సాహిత్యము-సౌహిత్యము – 49 : ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే ?

శ్రీశారదా కారుణ్య కౌముదీ|

14—04—2018; శనివారము|

“సాహిత్యము—సౌహిత్యము~49″|

ఇంతవరకు ౘాలారకాల సమస్యాపూరణాలు పరికించేం. ఈ వారం సమస్యలో ఛందస్సుకి సంబంధించిన సమస్యకూడా ఇమిడివుంది. ఆ సమస్య ఏమిటో చూద్దాం.

“ఉత్పలగంధిరో యిపుడు నీవూహూయనన్ పాడియే?”||

నీలికలువ పరిమళంతో గుబాళిస్తున్న సుందరీ! ఇప్పుడింక నీవు, “ఊహూ” (కాదు) అనడం న్యాయంగావుందా, చెప్పు?” అని సమస్యకి భావం.

సమస్య ఛందస్సు చూస్తే అస్పష్టంగాను, పక్కదారి పట్టించేటట్లుగాను ఉంది. పద్యపాదభాగంలోని మొదటిమూడుగణాలనిచూస్తే “భ-ర-న” గణాలతోవుంది.  అది ౘాలదన్నట్లు “ఉత్పల” శబ్దంతో పద్యపాదం ప్రారంభమయ్యింది.  వీటిని అనుసరించి చూస్తే, ‘ఉత్పలమాల వృత్తం’ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాని, మిగిలిన భాగంచూస్తే, “మ-య-లగం” తో ఉంది. అంటే ‘మత్తేభవృత్తం’లోని లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగని హైబ్రిడ్ “ఉత్పలేభం” అనడానికి అటువంటి వృత్తజాతికి ఉండే యతి-ప్రాస నియమాలు తెలియవు. అందువలన ఈ పద్యపాదభాగం, శార్దూల/మత్తేభ వృత్తంలోది అని భావించాలి. అలాగ ఊహిస్తే, దీనికి ముందు రెండు గురువులు చేరిస్తే శార్దూలవిక్రీడితవృత్తం ఔతుంది. అలాగ కాకండా,”స”గణం చేరిస్తే మత్తేభవృత్తంగా మారుతుంది. అయితే, రెండు సందర్భాలలోను యతిమైత్రి పాటించడానికి అనుగుణంగా పద్యపాదప్రథమాక్షరం ఉండేటట్లు చూసుకోవాలి. ఈ సమస్య “రాజశేఖర-వేంకటశేషకవులు” గా ప్రసిద్ధులైన శ్రీ దుర్భాక రాజశేఖరశతావధాని-గడియారము వేంకటశేషశాస్త్రిశతావధాని గారల “అవధాన సారము” నుండి గ్రహించబడింది. ఈ పద్యపాదభాగంలో, “ఊహూ” అనే పదం యతిస్థానంలోవుందికనక దానికి యతిమైత్రికలిగిన అక్షరాన్ని పాదప్రారంభంలో నిలుపుకుని పద్యపూరణం చెయ్యాలి. ఇది ఒక చమత్కారం!

అవధానిద్వయం చేసిన సమస్యాపూరణాన్ని ఇప్పుడు గమనిద్దాం!

కనుసన్నం కొలుపంగ ఒప్పితివలంకారమ్ములన్ పంప, వే

డ్కను గైకొంటివి, పూవు సెజ్జ దరియంగా రమ్మటంచున్ , వయ

స్యను పుత్తెంచితి నమ్మి వచ్చితి, కటాక్షంబింత లేనట్టి చె

య్వుననో ఉత్పలగంధిరో! యిపుడు నీవూహూయనన్ పాడియే?“||

అవధానులైన కవిద్వయం మత్తేభవిక్రీడితవృత్తాన్ని యెంచుకుని, ప్రేయసీ-ప్రియుల మధ్యవుండే ప్రేమభావాన్ని ఆలంబనగా చేసుకుని సరసమైన సమస్యాపూరణాన్ని సహృదయరంజకంగా నిర్వహించేరు. పద్యభావాన్ని గ్రహిద్దాం!

“కంటి సంజ్ఞలతో నీ ప్రీతిభావాన్ని సూచిస్తూ అందాలు చిందించేవు. నేను అలంకారాలనిపంపితే ఇష్టంగా తీసుకున్నావు. పూలపానుపు సిద్ధంగావుంది  రమ్మని నీ చెలికత్తెచేత కబురంపేవు. ఆ మాట నమ్మి నేను వచ్చేను. తీరా నేను వచ్చేసరికి, దయలేనట్లుగా ఈ విచత్ర విలాసచేష్ట అభినయంగా కనిపించేలాగ నీవు “ఊహూ” అనడం(ఇంతచేసి నన్ను నిరాకరించపూనినట్లు చేష్ట చెయ్యడం) నీకు న్యాయంగావుందా, నీలోత్పల పరిమళాలు వెదజల్లే నా హృదయేశ్వరీ?”

(కొలుపు=ఇష్టపడు;  పూవుసెజ్జ=పూలపానుపు;  దరి=సమీపము;  వయస్య=చెలికత్తె;  పుత్తెంచు=పంపించు;  చెయ్వు=విలాస చేష్ట ఉత్పలగంధి=నల్లకలువల పరిమళము కలిగిన శరీరము కలది; పాడి=న్యాయము)

స్వస్తి||

You may also like...

6 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    Yahoo మెయ్లుకి మెయ్ళ్లు పంపి, పలు whatsapp text లు పంపించి నా
    ఊహాలోకపు టెల్లలన్ పరచి నవ్యోత్సాహముల్ రేపి స
    మ్మోహాక్రాంతుని చేసి నా మదిని ఆమోదభ్రమన్ నింపి, ఓ
    హోహో ఉత్పలగంధిరో యిపుడు నీవూహూ యనన్ పాడియే?

  2. వ.వెం.కృష్ణరావు says:

    కిరణ సుందర వృత్తం – ఇది అత్యుష్టి జాతికిచెందిన, పాదానికి 17 అక్షరాలున్న పద్యం. “భ-ర-న-మ-య-వ”
    గణాలున్న సమవృత్తం. 11వ అక్షరం యతి. ఇది శిఖరిణి, మందాక్రాంత వంటి సమవృత్తాలున్న అత్యుష్టిజాతిపద్యం

    ఉత్పతితాధునాతన కవిత్వోదాత్త భాషా సుధా
    తత్పరతన్ , కిరణ్ , సలుపు సౌందర్యార్చనల్ , నీకు, భా
    వోత్పథచారకావ్యసఖి! భవ్యోత్సాహియై పిల్చువా
    డుత్పలగంధిరో! సరియె! నీవూహూయనన్ వీడగా!”

    ఆఖరిపాదం సందర్భశుద్ధికోసం కొంత మార్చేను.
    మన్నించగలరు!

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      చక్కెర తీపియున్, లవణపున్ సౌరస్యమున్ చేర్చి, చే
      ర్చుక్కగ క్రొత్తఛందమును సర్వోత్కృష్టమౌ శైలిలో
      గ్రుక్కయె త్రిప్పుకోన్ వ్యవధిలేకుండన్ సమస్యావృతిన్
      చక్కగ కూర్చినావు కద కృష్ణా పద్యరాజమ్మునన్!

      ( అత్యుష్టి or అత్యష్టి ? )

      • వ.వెం.కృష్ణరావు says:

        “అత్యష్టి” సరైన రూపం. సూచనకి ధన్యవాదం, కిరణ్ !

        • వ.వెం.కృష్ణరావు says:

          నీ మనోహర “కిరణ సుందర వృత్తం” లో మరొక
          బంగారపు మచ్చుముక్కకి ధన్యవాదం. క్రొత్త వృత్తంలో
          అప్పుడే రెండు పద్యాలు పుట్టేసేయి.

  3. సి.యస్ says:

    ఈ వారం సాహిత్యము – సౌహిత్యము లో అందించిన సమస్యా
    పూరణానికి పద్యపాదం ఇచ్చిన పృచ్ఛకుడు ఎవరో కానీ మంచి
    రసవంతమైన పద్యం పుట్టడానికి తోడ్పడ్డారు.
    కవిమత్తేభాలు కనక.. రాజశేఖర- వెంకటశేష కవులు పద్యాన్ని
    పూరించడంలో క్లిష్టతని సునాయాసంగా దాటగలిగేరు.
    పద్యంలో ఉన్న విశేషాల్ని– ముఖ్యంగా ఛందో పరమైన విషయాల్ని
    వివరంగా విశదీకరించావు. లేకపోతే అర్థం చేసుకోడానికి కష్టమయ్యేది.
    కిరణ్ సుందర్ స్పందన….అందుకు నీ ప్రతిస్పందన ముచ్చటగా ఉంది.
    మరికొన్ని కొత్త భావాలతో కూడిన కొత్త కొత్త పద్యాలు పుట్టుకొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *