శారదా సంతతి — 45 : వేలాది వైణికుల కులంలో ఏకైక విలక్షణవిద్వత్కళాకారుడు— వీణ వెంకటరమణదాసు

ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః|
27 : 05 : 2018; ఆదిత్యవాసరము|

శ్రీశారదా దయా చంద్రిక|

“శారదా సంతతి ~ 45″| వేలాది వైణికుల కులంలో ఏకైక విలక్షణవిద్వత్కళాకారుడు— వీణ వెంకటరమణదాసు(08-02-1866 నుండి 28-02-1948)

సర్వవిద్యా సరస్వతీ నిలయంగా చరిత్రలో ప్రసిద్ధిపొందిన ఉత్తరాంధ్రప్రాంతంలోని విజయనగరం ఎందరో శారదాదేవి అపురూపమైన బిడ్డలకి కన్నతల్లీ, పాలిచ్చి పోషించినతల్లీ కూడాను! అటువంటి శారదాతనయులలో జగద్విఖ్యాతిని ఆర్జించిన మహామహులలో ఒకరు “వీణ వెంకటరమణదాసుగారు”. వారు విజయనగరంలో, చాంద్రమాన, క్రోధన సంవత్సర, మాఘబహుళ అష్టమి రోజున, విశాఖ నక్షత్రంలో, అంటే, 08-02-1866, గురువారంనాడు జన్మించేరు. వారు మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో, శౌనకగోత్రంలో పుట్టేరు. వారి తండ్రిగారి పేరు, చిన్న గురురాయాచార్యులుగారు. తల్లిగారి పేరు, లక్ష్మీనరసమ్మగారు.  సుప్రసిద్ధ భైరవిరాగ-అటతాళ-వర్ణం, “విరిబోణి” సాహిత్య-స్వర రచయిత పచ్చిమిరియం ఆదియప్పయ్యగారు వారి వంశపూర్వజులే!

వీణ వేంకటరమణదాసుగారి తాతగారు, మైసూరు వీణ శేషన్నగారి తాతగారు స్వయంగా సహోదరులే!

వేంకటరమణదాసుగారి వంశంలో ముందు ఏడుతరాలనుండి సంగీతకళాకారుల పరంపర వర్ధిల్లుతూవచ్చింది.

ఆనందగజపతి మహారాజావారు ప్రాచీన భారతీయ సంస్కృతియందు పరమప్రీతి కలవారు కావడంచేత, వారి ఆస్థానంలో వివిధరంగాలలో ఆరితేరిన మహాప్రజ్ఞావంతులైన పండితులు ఉండేవారు. సంగీతరంగంలో, ఆ కాలంలో, మహానుభావులైన గురురాయాచార్యులవారు, దూర్వాసుల సూర్యనారాయణశాస్త్రిగారు, వీణ వెంకటరమణదాసుగారు, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు, కళాప్రపూర్ణ ద్వారం వేంకటస్వామి నాయుడువర్యులు మొదలైనవారంతా విజయనగర ఆస్థాన విద్వత్కళాకారులే!

వీణని వాయించే పద్ధతులుప్రధానంగా రెండు విధాలుగా ఉంటాయి. మొదటిది, “శయనవీణాపద్ధతి” (Horizontal way of playing Veena); రెండవది, “ఊర్ధ్వవీణాపద్ధతి” (Vertical way of playing Veena). మొదటి పద్ధతి, మనం తరచుగా సభలలో కళాకారులు వాయిస్తూండగా గమనించిన విధానం. ఈమని శంకరశాస్త్రిగారు, చిట్టిబాబుగారు, బాలచందర్ గారు, దొరైస్వామి అయ్యంగారు, గాయత్రిగారు మొదలైనవారు ఇలాగ వీణని అడ్డంగా పట్టుకుని వాయిస్తారు. రెండవ పద్ధతిలో వీణని నిలబెట్టి వాయిస్తారు. వీణ వేంకటరమణదాసుగారు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రిగారు, మంచాళ జగన్నాథరావుగారు మొదలైన కళాకారులు, వీణని నిలబెట్టి వాయిస్తారు.

దాసుగారు రోజూ పది-పన్నిండు గంటల తీవ్ర అభ్యాసంచేసేవారు. రోజూ, నాలుగు కాలప్రమాణాలలోను, మూడు స్థాయిలలోను సంగీతాభ్యాసం నిరంతరాయంగా జరిగేది. వివిధతానాలని, వేరు-వేరు కూర్పులతో, భిన్నలయప్రమాణాలలో అనుదినమూ అభ్యాసంచేసేవారు.

దేహారోగ్యంకోసము, శరీరసౌష్ఠవంకోసము దైనిక దేహవ్యాయామం విధిగా చేసేవారు. వారి కుడి చేయి టెన్నిసు ఆడే అంతర్జాతీయ ప్రథమశ్రేణి క్రీడాకారుడి కుడి చేయిలాగ బలిష్ఠంగావుండేదని, ప్రొఫెసర్ పి. సాంబమూర్తిగారు వ్రాసేరు.

రోజూ సంగీతాభ్యాసానికి, శరీరవ్యాయామానికి తగిన సమయం కేటాయించుకుని, సకాలంలోనే, సంధ్యోపాసనా అనుష్ఠానాన్ని, నిత్యదేవతార్చనవిధిని ౘక్కగా నిర్వర్తించుకునేవారు.

వారి వీణావాదనంలో మూడు ముఖ్యాంశాలు రసజ్ఞశ్రోతలని ఆకట్టుకునేవి. అవి,
(1) వారి వీణావాదనంలో అత్యద్భుతంగా ఉత్పన్నమయ్యే గాఢనాదవిభవం,
(2) ఊహాతీతమైన వారి వాదనలోని వేగతీవ్రత,
(3) సంగీతసృజనాత్మకమైన వారి అమేయ భావ ఔజ్జ్వల్యం.

భైరవి” రాగంలోని, “కొలువైయున్నాడే” అనే త్యాగరాజస్వామివారి కృతి,  “కాంభాజి” రాగంలోని, “సుబ్రహ్మణ్యాయ నమస్తే” అనే ముద్దుస్వామిదీక్షితుల కృతి, వేంకటరమణదాసుగారి వీణావాదననైపుణిలో, విలంబిత-మధ్య-ద్రుత లయలలోను, అంటే మూడుకాలాలలోను, సుస్పష్ట స్వర సౌష్ఠవ ప్రయోగ వైదగ్ధ్యంతో అలరారేవి అని సాంబమూర్తివర్యులు వక్కాణించేరు.

ఆనందగజపతి మహారాజావారు, వెంకటరమణదాసుగారు రాజుగారికోటలో, ఎదురెదురుగా కూర్చుని, 19 సంవత్సరాలపాటు, వీణావాదనం చేసుకునేవారట! సంగీతసహచరులైన వీణ వేంకటరమణదాసుగారికి, రాజావారు, సొంతఇంటినేకాక, మంచి పంటపొలాలనికూడా పారితోషికంగా ఇచ్చేరట!

ఇరవయ్యవశతాబ్ది ఆరంభంలో, కర్జను ప్రభువు, వీణ వేంకటరమణదాసుగారికి, ఘనమైన సమ్మానంచేసి, ఆ వీణావాదనకోవిదుడి కళాకౌశలాన్ని పదే-పదే సభాముఖంగా కొనియాడి, “సువర్ణ సింహతలాటం” వారి చేతికి తొడిగేరు. అనేక సభలలో అనేక సమ్మానాలు, బహుమానాలు ఆయన పొందేరు. ఆ బహుమతులన్నీ విజయనగరంలో వారి ఇంట ఉండేవి.

ఆయన వీణావాదన నైపుణ్యంలో ఆరు విశిష్టలక్షణాలు ఉన్నాయని విశ్వవిఖ్యాత సంగీతవిద్యాకోవిదులైన “పద్మభూషణఆచార్య పి. సాంబమూర్తి గారు గమనించి, వాటిని ఈ క్రిందివిధంగా వివరించేరు:—

(1) దాసుగారు తమ వ్రేళ్ళని వినియోగించడంలోను, వీణతీగలని మీటడంలోను ప్రత్యేక శైలిని కలిగినవారు.
(2) వారి వీణ పొడవు, సాధారణవీణల పొడవుకన్న తక్కువగావుండేది.  అందువలన, వారు తమ వీణని ౘాలా హెచ్చుస్థాయిలో “శ్రుతి” చేసేవారు.
(3) వారు ఉపయోగించే తీగలు, సాధారణంగా వీణలకి వినియోగించే తీగలంత సన్నంగా ఉండేవికావు. వాటికన్న కొంచెంలావు తీగలని వారు వాడేవారు. వారి వీణయొక్క అనుమంద్రతంత్రి, మామూలు వీణల తీగకి భిన్నంగా, రెండుసార్లు మెలిత్రిప్పబడిన లోహతంత్రిగావుండేది.
(4) వారు తమ వీణకి మైనపుమెట్లని వాడేవారుకాదు.
(5) అనుధ్వని ప్రయోజనంకోసం వాడబడే ఆనపకాయ పరిమాణం పెద్దదిగా ఉండేది.
(6) వారిది “ఏకఖండ వీణ” లేక ఏకాండీవీణ. అంటే, మొత్తం వీణ అంతా ఏ అతుకులూ లేకుండా, ఒకే ఒక కొయ్యముక్కతో లేక ఏకదారుఖండంతో చేయించుకునేవారు.

వెంకటరమణదాసుగారు సితారు, రుద్రవీణ కూడా అలవోకగా వాయించేవారట! సితారు వాదన నైపుణ్యాన్ని, తమ వీణపైన తానప్రయోగసౌలభ్యంకోసం వినియోగించేవారట!

అనేకసందర్భాలలో వారి వీణావాదనకౌశలంతో ఆ కాలంనాటి చెన్నపట్టణం రసజ్ఞశేఖరులని వెంకటరమణదాసుగారు రసానందడోలికలలో పరవశింపచేసేరట! 1912—1916 మధ్యకాలంలో తంజావూరులో అబ్రహాం పండితర్ ఏర్పాటు చేసిన సంగీతసభలలో పాల్గొన్న సంగీతవిద్వాంసులలో, వేంకటరమణదాసుగారు ప్రత్యేకమైన మన్ననలని అందుకున్నారు. 1916లో బరోడానగరంలో జరిగిన అఖిలభారత సంగీత సమ్మేళన సభల సమాలోచనలలో ఆయన ప్రముఖపాత్రని పోషించేరు.

వీణా రహస్య ప్రకాశిక” అనే చిన్నపొత్తాన్ని వారు తెలుగులో ప్రచురించేరు.

వారి వీణావాదనవేగకోవిదత్వానికి గుర్తింపుగా “షట్కాల చక్రవర్తి” అనే  ప్రత్యేకబిరుదం ఆయనకి ప్రదానంచేయబడింది.

దాసుగారికి, వారి 22 ఏళ్ళ ప్రాయంలో, భార్యావియోగం సంభవించింది.  ఆ తరవాత ఆయన పునర్వివాహంచేసుకోలేదు. అరవైయేళ్ళవయస్సులో వారికి చెవుడు వచ్చింది. అది ఏ వైద్యానికి లొంగక చివరివరకు ఆయనని బాధించింది. అందువలన ఆయన రమారమి రెండుదశాబ్దాలపైన దైహికంగా బ్రతికేవున్నా, సంగీతప్రపంచానికి పూర్తిగా దూరమైపోయేరు. ఆ విధంగా ఆయన చివరి దశంతా అనామకజీవితాన్ని అనుభవించి, 28—02—1948 వ తేదీన తనువు చాలించేరు.

వీణ వేంకటరమణదాసుగారి జీవితంలో జరిగిన ఒకటి-రెండు ముచ్చటలు చెప్పుకుని, ఈ వారం విషయానికి “స్వస్తి” పలుకుదాం:—

(1) 1916 లో బరోడాలో జరిగిన అఖిలభారత సంగీత సమ్మేళన సభలు సందర్భంలోనిది ఈ ముచ్చట. బరోడాలోని సంగీతపాఠశాల ప్రధానోపాధ్యాయుడైన ఫ్రెడెలిసు(Mr. Fredelis)మహాశయుడికి, వేంకటరమణదాసుగారికి సంగీతంవిషయంలో ఏదో ఒక చర్చ జరిగిందిట. ఆ చర్పలో భాగంగా,  ఒకరితో మరొకరు తమ-తమ సంగీతవాద్యాలపైన, ఇతరవిద్వాంసులు వాయించిన ఏ అంశాన్నయినా తాము తిరిగి వాయించగలమని ధీమా వ్యక్తంచేసేరుట!మొదట ఫ్రెడెలిసు తన పియానోమీద ద్రుతగతిలోవున్న  ఒక మధుర స్వరశ్రేణిగల సంగీతరచనని వాయించేడట! ఆ సంగీతరచనలోని స్వరక్రమాన్ని ౘక్కగా గ్రహించిన దాసుగారు, తమ వీణపైన ఆ బాణీని యథాతథంగా వాయించి వినిపించేసరికి ఫ్రెడెలిసు విస్తుపోయి విని చాలా సంతోషించేడట. అటు పిమ్మట, దాసుగారు, తమ వీణపైన, త్యాగయ్యగారి, భైరవిరాగంలోని, “కొలువైయున్నాడే కోదండపాణి” అనే కృతిని, వాయించి వినిపించేరట! ఫ్రెడెలిసుగారు, భైరవిరాగంలోని ప్రత్యేక నిషాదస్వరప్రయోగంలోని వైలక్షణ్యాన్ని గమనించి, దానిని యథాతథంగా పియానోమీద రాబట్టడం సాధ్యంకాదని అంగీకరించేరట!

(2) వేంకటరమణదాసుగారు ఒక సంగీతసభలో పాల్గొనడానికి మాయావరం వెళ్ళేరు. కార్యక్రమం ఐపోయినా, ఆ ఊరి కళాకారుడైన వీణ వైద్యనాథయ్యరు గారి ఇంటిలో, ఆయన కోరికమేరకి, దాసుగారు కొన్నాళ్ళు ఉండిపోయేరు. ప్రతిదినమూ ఇద్దరు కళాకారులూ కొంతసేపు ఎవరి వీణపైన వారు అభ్యాసం చేసుకునేవారు. ఒకరోజు అభ్యాసానంతరం, అయ్యరుగారు, దాసుగారిని, వారి తంజావూరు వీణని వాయించమని పట్టుపట్టేరు. దాసుగారు అందుకు సున్నితంగానే తిరస్కరించేరు. అయ్యరుగారు తమ పట్టుబిగించేరు. వేరే విధిలేక అర్థమనస్కంగానే తంజావూరువీణని దాసుగారు ఒడిలోనికి తీసుకుని, పై స్థాయిలో శ్రుతిచేసుకుని, వాయించడం మొదలుపెట్టేరు.
ఒక సందర్భంలో సారణితీగపై, కొంచెం ఎక్కువ ఒత్తిడితో ఒక విశేషప్రయోగం చెయ్యబోతే, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ తీగకాస్తా పుటుక్కున తెగిపోయింది. వెంటనే ఆ వీణని ప్రక్కకిపెట్టి, నవ్వుతూ, దాసుగారు, అయ్యరుగారితో, “మీ వీణలు ఆడపిల్లలు వాయించడంకోసం తయారు చేయబడ్డాయి. మా వీణలు మగవారు వాయించడానికి తయారుచేసేరు” అన్నారట!

(3) ఒకసారి, ఆ కాలపు మదరాసు సెనేటుహౌసులో దాసుగారి సంగీతసభ ప్రారంభంకాగానే, బయట బ్రహ్మాండమైన వాన కుండపోతగాపడడం మొదలయ్యిందిట! వానవల్లవచ్చే శబ్దంఎక్కువైపోతోందని, కార్యకర్తలు, కిటికీలు గుమ్మాలు తలుపులు వేసెయ్యబోయేరట! వెంటనే దాసుగారు వారందరిని వారించి, ఆ ధ్వనులస్థాయిని మించేరీతిలో తనవీణావాదనం ఉంటుందని వారందరికీ భరోసా ఇచ్చి, తమ వీణావాదనసభని అపూర్వ విజయవంతంగా నిర్వహించి, రసికవరుల ప్రత్యేక గౌరవాదరాలకి పాత్రులయ్యేరట!

అటువంటి మహావైణికసార్వభౌముడైన వీణ వేంకటరమణదాసుగారికి నతమస్తకులమై, నమస్కరిద్దాం.

స్వస్తి|

You may also like...

4 Responses

  1. KBJ SRINIVAS says:

    Thank you very much bava garu for the information on such a great musician. Do we get his recordings anywhere?

  2. సి.యస్ says:

    రమణ దాసు వీణ రాగాలు పలికింప,
    కర్జను దొర కూడ కరిగి పోయె.
    వినిన వారి కదియె వీనుల విందాయె ,
    విజయ నగర కీర్తి విశద మాయె.

    వీణ వెంకట రమణదాసు గార్ని గురించిన వివరాలు
    విలువైనవెన్నో సేకరించి అందించినందుకు ధన్యవాదాలు.
    గొప్ప సంగీతకారులకి బధిరత్వం ఒక శాపమనుకుంటాను.
    బెతోవిన్ కి కూడా అంతేగా!

  3. Srvalliseshasai says:

    vari gurinchi Vinnnu..kani vipulamuga ippude telusukunnanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *