శారదా సంతతి — 42 : శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి
ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః|
29—04—2018; ఆదిత్యవాసరము|
శ్రీశారదా దయా చంద్రిక|
“శారదా సంతతి ~ 42″| శివంకర సంగీత వాగ్గేయకార చిదంబరేశ్వర శిశువు ~ గోపాలకృష్ణ భారతి| (1810—1896).
అది సుమారు 1860వ సంవత్సరం చివరి భాగమనుకోవచ్చు. తమిళదేశంలోగల మాయావరంవూరులోని శ్రీ కృష్ణానందయోగివరుల ఆశ్రమం అది. వారికి పరమ ఆత్మీయమిత్రులైన శ్రీ గోపాలకృష్ణభారతివరుల రచన, “నందనార్ చరిత్రం” స్వయంగా భారతిగారే “కథా కాలక్షేపం” (అంటే మన “హరికథ” పద్ధతివంటిది), మూడురోజులపాటు సాయంకాలం మొదలు రాత్రివరకు, రోజూ ఐదారు గంటలు, పద్యాలు, పాటలు శాస్త్రీయసంగీతపద్ధతిలో, రాగ-తాళబద్ధంగా పాడుతూ, హృదయంగమవ్యాఖ్యానం చేస్తూ భక్తజనహృదయరంజకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి చుట్టు-ప్రక్కలవున్న సమీపగ్రామవాసులైన భక్తజనులు హాజరవ్వడం సర్వసామాన్యమైన విషయం. భక్తరసజ్ఞులకి స్థానికమైన ఏర్పాట్లు ఏవీ లేకపోతే, మఠంవారు ఆ ‘కథా కాలక్షేపం’ జరిగే మూడురోజులకి తగు వసతులు ఉచితంగానే అందజేస్తారు. దానివ్యయాలు, ‘భక్తజన భాండారం’ అని వదాన్యులచేత నిర్వహింపబడే ఉపవ్యవస్థ, మఠం యాజమాన్యంలోవుండి, భరిస్తుంది. దానికంతటికి, జిల్లాన్యాయాధికారైన మునసబుగారు, శ్రీ వేదనాయకం పిళ్ళైగారు పర్యవేక్షణాధికారులుగావుంటారు. వేదనాయక(గ)ం పిళ్ళైగారు, కృష్టానందయోగివరుల ముఖ్యశిష్యులు. కృష్ణానందయోగిగారి ఆత్మీయమిత్రులైన గోపాలకృష్ణభారతిగారికి పిళ్ళైగారిని యోగిగారే పరిచయంచేసేరు. ఆ పరిచయం ద్వారా, పిళ్ళైగారు భారతిగారి అంతేవాసిగావుంటూ, అపురూపమైన తమిళ కృతులు రచించి, ప్రముఖ దక్షిణభారత సంగీతవాగ్గేయకారులలో ఒకరిగా చరిత్రలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆ విధంగా మూడురోజుల అద్భుతకార్యక్రమం మహావైభవంగా, కన్నుల కైలాసంగా జరిగిపోయింది. నాలుగవరోజు ఉదయం సంధ్యాదికాలు ముగించుకుని, భారతిగారు, మఠంలోని తనగదిలో, పీటపైన కూర్చుని, తాళపత్రాలని జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నారు.
“నమస్కారం, అయ్యా!” అనే మాటలువిపించగానే, భారతిగారు తలెత్తి పైకి చూసేరు. సుమారు మధ్యవయస్సు దాటినట్లుగా కనిపిస్తున్న మహావర్చస్వి ఐన ఒక బ్రాహ్మణుడు రెండుచేతులతో నమస్కరిస్తూ ఎదుటవున్నాడు. ౘక్కటి విభూతి బొట్టు, బంగారురంగుతో మెరిసే మేనిచాయ, ధోవతిని కట్టుకుని, నడుముకి ఉత్తరీయం ముడివేసుకుని, బ్రహ్మవర్చస్సుతోవున్నాడు.
“శుభమస్తు! ఎవరయ్యామీరు? ఎందుకొచ్చేరు” అని భారతిగారు అడిగేరు.
“నాపేరు సభాపతయ్యరు. భారద్వాజగోత్రజుడిని. కృష్ణయజుర్వేద క్రమాంత స్వాధ్యాయిని. నా ఆఖరి ఆడబిడ్డ వివాహం జరిపించాలి. మాఘమాసంలో పెళ్ళి నిశ్చయమయ్యింది. నా వద్ద కూడబెట్టిన ధనం, నా ఈ కర్తవ్యనిర్వహణకి ఎంతజాగ్రత్తగా సరిపెట్టాలని ప్రయత్నించినా ౘాలడంలేదు. పైగా ఇంట్లో నా గృహిణి, తమ ఆశీర్వచనరూపంలో అనుగ్రహించే ద్రవ్యం, బిడ్డ గృహధర్మ జీవితానికి బలమైన ఆలంబనమని, సర్వశుభదాయకమని పట్టుపడుతోంది. వారి బంధువుల బిడ్డలకి మీ పుణ్యమయధనసహాయంతో చేసిన ఉపనయనాలు, వివాహాలు అన్ని విధాలా మంగళమయంగా ఉన్నాయంటోంది. అందుకని తమ దర్శనార్థంవచ్చేను. తమ చేతి ౘలువతోనే మా ఇంట కన్యాదానం జరగాలని నేను త్రికాలాలలోను ఉపాసించుకునే శ్రీగాయత్రీమాత సంకల్పమని త్రికరణశుద్ధిగా నమ్ముకుని, తమ సమక్షంలో ఈ విధంగా ఆశ్రయించుకుని ఉన్నాను అయ్యా!” అని సభాపతయ్యరుగారు మనవిచేసుకున్నారు.
“మీరు ఆ విధంగా నిలబడివుండడం తగదు. ఈ పీటమీద ఆసీనులుకండి. బ్రాహ్మణుడికి బ్రహ్మదేవులవారు అనుగ్రహించిన షట్కర్మాధికారంలో, దాన-ప్రతిగ్రహణాలు భాగమేకదా! “ధ్యాన-ధ్యాతృ-ధ్యేయరూపా” అని శ్రీమాత వశిన్యాది వాగ్దేవతలచేత కీర్తించబడిందికదా! మరి ఆ నామసారాంశాన్ని, ఈ విషయంలోకూడా అన్వయించుకుంటే “దాన-దాతృ దేయరూపా” ఔతోందికదా! అంటే, “ఇవ్వడం-ఇచ్చేవాడు-ఇవ్వబడేవాడు” అనే ఈ వ్యవహారమంతా శ్రీమాత రూపమయమే, కాకపోతే, రూప మహిమే! ఇంతకన్న ఇంకేముంది చెప్పండి? అది అలావుంచి ప్రస్తుతం మాట్లాడుకుందాం. అమ్మడి పెళ్ళికి ఏ మాత్రం కొరతవుంది, సభాపతయ్యా?”
అంతటి ఆప్యాయపు పలకరింపుకి, సభాపతయ్యగారి మనస్సు ద్రవించిపోయింది. సభాపతయ్యగారు, పీటకి ఒకమూల ఒదిగికూర్చుని, చేతులు జోడించి, అణకువతోను, ఇంచుక సంకోచంతోను, ఇలాగ అన్నారు: “సుమారుగా ఒక నూరు రూపాయలమేరకి ఇరకాటంగావుందండి. తమరు అనుగ్రహించిన ద్రవ్యసహాయం చూసుకుని, ఆ పైన ఇద్దరు-ముగ్గురు పరిచయస్థులవద్ద కాస్తంత ధర్మవడ్డీకి ఇప్పించగలమంటున్న నా బావమరుదులని అర్థిస్తాను, గోపాలకృష్ణయ్యగారూ!”
ఆ మాటలు వింటూనే, గోపాలకృష్ణభారతిగారు, తన ప్రక్కనేవున్న తాటి ఆకుల కవిలి కట్టలకేసిచూసి, వాటిని ఎడమవైపుకి ఒక క్రమంలో సర్ది పెట్టుకుని, విడి-విడిగావున్న తాళపత్రాలని తనచేతిలోకి తీసుకుని, జాగ్రత్తగా వాటిని పరిశీలించి, వాటిలోనుండి ఒక తాళపత్రాన్ని ఎంచి, దాని వెనుకవైపు, తనచేతిలోని గంటంతో తాను వ్రాయదలుచుకున్నదివ్రాసి ముగించి, సభాపతయ్యని చూసి ఇలాగ చెప్పేరు: “సభాపతయ్యగారూ! ఈ తాళపత్రాన్ని భద్రంగా తీసుకుని వెళ్ళి, నాగపట్టిణంలోవున్న కందప్ప చెట్టియారుగారికి ఇవ్వండి. మీ సమస్య పరిష్కారం ఐపోతుంది. మీ కుటుంబాన్ని, నూతనవధూవరులని ఆ చిదంబరనాథుడు, సభాపతి పెరుమాళ్ళు ౘల్లగాచూసి కాపాడతారు. హాయిగా వెళ్ళిరండి” అంటూ ఆ తాళపత్రాన్ని సభాపతయ్యరు చేతిలో పెట్టేరు, భారతివర్యులు.
ఆ తాళపత్రాన్ని రెండుచేతులా ఆదరంగా అందుకుని, రెండుకళ్ళకి అద్దుకుని, చేతికి వ్రేలాడుతున్న చిన్న నూలుసంచిలో తన మడిబట్టలమధ్య భద్రంగా దాచుకున్నాడు. ఆ మీదట మరల రెండుచేతులు జోడించి, నమ్రమధురంగా, సభాపతయ్య ఇలాగ అన్నారు: “భారతిఅయ్యా! మరొక ముఖ్యవిషయం ఏమిటంటే, మాదీ నాగపట్టిణమే! కందప్ప చెట్టియారుగారూ పరిచయస్థులే! తమరు మాఘమాసం, వివాహదిన సమయంలో అటువైపుగా రావడం జరిగితే, వివాహానికి విచ్చేసి, వధూవరులని స్వయంగా ఆశీర్వదించాలని మనసా వేడుకుంటున్నాను. నా గృహిణి మనోగతం ఇది. మీరు రావడం మా అదృష్టం! మాఘశుక్లదశమి, ఉదయం, సూర్యోదయానంతరం, ఆరు ఘటికల కాలప్రమాణం దాటిన తరవాత వివాహ లగ్నప్రారంభ ఘటికలని దైవజ్ఞుల నిర్ణయం.”
“అయ్యో! అలాగే! కందప్పకి నా ఆశీస్సులందించండి. ఆ వైపు నా “కాలక్షేపం” కార్యక్రమం ఏదైనా, చిదంబరనాథసంకల్పంవలన, ఏర్పడితే తప్పక వస్తాను. అంతా సభాపతి ౘలువ!” అని భారతిగారు సమాధానంచెప్పి, సభాపతయ్యని వెళ్ళిరమ్మని మరల ఆశీర్వదించేరు.
సభాపతయ్య మరొక్కమారు భారతిగారికి అంజలి సమర్పించుకుని, వీధివైపుకి అడుగులువేసేరు.
స్థానికమైన పెళ్ళిపిలుపులు, మిగిలిన పెళ్ళిపనులు ౘక్కబెట్టుకుని, సభాపతయ్య రెండు-మూడురోజుల తరవాత తనవూరు నాగపట్టిణం చేరుకున్నాడు. ఆ రోజు విశ్రాంతి తీసుకుని, మరునాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తైన తరవాత, సభాపతయ్యగారు ౘాపమీదకూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు. వారి ధర్మపత్ని కమలాంబాళ్ ఎర్రచమ్కీఅంచుకుట్టిన తాటాకు వీవనతో విసురుతూ, “ఏమండీ! వెళ్ళినపని కాయా? పండా?” అని అడిగింది, కొంత చింత మరింత వేగిరపాటు కంఠంలో ధ్వనిస్తూండగా!
“అందరికీతల్లి ఆ గాయత్రీమాత అపారకృప, నా బిడ్డలతల్లి కమలాంబిక తోడ్పాటు మనకుటుంబానికి దండిగావుండగా మనంచేసే ప్రతిధార్మిక ప్రయత్నమూ పండే, మనయింట ప్రతిదినమూ పండగే!” అన్నారు అయ్యరుగారు నవ్వుతూ.
“అబ్బ! ఎంత ౘల్లని మాట, ఎంత తియ్యగా చెప్పేరండి! ఎంత ఇచ్చేరండీ? మా అన్నల మొహమాటాలు, మనకి వడ్డీల ఇక్కట్లూ తప్పుతాయంటారా?” అంటూ కమలమ్మగారు కంగారు వెలిబుచ్చేరు.
“కమలా! వారు ఎంత ఇచ్చేరో వారు చెప్పలేదు. ఆయన ఏదో సంగీతసంబంధమైన విషయాలు ఎంతో ఏకాగ్రతతో వ్రాసుకుంటూండగా వారి పవిత్ర కార్యానికి భంగంకలిగించి, మన లౌకికబాధని వివరించడానికే నా మనసు క్లేశపడింది. మనకి ప్రాప్తమున్నదేదో పరమేశ్వరకృపావశమైన వారి హృదయసంకల్పరూపం పొంది తాళపత్రంమీద లిఖితరూపంలో సాక్షాత్కరించింది. అది ఏదైనా, ఎంతైనా, అదంతా మన ఇలవేలుపు చిద్గగనకాంతుడి మహాప్రసాదమని మనిద్దరి భావన. సాయంత్రం కందప్పచెట్టియారువద్దకి వెళ్ళినప్పుడు ఆ విషయం వెల్లడౌతుంది. అతడికి ఆయన వ్రాసియిచ్చిన తాళపత్రంమీద ఆ వివరాలువుంటాయి. ఇదిగో, ఇదే ఆ తాళపత్రం” అని అంటూ ఆయన తన ఉత్తరీయపు మడతలమధ్య
భద్రపరచిన తాళపత్రాన్ని భక్తితో భార్యకి చూపించేరు. ఆమె దూరంనుంచే దానిని స్పృశించకుండానే దేవుడిహారతిని కళ్ళకి అద్దుకున్నట్టు రెండుచేతులతో కళ్ళకి అద్దుకుంది. ఇంకేమీ అడగవలసిన అవసరంలేదనే ఇంగితప్రజ్ఞావంతురాలు, ఆమె! అందువలన వారివైపు చిరునవ్వుతోచూస్తూ, ఆమె మౌనంవహించేరు.
వారిద్దరూ కొంత తడవు విశ్రమించినతరవాత, సభాపతయ్యలేచి, ఉత్తరీయం మెడచుట్టూ కప్పుకుని, చేతిసంచిలోని తాళపత్రాన్ని ఒకమారు తడిమిచూసుకుని, భార్యవైపుతిరిగి చిరునవ్వుతో “కమలాంబా! మరి సాయంసంధ్యాసమయం సమీపించకుండానే కందప్పవద్దకి వెళ్ళివస్తాను. నా సంధ్యోపాసనవిధికి, అతడి సాయంసమయ విధి-నిషేధాలకి అనువుగా ఉంటుంది. తలుపులు దగ్గరకి వేసుకో!” అంటూ మెడలోని యజ్ఞోపవీతానికి నమస్కరించుకుని వీధిలోకి అడుగులు వేసేరు.
పట్టణ ప్రధానమార్గంలోని ముఖ్యకూడలిలోవున్న కందప్ప చెట్టియార్ గారి “నటరాజ తంగమాళిగై” లోకి సభాపతయ్యగారు అడుగు పెట్టేరో లేదో, లోపల అద్దాలగదిలో పట్టుదిండులమధ్య పరుపుపైన కూర్చుని, లెక్కల వాలుబల్లమీద పద్దులపుస్తకాలు చూసుకుంటున్న మధ్యవయస్కుడైన కందప్ప గబగబ సభాపతయ్యగారివద్దకివచ్చి, నమస్కరించి, “అయ్యగారూ! ఏమి సెలవు? కబురంపితే తమ దర్శనం చేసుకునేవాడినికదా?” అంటూ లోపలికి తీసుకువెళ్ళి మెత్తటికుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలవద్ద కూర్చున్నాడు. నవ్వుతూనే సభాపతయ్యగారు టూకీగా విషయాలన్నీ వివరిస్తూ, భారతిగారిచ్చిన తాళపత్రం చెట్టియారు చేతిలో పెట్టేరు. అతడికి, ఇటువంటి వ్యవహారాలు సుపరిచితమే కనుక, ఆ తాటాకుని రెండువైపులాచూసి, ఈశాన్యంలోని ఇనపపెట్టెని భద్రంగాతెరిచి, నూరు నోట్లున్న ఒకరూపాయి నోట్ల కట్టని తీసుకువచ్చి, సవినయంగా సభాపతయ్యగారి చేతిలో పెట్టేడు. ఆయన ఆ కట్టని కళ్ళకద్దుకుని, “ఇదంతా ఆ చిదంబరేశ్వర ముగ్ధశిశువైన భారతిగారి వదాన్యత. నా బిడ్డ పుణ్యం అంతటిది” అన్నారు. ఈలోపుగా కందప్పగారు పండ్లు, తాంబూలము తీసుకురప్పించి, కంచి పట్టుచీరలు, బనారసు పట్టు తాపితాలు (తన వస్త్ర విక్రయశాలనుంచి తీసుకురప్పించి), ఏభైరూపాయల దక్షిణతో సభాపతయ్యగారి చేతిలోపెట్టి, “గురువుగారూ! మమ్మలినందరినీ ఆ శీర్వదించండి. ఈ తాంబూలం స్వీకరించి, ఈ పట్టు వస్త్రాలు వివాహంలో వినియోగించి, నన్ను ధన్యుడిని చెయ్యండి. మీ ద్వారా నాకు అందిన ఆ తాళపత్రం మీద ఒకవైపు మీకు ఇవ్వవలసిన నగదు, అదిపోగా నావద్దమిగిలే, శ్రీవారి నికర సొమ్మునిల్వ మొదలైన తబిసీలు వ్రాసేరు. ఆ పత్రానికి రెండవవైపు, భారతి అయ్యగారు “ఆభోగిరాగం”లో, రూపకతాళంలో రచించిన “సభాపతికి వేరె దైవం సమానమాగుమా” అనే కృతివుంది, తమరుకూడా చిత్తగించండి” అంటూ, వినయంగా తాళపత్రాన్ని, సభాపతయ్య చేతిలో పెట్టేడు. ఆ కృతిని ఆమూలాగ్రం పరిశీలించి, కందప్పకి తాళపత్రాన్ని సభాపతయ్య సభక్తిగా తిరిగి ఇచ్చేసేరు. కందప్ప చెట్టియారు, సభాపతయ్యగారిని వీధిలోని తన గుర్రపుబగ్గీలో వారి ఇంటికి సాగనంపేరు. వివాహానికి గోపాలకృష్ణభారతిగారు స్వయంగా విచ్చేసి, “కారైక్కాల్ అమ్మన్ చరిత్రం” హరికథాకాలక్షేపంచేసి, వధూవరులని ఆశీర్వదించి, వివాహశుభకార్యాన్ని సర్వశోభాయమానంగా దగ్గరుండి నిర్వహింపజేసేరు.
— — — — — — — — — — — — — — — —
తమిళకృతినిర్మాణ సంగీతప్రపంచంలో “తమిళత్యాగరాజు“గా ప్రత్యేకగౌరవం పొందిన ఏకైక కృతికర్త, శ్రీ గోపాలకృష్ణభారతి. వారు, తంజావురువద్దవున్న ముడికొండాన్ గ్రామంలో పుట్టేరు. తండ్రిగారు శివరామభారతి. తాతగారు రామస్వామిభారతి. ముత్తాత కోదండరామభారతి. వారి కుటుంబపరంపరలో అందరూ వైణికవిద్వాంసులూ, సంస్కృతపండితులూను. గోపాలకృష్ణభారతిగారు, బాల్యంలోనే తలిదండ్రులని పోగొట్టుకున్నారు. వారు భరద్వాజగోత్రానికిచెందిన తమిళ బ్రాహ్మణులు. వారి చిన్నతనమంతా సరైన సంరక్షణలేకండా గడిచిపోయింది. వారు, తంజావూరుజిల్లాలోని కూత్తనూరు, సరస్వతీదేవి ఆలయంలోని పాకశాలలో వంటవాడిగా పని చేసేరు. ఆ సమయంలో సరస్వతీదేవి వారికి సాక్షాత్కరించి, సంస్కృత, తమిళ భాషాసారస్వతాలలోను, సంగీతశాస్త్రంలోను అపారవిద్యావైదుష్యాన్ని అనుగ్రహించిందని ఐతిహ్యం ద్వారా తెలుస్తోంది.
వారు ఆజన్మ నైష్ఠిక బ్రహ్మచర్యదీక్షావ్రతులై, శ్రీ గోవిందయతీశ్వరులవారి శుశ్రూషలో, వేదవిద్యని అభ్యసించేరు. “ఎంగళ్ గురునాథరుడైయ” అనే, రూపకతాళంలోని “సురటి“రాగ కృతిలో ఈ వివరాన్ని వారు వెల్లడించేరు. ఆ తరవాత ౘాలా కష్ట-నష్టాలని ఓర్చుకుని సంగీతగానకళాకోవిదులయ్యేరు. మన తెలుగుప్రాంతంలో “హరికథ“గా మనం పిలుచుకునే “భాగవతవిద్య” లో ప్రావీణ్యం పొందేరు. అకుంఠిత స్వయంకృషితో అనేకభాషలలో విద్వత్తుని సంపాదించేరు. ఉత్తరభారత సంగీతసంప్రదాయంలోని వివిధ రాగాల ప్రయోగ కళానైపుణ్యంలో సిద్ధహస్తులయ్యి, బేహాగ్ , హమీర్ కల్యాణ్ వంటి రక్తిరాగాలలో పరమరమ్యకీర్తనలని విరచించేరు.
యోగశాస్త్రవిద్యని అధ్యయనంచేసి, నిత్యాభ్యాసంద్వారా యోగవిద్యా విశారదులుగా యశస్సుని ఆర్జించేరు.
తెలుగులో త్యాగరాజులవారి సంగీతకృతినిర్మాణ శైలియొక్క సౌలభ్యాన్ని, భారతి గారు తమిళకృతినిర్వహణలో ౘక్కగా వినియోగించేరు. పరోక్షగురువుగా, వారిని స్వీకరించి, వారి సంగీతనాటకాలని, అంటే యక్షగాన ప్రక్రియలో ఆవిర్భవించిన “ప్రహ్లాదభక్తి విజయం“, “నౌకాచరిత్రం” లని అనుసరించి తమిళభాషలో “నందనార్ చరిత్రం” అనే విస్తృత సంగీత ప్రబంధం(musical opera)ని మహాద్భుతంగా విరచించేరు. అది ఆయన రచనలలో అగ్రగణ్యకృతి (Magnum Opus) మాత్రమేకాక యావత్ దక్షిణభారతసంగీతంలోనే ప్రత్యేక సంగీతరచనగాను, తమిళసంగీతచరిత్రలో గౌరీశంకరశిఖరతుల్యంగాను వెలుగొందుతోంది. తమిళంలోని పవిత్రగ్రంథరాజాలలో ఒకటైన “పెరియపురాణం” లో, కేవలం 37 పద్యాలకిమాత్రమే పరిమితమైన, 63 శివపరమభక్తులైన నాయనార్లలో ఒకరైన నందనారు చరిత్ర సంగ్రహాన్ని, 259 పాటలు-పద్యాలతో, పరమ రమణీయమైన తమిళ సంభాషణల బాహుళ్యంతో సుమారు 15 నుండి 20 గంటలుపాటు మూడురోజులలో నిర్వహించబడే విస్తారమైన శ్రవ్య/దృశ్య మహాకావ్యంగా మలచిన మహారచయిత శ్రీ గోపాలకృష్ణభారతివరిష్ఠులు. ఇంకొక మూడు చిన్న సంగీత ప్రబంధాలనికూడా వారు రచించేరు. అవి,
(1) “కారైక్కాల్ అమ్మన్ చరిత్రం”;
(2) “తిరు నీలకంఠనాయనార్ చరిత్రం”;
(3) “ఇయర్పగై నాయనార్ చరిత్రం” అనే పరమ పావనమయ సంగీత-సాహిత్య భక్తిరసభాండాలు.
వారు కథాకాలక్షేపానికికాని, సంగీతసభకికాని, ఆ రోజులలో అరవై రూపాయలు తీసుకునేవారు. ఐతే ఆ సొమ్ముని వ్యక్తిగత వ్యయాలకి వాడుకునేవారుకాదు. ఆ డబ్బుని, ఆ యా యజమానులవద్దనేవుంచేసేవారు. తనవద్దకి పేద గృహస్థులు, ఉపనయనాలకి, వివాహాలకి ధనసహాయంకోసం వచ్చినపుడు, ఆ యా గృహస్థులకి అవసరమైనసొమ్ముని ఇవ్వవలసినదిగా ధనవంతులైన తన కథాకాలక్షేపాదులకి ప్రతిఫలం ఇవ్వవలసిన యజమానులలో ఒకరికి తాళపత్ర లిఖిత ఆదేశంతో పురమాయించేవారు. ఆ తాళపత్ర ఆదేశాలు (palm-leaf cheques) ఇప్పటికీ ౘాలవరకు భద్రంగానేవున్నాయి. వాటికి ఒకవైపు ఒక పరమ రమ్యసంగీతకృతివుంటుంది. రెండవవైపు సొమ్ముకి సంబంధించిన ఆదేశంయొక్కవివరాలతోబాటు, అప్పటివరకు జరిగిన వ్యవహారాల తబిశీలు, ఆనాటికి సొమ్ము నికరనిల్వకూడా ఉంటాయి. అటువంటివి ఇంకా సంగ్రహించవలసినవి కొన్ని ప్రాంతాలలో, కొందరి గృహాలలో, ఉండిపోయేయని పెద్దల అభిప్రాయం. ఆయన విడికృతులు 180 గాను, “సంగీత ప్రబంధాలు“లోనికృతులు 426 గాను గణించి, వారి మొత్తం కృతులు-సంకీర్తనలు మొదలైనవన్నీ కలిపి 1,000 వరకు ఉంటాయంటారు. వారి విడి కృతులలోమాత్రమే, “గోపాలకృష్ణ” అనే ముద్రవుంటుంది.
ఆ కాలానికి ౘాలావరకు భారతభూభాగం ఆంగ్లేయప్రభుత్వపాలనలోనేవున్నా, కొన్ని ప్రాంతాలుమాత్రం ఫ్రెంచిప్రభుత్వాధీనంలోవుండేవి. ఆ విధంగా కారైక్కాల్ ప్రాంతం, ఫ్రెంచివారికిచెందివుండడంవల్ల, అక్కడి ప్రభుత్వ కలెక్టరైన సీసేగారు, “నందనార్ చరిత్రం” గురించి, దాని కర్త/ప్రయోక్త ఐన గోపాలకృష్ణభారతిగారిని గురించి దశదిశల మారుమ్రోగుతున్న కీర్తి-ప్రఖ్యాతులని ఆలకించి, భారతిగారిని కారైక్కాల్ ఆహ్వానించి, ఆయన “కథాకాలక్షేపం” విని ముగ్ధుడై, “నందనార్ చరిత్రం” గ్రంథాన్ని మొదటి సారిగా 11—11—1861వ తేదీన ముద్రితప్రతులని విడుదల చేసేరు. ఆ పుస్తకం రెండవ ముద్రణ 1862, ఆగస్టులో విడుదలయ్యింది. ఆ నాటి సువిఖ్యాత తమిళ పండితులైన ఆరుముగ నావలర్ , మీనాక్షిసుందరం పిళ్ళైల వంటి వారి మన్ననలని పొందిన పుస్తకం అది. శ్రీ రామలింగస్వామి వంటి యోగీశ్వరుల ఆదరణని నందనార్ చరిత్రం చూరగొంది.
అత్యాశ్రమి అయిన శ్రీగోపాలకృష్ణభారతివర్యులు, 1896వ సంవత్సరంలోని, “మహాశివరాత్రి” మహితపర్వదినమందు, తనువు పంచత్వంపొందగా, తాను చిదంబరేశ్వరునిలో ఐక్యం ఐపోయేరు.
వారు ధన్యాసి, శ్రీరంజని, కాంభోజి, శహాన, కేదారగౌళ, కీరవాణి, బిలహరి, బేగడ, యదుకుల కాంభోజి, దర్బారు, మధ్యమావతి, శ్రీ, దేవగాంధారి, సామ, ముఖారి వంటి జనబాహుల్యంలో బాగా ప్రచారంలోవున్న రాగాలనే కాకుండా, నాటకప్రియ, సరసాంగి, ఆహిరి, మాంజి, జగన్మోహిని వంటి అప్రచలిత రాగాలలోకూడా అనుపమాన సుందర రచనలు చేసేరు.
శ్యామాశాస్త్రిగారి “బ్రోవవమ్మ! తామసమేలే | దేవి! తాళలేనే, బిరాన“|| అనే మాంజిరాగంలోని కృతి, ఆ రాగంలోని జీవసంచారాలనన్నీ ఎంత కరుణరసమయభరితంగా సుస్పష్టంగానూ, సమగ్రంగానూ సంగ్రహించిందో అంత ప్రతిభావంతంగానూ ప్రభావమయంగానూ, భారతిగారి “నందనార్ చరిత్రం” లోని పాట, “వరుహ(గ)లామో, అయ్యా!” కూడా చేసింది. ఈ రాగంలో ఈ రెండు కృతులకివున్న స్థానం అనిదంపూర్వమైనది.
అటువంటి శ్రీ గోపాలకృష్ణభారతిగారికి సాష్టాంగంగా ప్రణమిల్లుదాం!
స్వస్తి|
_/\_.
గోపాలకృష్ణ భారతి
దీపారాధనము చేసి దివ్యార్చనగా
చూపితివె మాకు నీ దే
వీపూజల వక్కలంక వెంకటకృష్ణా!
గోపాలకృష్ణభారతిగారు, వృద్ధాప్యం పైబడినతరవాత,
తాము వివిధ యజమానులవద్ద మిగిల్చిన పైకాన్నంతటినీ,
లెక్కననుసరించి, పోగుచేసి, చిదంబరం/మాయావరం
దేవస్థానాలలో, ఆ సొమ్ముతో, శాశ్వతనిధులని ఏర్పాటు
చేసేరు. ఆ నిధులతో ప్రత్యేక దైవ కైంకర్య సేవలు జరిపే
వ్యవస్థని సమకూర్చేరు. ఇప్పటికీ, చిదంబరంలో,
“కృష్ణ శంబా” అనే పేరుతో, “అర్ ద్దజామ కట్టళై” అనే
కైంకర్యాన్ని సమర్పిస్తూంటారట!
తంజావూరు కృష్ణభాగవతర్ (1847-1903); “ఆధునిక
కథా కాలక్షేపం” నిర్మాతగా తమిళదేశంలో సుప్రసిద్ధులు.
“నందనార్ చరిత్రం”ని తమిళనాడులో బాగా ప్రచారం
చేసిన ధన్యభాగవతోత్తముడు. గోపాలకృష్ణభారతిగారి
సమక్షంలో నందనారు కథ కాలక్షేపంచేసి, ఆయనయొక్క
ప్రత్యక్ష ఆశీస్సులనందుకున్న మహానుభావుడు.
Simply superb!
భగవదనుగ్రహం ఎవరిమీద ఎలా ప్రసరిస్తుందో ఎవరెరుగుదురు?
జన్మాంతర సంస్కారం ఎంతటిదని మాత్రం ఎవరు చెప్పగలరు?
మహా మనీషి శ్రీ గోపాలకృష్ణ భారతి వారి ఉదాత్త చరితను
చదివితే, ఈ సందేహమూ కలిగింది…దానికి
సమాధానమూ లభించింది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని, సరియైన సంరక్షణ
లేకుండా, ఎన్నో కష్టాలమధ్య పెరిగిన ఒక బాలుడు–ఓ గొప్ప
వేదపండితుడు, బహుభాషాకోవిదుడు, మహా సంగీతమర్మజ్ఞుడుగా
అయిన గోపాలకృష్ణ భారతి వారిని గురించి చదివేకా అది అపార
భగగవదనుగ్రహం కాకపోతే ఏమనాలి? బహుశా ఆయన పాకశాలలో
వంటవానిగా ఆ సరస్వతీమాత నైవేద్యానికి అతి రుచికరంగా చేసిన
ప్రసాదాల మహిమే అయ్యుంటుంది.
సభాపతయ్యకి అత్యంత వినయ విధేయతలతో వారు చేసిన
సహాయము, అసలు వారు చేసిన కచేరీలు/ కథాకాలక్షేపాలు ద్వారా
తీసుకున్న పారితోషికాన్ని వినియోగించిన పద్ధతీ ఎక్కడా వినలేదు.
మనసుని కదిలించింది.
తంజావూరు కృష్ణభాగవతరుగారు, సంగీతంలోను,
“కథాకాలక్షేపం”లోను మహావిద్వత్కళాకారుడు. ఊహాతీతమైన ప్రజాదరణ కలిగిన పుంభావసరస్వతి.
ఆయన, “నందనారు చరిత్రం”లోని పాటలకి, పద్యాలకి
కొన్నింటికిమాత్రం, భారతిగారు కూర్చిన రాగాలు కాక,
వేరే ఎక్కువ జనరంజక రాగాలతో వరసలుకట్టి, ఆ రాగాలలో పాడి, ఆ కథకి పరమజనాదరణని కలిగించేరు.
ఐతే, ఈ విషయంలో భారతిగారికి అంగీకారం కలగడం
కోసం, వారిద్దరికి పూర్వపరిచయంలేకపోవడంవలన,
భారతిగారి ప్రియశిష్యుడు వేదనాయకం పిళ్ళై, కృష్ణ భాగవతరుగారి కథాకాలక్షేపం ఏర్పాటుచేసి, భారతిగార్ని
భాగవతరుగారికి పరిచయం చెయ్యకుండా, నందనారు కథని వినిపింపజేసేరు. కార్యక్రమానంతరం, భాగవతరుకి,
భారతిని పిళ్ళైగారు పరిచయంచేసేరు. కృష్ణభాగవతరు,
భారతిగారిని పదే-పదే మన్నింపువేడుకుని, పిళ్ళై చేసిన
పనికి శతవిథాల నొచ్చుకున్నారట! “నా వలన తమరికి
అపచారం జరిగింది. నన్ను క్షమింౘండి. మీ కథలోని
పాటలకి, పద్యాలకి, మీ అనుమతిలేకుండా, నా స్వంత
వరసలలో పాడి ప్రజల ఆదరణని పొందుతున్నాను”
అంటూ ఎంతో వాపోయేరట! దానికి భారతిగారు నవ్వుతూ, వారి మార్పులన్నీ మనోహరంగావున్నాయని,
ఇకమీదట ఆ కథంతా ఆ బాణీలలోనే నడవాలని,
ఆశీర్వదించేరట! ఇప్పుడు మనకి లభ్యం ఔతున్న
కథాకాలక్షేపం, అదే!
అక్కినేని నాగేశ్వరరావుగారు, అంజలీదేవిగారు నటించిన
అలనాటి గొప్ప ‘మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్ ‘
సినిమా ఐన “జయభేరి”లోని, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి
హరికథ, “నందుని చరితము వినుమా!
పరమానందము కనుమా!” ఘంటసాలగారి కమనీయ
కంఠశాలలో శాశ్వత మాధుర్యాన్ని సంతరించుకుంది.
ఆ హరికథకి మూలం, గోపాలకృష్ణభారతివరుల
“నందనారు చరిత్రం” కావడం గమనార్హం!
“జయభేరి”లో, ‘నందనారుచరితం’ హరికథ రచన
చేసినది, శ్రీశ్రీ. పొరబాటున మల్లాదివారిది అని
వ్రాయడం జరిగింది. పొరబాటు క్షంతవ్యం!