సాహిత్యము-సౌహిత్యము – 52 : తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్
ఐంశ్రీశారదా పరదేవతాయై నమోనమః|
05—05—2018; శనివారము|
శ్రీశారదా కరుణా వరుణాలయమ్ |
“సాహిత్యము – సౌహిత్యము ~ 52″|
శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి “చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి రాజావారైన, శ్రీ వెలుగోటి యాచేంద్ర గారి ఆస్థానంలో, ఆయన సమక్షంలో పూరించబడినట్లుగా ఐతిహ్యంద్వారా తెలుస్తోంది.(ఇంతకిముందు మనం ఈ శీర్షికలోనే, మోచర్ల వెంకన్న కవిగారిచేత రామాయణ-మహాభారత-భాగవతార్థాలలో పూరించబడిన “నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ ” పద్యాలు కూడా ఈ సందర్భంలో చెప్పబడినవిగానే ప్రస్తావించబడింది.)
ఇంక అసలుసమస్యని పరికిద్దాం:-
“తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “|
“పార్వతీదేవి వక్షస్థలంలో 54 తలలు కనపడ్డాయి” అని సమస్యకి భావం.
ఇది గణితశాస్త్రానికి సంబంధించిన సమస్య. సాహిత్యవిషయమైన అవధానప్రక్రియలో, “సమస్యలు”, లెక్కలతో ముడిపడివుండడం అరుదుకాదు. పుష్పగణనం, ఘంటాగణనం వంటివి అవధానాల్లో భాగంగావుంటాయి. అంతేకాక, ప్రత్యేకంగా గణితావధానమేవుంది.
ఇప్పుడు మోచర్ల వెంకన్నకవివరుల పద్యం పరిశీలించవచ్చు. ఈ పద్యం “మత్తేభవిక్రీడితం” పద్యపాదం అని మనకి తెలుస్తూనేవుంది. వృత్తాలలో, శార్దూలం, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల అనే నాలుగూ తెలుగు పద్యసాహిత్యంతో పరిచయమున్న అందరికీ సుపరిచితమైనవే! ఇంక జాతి – ఉపజాతి పద్యాలైన కందం, సీసం, ఆటవెలది, తేటగీతి కూడా బాగా తెలిసినవే! ముఖ్యంగా మన “సాహిత్యము – సౌహిత్యము” శీర్షికని ప్రతివారమూ పఠిస్తూన్న రసజ్ఞమిత్రులందరికి ఈ ఛందస్సులకి చెందిన పద్యాలన్నీ బాగా పరిచయమైనవే! ఈ వారం పద్యం మత్తేభవృత్తం. దీని పాదంలో “స-భ-ర-న-మ-య-వ” అనే 7 గణాలుంటాయి. అంటే పద్యపాదానికి 20 అక్షరాలన్నమాట!పాదాది అక్షరానికి, ఆ పాదంలోవున్న 14వ అక్షరంతో యతిమైత్రి కూర్చాలి. సమస్యాపూరణపద్యం యిది:—
“లలితాకారు కుమారు షణ్ముఖుని తా లాలించి ౘన్నిచ్చుచో
గళలగ్న గ్రహరత్న దీప్తకళికా గాంభీర్య హేమాంచితో
జ్జ్వల రత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపగా
తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
“పార్వతీదేవి పసిపిల్లవాడైన ఆరుముఖాలున్న కుమారస్వామివారిని లాలిస్తూ, శైశవమౌగ్ధ్యంతో వెలిగిపోతున్న ముద్దుమోములని ముద్దాడుతూ, నిమురుతూ, శిశుస్కందులవారికి, ఒక్కొక్క బులిబుల్లినోటికి తన మహనీయస్తన్యాన్ని మహాభావుకతా పారవశ్యంతో త్రావిస్తోంది. శిశుగుహులవారు స్తన్యం సేవిస్తున్నారు. ఆ మహాదేవి, తన కంఠసీమలో నవరత్నాల పతకంవున్న అందమైన హారం ధరించింది. ప్రక్కనేవున్న శంకరదేవులు ఈ ముచ్చటని ప్రీతితో గమనిస్తున్నారు. పాలు త్రాగుతున్న శిశుషణ్ముఖుని ఆరుముఖాలలోని పసిబుగ్గలు, నవరత్నాల వివిధవర్ణకాంతి కిరణవైభవంతో వెలుగులీనుతూ, కదులుతున్నాయి. ఆ కాంతికిరణాల మహాభాగ్యం ఏమిటంటే, అవి, బుల్లి అయ్యవారి బుజ్జిబుగ్గలని అమితమైన గారాబంతో తెగ నిమురుతూ, వదలకుండా ముగ్ధమోహనంగా అలవిమీరి ముద్దులాడేస్తున్నాయి. ముద్దూ-ముచ్చటా తెలిసినవారు ఎవరుమాత్రం అంతటి అద్భుత అవకాశాన్ని ౙారవిడుచుకుంటారు? ఆ సన్నివేశానికి సంబరపడుతూనే నవరసాభినయ ఉద్గమ ఆస్పదుడైన చిదంబరేశ్వరుడగు మహాశివుడు, ఈ అందాలనుంచి చూపు మరల్చి, అటు నవరస సంకేతాలైన నవరత్నాలనిపరిశీలిస్తే, తొమ్మిది రత్నాలలోను, ఒక్కొక్క రత్నంలో ఆరేసి కార్తికేయుడి ముఖాలు వివిధరసస్ఫూర్తితో విరాజిల్లుతున్నాయి. మొత్తంగా చూస్తే, 6×9=54 ముఖాలు లెక్కకొచ్చేయి”
ఈ వారం “సాహిత్యము – సౌహిత్యము ~ 52″తో, ఈ శీర్షికప్రారంభించి, వారాల ప్రకారం, ఒక సంవత్సరం పూర్తి ఐనట్లే! శ్రీశారదామాత అపార అనుగ్రహంతో, మా పెద్దలందరి అమేయ ఆశీర్వచనశక్తితో, రసజ్ఞులైన మన సత్సంగమిత్రమండలియొక్క ప్రోత్సాహభరితమైన శుభాశంసనపూరిత స్నేహ-వాత్సల్యభావగరిమతో ఏడాదిపాటు ఇది కొనసాగింది. ఇంతవరకు, ఈ శీర్షికని, అవధానవిద్యలో ప్రముఖ అంశమైనది, విడిగా, సాహిత్యక్రీడగా, ప్రత్యేక ప్రతిపత్తిని కలిగినది ఐన “సమస్యాపూరణం” ప్రధానవిషయంగా గ్రహించి నిర్వహించడం జరిగింది. ఇకపైన సాహిత్యసంబంధమైన వేర్వేరు అంశాలని, తెలుగు-సంస్కృతం-ఆంగ్లం మొదలైన భాషలలోవున్నవాటిని, మన శీర్షికలో ప్రస్తావించడం జరుగుతుంది.
అతివ్యాప్తి-అవ్యాప్తి-అల్పవ్యాప్తి దోషాలకి, మిగిలిన లోటు-పాటులకి సర్వదా-సర్వధా క్షంతవ్యుడని.
స్వస్తి||
ప్రతిబింబితాస్యము లుమా
పతి కేబదినాల్గు తోచవలెనా సేనా
పతి షణ్ముఖములు చాలక
వెతికినటుల్ వక్కలంక వెంకటకృష్ణా!
సంవత్సరకాలంగా నిరాటంకంగా సాగుతూ వస్తున్న
“సాహిత్యము-సౌహిత్యము” శీర్షికకూ, నడుపుతున్న
నీకూ వార్షికోత్సవ శుభాభినందనలు.
మంచి సాహిత్యాంశాల్ని…ముఖ్యంగా పద్యకవిత్వంలో ఒకప్పుడు తెలుగు నేలను ఏలిన అవధాన ప్రక్రియలో ఒక ప్రధానమైన , రసవత్తరమైన
సమస్యా పూరణాంశాన్ని తీసుకుని సారవంతమైన పద్యాల్ని అందించేవు. ఈ తరం రసజ్ఞులకి చాలా మంచి కానుక.
మళ్ళీ మోచర్ల వెంకన్నగారు వచ్చారు. ఆయన
ఏ పద్యం చెప్పినా అందంగానే ఉంటుంది.
54 ముఖాలుగా నవ రత్నాల్లో ప్రతిబింబించిన
కుమారస్వామి ఆరు ముఖాల్ని వర్ణించి చెప్పిన
పద్యం ‘లెక్కల్లో’ ఒకటి.