శారదా సంతతి — 38 : మహిమోపేత మహావాగ్గేయ గాయకుడు~మైసూరు సదాశివరావుగారు
ఐం శ్రీశారదాదేవ్యై నమః |
01—04—2018; ఆదిత్యవాసరము.
శ్రీశారదా వాత్సల్య దీప్తి :—
“శారదా సంతతి~38″| మహిమోపేత మహావాగ్గేయ గాయకుడు~మైసూరు సదాశివరావుగారు. (1800? నుండి 1870? వరకు)|
మైసూరు పట్టణంలో ఒక సంపన్న గృహస్థుని ఇల్లు. 19వ శతాబ్ది ప్రథమపాదం గడిచి, ద్వితీయపాదారంభం నడుస్తోంది. వార్షిక శ్రీరామ మహోత్సవ కోలాహలం ఆ ఇంటినంతటినీ చైతన్యమయం చేసేసింది. గృహగర్భంలోని పెద్ద హాలులో పట్టు బరకం పరచబడివుంది. హాలు ఒకచివర మహావర్చస్వి ఐన ఒక గాయకుడు, ఆయనకి ఇటు-అటు ప్రక్కవాద్యకళాకారులు, ఆయన వెనకన తంబూరా శ్రుతి మీటుతున్న యువద్వయం ఉన్నారు. వారందరికి అభిముఖంగా ఆ హాలుకి సరిపడ సరసహృదయులందరు ఎంతో కుతూహలంతో నిశ్శబ్దంగా ప్రధానగాయకుడి పాటకై ఎదురుచూస్తున్నారు. వేదికపైనున్న కళాకారులు పరస్పరం చిరునవ్వులతో పలకరించుకుని, సభారంభానికి సూచనచేసేరు. భక్తిరసమయంగా సంగీతసభ జరుగుతోంది. రాగం-తానం-పల్లవి రమ్యంగా నిర్వహించబడిన అనంతరం, తాళవాద్యకళాకారుల తనియావర్తనం, రసజ్ఞుల కరతాళధ్వనులమధ్య పూర్ణలయభావపోషకంగా ముగిసింది. మరొకసారి కరతాళధ్వనులయ్యాక, సభాసదులలో ఒక మధ్యవయస్కుడు లేచి నిలబడి, ప్రధానగాయకుడికి సవినయంగానమస్కరించి “తమ కృతి, ‘నరసింహుడు ఉదయించెను‘ ఈ శుభతరుణంలో తమనోట వినాలని సభాసదులమందరమూ ఉవ్విళ్ళూరుతున్నామయ్యా” అని కూర్చున్నాడు. వెంటనే గాయకుడు, “అయ్యో ఆ కృతిని ప్రత్యేక ఉపవాసదీక్షలో, మహాపర్వాలలో, దేవుడిగదిలోని నా ఉపాస్యదైవమైన నరసింహస్వామివారికోసం ప్రత్యేక కైంకర్యంగా, కమలామనోహరి రాగంలో, నేను విశేషసేవగా పాడుకునేపాట. అది ఇక్కడ, ఇప్పుడు, ఇలాగున పాడవచ్చునా అని నా సంశయం! అంతకంటె నాకు వేరే అభ్యంతరమేమీలేదు” అని సందిగ్ధంలో పడ్డారట! వెంటనే శ్రోతలందరూ వారు ఆ కృతిని గానం చెయ్యాలని అభ్యర్థించేరట! “సరే! ప్రజల అభీష్టమే ప్రభువుల ఆదేశమేమో(vox populi,vox Dei)” అని ఆయన అనుకుని ఆ కృతిలోని పల్లవిని, మొదటి చరణాన్ని పూర్తిచేసి, రెండవ చరణం, “సనకాదులు విస్మయింప” ఎత్తుకుని, “నెరవల్ “(రాగంలోని వివిధ మధుర స్వరసంచారాలని, కృతిలోని ఒక సాహిత్యశ్రేణినిఆలంబనగాచేసుకుని, లయభేదంతోను, స్థాయీభేదంద్వారాను రసికులకి రసమయంగా అందించడం)ని మహాభక్తిపారవశ్యంలో చేస్తున్నారట! ఉన్నట్లుండి, ఆ హాలులో గోడ మధ్యలో అలంకరించబడిన అనేకదైవపటాలమధ్యనున్న నృసింహస్వామివారి పటం నేలపై భళ్ళునపడి అద్దం చిట్లిపోయిందిట. వెంటనే మహానుభావుడైన ఆ గాయకోత్తముడు, పరిసరాలని గమనించి, విషయాన్ని గ్రహించుకుని, తన పాటని ఆపివేసి, వేదనతో దుఃఖించేరట!
ఆ మహాగాయకుడి పేరే మైసూరు సదాశివరావుగారు. నృసింహస్వామివారి మహోపాసకులు.
మైసూరు సదాశివరావుగారిని గురించిన జీవితచరిత్రకిసంబంధించిన ప్రధానవిషయాలేవీ నిర్ణయాత్మకంగా మనకి లభించడంలేదు. వారు, ఆ రోజులలో ఉత్తర ఆర్కాటుజిల్లాకిచెందిన చిత్తూరు సమీపంలోని గిరంపేటగ్రామంలో, ఒక సంపన్న గృహంలో జన్మించినట్లు కొందరు చరిత్రకారులు వ్రాసేరు. వారు మహారాష్ట్రస్మార్త దేశస్థ బ్రాహ్మణ దంపతులైన శ్రీమతి కృష్ణాబాయి- గణేశరావులకు జన్మించేరు. వారి ౘదువు-సంధ్యల వివరాలు తెలియదు. యుక్తవయస్సు వచ్చేసరికి చిత్తూరుజిల్లా కలక్టరేటులో ఉద్యోగంచేసేరట!ఆ తరవాత ఆరణి జాగీరుదారు కుమార్తె, సుందరబాయిని వివాహం చేసుకున్నట్లు ఆధారాలున్నాయి.
మొదటినుంచి సంగీత-సాహిత్యాలలో గాఢమైన అభినివేశమూ, గొప్ప లోకజ్ఞానమూ ఉండేవట!
త్యాగరాజస్వామివారి శిష్యుడైన వాలాజాపేట వేంకటరమణ భాగవతులవద్ద అంతేవాసిగావుండి, సంగీతం ౘక్కగా నేర్చుకున్నారు. త్యాగరాజులవారు, శిష్యగృహానికి వాలాజాపేట విచ్చేసినప్పుడు, సదాశివజీ, వారి పరమగురువుపై, “త్యాగరాజస్వామి వెడలిన” అనే ‘తోడి’రాగకృతిని రచించి పాడి, అయ్యవారి ఆశీస్సులకి పాత్రులైనారట!
సదాశివజీకి మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృతం, ఆంగ్లం భాషలు ధారాళంగా వచ్చు. కాని, చాలా కృతులని తెలుగులోను, కొన్ని సంస్కృతంలోను రచించేరు. వారి కృతులు నారికేళపాకంలోవుంటాయని విద్వాంసుల అభిప్రాయం.
ఒకసారి మైసూరు వ్యాపారస్థులైన అన్నదమ్ములు, దొడ్డ మునిస్వామిశెట్టి- చిక్క మునిస్వామిశెట్టి వ్యాపారరీత్యా చిత్తూరు వెళ్ళినపుడు, సదాశివజీ యొక్క మధుర సంగీతానికి, అపార వైదుష్యానికి ముగ్ధులైపోయి, సదాశివజీని తమ మైసూరుకి ఆహ్వానించి అక్కడే స్థిరపడవలసినదిగా వేడుకున్నారట! సుమారు 30ఏళ్ళ ప్రాయమున్న సదాశివజీ మైసూరుకి మకాము మార్చి, అక్కడే స్థిరపడడం జరిగింది.
ఆయన మైసూరు మహారాజా శ్రీ ముమ్మడి కృష్టరాజ వొడయారువారి సంస్థానంలో,ఆస్థానవిద్వాంసులుగా వుండేవారు.
వారు నిత్యదేవతార్చనానుష్ఠానపరులు. వైదిక ఆర్ష సంప్రదాయాలని త్రికరణశుద్ధిగా ఆచరించేవారు. మొదటిమూడు వైదిక ఆదేశాలని నియమనిష్ఠలతో పాటించేౘాలామంది, నాలుగవ ఆదేశం అయిన, “అతిథిదేవో భవ!” అనే ఆదేశాన్ని ఉపేక్షించడం కద్దు! కాని, సదాశివజీ, ఈ నాలుగవ ఆదేశాన్నికూడా అనుదినమూ నియతి తప్పకుండా ఆచరించేవారట. కనీసం పదిమందినుండి ఏభైమంది పైవరకుకూడా వారింట భోజన, దక్షిణాది సత్కారాలతో అతిథిపూజలందుకొనేవారట! వారందరికీ గోముఖమనే ప్రత్యేక ఘృతపాత్రతో వారు స్వయంగా నెయ్యి వడ్డించేవారట! ఒకసారి వారు ఇంటలేనిసమయంలో, వారి శిష్యులు ఒక పేదబ్రాహ్మణుడు, ‘దేవరనామ‘ పాడుకుంటూ, భిక్షాటనకివస్తే, అతడిని వారు అపస్వరాలతో పాడుతున్నాడని గేలిచేసేరట! ఇంతలో, సదాశివజీ బయటనుంచివచ్చి, ఆ పేద బ్రాహ్మడిని ఇంటిలోనికి తీసుకువెళ్ళి, అతిథిమర్యాదలుచేసి, పదిరోజులకి సరిపడే స్వయంపాకం, సదక్షిణగా సమర్పించి, శిష్యులచేత అతడికి పాదాభివందనంచేయించి, శిష్యులని మన్నించి ఆశీర్వదించవలసినదిగా అభ్యర్థించేరట! ఆ పైన అతడిచేత ‘దేవరనామ’ మరల పాడించుకుని, ఆ పాటలోని భక్తిభావాన్ని, ఆర్తిని గ్రహించవలసినదిగా శిష్యులని ఆదేశించేరట.
వీణ శేషన్న, వీణ సుబ్బన్న, ఎ. చిదంబరయ్య, గంజాం సూర్యనారాయణప్ప, Ch. వెంకటేశయ్య మొదలైనవారు వారి శిష్యవర్గంలోవారు.
కాంభోజి రాగంలో “నీకేల“, భైరవి రాగంలో “పార్థసారథే! కరుణాజలనిధే!”, ఖమాసురాగంలో “పరమాద్భుతమైన“, మాయామాళవగౌళలో “దేవాదిదేవ!”, హరికాంభోజిలో “సాకేతనగరనాథ“, సావేరిలో “శ్రీకామకోటిపీఠస్థితే“, రాగమాలిక ( తోడి+ఆభోగి+శంకరాభరణం+కాంభోజి+శహాన )లో “పంచబాణుడు నాపై“, బలహంస రాగంలో “ఎవరున్నారు“, రీతిగౌళ రాగంలో “నన్ను బ్రోచుటకు ఇంత తామసమా! సన్నుతాంగ శ్రీచంద్రశేఖర“, దేవగాంధారిలో “దొరకెను నేడు శ్రీకృష్ణుడు” మొదలైన పరమరమ్యమైన సదాశివజీ కృతులు వివిధ విద్వాంసులు పాడినవి “యూ-ట్యూబు”లో లభ్యమౌతున్నాయి.
మైసూరులో రామస్వామిశెట్టి అనే వస్త్రవ్యాపారి సదాశివరావుగారికి మిత్రుడు. శేఠ్జీ వేరే ఊరు వెళ్ళవలసివచ్చి, తన బట్టలకొట్టు బాధ్యతని సదాశివగారికి అప్పగించి ఊరు వెళ్ళేరుట!కొట్టు సదాశివగారి అధీనంలోవుందని తెలియగానే, ఊరిలోనికొందరు, సదాశివగారి దయాగుణం, దాతృత్వం తెలిసినందువల్ల, ఏదో ఒక వంకపెట్టి వస్త్రాలు యాచించి తీసుకుపోయేరుట. శెట్టిగారు ఊరునుంచివచ్చి చూసుకుంటే కొట్టంతా ఇంచుమించు ఖాళీ ఐపోయివుంది. సదాశివరావుగారు, నవ్వుతూ, శెట్టిగారితో ఇలా అన్నారట!
“మిత్రమా! కొట్టంతా ఖాళీ ఐపోయినమాట నిజం. పాపం ౘాలామంది నాకు తెలిసినవారు అవసరంలోవుండి, నన్ను అడిగి మరీ తీసుకువెళ్ళేరు. సరుకు నాది కాకపోయినా మరి నేను ఇవ్వవలసివచ్చింది. దీనివలన నీకు పుణ్యమూ వస్తుంది, దైవానుగ్రహకారణంగా భవిష్యుత్తులో నీకు లాభమూవస్తుంది. అలాగ కాదంటే, నీ కొట్టులోనుంచి జనం తీసుకువెళ్ళిపోయిన సరుకు వెల కట్టేసెయ్యి. ఆ డబ్బు నీకు ఇచ్చేసి, నీకువచ్చిన పూణ్యాన్ని, నీకు రాబోయే దైవానుగ్రహరూపంలోని ప్రత్యేకలాభాన్ని నేను కొనేసుకుంటాను”
శెట్టిగారిదగ్గర ధనసంపదేకాక, సుహృత్సంపదకూడా పూర్తిగావుంది. అందువల్ల ఆయన ఫకాలున నవ్వుతూ, రెండుచేతులూ జోడించి, “గొప్పబేరమే మిత్రమా! ఐతే, అంతా కృష్ణార్పణం!” అన్నారట. ఇద్దరూ మనసార నవ్వుకున్నారట! ఆ సంవత్సరం శెట్టిగారికి మామూలుగావచ్చేలాభాలకి పదిరెట్లు ఎక్కువ లాభాలువచ్చి, వ్యాపారం ఊహాతీతంగా అభివృద్ధి చెందిందిట!
వారు తమ అంతిమయాత్రకి సంబంధించిన జ్ఞానమున్నవారట. చివరి రోజునకూడా(ఏ వ్యాధులబారిన పడకుండా) వారు ఆఖరిక్షణంవరకు పూర్తి స్పృహతోవుండి భగవద్ధ్యానం చేసుకుంటూ, మాయామాళవగౌళ రాగంలో, వారి అంతిమకృతి, “కమలాకాంత! సుస్వాంత!”ని సన్నగా గానంచేస్తూ, యోగభూమికలోలీనమై, శ్వాసని సంగీతశారదలో విలీనం చేసేరట! అటువంటి సంగీతయోగికి దండవత్ ప్రణామం అర్పించుకుందాం!
స్వస్తి||
ఒక మహోన్నత వ్యక్తి పరిచయం చాలా సంతోషం కలిగించింది. ఈయన రాసిన పాటలు విన్నాం. కానీ తెలుసుకోవడం ఇప్పుడే ఇక్కడే. ధన్యవాదములు
మహానుభావుల జీవితాల్లోని విశేషాలు కూడా , తెలుసుకుని తీరాల్సిందే అని ఆ పించేటట్లున్నాయి.
ఆ అవకాశం మాకు కలుగుతోంది అంటే అది నీ ద యే.
దన్యవాదాలు.
మైసూరు సదాశివ గారి వంటి మహోన్నత వ్యక్తి గురించి ప్రాతఃకాలాన్నే తెలుసు కోవడం ఈరోజు శుభ ప్రాయమనడానికి నిదర్శనం.ధన్యుణ్ణి.
నీకు అభినందనలు.🙏🏻🙏🏻
మైసూరు సదాశివరావు గారి జీవన రేఖలు చాలా
ఆసక్తిదాయకంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి. వీరి
గురించి ఎప్పుడూ ఎక్కడా వినడం జరగలేదు. అలాంటివారి
గురించి ఎంతో కష్టపడి వివరాలు సేకరించి మాలాంటివారికి
అందిస్తోన్న నీ కృషికి జోహార్లు!
ఇందులో చెప్పిన సంఘటనలు వారి వ్యక్తిత్వాన్ని అంచనా
వెయ్యడానికి ఎంతగానో దోహదపడతాయి.
నరసింహస్వామివారి మీద పాడిన కీర్తన ద్వారా వారి భక్తి తత్పరత,
‘దేవరనామ’ పాడుకునే పేద బ్రాహ్మణుని సేవించడం ద్వారా వారి
సాధుజన సేవ, అతిథి మర్యాద,
రామస్వామి శెట్టి సంఘటన ద్వారా వారి దాతృత్వ లక్షణం, ధన సంపాదన పట్ల ఔదాసీన్యం అన్నీ గోచరమౌతాయి. మనసున్న
మహా వాగ్గేయ కారుడు!
The is the first time I have come to know of Sri sadasiva Rao garu,a great musician who is also a composer and author of many kritis some of which I know. His devotion to Narasimha swami is amazing. His attitude in giving away to the needy and his modesty towards the poor Brahmin who came to his house for alms reflect the divinity in his personality. His leaving the body consciously without dying makes him a complete and true Sangeeta Yogi. Thank you very much for giving us this special episode.
I’m immensely happy for your profound observation
that the saintly composer Sri Mysore Sadasivaraoji
left the body without dying (like worldly people who
helplessly surrender to death meekly).
Kudos to U my cute kiddy!
“పంచబాణుడు నాపై” అనే రాగమాలికలో, పల్లవిని,
“తోడి” రాగంలోకూర్చి, నాలుగుచరణాలని, వరసగా,
‘ఆభోగి’, ‘శంకరాభరణం’, ‘కాంభోజి’, ‘శహాన’ రాగాలలో
సదాశివరావుగారు వరసలు కట్టేరు. కొన్ని సెల్ ఫోన్
స్క్రీన్స్ మీద, నిలువుగా “శహాన” రాగంపేరు పూర్తిగా
రావడంలేదు. అందుకని ఈ వివరణని ఇక్కడ చేర్చడం
జరిగింది. ధన్యవాదం.
శ్రీ మైసూరు సదాశివరావుగారికృతులలో ప్రధానముద్రలు,
“సదాశివనుత”, “కవి సదాశివనుత”, “భూధవరాయకవి
సదాశివనుత”, “సదాశివార్తిహర”, “సదాశివభాగ్యధేయ”,
“సదాశివభయహర” అని వినిపిస్తాయి.
I’m very happy to know about the great vidwan through you guruvugaru. Dhanyoham.