సాహిత్యము-సౌహిత్యము – 46 : భాగవతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
24—03—2018; శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~46″.
“పునరుక్తి చమత్కృతి” వరుసలో, ఈ వారంకూడా గత రెండువారాలుగా ప్రస్తావించుకుంటున్న ‘చంపకమాల‘ పద్యపాద సమస్యని శ్రీ మోచర్ల వెంకన్న కవివరులు భాగవతార్థంలో ఏవిధంగా పూరించేరో గమనిద్దాం!
సమస్య :—
“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “|
ఇప్పుడు సమస్యాపూరణ పద్యాన్ని పరికిద్దాం.
“అనఘ సురేశ! వాయుసఖ! అర్యమనందన! రాక్షసేంద్ర! ఓ
వననిధినాధ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మనుమని చెప్పె మాధవుడు మారుని పెండ్లికి మిమ్మునందరన్ ,
నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “|
“భాగవతం”లో శ్రీకృష్ణుడు తనకి, రుక్మిణీదేవికి పెద్దకొడుకైన ప్రద్యుమ్నుడు (మారుడు=మన్మథుడు; ఫాలనేత్రుడి క్రోధాగ్నికి భస్మమైన మన్మథుడు శివానుగ్రహంవలన రుక్మిణీ-కృష్ణులకి ప్రద్యుమ్నుడిగా పుడతాడు) యొక్క వివాహం జరపబోతున్నాడు. ఆ సందర్భంలో, అష్టదిక్పాలకులని తన పుత్రవివాహానికి విచ్చేయవలసినదిగా సప్రశ్రయంగా ఆహ్వానించడానికి తగిన వ్యక్తికోసం ఆలోచిస్తూండగా, నారదమహర్షి, స్వయంగా ఆ సంతోషకరమైన శుభకార్యం తానే నిర్వహించపూనూకుని, శ్రీకృష్ణులవారి అభీష్టంమేరకి, దేవసభలో వేంచేసివున్న అష్టదిక్పతులకి, శ్రీకృష్ణుని తరఫున సాదరాహ్వానాన్ని ఈ విధంగా తెలియజేసేరు.
“ఓ పుణ్యస్వరూపుడివైన మహేంద్రా! వాయుదేవుడి మిత్రుడవైన ఓ అగ్నిదేవా! సూర్యపుత్రుడవైన ఓ యమధర్మరాజా! రాక్షసప్రభువు ఐన ఓ నిరృతీ! సర్వజలాలకీ ప్రభువువైన ఓ వరుణదేవా! పరిమళాలని వ్యాపింపచేసే వాయుదేవా! విశ్రవసుడికుమారుడవైన ఓ కుబేరా! త్రినేత్రుడివైన ఓ ఈశానదేవా! శ్రీకృష్ణుడు భూలోకంలోని పవిత్ర ద్వారకానగరిలో తన జ్యేష్ఠకుమారుడైన ప్రద్యుమ్నుడి పెండ్లిని మహావైభవంగా జరపబోతున్నాడు. ఆ శుభకార్యానికి, మిమ్మల్నందరినీ విచ్చేయవలసినదిగా ఆయన ప్రతినిధిగా పేరు పేరునా ఆహ్వానించవలసినదిగా నన్ను మీ వద్దకి పంపేడు”.
ప్రదక్షిణక్రమం(clock-wise-
(1)తూర్పుదిశకి ఇంద్రుడు,
(2)ఆగ్నేయానికి అగ్ని,
(3)దక్షిణానికి యముడు,
(4)నైరృతికి నిరృతి,
(5)పడమరకి వరుణుడు,
(6)వాయువ్యానికి వాయువు,
(7)ఉత్తరానికి కుబేరుడు,
(8)ఈశాన్యానికి ఈశానుడు, ఈ ఎనిమిదిమంది దిక్పాలకులని, అదే క్రమంలో, వరసని తప్పనీయకుండా పిలిచినట్లు పద్యాన్ని కూర్చగలగడం ఈ కవిగారిలోని ప్రత్యేకప్రతిభ; ఆ ప్రతిభావిశేషం గ్రహించి ఆనందించగలగడం మన సరసుల స్వారస్యమూను!
స్వస్తి||
వెనకటి భారతార్థపు విభేదము భాగవతార్థమందునం
దొనరగ అన్వయించి పరితుష్టి జనింప సమస్య పూర్తిచే
సిన కవిరాజు నాదరముచేయగ రమ్మను దష్టలక్ష్ములన్
నిను నిను నిన్ను ని న్ననుచు నిన్నును నిన్నును నిన్ను ని న్ననన్!
*భాగవతార్థపద్య మం
దొనరగ….
(కు) మారుని పెళ్ళికి మాధవుడు తన పక్షాన ఆహ్వానాలు
అందించమని లోక సంచారి నారదుడిని కోరడం, ఆయన
అష్టదిక్పాలకుల్ని ఆహ్వానించడం ఈ పద్యంలో చక్కగా కుదిరింది.
చివర్న నువ్వు చెప్పిన ప్రదక్షిణ విధిలో ఇమిడివున్న విశేషం
ఇప్పుడే తెలిసింది.
తూర్పునుంచి మొదలయ్యే అష్టదిక్పాలకుల వరస, ఆయా దిక్కుల అధిపతులు ఈ పద్యం చదువుకుంటే తెలిసిపోతుంది.
ఆ రకంగా ఈ పద్యం ధారణ చేయవలసింది.