రయంలో ఒకరైన తిక్కనసోమయాజిగారి చాటుపద్యంగా ప్రసిద్ధి పొంది, తరతరాలనుంచి తెలుగువారి నోట నానుతున్న భక్తిభావభరితమైన ఒక పద్యం పరిశీలిద్దాం! మత్తేభవిక్రీడితం ఛందస్సులోవున్న ఆ పద్యం ఇదే:—
మ.॥
“అరయన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై,
నరుపై, ద్రౌపదిపై, కుచేలునిపయిన్ , నందవ్రజశ్రేణిపై,
పరగన్ కల్గు భవత్ కృపారసము, నాపై కొంత రానిమ్ము, నీ
చరణాబ్జంబులు నమ్మినాను, జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”
“విశ్వానికంతటికి ప్రభువువైన, భక్తజనులయందు అమితవాత్సల్యము కలిగిన ఓ శ్రీకృష్ణా! ౘక్కని సంప్రదాయజ్ఞులైన పెద్దలనుంచి, ఇతిహాస పురాణాదులనుంచి నాకు తెలిసిన విషయాన్ని నీకువిన్నవించుకుంటున్నాను. ఇది విని నన్ను అనుగ్రహించు స్వామీ! నీ మహాభక్తులైన భీష్ముడు, విదురుడు, అక్రూరుడు, కుబ్జ, అర్జునుడు, ద్రౌపది, కుచేలుడు, సుందరబృందావనవాసులైన గోప-గోపీజనులు (మొదలైనవారు అందరి) పైన ౙాలువారిన నీ అపారకృపారసాన్ని, (నా అర్హతనిబట్టి, మరీ అంత ఇబ్బడి-ముబ్బడిగా కాకపోయినా) నాపైనకూడా ఎంతోకొంత ప్రసరింపజేసి, నన్నుకూడా వారిలాగనే ధన్యుడినిచెయ్యి ప్రభూ! నాకు నీ పాదపద్మాలు తప్ప వేరే గతిలేదని నిన్నే త్రికరణశుద్ధిగా నమ్ముకుని, నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాను అనే విషయం నీకు తెలుసుకదా, మహాప్రభూ!”
ఇది అవ్యాజ అనన్య భక్తి. ఇటువంటి భక్తిని కలిగిన పెద్దలందరూ తరించినట్లు రామాయణ, మహాభారత, భాగవతాది పరమప్రామాణిక గ్రంథాలు చెపుతున్నాయి.
“శ్రీమద్భాగవతమహాపురాణమ్ “, ఏకాదశస్కంధంలోని, 14వ అధ్యాయంలో, 19వ శ్లోకంలో శ్రీకృష్ణభగవానులు, ఉద్ధవులవారిని ఉద్దేశించి ఇలాగ ప్రకటించేరు:—
“న సాధయతి మాం యోగః, న సాంఖ్యం, ధర్మ ఉద్ధవ! |
న స్వాధ్యాయః, తపః, త్యాగః, యథా భక్తిః మమోర్జితా”||
“ఓ ఉద్ధవా! నాయందలి పరమమైన భక్తి నా ఉత్తమ సాధకులకి నన్ను వశం చేసినంత సమగ్రంగా, యోగ, సాంఖ్య, వేదవిహిత కర్మానుష్ఠాన, సాంగవేదాధ్యయన, తపశ్చర్య, సన్న్యాసాశ్రమ స్వీకారాది వివిధ అధ్యాత్మవిద్యామార్గాలు ఆయా సాధకులకి నన్ను వశంచేయలేవు!”
అంటే భగవానుడి సందేశంప్రకారం, భక్తియోగానికి, భక్తియోగానుసారి ఐన భగవద్భక్తుడి సాధనకి అంతటి ఔత్కృష్ట్యం, ఉత్తమఫలప్రదాయకశక్తి ఉన్నాయి అని తేటతెల్లం ఔతోంది!
ఇప్పుడు, కొంత హాస్యరసప్రధానవిషయంలోకి వెడదాం! హాస్యం నవరసాలలో ఒకటికదా! అందునా తెలుగువారికి ౘాలా తీయనైన రసం. ఈ హాస్యరసాన్ని అనేకరకాలుగా కవులు పుట్టించేరు. దానిలో “అనుకరణ” ఒకటి! అనుకరణ అనేది అసలు జీవలక్షణం. అనుకరణలేకుండా మానవజీవితమేలేదు. ఐతే సాహిత్యంలో ఈ “అనుకరణ”ని ౘక్కగా మోతాదుకి మించకుండా చేసే ప్రక్రియనే ఆంగ్లంలో parody లేక “పేరడీ”/”హాస్యానుకరణము” అనవచ్చు. తిక్కనగారి చాటువు, “అరయన్ శంతను పుత్రుపై – – – ” పద్యానికి ఒక హాస్య అనుకరణ(parody) పద్యంవుంది. ఆ పద్యంలో తెలుగువారికి ప్రియమైన ప్రాతఃకాలపానీయం “కాఫీ” అల్పాహారశాల(restaurant)లో అల్పాహారాలుసేవించే ఒక అల్పాహారప్రియుడితో ఇలాగ మొరపెట్టుకుంటోంది:-
“వడపై, ఆవడపై, పకోడిపయి, హల్వా, కోవపై, కారపున్
పొడిపై, చట్నిలపై, రవిడ్డిలిపయన్ , బోండాపయన్ , జాంగిరీ
సుడిపై, పారు భవత్కృపారసము ఇచ్చోకొంత రానిమ్ము, నే,
ఉడుకున్ కాఫిని, ఒక్కగుక్క కొనవే! ఓ కుంభలంబోదరా!”
“ఓ బానపొట్ట భోజనప్రియమహోదయా! ఈ అల్పాహారశాలలో నీ నోరు ఊరించే గారె, పెరుగువడ, పకోడీ, హల్వా, పాలకోవా, కారప్పొడి, రకరకాల చట్నీలు, రవ్వ ఇడ్లీ, బోండా, జహంగీరు చక్రం మొదలైన తినుబండారాలమీద నీవు కనపరిచే ప్రీతిలో కాస్తంతైనా నామీద ప్రసరింపచేసి, పిసరంత ఖాళీని, నీ కడుపులో నా కోసం కేటాయించివుంచుకో! నేను పొగలూ-సెగలూ చిమ్ముతున్న వేడి-వేడి కాఫీని! చిట్టచివరగా నన్నుకూడా ఒకటో, రెండో గుక్కలు పట్టిస్తేనే నీ అల్పాహారసేవావ్రతానికి ఒక సార్థకత, సంపూర్ణత కలుగుతాయి స్వామీ!”
స్వస్తి|
Atyadhbhutam guruvugaru. Namaskaram.
ప్రార్థనా పద్యంలా చదువుకోవడానికి ఎంత
భక్తిమయంగా వుందో…ఈ పద్యం. తిక్కనగారి
కవితా మాధుర్యం ఈ పద్యంలో తొణికిసలాడుతోంది.
గట్టిగా రెండుసార్లు చదివితే నోటికి వచ్చేసేంత అందమైన
నడకతో సాగింది.
ఈ పద్యం చదువుతుంటే పోతనగారి భాగవతంలోని
“ఆదిన్ శ్రీసతి కొప్పుపై , తనువుపై …అనే పద్యం జ్ఞాపకానికి వస్తోంది.
ఇక ఈ పద్యానికి హాస్యనుకరణం చేస్తూ చెప్పిన పద్యం
నిజంగా హాస్యస్ఫోరకంగా ఉంది. దానికి నీ భావ వివరణ పసందుగా
ఉంది.
మహాకవి తిక్కన గారి చాటు పద్యముల గ్రంధము పేరు?.. దయచేసి తెలియ జెప్పండి ..నమస్సుల