సాహిత్యము-సౌహిత్యము – 53 : కరగె పో పో న్నీళ్ళకున్ పల్చనై
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి|
“సాహిత్యము – సౌహిత్యము ~ 53″|
రమారమి 1600వ సంవత్సర సమీపంలో, శ్రీ సారంగు తమ్మయ్యకవిగారు, “వైజయంతీ విలాసము” అనే పేరుతో సుప్రసిద్ధమైన “విప్రనారాయణచరిత్ర“ని, ౘక్కని పద్యకావ్యంగా రచించేరు. శ్రీ బొమ్మకంటి వేంకట సింగరాచార్యగారు, శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావుగారు యొక్క గౌరవ సంపాదకత్వంలో, స్వామి శివశంకర స్వామివారి సరళ పీఠికతో, ఎమెస్కో సంప్రదాయ సాహితి-13గా ఈ “వైజయంతీ విలాసము” ప్రథమ ముద్రణ 1990లో, ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించి సంప్రదాయ సాహిత్యాభిలాష కలవారికి సంతోషాన్ని, అది లేనివారికి దానిపట్ల కుతూహలన్ని కలిగించే సఫలయత్నం చేసేరు.
సారంగు తమ్మయ్యకవిగారు, “వైజయంతీ విలాసము”ను, నాలుగు అశ్వాసాలు, సుమారు 530 పద్య-గద్యాలు కలిగిన చంపూకావ్యంగా, రసరమ్యంగా రచించేరు. దీనిలోని ద్వితీయాశ్వాసంలో, 139వ పద్యంగురించి, సంక్షేపంగా ఈ వారం తెలుసుకుందాం:—
“శా.॥
ఆ విప్రోత్తము వజ్ర పంజర నిభంబై నిశ్చలంబైన స
ద్భావంబంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ , లోహమై,
గ్రావంబై, దృఢ దారువై, తరుణ వృక్షంబై, ఫలప్రాయమై,
పూవై, తన్మకరందమై, కరగె పో పో న్నీళ్ళకున్ పల్చనై”||
“బ్రాహ్మణోత్తముడైన ఆ విప్రనారాయణుడి వజ్ర పంజర సమానమై, నిశ్చలమైన శ్రీహరిసేవాంకితమయ ఉత్తమ భక్తి భావము, శోభాయమానమైన దేహావయవాలు కలిగిన సుందరయువతితో సహచరించడంవలన పరిణమించే (జీవ)రాగాది రజోతమోగుణప్రభావం వలన మొదట లోహత్వధర్మాన్నిపొందింది. ఆ తరవాత క్రమంగా, బండరాయిగాను, గట్టి కొయ్యగాను, లేత చెట్టు కర్రగాను, పండుగాను, పువ్వుగాను, దానిలోని తేనెగాను, రాను-రాను నీళ్ళకంటెకూడా పలౘనైపోయి కరిగిపోనారంభించింది.”
కావ్యగతమైన కథాపరంగా, విప్రనారాయణుడి భగవద్భక్తియుత బ్రహ్మచర్య వ్రతదీక్షాభావం, దేవదేవి అనే సుందరవేశ్యాయువతియొక్క మోహజాలంలో పడిపోయి, క్రమ-క్రమంగా ఎంత అట్టడుగుకి పతనమైపోయిందో ఈ పద్యం పాఠకుడికి హృదయంగమంగా వర్ణించి చూపుతోంది. సాహిత్యపరంగాను, ఆలంకారికశాస్త్రానుసారంగాను, ఇతరవిషయపరంగాను ఈ పద్యం అనుపమానమై, అద్భుతమైన యశస్సుని ఆర్జించింది.
ఐతే, మన అధ్యాత్మవిద్యాసాధనపరంగా, ఈ మహాపద్యం, సాధకలోకానికి చేసే బోధ, అందించే సందేశం లోకోత్తరప్రజ్ఞానంతో అనుసంధానమైవున్నవి. ఏ సాధకుడైనా, ఏ చిన్న విషయానికైనా, ఇసుమంతైనాకూడా తన సాధనకి ప్రతికూలమైన అంశమైనదానికి, అవకాశం ఏ మాత్రమూ ఇవ్వకూడదు!
స్వస్తి|
సారంగు తమ్మయ్య రాసిన ఈ పద్యం ఇంతకుముందు ఎన్నోసార్లు
నీదగ్గరే విన్నాం. తెలుగులోని చాలా గొప్ప పద్యాలలో ఇదొకటి.
ఆధ్యాత్మిక సాధనామార్గంలో పయనించే సాధకులకు హెచ్చరిక లాంటిది ఈ పద్యం.
మనిషి నడవడికలో…ముఖ్యంగా ఆధ్యాత్మిక పథంలో అడుగులు
వేసేవారికి వ్యక్తిగత శీలం ఎంత ముఖ్యమో , అది జారిపోయినప్పుడు
అతను పతనావస్థకు ‘ క్రమంగా’ ఎలా దిగజారిపోతాడో అన్న సత్యాన్ని
కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుతమైన పద్యం ఇది.
ఈ పద్యాన్ని చదివినప్పుడు ‘ ఆకాశంబున నుండి శంభునిశిరం బందుండి…….. పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్…అని భర్తృహరి చెప్పిన పద్యం గుర్తుకొస్తుంది.
నిత్యజీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తూంటాం. సర్వసంగ పరిత్యాగులుగా మారి, ఆ మార్గంలో కఠినమైన సాధనచేసి, కొంత
ఎత్తుకి చేరుకుని, ఒక చిన్నబలహీనత వల్ల క్షణంలో శిఖరాగ్రం నుంచి లోయలోకి జారిపోయిన వాళ్లనెందరినో.
సాధకుడు చేసే సాధన ఒక క్షీరభాండం లాంటిదైతే, అందులో
బయటినుంచి ఒక ఉప్పుకల్లు పడినా, లేదా భాండశుద్ధి (అంతః శుద్ధి/
స్వీయ నియంత్రణ) లేకపోయినా పాలు విరిగిపోతాయి. సాధన
చెదిరిపోతుంది అని చెప్పే ఈ చక్కటి పద్యం అందించినందుకు ధన్యవాదాలు.
కేవలమూ భగవన్మయమైపోయిన సాధకుని హృదయగత
భావం భగవదనుగ్రహంవల్ల సత్స్వరూపంపొందుతుంది.
అప్పుడది నిశ్చలంగాకూడావుంటుంది. అలాంటి స్థితిలో, పరమేశ్వరాభిముఖ్యాన్ని కలిగిన తన ఆంతర్యం,
సన్మయస్వరూపంతోవున్నది, ఇతర రజోగుణ, తమోగుణ
దిశగా ఆకర్షితమైతే ఆ ఆంతర్యం నిశ్చలతని కోల్పోయి,
సహజ చాంచల్యగుణాన్ని పొందుతుంది.
మంచుగడ్డలో జలాణువుల సాంద్రత గాఢతమంగావుండడం
వలన నీటిగడ్డ గట్టిగావుండి, నిశ్చలంగావుంటుంది!
కాస్త వేడికి గురైనవెంటనే, జలాణువుల సాంద్రత పలచబడి,
నీరై ప్రవహిస్తూ సహజంగానే చంచలమైపోతుంది.
అది మరీ మరగబెడితే, ఆ నీరే ఆవిరై, జలాణువుల సాంద్రత
మరి-మరీ పలచనైపోయి, గాలిలో కలిసిపోయి అత్యంత
చంచలావస్థకి గురైపోతుంది.”పో పోన్నీళ్ళకున్ పల్చనై”
అంటే ఇదే!
ౘాలా కష్టపడిపోగేసుకున్న సంపదని జూదంలో పోగొట్టుకోవడాన్ని అనేకజనుల జీవితాలలో మనం
చూస్తూనేవుంటాం!