శారదా సంతతి — 40 : వేణుగానానికి శాస్త్రీయసంగీతసభాగౌరవం కలిగించిన పండిత్ పన్నాలాల్ ఘోష్
ఐంశ్రీశారదా పరదేవతాయై నమః|
15—04—2018; ఆదిత్యవాసరము.
శ్రీశారదా కృపాచంద్రిక |
“శారదా సంతతి ~ 40″| వేణుగానానికి శాస్త్రీయసంగీతసభాగౌరవం కలిగించిన పండిత్ పన్నాలాల్ ఘోష్ | (24—07—1911 నుండి 20—04—1960 వరకు)
శ్రీకృష్ణుడికి పెదవులపై వేణువు ఉంటుంది. రాధాదేవి వామభాగంలో ఆయనని అంటిపెట్టుకుని ఉంటారు. ముగ్ధమోహనముఖానికి అందాన్ని ఇనుమడింపచేస్తూ వెలుగులీనే నెమలి పింఛం తలపైనవుంటుంది. వ్యత్యస్తపాదాలని నాలుకతో తనివితీరా నాకుతూ, పొదుగులోపాలుత్రాగుతున్న లేగదూడని కలిగిన ఆవు ఉంటుంది. దశదిశలనీ అమలిన సహజ పరిమళభరితంచేసే తులసిమాల కంఠాభరణమై, వక్షస్థలాన్ని అలంకరిస్తూంటుంది. ఈ ఐదూ, భక్తుడి సాధన జీవితాన్ని పవిత్రపూర్ణంచేసే (స్థూలపంచభూతాలకి, సూక్ష్మరూపమైన) పంచతన్మాత్రలకి-అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకి పావనసంకేతాలు. ఆ పంచతన్మాత్రల గవాక్షాలద్వారా ప్రసరించే మనఃప్రత్యయానికి ఆశ్రయస్థానాలు.
“మనోరూపేక్షుకోదండా“, “పంచతన్మాత్రసాయకా” ఐన శ్రీమాత తన భక్తులని అనుగ్రహించే కటాక్ష వైభవమే వైష్ణవ వైశిష్ట్య తత్త్వ భరిత సౌందర్య భావంతో ఇక్కడ శ్రీకృష్ణులవారి అలంకరణలరూపంలో ఆరాధకలోకానికి ఆలంబనస్థానమై విరాజిల్లుతోంది.
అనాహతనాదానికి, ఆహతనాదాలకి మూలస్థానము, ఆయువు పట్టువంటి పరమనాద సంజ్ఞకమైన ప్రణవగానానికి శ్రీకృష్ణుని వేణువు దివ్యవాహిక. వ్యాసభాగవతమహాపురాణంలోని దశమస్కంధమందు 21వ అధ్యాయం “వేణుగీతం“గా ప్రసిద్ధి పొందింది. “వశ్చ బ్రహ్మానందశ్చ, ఇశ్చ విషయానందశ్చ- (వ+ఇ) ‘వే’; తౌ ద్వౌ ఆనందౌ అణూ భవతః యస్మిన్ అసౌ = వేణుః”|
అంటే, ‘వ’ బ్రహ్మానందానికి, ‘ఇ’ విషయానందానికి సంకేతాలు. ఈ రెండు ఆనందాలూకూడా దేని సహజ ఆనంద మూల స్వరూపంలో లయమైపోతాయో అది “వేణువు“యొక్క నాదంనుండి పుట్టే నిరతిశయానందం – అని వ్రజభాగవత రసానుభవవేత్తలైన నిరంతర నిర్మల శ్రీరాధాకృష్ణ ఉపాసనాతత్పరులు చెపుతారు. శ్రీకృష్ణుడి వేణుగానం వర్ణిస్తూ, “రంధ్రాన్ వేణోః అధరసుధయా పూరయన్ “, “క్వణిత వేణువిచిత్రగీతం“, “తదుదితం కలవేణుగీతం“, “కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషం“, “వేణుస్వనైః కలపదైః” అనే ప్రత్యేక సంగీతసంబంధ సాంకేతిక శబ్దప్రయోగాలద్వారా, ఆయన వేణుగానం చేసిన సంగీతవిషయాల వివరాలు మనకి వ్యాసులవారు తెలియజేసేరు. ఈ వర్ణనలద్వారా శ్రీకృష్ణుడు స్వర తాళ నిబద్ధమైన ప్రాచీన భారతీయ శాస్త్రీయ మనోహర రాగ సంగీతాన్ని తన వేణుగీతంద్వారా వినిపించేడని తెలుసుకోవాలి. The usage of specific words such as “Geetam” and “Padaih” by Sage Vyasa unmistakably mean compositions in melodic music in which Ragas are employed of which tonal registers and time-cycles are inseparable parts. So Sri Krishna’s flute-music is not at all pastoral or any other variety of non-classical version of music at least in this context.
మహాకవి కాళిదాసు నాట్యాన్ని “చాక్షుష క్రతువు” అన్నాడు. అదేవిధంగా సంగీతంకూడా “శ్రవణ క్రతువు”గా గ్రహించగలగాలి. అలాగకాకపోతే, “గాంధర్వవిద్య” వేదానికి ఉపాంగ ప్రతిపత్తిని కలిగివుండడానికి అవకాశంలేదు. అందువల్లనే పోతనగారు తెలుగు భాగవతంలోని అదే ఘట్టంలో ఇలాగ వర్ణించేరు.
“మౌళిపింఛము, కంఠదామమును మెరయ,
విలసిత గ్రామముగ ఒక్క వేణువందు|
బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగ చేసె,
చతురనటమూర్తి గోపాలచక్రవర్తి”||
“శిరమున నెమలిపింఛము, మెడలో వనమాల వెలుగులీనుతుండగా, (పూర్ణశాస్త్రీయ సంగీతమునకు సంబంధించిన షడ్జ,మధ్యమాది రీతులతో కూడిన) గ్రామమూర్ఛనలను ౘక్కగా వెలయజేయుచు శ్రీకృష్ణుడు తన మురళీగానముద్వారా సామవేదసారమైన ‘బ్రహ్మగాంధర్వగీతము’ వినిపించెను”. ఇక్కడ “బ్రహ్మగాంధర్వం” అంటే ఏమిటో తెలియాలంటే, “తైత్తిరీయోపనిషత్తు” లోని “బ్రహ్మానందవల్లి” లోవున్న, అష్టమానువాకం వివరించిన “ఆనందమీమాంస“ని పూర్తిగా అవగాహనచేసుకోవాలి. అటువంటి “బ్రహ్మానంద దాయకమైన గాంధర్వ వేణుగానం”, శార్ఙ్గదేవుని ‘సంగీతరత్నాకరం’ లో ప్రస్తావించబడిన “గ్రామ విభాగ వర్ణరచనాలంకార జాతిక్రమః” అయిన సంగీతమే అని పోతనగారిచే ప్రయోగించబడిన “గ్రామము” అనే సంగీత శాస్త్రసంబంధమైన సాంకేతికపదం వెల్లడిచేస్తోంది.(“Grama” is a technical word used in Musicology.)
అంతేకాక, “శ్రీదేవీ వేణుమాశ్రిత్య రేమే కృష్ణముఖాంబుజే“( శ్రీరాధాదేవి వేణురూపాన్నిధరించి శ్రీకృష్ణముఖపద్మాన్ని ఆశ్రయించి ఆనందించింది) అనికూడా పెద్దలంటారు.
ఇదంతా ఎందుకు చర్చించవలసివచ్చిందంటే, వేణువు మేకల/గొర్రెల/పశువుల కాపరుల బూరావంటిది అని చాలామంది ఉపన్యాసాలలోను, గ్రంథాలలోను అన్నారు. కృష్ణుడిని pastoral boy అని, ఆయన వేణువుని, pastoral musical instrument అని, దానికి శాస్త్రీయ సంగీతవాద్యసామర్థ్యం లేదని అన్నారు. ఇటీవల కాలంలో ఆ పరిస్థితి ఏర్పడివుండవచ్చు. కాని, ద్వాపరయుగకాలానికి అది సంపూర్ణశాస్త్రీయ ప్రబంధ/నిబద్ధ సంగీతం (well-composed classical music of melodic system, which can be construed as “pre-Dhrupad Music”.) వాయించడానికి వినియోగించబడినట్లు భాగవతమహాపురాణంలో ఉన్న ఆధారాలని మనం పైన సంక్షిప్తంగా వివరించుకున్నాం.
ఐతే, ఆ తరవాతకాలంలో ఆ విద్య మరుగునపడిపోయివుండవచ్చు. జానపదులు వాయించుకునే మురళి మాత్రమే మనకి మిగిలివుండవచ్చు. మళ్ళీ పండిత్ పన్నాలాల్ ఘోష్ గారు పూనుకునేవరకు అది జానపద సంగీతానికి పరిమితమైపోయివుండవచ్చు.
ఈ వారం ఉత్తరభారతసంగీత వేణుగాన విద్వత్కళాకారుడు శ్రీ పన్నాలాల్ ఘోష్ గురించి ముచ్చటించుకుందాము.
1911వ సంవత్సరం, జూలై 24వ తేదీన, తూర్పు బంగరాష్ట్రం(ఇప్పటి బాంగ్లాదేశ్ ) లోని బారిశాల్ జిల్లాలోని అమానత్గంజ్ అనే ఊరిలో పన్నాలాల్జీ జన్మించేరు. వారి తల్లిగారి పేరు సుకుమారి ఘోష్ . ఆమె ౘక్కని గాత్రంతో సంప్రదాయ వంగ సంగీతాన్ని పాడేవారు. కొడుకుకి మంచి సంగీతం నేర్పించాలని ఆమె ౘాలా కుతూహలపడేవారు. తండ్రిగారు శ్రీ అక్షయకుమార్ ఘోష్ , ఆంగ్లేయ ప్రభుత్వోద్యోగి. అంతేకాక, ఆయన సితార్ వాద్యనిపుణులు. తాతగారు, హరకుమార ఘోష్ , గొప్ప సంగీతవిద్వాంసుడు. పన్నాబాబు అసలుపేరు అమలజ్యోతి ఘోష్ . పన్నాబాబుకి సంగీతప్రీతి ఏర్పడడానికి, అందునా బాన్సురీ వేణువు (ఉత్తరభారత సంగీత సంప్రదాయానికిచెందిన వేణువు – కర్ణాటకసంగీతవేణువుకి భిన్నంగా, పెద్దగావుంటుంది) వాయించడంలో కుతూహలం కలగడానికి తాతగారైన హరకుమార ఘోష్ గారు పరోక్షకారణం అని చెప్పవచ్చు. సితారు, తబలా, పఖవాజ్ (ఉత్తరభారత ధ్రు(వ)పదసంగీతంలోని ప్రక్క(తాళ)వాద్యం, కర్ణాటక సంగీతంలోని మృదంగరూపంలోనే వుంటుంది) లలో తాతగారికి నైపుణ్యం ఉండేది. అందువల్ల బాల పన్నాబాబుకి సంగీతంలో గాఢమైన అభిరుచికలిగి తాతగారివద్ద తబలా, సితారు బాగానే అభ్యసించినా వేణునాదం ఆయనని అమితంగా ఆకట్టుకుని,బాన్సురీ వారి నిత్యజీవితంతో పెనవేసుకుపోయింది. ఆ విధంగా పన్నాబాబు జీవితానికి బాన్సురీ, ఆధునిక ఉత్తరభారతసంగీత చరిత్రలో బాన్సురీకి పన్నాబాబు పరస్పర అవిభాజ్య ఆలంబనాలై అలరారడం ఒక చారిత్రక సత్యం.
పన్నాబాబుకి మొదటినుంచి దేహదృఢత్వాన్ని తీర్చిదిద్దే శారీరకవ్యాయామాలు అంటే వల్లమాలిన ఇష్టం ఉండేది. అందువల్ల ఆయన మల్లవిద్యాశాలలో చేరి కుస్తీపట్లు నేర్చుకున్నారు. యుద్ధకళానైపుణ్యానికిసంబంధించిన విలువిద్య, ఖడ్గయుద్ధవిద్య అంటే కత్తిసాము, దండయుద్ధవిద్య అంటే కర్రసాము, వెయ్ట్ లిఫ్టింగ్ , బాక్సింగ్ , షూటింగ్ , జుజూట్సు(జపానుకిచెందిన ఆత్మరక్షణార్థ యుద్ధవిద్య) మొదలైన అనేక విద్యలు అభ్యసించేరు. 1936లో జరిగిన పోటీలలో, Bantam-weight champion అయ్యేరు.
పన్నాబాబు చిన్నతనంలో రెండు విచిత్రసంఘటనలు చోటుచేసుకున్నట్టు చెపుతారు. 9 ఏళ్ళ వయస్సుండగా, వారి ఊరివద్దవున్న ఒక నది ఒడ్డునో లేక ప్రవాహంలోనో సరిగాలేని ఒక వెదురు వేణువు దొరికిందని అంటారు. దానిని ఆయన ౘక్కగా తయారుచేసుకుని దానితో తనకి తోచిన పాటలు వాయించే ప్రయత్నం చేస్తూ, ఆ సాధనలో కృతకృత్యుడై, తల్లిగారి ప్రోత్సాహంతో తన సాధనని కొనసాగించేరట. యుక్తవయస్సు రాబోతుండగా వారి పాఠశాల ఉపాధ్యాయుని మరణానంతరం, కర్మకాండని చూసేందుకు, స్మశానానికి వెడితే ఆయనకి ఒక సాధుమహాత్ముడు అక్కడ కనిపించి పన్నాబాబుని ఆశీర్వదించి, వేణుగానవిద్యని అభ్యసించవలసినదిగా చెప్పి, వేణుగానోపాసన ద్వారా పన్నాబాబు ముక్తిని పొందుతాడని సూచనచేసి, తనవద్దనున్నవేణువుని పన్నాబాబుకి ప్రసాదించేరనే ఐతిహ్యం ప్రచారంలోవుంది.
1928 ప్రాతంలో స్వాతంత్ర్య ఉద్యమం యొక్క ప్రభావం యువతపైన ౘాలా ఎక్కువగావుండేది. పన్నాబాబు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడంవల్ల ఆంగ్లేయప్రభుత్వాధికారుల దృష్టి అతడి మీద పడింది. ప్రభుత్వంవారి నిఘా తప్పించుకోవడానికి, 17 సంవత్సరాల వయస్సు వచ్చినందువల్ల ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి, పన్నాబాబు కలకత్తాలోని తన అక్కగారైన శ్రీమతి పరిమళ కణ రాయ్ వద్దకి వెళ్ళేడు. అక్కగారు ౘక్కని సంగీతజ్ఞానమున్న గాయని. బావగారు, లలితచంద్రరాయ్ మంచి బాక్సింగ్ విద్యానిపుణులు. వారాద్దరివద్ద పన్నాబాబు రెండు విద్యలని బాగా నేర్చుకున్నాడు. ఆ కాలంలో వంగసాహిత్యపత్రికగా ప్రసిద్ధివున్న “ప్రబా(వా)సి” ముద్రణాలయంలో కొంతకాలం పనిచేసేడు. 18 ఏళ్ళ ప్రాయంలో పన్నాబాబుకి పితృవియోగంకలిగి, ఆర్థిక బాధ్యతలు చుట్టుముట్టేయి. ఆ కారణంగా ఆయన కలకత్తాలోని మూకీ సినీ లోకంలోకి అడుగుపెట్టవలసివచ్చింది. బారిసాల్లో బాల్యమిత్రుడైన అనిల్ బిస్వాస్ ని, పన్నాబాబు కలకత్తాకి రావలసినదిగా కోరేరు. అప్పటికే అనిల్జీ మంచి గాయకుడు, గొప్ప సంగీత స్వర రచయిత కూడాను! ఒకసారి కలకత్తాలోని సుప్రసిద్ధకవీశ్వరుడైన కాజీ నజ్రుల్ ఇస్లాంగారి రచనకి అనిల్ బిస్వాస్ సంగీతరూపకస్వరూపాన్నికల్పిస్తూండగా, పన్నాబాబు వేణుగానాన్ని దానిలో కూర్చవలసివచ్చింది. ఆ సందర్భంలో పన్నాబాబు తన చేతిలోని సంప్రదాయసిద్ధమైన వేణువు అటు శాస్త్రీయ సంగీతానికి, ఇటు లలితసంగీతానికి, రెండింటికి సమానస్థాయిలో ఉపయోగించడానికి అనువైనదికాదని గ్రహించేడు. ఆ విధంగా సప్తరంధ్రసమన్విత వేణువు లేక ఏడు కన్నాల మురళి ఆవిర్భవించడానికి తప్పనిసరి సందర్భం ఏర్పడింది.
స్వరపారమ్యసిద్ధాంతకర్త ఐన “మౌసికీ కి ఔలియా” ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాcసాహబ్ గానకళని ఆరాధించే పన్నాబాబు, వేణుగానంద్వారా ఖాcసాహబ్ ‘గాయకీ’ని అంటే వారి ‘గానశైలి’ని యథాతథంగా ఉత్పత్తి చేయటానికి తపస్సుచేసి సాధించేరు. ఆ సాధనక్రమంలోనే భారతీయ సంగీతశైలికి పూర్తిగా అనువైన 26 అంగుళాల పొడవైన వేణువుని లేక బాన్సురీని (కొందరు మిత్రుల సహాయంతో) రూపొందించేరు. ఈ సందర్భంలోనే వారు, ఆయనకాలంలో సుప్రసిద్ధులైన గాన-వాద్య కళాకారులతో సాన్నిహిత్యాన్ని సంపాదించేరు. శాస్త్రీయసంగీతసంబంధమైన సూక్ష్మాంశాలనెన్నో గ్రహించాలనే వారి జిజ్ఞాస, అపార తపన ఆయనని ఒక మహాకళాకారునిగా మలచివేసింది. సంగీతసభలలో ఆయన వేణువాదనానికి, ఆయన తమ్ముడైన పండిత్ నిఖిల్ ఘోష్ తబలా వాయించేవారు. నిఖిల్ ఘోష్ కుమారులిద్దరూ, నయన్ ఘోష్ (సితార్ , తబలా); ధ్రుబ(వ) ఘోష్ (సారంగి) సుప్రసిద్ధ సంగీతకళాకారులే!
దేవేంద్ర మురుడేశ్వర్ (పన్నాబాబుకి అల్లుడుకూడాను), వి.జి.కర్నాడ్ , నిత్యానంద హల్దీపూర్ , హరిపాద చౌధరి, అమినుర్ రెహ్మాన్ , ముకుల్ రాయ్ ,చంద్రకాంత్ జోషి, మోహన నాదకర్ణి, కృష్ణరావ్ దేశాయ్ , మధువంతీ బసు మొదలైన వారియొక్క శిష్యకోటి దేశ-దేశాల ఉన్నారు.
1936లో “న్యూ థియేటర్స్ ” వారి కలకత్తాలోని చలనచిత్రసీమకి చెందిన ఆర్ . సి. బొరాల్ గారితో కలిసి చలనచిత్రసంగీతానికి అవసరమైన వాద్యబృందసంగీతం(orchestra)లో వేణువిద్వాంసుడిగా పనిచేస్తూ, దానికి సంబంధించిన సులువులు-మెలకువలు అన్నీ ౘక్కగా నేర్చుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే హార్మోనియంవిద్వాంసుడు ఉస్తాద్ ఖుషీ మహమ్మద్ వద్ద “గండాబంధన్ ” శిష్యుడయ్యి శాస్త్రీయసంగీతవిద్యనేర్చుకోవడం ప్రారంభించేరు. అనతికాలంలోనే ఆయన దివంగతులయ్యేరు. అందువలన పన్నాబాబు, ధ్రుపద/ఖయాల్ సంగీతాలలో పండితుడైన గిరిజాశంకర చక్రవర్తి వద్ద శిష్యుడిగాచేరి గురు-శిష్య పద్ధతిలో సంగీతం అభ్యసించేరు. అనిల్ బిస్వాస్ తో కలిసి రవీంద్రనాథటాగోర్ , కాజీ నజ్రుల్ ఇస్లాం వంటి మహామహుల రచనలకి ౘక్కని సంగీతం కూర్చేరు. 1938లో ఒక నాట్యబృందంతోకలిసి విదేశయానం చేసేరు. అక్కడి రసజ్ఞులకి మన వేణుగానవిద్యని పరిచయంచేసి వారిని అబ్బురపరిచేరు. అక్కడి వేణువాదనవిద్యలోని సూక్ష్మాంశాలని గ్రహించేరు. ఈ విధంగా సంగీతం నేర్చుకోవడం వారు జీవితాంతమూ కొనసాగించేరు. ఆయన బొంబాయిలోవుండగా “మైహరు“ఘరానా సృష్టికర్త ఉస్తాద్ బాబా అల్లా ఉద్దీన్ ఖాcగారివద్ద శిష్యరికం చేయడానికి వెళ్ళేరు. బాబాజీ పన్నాబాబు సంగీతమంతావిని, “నేను నేర్పడానికికాని, మీరు నేర్చుకోవడానికికాని, ఇంకేమి మిగిలివుంది?” అని చిరునవ్వుతో అడిగేరట. ఐనా పన్నాబాబు అభ్యర్థనని కాదనలేక బాబాజీ, ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక సూక్ష్మాశం బోధిస్తూ ఉండేవారట.
నవయౌవనంలోవుండగానే, అనిల్ బిస్వాస్ సహోదరి ఐన పారుల్ బిస్వాస్ ని, వివాహంచేసుకున్నారు. ఆమె పారుల్ ఘోష్ పేరుతో చలనచిత్రసంగీతంలో, మొదటి తరం పార్శ్వగాయనీమణులలో, ప్రథమశ్రేణికిచెందిన గాయనిగా సుప్రసిద్ధిని పొందేరు. బెంగాలీ, హిందీ చలనచిత్ర పార్శ్వగాయనీమణులలో పారుల్ ఘోష్ శాశ్వతస్థానాన్ని అలంకరించేరు.
పన్నాబాబు స్వయంగా సంగీతం సమకూర్చిన చలనచిత్రాలలో “సచ్ బంధన్ “(1940); “అంజాన్ “(1940); “బసంత్ “(1942); “భలాయి”(1943); “దుహాయి”(1943); “సవాల్ “(1943); మొదలైనవి ఉన్నాయి. వీటిలో ‘బసంత్ ‘లోని పాటలు మధురమైన వరసలతోను, అందమైన సంగీతంతోను all-time super-hitsగా నిలిచిపోయేయి.
పన్నాబాబు శాస్త్రీయ సంగీతంలో చేసినకృషిని ప్రధానంగా మూడుభాగాలుగా విభజించవచ్చు.
(1) పారంపరిక శాస్త్రీయ రాగసంగీతం;
(2) ఆయన ఆవిష్కరించిన నూతనరాగసంగీతం;
(3) “ఆకాశవాణి”-ఢిల్లీకేంద్రంవారికోసం వారు కూర్చిన సంగీతవాద్యబృంద రచనలు(archestral compositions presented for All India Radio).
యమన్ , దర్బారీ, శ్రీ వంటి ప్రాచీనరాగాలు, చంద్రమౌళి, దీపావళి వంటి పన్నాబాబు రచించిన నూతనరాగాలు, “యూ-ట్యూబు”లో దొరుకుతాయి. రసజ్ఞులు విని ఆనందించవచ్చు. ముఖ్యంగా వారి యమన్ రాగవాదనం, శ్రీరాగవాదనం వారి మహామధుర, ప్రశాంత, సువ్యవస్థిత శాస్త్రీయ సంగీతానికి మచ్చుతునకలు. వారి సంగీత సృజనాత్మక శక్తి అంతా వారి స్వచ్ఛసుసంప్రదాయసువిలసిత సంగీత ఆదర్శాల శాశ్వతమైన విలువల పునాదులపైన పరమరమ్యమణిమందిరంగా నిర్మితమైవుంది.
పన్నాబాబు మొదటినుంచీ భగవాన్ శ్రీరామకృష్ణపరమహంసలవారిని ఆరాధించేవారు. అందువలన స్వామి వివేకానందులవారి ప్రత్యక్షశిష్యులైన స్వామి విరజానందులవారివద్ద మంత్రదీక్షని తీసుకుని అధ్యాత్మవిద్యాసాధన చేసుకునేవారు. అనునిత్యమూ ధ్యానంచెయ్యడం, ప్రతిగురువారం మౌనం పాటించడం వారి సాధనలో భాగాలు. వారు అన్ని విధాల ఎంతటి మహోన్నత వ్యక్తిత్వాన్ని కలిగివుండేవారో అంత వినయనమ్రంగానూ నిత్యజీవితం గడిపేవారు. అంతటి సౌశీల్యము, సౌజన్యము, సౌహార్దము కలిగినవ్యక్తి విద్వత్కళాలోకంలోనే అరుదు అని చెప్పాలి.
ఇంతటి గొప్ప జీవితాన్ని నిర్వహిస్తూవస్తున్న పన్నాబాబు 48 ఏళ్ళు నిండిన మధ్యవయస్సులోనే, 1960వ సంవత్సరం, ఏప్రిల్ , 20వ తేదీన న్యూఢిల్లీలో హృద్రోగంతో పార్థివదేహాన్నివిడిచి, సంగీతశారదలో లీనమైపోయేరు.
వారికి నతమస్తకులమై దండవత్ ప్రణామం సమర్పించుకుందాం.
స్వస్తి|
“స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః”
అని శ్రీలలితాదేవిని వర్ణించే నామం, శ్రీకృష్ణవేణుగానానికి
పూర్తిగా సరిపోతుంది.
శ్రీ పన్నాలాల్ ఘోష్ హిందీ చలనచిత్రాలలోని అనేక
సూపర్ హిట్ ఆల్ టైం మెలొడీస్ కి, తన వేణుగానాన్ని
పార్శ్వగానంగా వినిపించేరు. ఉదాహరణకి
శంకర్ – జైకిషన్ సంగీతం సమకూర్చిన ఆల్ టైం మ్యూజికల్ గ్రేట్ “బసంత్ బహార్ “లోని, మన్నాడే-లతా
డ్యూయెట్ “నైన్ మిలే చైన్ కహాc”, లతా సోలో “మైc పియా తేరీ, తూ మానో యా న మానో” వంటి అనేక
అనర్ఘరత్నాలకి వేణుగానం అందించిన మహానుభావుడు
పండిత్ పన్నాలాల్ ఘోష్ సాహబే!
పన్నాబాబు కి దండవత్ ప్రణామం. వేణుగోపాలస్వామికి జేజేలు. Article చాలా బావుంది, మధురంగా.
మురళీగానవిలోలుడు
నరరూపముదాల్చి వేణునాదాత్మకుడై
వర పన్నాలాల్ ఘోషయి
పరమానందమ్ము చిందె బాలాంత్రపురే!
చిందే అందాలందుకు
నేందుకు సుందరములైన నీ కందాలా
నందామృత చషకములహొ!
వందింతును వాణిని, నిను పలికించుటకై!
బహుముఖీన ప్రతిభాశాలి, అసామాన్య వేణువాదకుడు
అయిన శ్రీ పన్నాలాల్ ఘోష్ ని గురించిన పరిచయ వ్యాసం
ఒక ఎం. ఫిల్ థీసిస్ స్థాయిలో ఉంది.
ముఖ్యంగా సంగీత వాయిద్యాల్లో వేణువుకి ఉన్న ప్రాశస్త్యాన్ని,
శాస్త్రీయ సంగీతంలో వేణు గానానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ
రాసిన ముందుభాగం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది.
ఇక నలభై తొమ్మిదేళ్ళ తన జీవితకాలంలో శ్రీ పన్నాలాల్ వివిధ
రంగాల్లో చేసిన కృషి, సాధించిన విజయాలు… అమోఘం,
అనితరసాధ్యం! శాస్త్రీయ సంగీత ప్రపంచంలోనూ ,
చలనచిత్ర సంగీత రంగంలోనూ తనదైన ముద్ర వేసిన పన్నాలాల్,
ఇటు ఆధ్యాత్మిక రంగంలో, గురుమహరాజ్ భక్తులవడం,
వివేకానందుల ప్రత్యక్ష శిష్యులైన స్వామి విరజానందులవారి వద్ద
మంత్రదీక్ష తీసుకోవడం మరింత గొప్ప విషయం.
శ్రీ పన్నాలాల్ గారికి ప్రణామాలు.