సాహిత్యము-సౌహిత్యము – 47 : ఆర్ష తాత్త్విక దర్శన స్ఫూర్తిలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీశారదా కరుణా కౌముది :—

31—03—2018;  శనివారము.

“సాహిత్యము—సౌహిత్యము~47″|

రామాయణ/భారత/భాగవత పరమైన విషయాలని, సమస్యాపూరణానికి వస్తువులు(themes)గా స్వీకరించి, శ్రీ మోచర్ల వెంకన్నగారు గతంలో పూరించి, శ్రీశారదాదేవి అమ్మవారి దివ్య కంఠసీమలో అలంకరించిన వసివాడని  “చంపక మాలలు“యొక్క పరిమళాలని, అందౘందాలని మూడువారాలుగా మన రసజ్ఞ సత్సంగ సభ్యులు ౘక్కగా ౘవిచూసేరు. ఆ సమస్య మన మనస్సులకి హత్తుకుపోయింది కూడాను! అది యిది:—

“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “

ముఖ్యాతిముఖ్యమైన కావ్య/ఇతిహాస/మహాపురాణాలు మూడింటినీ స్పృశించి మూడు మనోహరపద్యాలు పూర్వకవిగారిచేత చెప్పబడ్డాయికదా, ఇంక మన శారదామాతకి ఇంతకన్న అలంకారాలు ఏముంటాయిలే, అందువల్ల, ఈ పూరణ పరంపరని గతవారంతో ముగించి, ఈ వారం మరొక్క “పునరుక్తి చమత్కృతి” పద్యం పరికించి, ఈ విషయానికి భరతవాక్యం పలికి, మరొక అంశం వచ్చేవారంనుంచి ప్రారంభిద్దాం, అనుకుని ఆ ప్రణాళిక ప్రకారం భరతవాక్యం పలికి, 47వ “సాహిత్యము – సౌహిత్యము” లో వేరే పద్యం ప్రస్తావించి సిద్ధంచేసివుంచేను. కాని, శారదామాత అభీష్టం మరొక రకంగావుంది. కేవలమూ పురాణవిషయము, ౘక్కని మాటలకూర్పు, మంచి అందమైన నడక, కాస్తంత కవితాస్పర్శ, హర్షప్రదమైన చమత్కారశుద్ధి, నాటకీయవైభవమూ వంటి దినుసులున్న మూడు పద్యాలతో అమ్మ అలంకరణ ముచ్చట పూర్తికాలేదు. చిన్మయీ, పరమానందా ఐన ఆ తల్లి మంజుల మతికి, ఒక వెలితి తోచింది. ఆ మూడింటిలోను ఆర్ష తాత్త్విక దర్శన స్ఫూర్తి ఆవంతైనాలేదు.

అంతేకాక, సాధకులవైపునుంచి ఆలోచిస్తేకూడా, అమ్మకి మరొక లోటూ కనిపించింది. రామాయణ ఇతివృత్త వృత్తం (నాతిగల, క్షత్రియ యువ) బ్రహ్మచర్యానికి సంబంధించిన తమోగుణప్రధానమైన యుద్ధానికి, భారతవిషయవృత్తం గృహస్థాశ్రమానికి సంబంధించిన రజోగుణప్రధానమైన యాగానికి, భాగవతవిషయపద్యం గార్హస్థ్యానంతర వానప్రస్థాశ్రమానికి సంబంధించిన సత్త్వగుణప్రధానమైన(వైదిక అనుశాసనాన్ని పాటించే కుటుంబపరంపరని కొనసాగించవలసిన) పుత్రకల్యాణాన్ని ప్రతిపాదిస్తూను, వైదికధర్మనిర్వహణలోని సోపానక్రమాన్ని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో త్రిగుణాతీతమైన తురీయస్థితిని ఎరుకపరచగలిగిన, సనాతన దర్శనతత్త్వాన్ని ప్రతిపాదించే పద్యంయొక్క సంపూరక ఆవశ్యకత(complementary inevitability)ఏర్పడింది.

ఆ కొరతని తీర్చుకోవడానికి, ఈ లోటుని భర్తీ చేయడానికి  శ్రీశారదామాత శ్రీ బాలాంతరపు కిరణ్ సుందర్ గారి హృదయగత హరిత కవితా కేదారంలోకి, తన పరమానుగ్రహ మందాకినీ సలిలాలని ప్రవహింపజేసి, ఆయనచేత  ఆ తల్లికి వలసిన మూలవస్తువు విషయంగా హృద్యమైన పద్యం వ్రాయించుకుంది. ఆ అనుగ్రహాన్ని ప్రసరింపచేసినది శారదామాత ఐతే, అది అందిపుచ్చుకుని పద్యచంపకమాలకి పదముల ప్రసవాలు కూర్చినవారు కిరణసుందరకవివరులు.

ఈ అపురూపమైన రసమయ పద్య ప్రసాదం మనందరికీ అయాచితంగా లభించడం మనఅమేయ సుకృతంకాక మరేమిటి? అబ్బురమైన ఆ విందుకి ముందు ఈ వర్ణనల అవాంతరం నాక్కూడా ఇంపైన విషయంకాదు. అందుకే ఆ పద్యాన్ని, ఈ సద్యఃస్ఫూర్తితో సాదరంగా ఆమంత్రిద్దాం!

“ఘన వలజా! తృషోపశమకంబ! కటంకటమా! స్వకంపమా!

ధ్వనన వహీ! నిదాఘకర! వారిజవైరి! సజీవ! దక్షిణా

స్యుని వరమూర్తి అంశముల సూచికc గొల్చెనె శంకరుండు, తా

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “||

“ఓ గొప్ప భూమాతా! (జీవుల) దప్పికని తీర్చే జలమా! (సృష్టిలోని నిరర్థక ద్రవ్యాలని దగ్ధంచేసే) అగ్నిదేవా! (సృష్టిలో చలనానికి సంకేతమైన) వాయుదేవా! (సృష్టిలో శబ్దతన్మాత్రకి మూలమైన) ఆకాశమా! (వేసవిని కలిగించే) సూర్యదేవా!  (పద్మవికాసానికి ప్రతికూలుడివైన) ఓ చంద్రా! (వీటినన్నింటినీ గ్రహించగలిగిన) ఓ జీవాత్మా! తన దక్షిణామూర్తి స్వరూపంలోని అంశలు(భాగాలు)గా శంకరుడు మిమ్ములనందరినీ విడి-విడిగా గమనిస్తూనే, తనలోని వైశ్విక పంచ తన్మాత్రలుగాను, దివా-రాత్ర కాలసంకేతాలుగాను, ఆ పైన వీటిని పరిమితప్రజ్ఞతో అనుభవించే జీవాత్మగాను సమైక్యస్ఫూర్తితో గ్రహిస్తున్నాడు”.

ఈ పద్యానికి మూలధాతువు, ఆదిశఙ్కర విరచిత “దక్షిణామూర్తిస్తోత్రమ్ ” లోని 9వ శ్లోకంలోవుంది. ఆ శ్లోకం ఇది:—

“భూరంభాంస్యనలోsనిలోsంబరమహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే”||

“భూమి-నీరు-నిప్పు-గాలి-ఆకాశం-సూర్యుడు-చంద్రుడు-సర్వకర్మల, విద్యల అధికారి ఐన పురుషుడు/జీవాత్మ అనే ఈ ఎనిమిది రూపాలలో భాసిస్తూనే

చరాచరాత్మకంగావుంటూ, విమర్శదృష్టికి వివర్తమైన విశ్వమయ, అద్వయ స్ఫూర్తి స్వరూపుడై అనుభవమగుచున్న గురుతత్త్వనిర్దేశకుడగు శ్రీదక్షిణామూర్తిస్వామికి నమస్కరిస్తున్నాను”.

ఇదే విషయం(theme), “శ్రీమద్భగవద్గీత”లోని ‘జ్ఞాన-విజ్ఞానయోగం’ అనే పేరుగల సప్తమాధ్యాయంలో, నాలుగవ శ్లోకంలో, శ్రీకృష్ణభగవానుడిచేత, ఇలాగ చెప్పబడింది:—

“భూమిరాపోsనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా”||

“భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు(మనఃకారకుడు చంద్రుడు), బుద్ధి(బోధాత్మక బుద్ధి కారకుడు సూర్యుడు), అహంకారం(జీవాత్మ) అని నా ప్రాకృతికరూపం ఎనిమిది విధాలుగా ఉంటూంది”.

అలాగే “శ్రీలలితాసహస్రనామస్తోత్రమ్ “లో, 662వ నామం, “అష్టమూర్తిః” అనివుంటుంది.

This is the metaphysical concept of various Vedic philosophies like Kevalaadvaita, Visishtaadvaita, Dvaita, Saaktaadvaita and so on and so forth.

స్వస్తి||

You may also like...

4 Responses

  1. Kasu says:

    Very nice bava garu. Though it is above my standard to grasp it fully, i could feel the essence. I will try to climb to your standards.

    By the way, why do we say “bharata vaakyam” while closing a topic?

    • వ.వెం.కృష్ణరావు says:

      నాట్యప్రధానమైన నాటకాలకి చివర భరతమునిని
      ప్రస్తుతిస్తూ చేసే గౌరవ వందనోపేతమైన పద్యము/లని లేక
      పాట/లని “భరతవాక్యమ్ ” అంటారు. నాట్యపరిభాషకి
      సంబంధించిన ఈ పదబంధం లోకభాషణంలో “చివరి ఘట్టం”
      లేక “విషయం” అనే అర్థాన్ని సంతరించుకుంది.

  2. వ.వెం.కృష్ణరావు says:

    1) “విష్ణుపురాణం”, ‘ప్రథమాంశం’లో అష్టమూర్తి ప్రసక్తి
    ఇలావుంది:—

    “సూర్యో జలం మహీ వహ్నిః వాయురాకాశ ఏవ చ|
    దీక్షితో బ్రాహ్మణః సోమః ఇత్యష్టౌ మూర్తయో మతాః”||

    2)యోగశాస్త్రంలోనూ ఈ విషయప్రస్తావనవుంది:—

    “గుణభేదాత్ ఆత్మమూర్తిః అష్టధా పరికీర్తితా|
    జీవాత్మాచాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మలః||
    శుద్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమః స్మృతః|
    అష్టమస్తేషు భూతాత్మేత్యష్టాత్మానః ప్రకీర్తితాః”||

    3)”మత్స్యపురాణం”లో ఇలాగవుంది:—

    “లక్ష్మీర్మేధా ధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభా ధృతిః|
    ఏతాభిః పాహి తనుభిః అష్టాభిర్మాం సరస్వతీ”||

    ఈ విధంగా అనేక పురాణాదులలో వివిధ అష్టమూర్తి
    ప్రసక్తివుందని శ్రీభాస్కరరాయలవారి శ్రీలలితాసహస్ర
    నామస్తోత్రభాష్యమైన “సౌభాగ్యభాస్కరభాష్యమ్ “,
    662వ నామవ్యాఖ్యానసందర్భంలో వివరించేరు.

  3. సి.యస్ says:

    సమస్యా పూరణంలో వరసగా మూడు వారాలు శ్రీ మోచర్ల
    వెంకన్న గారి రసమయమైన పూరణలను అందించడం– మరొక
    మంచి పద్యం ఆవిర్భవించడానికి తోడ్పడింది. శ్రీ కిరణ్ రాసిన
    ఈ పద్యం… పద్యరచనలో చేయి తిరిగిన ఒక కవిపండితుడు
    రాసినట్టుగా ఉంది. అయితే ఈ పద్యం అంత సులువుగా అర్థం
    అయ్యేట్టు లేదు. లోతైన భావంతో పాటు, అన్వయ క్లిష్టతా ఉంది..,
    పద కాఠిన్యతా ఉంది.
    అద్భుతమైన నీ అర్థవివరణతో పాటు దక్షిణామూర్తి స్తోత్రానికి
    అన్వయించి, భగవద్గీతలోని శ్లోకాన్ని, లలితాసహస్ర నామం లోని
    నామాన్ని ఉల్లేఖిస్తూ చేసిన సమన్వయం… బంగారానికి అద్దిన
    తావిలా ఉంది. చాలా మంచి విశ్లేషణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *