శారదా సంతతి — 44 : పరమాత్మ భావరసామృతపాన మత్త శీలి ~ బరూఖ్ స్పినోజా – Part 2
మన ఆర్ష సంస్కృతిలోని అధ్యాత్మవిద్యావేత్తలు బోధించే అనేక నియమాలలో ప్రథమశ్రేణి నియమం “ఏకాంతవాసం-Solitude”. దానిని త్రికరణశుద్ధిగా ఆచరించిన తత్త్వదర్శి, మహోన్నత మౌని, బ్రహ్మర్షి అని చెప్పతగిన ప్రప్రథమ పాశ్చాత్య దార్శనికుడు స్పినోజా! ఆయన, సుమారు 44 సంవత్సరాల 3 నెలలు కాలవ్యవధి కలిగిన తమ ఆయుర్దాయంలో, కనీస మానవ జీవన అవసరాలైన ఆహార నిద్రాదులకోసమూ, కూడు-గుడ్డ-గూడులకి అయ్యే ఆర్థికవ్యయాలకి కావలసిన కనీస ధనసముపార్జనకోసమూ తప్ప, మిగిలిన సమయమంతా ఒకక్షణంకూడా వ్యర్థంచెయ్యకుండా తత్త్వచింతనకోసమూ, శాస్త్రాధ్యయనం కోసమూ, తనవైన తత్త్వదర్శనరచనలకోసమే వినియోగించేరు. 44 సంవత్వరాల వయస్సు పూర్తైన మూడునెలలలోపే క్షయవ్యాధితో, సులువుగా మరణదేవత ఒడిలోకి చేరుకున్నారు. 12 సంవత్సరాల చిన్నవయస్సులో, అలగ్జాండర్ పోప్ , (Alexander Pope : 1688-1744) అనే ఆంగ్లకవి, తన “SOLITUDE” అనే పద్యంలోని ముగింపుభాగంలో అనిన మాటలు, స్పినోజాగారి పావన జీవన భావన గరిమకి అద్దం పడతాయి. ఆ పంక్తులే ఇవి:—
” – – – – – let me live, unseen, unknown;
Thus unlamented let me die,
– – – – – , and not a stone
Tell where I lie.”
(“ఊరు, పేరు లేని ఒకమనిషై నేను,
బ్రతుకు భువిని గడపవలెనుగాక!
కడకు మరణమొంద, కన్నీరు పెట్టంగ
ఒక్కరైన లేని ఉనికితోడ!
“గాలితరగ, మట్టి కణమైన, నీరైన,
చెట్టు, పుట్ట, గట్టు, గుట్టలైన,
ఎండ, వాన, మబ్బు, పండుటాకులు నాదు
పాద చిహ్న గతిని పలుకకుండ!”)
ఆయన జీవితంలో స్పినోజా ఏ ఒక్కరినీ తన మాటలతోకాని, చేతలతోకాని గాయపరచగలిగిన భావననికూడా ఎప్పుడూ తలపెట్టలేదు. ఆయనగురించి ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు, పరిచయస్థులు, సహవిద్యార్థులు, ఇంటి చుట్టుప్రక్కలవారు ఏ ఒక్కరూకూడా, చిన్న ఫిర్యాదు చెయ్యలేదు. ఆయన గొప్ప స్నేహశీలి, పరమమృదుస్వభావి, మిత-మధురభాషి, సర్వలోక హితైషి, సాధుహృదయుడు. “భగవద్గీత“లో భగవానుడు చెప్పిన “అద్వేష్టా సర్వ భూతానాం“, “సంతుష్టః సతతం యోగీ“(XII:13/14), అలాగే XVII వ అధ్యాయంలో, దైహిక-వాఙ్మయ-మానసిక తపస్సుల లక్షణాలకి స్పినోజా
జీవితం లక్ష్యభూతంగా నిలుస్తుంది.
(1) The Principles of Descartes’ philosophy;
(2) The Treatise on the Correction of the Understanding;
(3) The Theologico-political Treatise;
(4) The Political Treatise;
(5) The Ethics, &
(6) The Correspondence of Spinoza
స్పినోజాగారియొక్క ప్రధానరచనలుగా పరిగణించబడుతున్నాయి. పాశ్చాత్య తత్త్వదర్శనకారులందరిలో God-intoxicated Pholosopher , గణుతికెక్కిన ఏకైకదార్శనికుడు బరూఖ్ స్పినోజా మహాశయుడు మాత్రమే! ఆయన సార్వకాలికంగాను, సార్వదేశికంగాను, అంటే, సర్వే-సర్వత్ర, దేవుడి ఉనికినితప్ప మరొక వస్తువుని దేనినీ గ్రహించని ఉత్కృష్ట ద్రష్ట!
“విశ్వం విష్ణుః, విష్ణుర్విశ్వం” (విశ్వమంతా విష్ణుమయం, విష్ణువు విశ్యమయం) అన్నట్లుగాను, “యో మాం పశ్యతి సర్వత్ర, సర్వం చ మయి పశ్యతి|
తస్యాహం న ప్రణశ్యామి, స చ మే న ప్రణశ్యతి||”
(అన్నింటిలోను నన్ను దర్శించేవాడు, నా యందు అన్నింటిని గ్రహించేవాడు, ఐనవానికి నేను ఎల్లప్పుడూవుంటాను, అటువంటివ్యక్తి ఎప్పుడూ నా దృష్టిలోవుంటాడు” (భగవద్గీత: VI-30) అని భగవానుడు గీతలో బోధించినవిధంగా, స్పినోజా నిత్యజీవితమేకాక, ఆయన తత్త్వదార్శనిక రచనల సారాంశంకూడా ఉంటుంది. ఆయన తరచు సవికల్ప సమాధికి తుల్యమైన స్థితి-గతులలోవుంటూ, తన చుట్టూవున్న సర్వప్రపంచాన్నీ పరమాత్మమయంగానే దర్శిస్తూ, ఆ పరమాత్మభావ పారవశ్యస్థితిలోనే తను ప్రతిపాదించిన తత్త్వదర్శనానుభవాన్ని గ్రంథస్థం చేసినట్లుగా వారి రచనలు కొన్ని సాక్ష్యం ఇస్తాయి. వారి తత్త్వశాస్త్రం, మన భారతీయ మౌలిక శైవ-వైష్ణవాది పారమ్య విశిష్టాద్వైతసిద్ధాంతానికి సన్నిహితంగా వుంటుంది. ఉదాహరణకి, శ్రీ రామానుజ వైష్ణవ విశిష్టాద్వైతసిద్ధాంతంలోని పునాది భావాలైన “– – – భువనం సత్యం, తదీశః శ్రియఃకాంతః, బ్రహ్మ స ఏవ, సః అఖిలతనుః భిన్నాః తతః చేతనాః, సత్యా సంసృతిః, ఈశనిగ్రహకృతా – – – ”
అని ఈ విధంగా వివరించబడిన తాత్త్వికాంశాలకి, స్పినోజా ప్రతిపాదించిన దార్శనిక భావనలకి సాపత్యం కనిపిస్తుంది. “- – – జగత్తుయొక్క ఉనికి నిజమైనది. దానికి పరబ్రహ్మమూర్తి ఐన శ్రీమన్నారాయణుడే ప్రభువు. చైతన్యవంతులైన విభిన్నజీవులందరూ ఆయనలోని అంతర్భాగాలే! ఆయనచేత పరిపాలించబడే ఈ సంసారమూ నిజమే!” అని పైన ఉదహరించుకున్న సంస్కృతమూలానికి తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైతం మూడు మౌలికవిషయాలని అంగీకరించింది.
(1) తన ఉనికి, మనుగడ పరాధీనమైవుండే కేవల జడజగత్తు(అచిత్ )|
(2) తన ఉనికి పరాధీనమైవుండే చిత్ + అచిత్ ల, మిశ్రమరూపుడైన జీవుడు|
(3) సర్వతంత్రస్వతంత్రుడు, స్వయంభువు, జీవ-జగత్తుల సృష్టి-స్థితి-లయాలు నిర్వహించే ఈశ్వరుడు.
స్పినోజా, ఇదే విధంగా మూడు మౌలిక అంశాలని పునాదులుగా గ్రహించి, తన దార్శనికసిద్ధాంతసౌధాన్ని నిర్మించేడు. ఆయన, మూడు ప్రశ్నలని తానే సంధించుకుని, ఆ ప్రశ్నలకి సమాధానం రాబట్టడంద్వారా తన సిద్ధాంతప్రతిపాదన చేసేరు. ఆ ప్రశ్నలు యివి:—
(1) మనం నివసించే ఈ జగత్తుయొక్క స్వరూప-స్వభావాలేమిటి?
(2) ఈ జగత్తులో మనలని ఎవరు ఈ విధంగా తీసుకువచ్చి ఉంచేరు?
(3) ఎందుకు ఈ వ్యవహారమంతా సంభవించింది?
ఈ మూడు ప్రశ్నలకి సరైన సమాధానం రాబట్టడానికి, ఆయన, మూడు విధాలైన పరిష్కార ప్రదాయక అన్వేషణలని చేపట్టేరు. అవి ఇవి:—
(1) జగత్తుయొక్క నిర్మాణం తెలుసుకోవడం.
(2) పరమాత్మయొక్క మౌలికతత్త్వాన్ని గ్రహించడం.
(3) మానవ జీవన మౌలికధర్మం అర్థంచేసుకోవడం.
(1) జగత్తుని కాలప్రమేయంప్రకారం అధ్యయనంచేయడంవలన అది అనాది అని, అనంతమని తెలుస్తుంది. అలాగే స్థలప్రమేయపరంగా వివేచనచేస్తేకూడా జగత్తు ఆద్యంతరహితం అని అర్థం ఔతుంది. (2) కర్తలేని కార్యం ఉండదు కనుక, ఈ జగత్తుని, దీనిలో మనలని ఉంచినవాడు “దైవం“! దైవంయొక్క మౌలికస్వరూపం, “సత్ ” అంటే, “ఉనికి“. ఈ జగత్తు యొక్క ఉనికి, దీనిలోని అనేక విషయాల ఉనికి, ఇటువంటి స్థితిశీలమైన/గతిశీలమైన “ఉనికిలు” అనేకానేకాలకి సర్వదా “ఉనికి” ఐన మహాసత్తా లేక పరమమైన ఉనికి ఏదైతేవుందో అదే దైవం. అది దానికి అదే ఆధారంగావుంటూ, మిగిలినవాటికన్నింటికీకూడా కాల-స్థలప్రమేయాలలో శాశ్వత ఆశ్రయంగావుంటుంది. కాల-స్థల ప్రమేయాలలో బందీలైన అనంతకాలాల, అనేకస్థలాల మానవుల మహాభావనలన్నీ, దైవంయొక్క అనంతభావమహిత క్షీరాంబుధిలోని లఘు-గురు ఆవర్త, బుద్బుద, ఫేన, తరంగాది రూప వైవిధ్యాలే!
(3) మనం ఇక్కడకి ఎందుకు వచ్చేమంటే “ఆనందానుభవంకోసమే!” అని స్పినోజా చెప్పేరు. దుఃఖం కలుగుతోందంటే, దానికి కారణం అజ్ఞానమే తప్ప మరొకటికాదు. జ్ఞానంతో జీవితాన్ని నిర్వహించుకుంటే దాని ఫలం ఆనందం తప్ప మరొకటి కానేరదని స్పినోజా తన స్వానుభవంద్వారా బోధించేరు.
ఈ అతిస్వల్ప పరిచయంతో, స్పినోజాగారు లోకానికి అందించిన కొన్ని దివ్యభావనామయ సందేశాలని అందుకునే ప్రయత్నం చేద్దాం!
(1) మొత్తం మానవలోకంలోని అత్యుత్తమ పరమశ్రేష్ఠ తత్త్వదర్శి అయిన మహాత్ముడియొక్క పరమాత్మకి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానవైశారద్యం, శైశవ అవగాహనామౌగ్ధ్యాన్ని పోలివుంటుంది.
(2) దైవానికి సంబంధించిన అనంత వర్ణ వైవిధ్య భరిత శోభని గ్రహించడం మనిషికి పూర్తిగా అసాధ్యం. ఎందువల్లనంటే, మానవుడి (స్థూల-సూక్ష్మ) ఇంద్రియాలకి వర్ణ అంధత్వం(colour-blindness) అనే సహజలోపం ఉంది.
(3) మనలో ప్రతివ్యక్తి ఆయన(పరమాత్మ)లో ఒక నిశ్చితభాగమే; ఆయనయొక్క దివ్యదేహంలోని ఒకానొక జీవకణం; ఆయన దివ్యహృదయంలో ఒక భావం; ఆయన రచించిన జీవ-కావ్యంలో ఒక ఉచ్చారణయోగ్యమైన అక్షరం(syllable)!
(4) మనం ఎందుకూ ౘాలని ఐదు ఇంద్రియాల అర-కొర శక్తితోను, పరిమిత సామర్థ్యం కలిగిన తెలివి-తేటలతోను, నలుసంతమేరకి మాత్రమే దైవవిభూతిని గ్రహించగలం. కారాగారంలోని ఒక ఇరుకుగదిగోడ బీట ద్వారా మహాసముద్రాన్నో, అనంతాకాశాన్నో చూడడం వంటిదే ఈ ప్రయత్నం!
(5) మనం మన పరిమిత మానవబుద్ధితో, ఆ అపరిమిత దివ్య ప్రజ్ఞాన వైభవాన్ని గ్రహించగలమనే అజ్ఞానంతోవుండకూడదు. యావద్విశ్వనిర్వహణ విధాయకమైనటువంటి పరమేశ్వరుడి అనంత దివ్య ప్రతిభ, సర్వజ్ఞమైన సర్వవ్యాప్తమైన ఆ పరమాత్మయొక్క దివ్యప్రణాళికా రచనలో నిక్షిప్తమైవుంది. ఖండమైన మన జ్ఞానం, అఖండమైన ఆయన దివ్యప్రజ్ఞలో భాగమైవుంటుంది. సముద్రం కెరటాన్ని కంటుంది, కాని, కెరటం సముద్రాన్ని కనలేదు.
(6) మానవుడు జ్ఞానసహితుడై పురోగమించాలి. పరమశ్రేష్ఠమైన మానవ సత్యానుభవాన్వేషణ తానే ఆ దైవం అనే ఎల్లలెరుగని ఎరుకతో ముగిసిపోతుంది. అప్పుడే పరమాత్మప్రేమ అంటే ప్రత్యగాత్మప్రేమే అనితెలిసిపోతుంది. ఇదే “అనంత బౌద్ధిక పరమాత్మ ప్రేమ” అని స్పినోజా వక్కాణించేరు. (“మోక్షసాధనసామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ| స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే||” ఆదిశఙ్కరులు:వివేక.:32)
(7) లౌకికంగా కొన్ని మానవజీవితాలు, అటువంటివారికి లేక వారి సాటి మానవులకి దుఃఖమయంగానూ, నిరర్థకంగాను, మానవహేతు విరుద్ధంగాను కనిపించవచ్చు. కాని అది నిజం కాదు. ఒక అద్భుతమైన పాటలోని అనేక ప్రణయరసభరిత మధురస్వరసమూహాలలోని ఒకానొక విషాదస్వరనాదంగానో, ఒక రసవంతమైన ఠుమ్రీలో ప్రత్యేకంగా ఉపయోగించబడిన ఒక “వివాది”స్వరప్రయోగంగానో, ఒక గొప్ప వర్ణచిత్రంలో, “వెల-వెల”బోయే వర్ణవ్యత్యయవిలాసంద్వారా వ్యక్తమయ్యే విలక్షణభావవైవిధ్యంగానో, అన్ని వైపులనించి అందాలు చిందే ఒక మహావృక్ష సమగ్రరూపానికి “వెలితి”ని సూచించేటట్లు కనిపిస్తూనే, ఒకానొక గంభీర సృష్టి లక్షణాన్ని ప్రకటించే ఆ చెట్టుయొక్క ఒక పెద్ద ఎండిపోయిన కొమ్మగానో, పరమాత్మయొక్క దివ్య ఊహలో భాగంగానే ఆ జీవితాలు ఉన్నాయి. దేహధారులైన మానవులందరిలో, పరిణామశీలమై నశించే దైహికాంశం దృశ్యమానంగా ఎలాగవుందో, అలాగే అవినాశియైన పరమాత్మ తత్త్వలేశం అదృశ్యమై అంతర్నిహితంగావుంది.
(8) మానవసమాజం అంతా ఒక శరీరంవంటిది. ఒకరిని మరొకరు గాయపరచడం అంటే, తనకి తానే గాయం చేసుకోవడం. అంతే!
(9) మానవ లోకంలోని అత్యుత్తమవిజయాలన్నీ, ఆత్మౌన్నత్యంతో సాధించబడినవేకాని, ఆయుధబలంతోకాదు.
(10) కాలశృంఖలాలలో బంధించబడిన మానవజీవితాన్ని, ప్రేమ, శాశ్వతానంద పునీత నిధానంగా పరిపక్వం చేసేస్తుంది.
విశ్వమానవ శ్రేయోదాయక దివ్యామృతాస్వాదనాతత్పరుడైన బరూఖ్ స్పినోజాకి సాష్టాంగ దండప్రణామం సమర్పించుకుందాం.
This article is an example of what is stated in the philosophy of spinoza.it is not possible to concieve the divine in its entirety by limited human intelligence.in the same way it is not pissible for ordinary human intellect to capture in such a succinct way the philosophy of arguably the greatest western philosopher of all time.the supreme intelligence itself concieved and wrote this article for the sake Of limited intellects like mine.the person who is a vehicle for that supreme intellect to express itself in such a pristine way deserves respect and adoration which unfortunately for a small human being like me is only pisdible in the form of the garland of thoughts mentioned above.pranams
అత్యంత ప్రేమాస్పదుడూ, అత్యుత్తమ చింతనాపరుడూ
తన జీవితకాలమంతా వివాదరహితుడు అయిన
స్పినోజా జీవన చిత్రాన్ని క్రిందటి భాగంలో అద్భుతంగా
ఆవిష్కరించిన తరువాత , ఈ వారం ఆయన సిద్ధాంతాన్ని,
తాత్త్వికసందేశాన్ని ఎంతో అర్థవంతంగా అందించావు.
స్థలపరిమితికి లోబడి అందించే ఈ చిన్న వ్యాసం పరిధిలో
అంత విస్తృతమైన ఆయన భావనామయ సందేశాన్ని వివరించడం
కష్టమే అయినా చక్కగా, చిక్కగా సమీక్షించడం జరిగింది.
దుఃఖానికి కారణం అజ్ఞానమనీ, జీవితం ఆనందానుభవం కోసమే
అనీ, అలాగే అక్కడ ఉదాహరించిన మొత్తం పది అంశాలూ కూడా
గొప్ప సందేశాలే!
ఆయన భావాల్ని మన భారతీయ చింతనతో పోల్చి చెప్పడం వల్ల స్పినోజా తత్త్వాన్ని అర్థం చేసుకోడానికి కొంత సులువైంది.
పాశ్చాత్య తత్త్వవేత్తలలో ప్రముఖ స్థానం ఉన్న స్పినోజాని
ఈ మూలంగా చదవడం ఆనందంగా ఉంది.
A great article with depths of wisdom and knowledge, which takes one to higher levels of thinking about the self . Every Sadhak has an important message as to how he should lead life spend his valuable time in search of the eternal truth. The essence of Spinoza’s Divine messages to the world are thought provoking and clearly reveal His realisaton of the Supreme Reality. My salutations to the greatest philosopher of all times.