సాహిత్యము-సౌహిత్యము – 48 : సారెకు సారెకున్ మరియు సారెకు సారెకు సారెసారెకున్
శ్రీశారదా కరుణా కౌముది :— “సాహిత్యము—సౌహిత్యము~48″|
ఇంతవరకు, ఈ “పునరుక్తి చమత్కృతి“లో రసరమ్యసమస్యాపూరణాలని మాత్రమే ప్రత్యేకంగా ఎంపికచేసి, మన సత్సంగ రసజ్ఞులకి నివేదించడమయ్యింది. ఇంతకిముందువారం అనుకున్నవిధంగానే, ఈ వారంతో “పునరుక్తి చమత్కృతి”కి భరతవాక్యం పలికి, వచ్చేవారంనుంచి, యథాపూర్వంగా సమస్యాపూరణయాత్రని కొనసాగించవచ్చు. ఈ వారం, ఈ ఉపశీర్షికకి ఉపసంహారంగా ఉత్పలమాల పద్యపాదసమస్యని ఉదహరించుకుందాం!
“సారెకు సారెకున్ మరియు సారెకు సారెకు సారెసారెకున్ “|
ఈ సమస్యకి, “మళ్ళీ–మళ్ళీ“, లేక, “మాటిమాటికీ” అని అర్థం కదా! దీనిని సి.వి.సుబ్బన్న శతావధానిగారు, తమ “శతావధానప్రబంధము”, ప్రథమఖండములో ప్రస్తావించేరు. దీనిని సుబ్బన్నకవిగారు, రామాయణ పరంగా, రమణీయ సన్నివేశాన్ని సంకల్పించుకుని, ఇంత అందంగా పూరించేరు:—
“శ్రీరమణీయ చారుసరసీరుహలోచనుడున్నతాంసు డౌ
రా! రఘురాముడంచు, మధుర త్రప చూడ తలంచియున్ సభన్ |
ధారుణి పుత్రి చూడదభితస్స్ఫురదక్షుల, యత్నమూనెడున్ ,
సారెకు సారెకున్ మరియు సారెకు సారెకు సారెసారెకున్ “||
“సీతాదేవి, సర్వసంపదలకీ ఆశ్రయమైన మహాసౌందర్యమయ పుండరీకనయనుడు, ఉన్నత భుజస్కంధమున్నవాడు ఐన శ్రీరామచంద్రుని (శివకోదండభంజనానంతర స్వయంవరసభలో, తన కోమల హస్తాలలో పుష్పమాలని పట్టుకుని, ఆయన గళసీమని అలంకరించడానికి, రఘురాముని వైపు మెలి-మెల్లిగా అడుగులువేస్తూ) చూడాలని అమిత కుతూహలంతోవుంది. సభామర్యాదకి భంగంలేకుండాను, తన సహజ వ్రీడా-వినయశీలతలని అతిక్రమించకుండాను తన కుతూహలాన్ని తీర్చుకోగలగాలి. అందుకని కాటుకనిండిన తన విశాలనయనాలని తలవంచుకునే, చక్రాలలాగ, గుండ్రంగా త్రిప్పుతూ(అభితః స్ఫురత్ అక్షులు=brilliant eyes with circumspection), సభాసదుల చూపులనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, మాటి-మాటికీ, ఇటూ-అటూ చూస్తున్నట్లుగా అభినయిస్తూ, రాముడిని చూచే రహస్యయత్నం చేస్తూనేవుంది”.
స్వస్తి||
తీరినకోర్కెలున్ తనివితీరని భక్తియు నున్నవారు, సం
సారపయోధి ఇంకి దినచర్యల ఉచ్చులు లేనివార, లే
కారణవృత్తి లేక తెగకార్తురు దైవకృతజ్ఞతాశ్రువుల్
సారెకుసారెకున్ మరియు సారెకుసారెకు సారెసారెకున్
సి వి సుబ్బన్న శతావధాని గారి పూరణ అధ్బుతం.
అంతే కమనీయంగా ఉంది శ్రీ బాలాంత్రపు వారి పూరణ.
చారు కవితా సుధాకూ
పారోర్మి తతులు కద! మన బాలాంత్రపు ‘రే’
పూరణ పద్యములన్నియు,
సారెకు సారెకును సారె సారెకు చూడన్ !
చారు కవితా సుధాకూ
పారోర్మి తతులు కద! మన బాలాంత్రపు ‘రే’
పూరణ పద్యములన్నియు,
సారెకు సారెకును సారె సారెకు చూడన్ !
‘ అవధాన విద్య’ ను అందరికీ అర్థమయ్యే రీతిలో
అందించిన శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారు స్వయంగా
పూరణ చేసిన ఈ పద్యం అత్యంత మనోహరంగా ఉంది.
పురుషాకృతికి ప్రతిరూపమైన శ్రీ రామచంద్రుని సుందర
రూపాన్ని చక్కగా వర్ణిస్తూనే , ఆ రూపాన్ని సీతాదేవి చూసిన
వైనం పరమ సుకుమారంగా చిత్రించారు.
కాబోతున్న హృదయేశ్వరుడిని నలుగురి ముందూ తలెత్తి
తేరిపార చూడడానికి స్త్రీ సహజాలంకారమైన/ లక్షణమైన
సిగ్గు అడ్డువస్తోంది. కనక…. చంచలిత నేత్రాలతో, ఏదో
చూస్తున్నట్టుగా రాముడ్ని చూస్తోంది అని వర్ణించడం చాలా
అందంగా ఉంది. మంచి పద్యం మా ముందుంచావు.