సాహిత్యము-సౌహిత్యము – 51 : జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్

ఐం శ్రీశారదా పరదేవతాయై నమః|

28—04—2018;  శనివారము|

శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్నా|

సాహిత్యము—సౌహిత్యము~51|

ఈ వారంకూడా రాజశేఖర-వేంకటశేషకవుల “అవధాన సారము” లోని మరొక విలక్షణ సమస్యాపూరణాన్ని తిలకించి పులకిత మనస్కులమౌదాం! ఇప్పుడు సమస్యని పరిశీలిద్దాం!

“జగద్వ్యాప్తములయ్యె ఇరులు ఖరకరుడుండన్ “||

సమస్యని చూచీచూడగానే ఏ ఛందస్సో తెలియదు. ఇది మొదటి సమస్య. ఐతే, సమస్యలోని ముందు అక్షరం తీసి, పై పాదంలోకి పంపితే, ఇది కందపద్యపాదం అని తెలియడంవల్ల ఆ సమస్యకి ఈ సమాధానం సరిపోతుంది. కాని, ఆ సమస్య తొలగినంతమాత్రాన ‘అమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోడానికి వీలులేనంత ఉక్కిరిబిక్కిరి ప్రాసస్థాననిర్వహణలో పైకే పెల్లుబుకుతోంది. అది సరిపోదన్నట్టు “సూర్యుడుండగానే లోకమంతా చీకటిమయమయ్యింది” అని మనవేపు పెదదవిపై నవ్వునీ, నొసటిపై వెక్కిరింతనీ చూపిస్తూ, సమస్య పాదంయొక్క భావం మరొకటి, మన ప్రాణానికి ఐనా మనకేమీ ఇబ్బందికలగకుండా, కవిద్వయంవారు – అంటే “రాజశేఖర-వేంకటశేషకవులు” సమస్యని మహాభారతార్థపరంగా ఎంత అందంగా, అలవోకగా, సమయస్ఫూర్తితో పూరించి, రసబంధురంగా రక్తికట్టించేరో గమనించి సరసహృదయులు ఆనందించండి:-

“సద్వ్యాఘాతము నిండె, వి

యద్వ్యాపృతి శౌరి చక్ర మడ్డుపరుప, ఆ

పద్వ్యధితుడయ్యె క్రీడి, జ

గద్వ్యాప్తములయ్యె ఇరులు, ఖరకరుడుండన్ “||

“(పాండవ-కౌరవ యుద్ధభూమిలో, సైంధవవధ రోజున) అర్జునుడు తన ప్రతిజ్ఞాభంగమవ్వడంవల్ల వచ్చే ఆపదలని ఊహించుకుని బాధపడుతున్నాడు. శ్రీకృష్ణుడి సుదర్శనచక్రం ఆకాశానికంతటికీ అడ్డుపడడంవలన, నక్షత్రాలతోసహా కాంతిమండలాలన్నీ కనిపించకుండా పోయేయి. అందువలన, ఆకాశంలో సూర్యుడుండగానే లోకమంతా చీకటులు కమ్ముకున్నాయి”.

ఇక్కడొక అందమైన స్వారస్యాన్ని మనం గ్రహించాలి. కేవలం ప్రత్యక్ష నారాయణస్వరూపమైన సూర్యనారాణమూర్తికి, వ్యక్తావ్యక్త ఆదిమూల శ్రీమన్నారాయణుడే స్వయంగా శ్రీకృష్ణభగవానుడై తన సంకల్పంతో సుదర్శనచక్ర దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశాన్నంతా ఆచ్ఛాదింపజేసి, బాహ్యప్రంచాన్ని గాఢాంధకారబంధురం చేసేడు. కాని, మానవుడైన అర్జునుడు, తన ప్రతిజ్ఞాభంగభయంతో, సాక్షాత్తుగా శ్రీమన్నారయణునిసమక్షంలోనే,  ఆయన అనుగ్రహరూపమైన సూక్ష్మజ్ఞానకాంతి ప్రసారానికి, తనవ్యధఅనే జీవభావమయ యవనికని అంతరాయంగాచేసుకుని, మోహంతో, తనపైన లేనివి, స్వయంగా భగవానుడే తనపైన వేసుకుని తానే పరిష్కరిస్తూన్నవి అయిన  బరువు బాధ్యతలని తన తలకెత్తుకుని, తన అంతరంగాన్ని దుఃఖభ్రమితం చేసుకుని, సాక్షాత్భగవద్విలాస దివ్యలీలావైభవాన్ని దర్శించలేని అవిద్యతో మమైకం ఐపోయే సామాన్యజీవుడిలాగవున్నాడు!

ఇది ఒక అంతర్గతచిత్రం, విచిత్ర జీవలక్షణమూను!

స్వస్తి||

You may also like...

4 Responses

  1. Dakshinamurthy M says:

    ఎప్పటి లాగే ఇది ఒక చక్కటి సాహిత్య రస గుళిక. అందించిన మీకు ధన్యవాదములు.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    గట్టి సమస్యే, దీన్నో
    పట్టాన పరిష్కరించి ప్రాసను కూడా
    గిట్టించారే! దణ్ణం
    పెట్టాలోయ్ వక్కలంక వెంకటకృష్ణా!

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      చివరిపాదంలో “పెట్టాలోయ్” కి బదులుగా “పెట్టొచ్చును” అని పెట్టొచ్చును.

  3. సి.యస్ says:

    సమస్యాపూరణ చాలా గొప్పగా ఉంది. మంచి పద్యం. అవధానుల
    ప్రతిభా పాటవాలని తెలియజేసే క్లిష్టత ఉన్న ప్రాస.
    అయితే, కింద ఇచ్చిన వ్యాఖ్యానం మరింత ఆలోచింప
    చేసేదిగా ఉంది. యుద్ధం ప్రారంభించడానికి ముందు భగవానులు
    చేసిన గీతాబోధ ఆ క్షణం అర్జునునికి ఉపకరించ లేదన్నమాట. మళ్ళీ నువ్వు చెప్పినట్టు అవిద్యతో మమేకం అయిపోయి సామాన్యజీవు డయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *