సాహిత్యము-సౌహిత్యము – 54 : హర! మీ పాద పయోజ పూజితములై అత్యద్భుతం బవ్విరుల్

ఐంశ్రీశారదాపరదేవతాయైనమోనమః|
19—05—2018; శనివారము|

శ్రీశారదాంబికా వాత్సల్యచంద్రికా|

“సాహిత్యము—సౌహిత్యము ~ 54″|

నాకు అనవరత పూజ్య పుంభావ సరస్వతి, నాయందు సర్వదా అపారవాత్సల్యం చూపిన మా నళినీచిన్నాన్నగారు, అంటే శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావువర్యులు, (శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులవారితోకలిసి), “ఆంధ్రజాతిఅంతరంగకారువుతెలుగు చాటువుపుట్టుపూర్వోత్తరాలు” అనే ప్రామాణిక రచనని మనోహరంగా రచించేరు. వారు, నాకు ఆ పుస్తక ప్రతిని ఒకదానిని, నా యందు అపారవాత్సల్యంతో, నన్ను ఆశీర్వదించి, ఇచ్చేరు.

గత మూడు దశాబ్దాలపైగా నా అనేక ఆప్తమిత్రమాలలో ఆ పుస్తకమొకటి!

ఆ గ్రంథంలో 1260వ సంవత్సరప్రాంతానికి చెందిన యథావాక్కుల అన్నమయ్య కవిగారి “సర్వేశ్వర శతకం” నుంచి ఒక గొప్ప పద్యాన్ని ఉదహరించేరు. ఆ ఉదహరింపబడిన పద్యం ఇది:—

“తరులన్ పువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితో పండ్లగున్ |

హర! మీ పాద పయోజ పూజితములై అత్యద్భుతం బవ్విరుల్ |

కరులౌ, అశ్వములౌ, అనర్ఘమణులౌ, కర్పూరమౌ, హారమౌ,|

తరుణీ రత్నములౌ, పటీరతరులౌ, తథ్యంబు సర్వేశ్వరా!”||

పద్యభావం:—
“ఓ పరమేశ్వరా! వేరు-వేరు చెట్లకి పూసిన పువ్వులని కోయకుండా అలాగే వదిలిపెడితే, ముందుగా పిందెలై, ఆ తరువాత, ఆయాజాతులకి చెందిన పళ్ళుగా ఐపోతాయి. ఆ పువ్వులనే వేరు-వేరు కోరికలతో, అర్థార్థులైన మీ భక్తులు, మీ పాదాలచెంత పూజచేస్తే అత్యద్భుతంగా ఆ పువ్వులే మీ భక్తుల కోరికలని తీరుస్తూ, ఏనుగులైపోతాయి; గుర్రాలైపోతాయి;  అమూల్యాలైన మణి-మాణిక్యాలుగా మార్పుచెందుతాయి; కర్పూరంగాకాని, హారంగాకాని, సౌందర్యరాశులైన నారీమణులుగాకాని, మంచిగంధంచెట్లుగాకాని మారడం తప్పకుండా జరుగుతుంది సర్వేశ్వరా!”

అంటే అర్థార్థులైన వివిధభక్తులు విభిన్నమైన కోరికలతో పూజచేస్తారు. ఉదాహరణకి, రాజ్యపాలనచేసేరాజుగారు తన సైన్యబలాన్ని పెంచుకోవడానికి సర్వేశ్వరుణ్ణి పూలతో పూజిస్తే, ఆ పూవుల పూజాఫలంగా ఆ రాజుగారికి గజబలం పెంపొందడానికి ఏనుగులు, అశ్వబలం పెరగడానికి గుర్రాలు,  లభిస్తాయి. అదేజాతి పూలతో వేరొక భక్తుడు, మరొక కోరిక తీరడంకోసం సర్వేశ్వరపూజని చేస్తే ఆ పూజాపుష్పాలు, ఆ భక్తుడికి ఆ కోరిక తీరేటట్లు చేస్తాయి. మొత్తంమీద చెట్లకి వదిలేస్తే ఆయా జాతి పళ్ళుగాతప్ప మరొక రూపాంతరంచెందలేని పూవులు, సర్వేశ్వరపాదపూజకి వినియోగించబడడం వలన, వివిధభక్తుల విభిన్న మనోగత మనోరథాలని నెరవేరుస్తూ అనేక అభీష్టసిద్ధఫలాలుగా అనేకరూపాంతరాలు చెందుతున్నాయి. ఇది ఒక పరమాద్భుత భక్తిభావము, మహామంగళమయ భక్తభావన కూడాను!

ఈ విషయానికి సంబంధించిన మరొక పద్యాన్ని, దాని వృత్తాంతాన్ని, ఇతివృత్తాన్ని వచ్చేవారం ముచ్చటించుకుందాం.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    శతకమొకటి వ్రాసి, సర్వేశ్వరుని పైన
    దివ్యపథము చూపు భవ్యమూర్తి!
    పూవులన్ని శివుని పూజకే పూసేను,
    అన్నమయ్య మాట, అమ్మపాట!

  2. బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *