శారదా సంతతి — 39 : మోక్ష నిక్షేప కీర్తనల కర్త — మునిపల్లె సుబ్రహ్మణ్యకవివరిష్ఠులు

శ్రీశారదాదేవ్యై నమః|
08—04—2018; ఆదిత్యవాసరము|

శ్రీశారదా దయా జ్యోత్స్న|

“శారదా సంతతి~39″| “మోక్ష నిక్షేప కీర్తనల కర్త — మునిపల్లె సుబ్రహ్మణ్యకవివరిష్ఠులు“| (1730? నుండి 1780? వరకు)

తెలుగులో “అధ్యాత్మ రామాయణ కీర్తనలు” ౘాలా అపురూపమైన సంగీత-సాహిత్య రచనలుగా లోకప్రశస్తిని పొందేయి. ప్రస్తుతకాలంలో మనకి ఈ పాటలు పరిచితమైనవిగా లేకపోవచ్చుగాక! కాని నాలుగైదుదశాబ్దాలక్రితంవరకు మన ఇళ్ళలో స్త్రీలందరూ, ముఖ్యంగా గ్రామసీమలలో, ఈ కీర్తనలని హృద్యంగా పాడుకుంటూ మహిళా సత్సంగాలు నిర్వహించుకోవడం ఆ కాలంలో లోకాచారంగావుండేది. వ్యాసదేవులు, “బ్రహ్మాండపురాణం“లో, శంకర-గౌరీ సంవాదం(dialigue) రూపంలో సీతారామచరిత్రని అధ్యాత్మవిద్యాపరమైన అంతరార్థ ప్రబోధక తత్త్వగ్రంథంగా విరచించేరు. (Narration of the story of Sita and Rama in terms of the inner spiritual significance and its ultimate philosophy to help the devotional seekers of Sri Rama Brahmam to attain the final bliss is the theme of the “Adhyaatma Raamaayanam”).

“అక్షరం బ్రహ్మ పరమం స్వభావోsధ్యాత్మముచ్యతే” : శ్రీభగవద్గీతా : VIII : 3.

“సర్వకాలాలలోను, సర్వస్థలాలలోను నశించకుండా శాశ్వతంగావుండేదే ‘పరబ్రహ్మం’. ప్రత్యగాత్మస్వరూపంలో దేహగతమైన ఆ పరబ్రహ్మమే అధ్యాత్మం”.

“అధ్యాత్మరామాయణం”, భగవద్గీతలోని, పైనిర్వచనానికి అనుగుణంగా రామకథని వివరిస్తుంది.

“వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే|

వేదః ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా”||

“దశరథ తనయునిగా అవతరించిన శ్రీరామచంద్రుడు వేదములద్వారా తెలుసుకోవలసిన పరమపురుషుడు. అటువంటి శ్రుతిప్రతిపాదితుడైన పరమ పురుషుని చరితము, వాల్మీకిమహర్షి విరచితమైన “శ్రీమద్రామాయణం” రూపంలో ఈలోకంలోకి (పౌరుషేయ)వేదమై ఆవిర్భవించింది”.

మహర్షులు పైన విశదంచేసిన ఉపదేశాన్ని అనుసరిస్తూ “అధ్యాత్మరామాయణం” రచన కొనసాగుతుంది. ఆ సంస్కృతరచనకి తెలుగులో పద్యానువాదాలు వెలిసేయి. ఆ అనువాదాలు సుబ్రహ్మణ్యకవి అధ్యాత్మరామాయణకీర్తనలకి పూర్వమూ, అటు తరవాత కూడా వచ్చేయి.

“అధ్యాత్మరామాయణం”లోకూడా 7 కాండలున్నాయి. వీటిలో మొదటి ఆరు కాండలని, అంటే బాలాది యుద్ధ కాండ పర్యంతమూ, 104 కీర్తనలుగా శ్రీ మునిపల్లె సుబ్రహ్మణ్యకవిగారు, తెలుగులో రచించేరు. సప్తమమైన “ఉత్తరకాండ”ని కవిగారు అనువదించలేదు. ఉత్తరకాండలోని “పంచమ సర్గము” 62 శ్లోకాలున్న “శ్రీరామగీత“. దీనిలో మొదటి ఆరు శ్లోకాలు, శ్రీమహాదేవుడు పార్వతీదేవికి చెప్పినవిషయాలతోను, మిగిలిన ఏభై ఆరు శ్లోకాలు రాములవారు లక్ష్మణస్వామికి చేసిన అధ్యాత్మవిద్యాబోధ రూపంలోను ఉన్నాయి. ఉదాహరణకి రెండు శ్లోకాలని విజ్ఞులైన మన సత్సంగసభ్యులముందు ఉంచడం జరుగుతోంది. ఈ శ్లోకాలు, “ఇంద్రవంశ”/ “వంశస్థ”/”ఉపజాతి – ఈ రెంటి మిశ్రమం” వృత్తాలలో రచించబడ్డాయి. ఇంద్రవంశకి, త-త-జ-ర-(12 అక్షరాలు); వంశస్థకి, జ-త-జ-ర-(12 అక్షరాలు) కూర్పుతోవుంటాయి.

“శ్లో.॥ యావత్ న పశ్యేదఖిలం మదాత్మకం

తావత్ మదారాధన తత్పరో భవేత్ |

శ్రద్ధాలురత్యూర్జిత భక్తి లక్షణః

యస్తస్య దృశ్యోsహమహర్నిశం హృది“|| ( 58 వ శ్లోకం ).

“(అధ్యాత్మవిద్యలో అభినివేశంకలిగిన ఉత్తమసాధకుడు, ఇంద్రియగోచరమైన) ఈ సర్వవిశ్వమూ ‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం’ అనే తాత్త్వికసత్యం నిర్విరామానుభవంలోకి రానంతవరకు, అతడు(సాధకుడు) నా నిత్యారాధనలో లీనమైవుండాలి. అటువంటి ఉత్కృష్టభక్త్యనుభవం కలిగిన శ్రద్ధాలువు సర్వావస్థలలోను(జాగ్రత్ – స్వప్న – సుషుప్తి); సర్వదా (రేయింబవళ్ళు) తన హృదయంలో నా సాక్షాత్కిరాన్ని కలిగివుంటాడు”.

“శ్లో.॥ యః సేవతే మాం అగుణం గుణాత్పరమ్ ,

హృదా కదా వా యది వా గుణాత్మకమ్ |

సోsహం స్వపాదాంచిత రేణుభిః స్పృశన్ ,

పునాతి లోకత్రితయం యథా రవిః“|| ( 61 వ శ్లోకం ).

“నన్ను త్రిగుణాతీతమైన (నిరాకార)నిర్గుణతత్త్వ స్వరూపునిగాకాని, లేక, (సాకార)సగుణ భగవానుడిగాకాని తన హృదయపూర్ణంగా సదా కొలిచే (పరిపూర్ణ)సాధకుడు నా కంటె వేరుకాని నేనే ఔతున్నాడు. సూర్యకాంతి సకలలోకాన్ని పునీతంచేసినట్లు, అతడు తన పాదపరాగరేణువులతో ముజ్జగాలని పవిత్రం చేస్తున్నాడు”.

మునిపల్లెవారి జీవితచరిత్రవివరాలు లభ్యంకావడంలేదు. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారి “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము“లో విశదంచేయబడిన వివరాలమేరకి, మునిపల్లెవారు శ్రీకాళహస్తిసీమని, 18వ శతాబ్దిలో ఏలిన దామెర వేంకటేంద్రుడు, వారి కుమారుడైన కృష్ణభూపాలుర ప్రాపకంలోవుండేవారని వెల్లడి ఔతూంది. మునిపల్లెకవి సంస్కృతాంధ్రాలలో పాండిత్యమున్న కవిమాత్రుడేకాక, సంగీతస్వర రచన చేయజాలిన కీర్తనకారుడుకూడాను! ఆయన, అధ్యాత్మరామాయణకథని ఆధారంగాచేసుకుని తమ సంగీతకీర్తనలని రచించేరు. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగాచేసుకుని, త్యాగయ్యగారు తమ సంగీత కృతులని, కీర్తనలని “త్యాగరాజ రామాయణం” గా రచించేరు. అదేవిధంగా సుబ్రహ్మణ్యకవి వ్యాస అధ్యాత్మరామాయణాన్ని అనుసరించి, తమ సంగీత కీర్తనల రూపంలో “మునిపల్లె సుబ్రహ్మణ్యకవి అధ్యాత్మరామాయణం” కూర్పు చేసినట్లు భావించడం బాగుంటుంది.

ఈ కీర్తనలు స్త్రీల పాటల సంప్రదాయానికి అనువైన రీతిలో మునిపల్లెకవిగారు రచించి, స్వరపరచడంవలన, ఈ కీర్తనలు సాహిత్యంలోనూ, సంగీతపరమైన రాగ-తాళ-లయాత్మక సంవిధానంలోనూ బహుజన అభ్యాస సౌలభ్యంతో అలరారుతున్నాయి. ఈ కీర్తనలచివర, ‘శేషాద్రివాసుడు‘, ‘శేషశైలాధిపుడు‘, ‘శేషగిరీశుడు‘ మొదలైన ముద్రల ప్రయోగం ఉన్నందున, ఇవి అన్నీ శ్రీవేంకటేశ్వర వర వరదుడికి అంకితంగా రచించబడ్డాయని తెలుస్తూంది.

ఈ కీర్తనల నిర్మాణం, పల్లవి, అనుపల్లవి, చరణాలతోకూడుకునివుంటుంది. పల్లవి, అనుపల్లవి సామాన్య సాహిత్య-సంగీత నిర్మితిని కలిగివున్నా, చరణాలు కథాప్రధానమైనవికనుక పెద్దవిగావుంటాయి. కథాఘట్టాలననుసరించి చరణాలు కనీసం మూడునుండి పది-పన్నిండువరకువుంటాయి. సంగీతపరంగా, పల్లవి, అనుపల్లవి కృతులలోలాగేవున్నా, సంగీతానికిసంబంధించిన సంగతులకి అవకాశంవుండదు. అలాగే, కథాప్రాధాన్యతవలన చరణాలనిడివి, చరణాలసంఖ్య ఎక్కువగావుండడంవలన “సంవాద దరువు” పద్ధతిలో సాహిత్య-సంగీత-గానాల కూర్పులువుంటాయి. ధాతు-మాతుకల్పనాదక్షతకలిగినవాడినే “వాగ్గేయకారుడు” అంటారు. “ధాతువు” అంటే, సంగీతానికి సంబంధించిన స్వర-తాళాల కూర్పు అని అర్థం. అలాగే, “మాతువు” అంటే, సంగీతం పాడడానికి అనువైన సాహిత్యభాగం అన్నమాట. చరణాలు కథాఘట్టాలతో నిండివుండడంవలన, విస్తృతమైనకూర్పుని కలిగివుండడం సహజం. అందువలన ఇటువంటి సందర్భాలలో, ఒకే ధాతుప్రయోగం నాలుగు లేక ఎనిమిది మారులు సంగీతపరంగా పునరావృత్తి ఔతూండగా, సాహిత్యంమాత్రం ప్రతి సంగీత ఆవృత్తికి మారిపోతూ, కథ ముందుకి వెళ్ళడానికి దోహదంచేస్తుంది. ఆ విధంగా, అధ్యాత్మరామాయణ కీర్తనలు కథాప్రాధాన్యం కలిగిన ప్రత్యేక ప్రక్రియకి అనువైన క్రొత్త బాటలకి దారులు తీసేయన్నమాట! అందుకనే, డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు, “అన్నమాచార్యుల గేయాలు సంకీర్తనాత్మకములు, క్షేత్రయ్య పదాలు అభినయాత్మకములు, సుబ్రహ్మణ్యకవి కీర్తనలు ఆఖ్యానాత్మకములు— అంటే, ఒక వ్యక్తి కథ చెప్పుతున్నట్లుగా కీర్తనలను గానముచేసుకొనిపోవుట.” అని వివరించేరు. సంగీత-సాహిత్యాలలో తగిన పరిజ్ఞానం కలిగినవారు, పూర్వం వీటిని పల్లెలలోని సత్సంగాలలో పాడుతూ, మధ్యలో కథని వివరిస్తూ సత్కథాకాలక్షేపం చేసేవారు.

భైరవిరాగం, అటతాళంలో, “వినవే సత్యవాణి శర్వాణి అలివేణి నీరజపాణి“, కేదారగౌళరాగం, ఆదితాళంలో, “సీతారామమారుతి సంవాదము చేరివినవే“, నాదనామక్రియరాగం, ఆదితాళంలో, “ఇందువదనా వినవే ఈ చరితము“, సౌరాష్ట్రరాగం, ఆదితాళంలో, “వినవే సుగుణాన్వితా – గిరిరాజసుతా“, బిలహరిరాగం, అటతాళంలో, “శరణు శరణని రామచంద్రుని అహల్య – -“, సురటిరాగం, ఆదితాళంలో, “చేరి వినవే శౌరి చరితము – గౌరీ! సుకుమారీ! గిరివర కుమారీ” మొదలైన అనేక అధ్యాత్మరామాయణ కీర్తనలు, తరచుగా, ఇదివరకు, మన ఇళ్ళలోనో, విజయవాడ భక్తిరంజనిలోనో, సత్సంగ సంగీత గోష్ఠులలోనో వినబడుతూనేవుండేవి. ఈ కాలంలో మనకి “యూట్యూబు” మాత్రమే శరణ్యం!

ఇంతకన్న మునిపల్లె సుబ్రహ్మణ్యకవివరుల గురించిన వివరాలు ఏవీ మనకి లభ్యం కావడం లేదు. అందుకని ఆ మహాపురుషుడినిగురించి ఈ మాత్రమే తెలుసుకోగలిగినందుకు అసంతృప్తులమైనా, మన హార్దిక అంజలిని వారి పాదాలచెంత సమర్పించుకుని, వారి కీర్తనలని విని, సంతృప్తులమౌదాం!

స్వస్తి|

You may also like...

7 Responses

  1. Dakshinamurthy M says:

    Wonderful sir. We are blessed to know such great people. Thank you

  2. Sampathkumar ghorakavi says:

    Maa Naannagaru paadevaaru. Nenu try chesa. Chala goppavi. Koniki satyanarayana gaaru Hyderabad paadaaru. Namaskaram guruvugaru.

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    Article చాలా బావుంది. (పౌరుషేయ) అని bracket లో చేర్చడం (ఎవరూ అడక్కండానే) బావుంది. సత్యసంధతని సూచిస్తోంది.
    జగమంతా మాయ అనడం కన్న, జగమంతా రామమయం అనడం బాగుంది. జగన్మిథ్యా అనడం కన్న, సర్వం బ్రహ్మమయం అనడం ఉపయోగకరంగానూ, జగత్తునుంచి వెలువడడానికి పనికొచ్చే ఉపాయంగాను ఉంటుంది.
    మునిపల్లెవారికి నమోవాకాలు.
    నీకు జోహార్లు.

  4. సి.యస్ says:

    ‘అధ్యాత్మ రామాయణ కీర్తనల’ గురించి చదివితే, ఆలోచనలు
    1962-63 వ సంవత్సరంలోకి వెళ్లిపోయాయి. అప్పుడు.
    అమలాపురం దగ్గర అల్లవరం అనే ఊళ్ళో ఉండేవాళ్ళం.
    అక్కడ మా ఇంటి ఎదురుగా పేరిందేవి అని ఒకామె ఉండేది.
    ఆమెకి ఈ అధ్యాత్మ రామాయణ కీర్తనలు వచ్చు. స్వతహాగా
    సంగీతం అంటే అభిమానం ఉన్న అమ్మ ఆ పేరిందేవి గారి దగ్గర
    కొన్నాళ్ళు ఈ కీర్తనలలో కొన్ని నేర్చుకుంది. రోజూ రాత్రి భోజనాలు
    అయ్యేకా ఆవిడ వచ్చేది. అప్పుడు అల్లవరంలో ఇళ్ళకి కరెంట్
    లేదు. హరికేన్ లాంతర్ ముందు పుస్తకం పెట్టుకుని ఆవిడ
    నేర్పుతూంటే, పక్కన కూచుని నేనూ వినేవాడిని.
    “రామాభి రామ! గుణధామా” , ” వినవే సత్యవాణి” మొదలైన
    కీర్తనలు ఇంకా నా జ్ఞాపకాలలో ఉన్నాయి.
    ఇప్పుడు నీ ఈ వ్యాసం ద్వారా, ఆ కీర్తనల కర్త, వాటిలోని
    సంగీత, సాహిత్య, సాంకేతిక అంశాలన్నీ తెలిశాయి.
    తెలుగువాళ్లందరూ గర్వపడవలసిన గొప్ప రామాయణ కావ్యం
    ఇది.

  5. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    ఇంకో సంగతి. ఈ వినవే, వినవే, వినవే అని ప్రతి కీర్తనలోను వినిపిస్తుండడం గమనిస్తే, మన లవకుశ సినిమాలో “వినుడు వినుడు రామాయణగాథ”, “రామకథను వినరయ్యా”, “శ్రీరాముని చరితమును……… వినుడో యమ్మా” అంటూ “పదే, పదే” వినమని ప్రాధేయ పడే సంప్రదాయమూ, శైలీ ఈ కీర్తనల నుంచే వచ్చిందేమో అనిపిసిస్తుంది

    • వ.వెం.కృష్ణరావు says:

      మౌలికవిషయాన్ని శ్రీ బి. కిరణ్ సుందర్ ప్రస్తావించడం జరిగింది.
      కేవలాద్వైతసిద్ధాంతం ప్రకారం, సాధకుడు, శ్రవణం-మననం-
      ధ్యానం అనేవి అనునిత్యమూ అభ్యసించాలి. ఈ మూడింటిలోను, శ్రవణం అన్నింటికీ పునాది. అచ్చతెలుగులో
      శ్రవణాన్ని “వినడం” అంటారు. “అధ్యాత్మరామాయణ కీర్తనలు”
      సాకారసగుణ అద్వైతసిద్ధాంతాన్ని, ‘సీతారామకథ’ ఆలంబనగా
      బోధిస్తాయి. ఐతే సాధనకిసంబంధించినంతవరకు “వినడం”
      కీలకాంశం కనక “వినుడు, వినవే, ” ఇత్యాది పదాలతో బోధ
      ఉండడం సహజం.

      • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

        “ఆత్మా వా2రే …శ్రోతవ్య:…..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *