శారదా సంతతి — 36 : అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు— అల్లాదియాఖాc సాహెబ్

శ్రీశారదా కారుణ్య కౌముది:—
18—03—2018; ఆదిత్యవారము.

“శారదా సంతతి~36” ~ “అలౌకిక ఆచార్యశ్రేష్ఠుడు—అల్లాదియాఖాc సాహెబ్ ” (10—8—1855 నుండి 16—3—1946 వరకు)

నేడు విలంబినామసంవత్సర నూతన వర్షాది పర్వదినం. మీ అందరికీ విలంబి సంవత్సరాది శుభాకాంక్షలు సమర్పిస్తున్నాము.

19వ శతాబ్దిలో, ఆఖరి దశకంలో, చివరిభాగం అనుకోవచ్చు! బొంబాయి మహానగరం. గోవాకిచెందిన ఆ కాలంలో సుప్రసిద్ధ సంపన్న సంగీతలోక మహారాజ్ఞి, బాపూతారాదేవి, కలబాదేవి రాజవీధిలో, ఒక మంచి భవనంలో నివసిస్తోంది. సంపన్నురాలేకాక, మహారసజ్ఞురాలుకూడా కావడంవలన, సంగీతప్రపంచంలో అలవిమీరిన జనాదరణనిపొందింది. తరచు, తన భవనంలో, “సంగీత గోష్ఠిలు” నిర్వహించేది. ఒక ౘక్కని సాయంత్రం, సంగీతసభని ఏర్పాటుచేసింది. పట్టణంలోని మహావిద్వాంసులు, కళాకారులు అందరూ విచ్చేసి, ఉచిత ఆసనాలని గ్రహించేరు. రసజ్ఞులైన పురప్రముఖులు సభని అలంకరించేరు. సభావేదిక సుశోభితంగా ప్రకాశిస్తోంది.

ఒకరితరవాత మరొకరు కళాకారులు తమ ౘక్కని పాటలని పాడి, సదస్యుల కరతాళధ్వనులద్వారా మన్ననలందుకుని మరలివెడుతున్నారు.

ఆగ్రాఘరానాకిచెందిన ఉస్తాద్ నత్ధన్ ఖాcసాహెబ్ ప్రియశిష్యురాలు అయిన బబ్లీబాయి తన మృదుమధుర కంఠంలో అద్భుతగానాన్ని వినిపించింది. ఆమె తరవాత పాడడానికి ఎవరూ సాహసించలేదు. అప్పుడు ఆమె ఖాcసాహబ్ ఉస్తాద్ అల్లాదియాఖాcజీని తమ గానాన్ని వినిపించవలసినదిగా అభ్యర్థించింది. మందహాసం చిందిస్తూ ఆ మహాగాయకోత్తముడు, వేదికపైన ఆసీనులయ్యి, అంతవరకు ఆ వేదికకిలేని ఒక విలక్షణకాంతిపుంజంతో దానిని సుశోభితంచేసేరు. ఆ సాయంత్రం వారు వినిపించిన దివ్యగానం, అంతవరకు బొంబాయి నగర సంగీతరసికులకి, పూర్తిగా అపరిచితమైనది. ఆ అలౌకిక గానరససాగరంలో విహరించిన రసజ్ఞులందరూ మంత్రముగ్ధులై, ఆ వినూత్న సంగీతరసపీయూషంకోసం పిపాసువులైపోయి వారిగానంకోసమూ, వారి శిష్యపరంపర సంగీతంకోసమూ తహతహలాడేవారు.

1855వ సంవత్సరం, ఆగష్టునెల, 10వ తేదీన, అల్లాదియాఖాcసాహబ్ , రాజస్థానులోని, ఉనియా(వా)రా గ్రామంలో, ఖ్వాజా అహ్మద్ ఖాcసాహబ్ జీకి (ౘాలామంది పిల్లలు పుట్టి మరణించిన తరవాత), జన్మించేరు. ఆ సందర్భంలో ఒక సాధుమహాత్ముడి సలహామేరకి, అహ్మద్ ఖాcజీ ప్రత్యేక దీక్షావ్రతాన్ని, అల్లాదియాఖాc జన్మించడానికిముందు, పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించేరు. ఆ వ్రతఫలంగా పుట్టిన పిల్లవాడికి “గులాం అహ్మద్ ఖాc” అని పేరుపెట్టేరు. కాని ఈశ్వర వర ప్రదానంగా లభించినవాడు కనుక, ఆ బాలుడిని, అందరూ, “అల్లాదియా“(ఈశ్వరుడిచేత ఇవ్వబడినవాడు) అని పిలిచేవారు. అందువలన, అసలు నామకరణం మరుగునపడి, లోకదత్తమైన పేరు సార్థకమై స్థిరపడింది. ఈశ్వరసంకల్పంవల్ల, అహ్మద్ ఖాcజీకి ఆ తరవాత ఇద్దరు ఆడబిడ్డులుకలిగి, చివరిగా, అల్లాదియాఖాcగారికి ఒక తమ్ముడు పుట్టేడు. అతడిపేరు హైదర్ ఖాc. అహ్మద్ ఖాcసాహబ్ వారికాలంలో పేరుపొందిన గాయకుడిగా మన్ననలు అందుకున్నవారు. అందువలన వారు, తాంక్ సంస్థానానికి నవాబుగారి ఆస్థానంలో గాయకునిగా గౌరవంపొందుతూండేవారు.

అల్లాదియాఖాcజీకి సుమారు 15 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, దురదృష్టవశంగా తండ్రి ఖ్వాజా అహ్మద్ ఖాcజీ పరమపదించేరు. అప్పటికి, అల్లాదియాఖాcజీ, కొంత అరబిక్ భాషని, మరికొంత పార్సీభాషని నేర్చుకున్నారు. ధ్రుపద్ , ధమార్ సంగీతప్రక్రియలలో గొప్ప-గొప్ప వాద్య విద్వాంసులని, గాయక కళాకారులని మంచి శ్రద్ధాసక్తులతో విన్నారు. అహ్మద్ ఖాcజీ కుటుంబ బాధ్యతలని, వారి తమ్ముడు, ఖాcసాహబ్ ఉస్తాద్ జహంగీర్ ఖాc స్వీకరించి, అల్లాదియాఖాcజీకి గాత్రసంగీతంలో కూలంకష శిక్షణని ఇవ్వడం మొదలుపెట్టేరు. మొదటి నాలుగైదు సంవత్సరాలు, అల్లాదియాకి ధ్రుపద్ – ధమార్ శైలికిచెందిన భారతీయ ప్రాచీనతమ సంగీతవిభాగంలోౘక్కని అవగాహనకలిగించి, కంఠం గానానికి అనువైన పరిపక్వత పొందేవిధంగా శిక్షణనిచ్చేరు. ఆ పిమ్మట ఖయాల్ సంగీతప్రక్రియలో పరిణతి పొందేవిధంగా ఆరేళ్ళపాటు సంపూర్ణసంగీతవిద్యాధ్యయన- అభ్యాసాలని చేయించేరు. అప్పటికి ఉస్తాద్ జహంగీర్ ఖాcజీ ఉదయపూర్లో స్థిరపడ్డారు. అల్లాదియాఖాcజీకి పాతికేళ్ళుదాటేయి. ఆ సమయానికి అల్లాదియాజీ, కొన్నివేల సంగీతకృతులు, కొన్నివందలరాగాలు ఏ వెలితీలేని విధంగా నేర్చుకున్నారు.

ఆ కాలంలో, జయపూర్ , వివిధఘరానాలకి మకుటాయమానంగా ప్రకాశించే అగ్రశ్రేణి విద్వాంసులైన కళాకారులందరికీ నివాస స్థానంగావుండేది. గ్వాలియరు ఘరానాకి మూలస్థంభద్వయమైన హడ్డూఖాc – హస్సూఖాcలు ఇద్దరికీ గురువువంటివాడైన ఖాcసాహబ్ బడేమొహమ్మద్ ఖాcసాహబ్ కుమారుడు, గాత్రసంగీతంలో అల్లాదియాఖాcసాహబ్ చేత మహామహిమాన్విత పూర్ణ గాయకునిగా ఆరాధింపబడినవాడు, ఐన ఉస్తాద్ ముబారక్ ఆలీఖాcసాహెబ్ జయపూర్ లోనే వుండేవాడు. ఆయనకి అల్లాదియాజీని తన ప్రియశిష్యుడిగా చేసుకుని, తన విద్యనంతా తన శిష్యుడికి ధారాదత్తం చేయాలని, ఆయన ౘాలా ముచ్చటపడ్డారు. అలాగే అల్లాదియాజీ ముబారక్ ఆలీఖాcసాహబ్ వద్ద శుశ్రూష చెయ్యాలని ఎంతగానో ఆరాటంచెందేరు. ముబారక్ ఆలీఖాcసాహబ్ గారిలోని విద్యావైభవదక్షత అల్లాదియాజీకి, అల్లాదియాఖాcజీలోని విద్యాసముపార్జనాపాత్రత ముబారక్జీకి పరస్పరమూ అంతటి ప్రీతిభావాన్ని కలిగించేయన్నమాట! అయితే, అల్లాదియాజీ గురువు-పినతండ్రి ఐన జహంగీరుఖాcసాహబుకికాని, మిగిలినకుటుంబసభ్యులకిగాని ఈ విషయం ఏమాత్రమూ అంగీకారం కాకపోవడంవలన, అల్లాదియాజీ ఆ ప్రయత్నంనుంచి విరమించుకోవలసివచ్చింది. కాని జీవితాంతమూ, అల్లాదియాజీ, ముబారక్జీని ఆయాసమయాలలో తలచుకుంటూనేవుండేవారు. అల్లాదియాజీ, ముబారక్జీకి ఏకలవ్యశిష్యరికం చేసినట్లు అనిపిస్తుంది. అల్లాదియాజీ సంగీతాన్ని ఎందరెందరో అపరిమితంగా మెచ్చుకునేవారు. అటువంటి కొన్ని సందర్భాలలో, అల్లాదియాజీ ఇలాగ అంటూవుండేవారు:—

మీరు నా గానంలో ఇంతగా మెచ్చుకుంటున్న నా సంగీతంలోని లయభావంలో మెరిసే హొయలు, సొగసు, నా ఆలాప భాగంలోవున్న క్లిష్ట ఊహాపుష్టి, నా తాన ప్రయోగంలోని సుందర సంక్లిష్ట సంయోజనాలు మొదలైన గొప్ప-గొప్ప సుగుణాలన్నీఉస్తాద్ ముబారక్ ఆలీఖాcసాహబ్ గారి సంగీతంతో పోలిస్తే, నిస్తేజంగా ఐపోతాయి. నా గానంలో మిమ్మల్నందరినీ మోహపరవశులనిచేసే సంగీతమంతా, నేను, వారు పాడగా వినిన సంగీతాన్ని, జాగ్రత్తాగా జ్ఞాపకంచేసుకుంటూ పాడుతున్న వారి అసలు సంగీతంలోని ఒక అంశ మాత్రమే!” అని చెపుతూ, ఆయనవద్ద సంగీతం నేర్చుకోలేకపోవడం అనే వెలితి, వారికి ఆజీవన మనోవేదనగా మిగిలిపోయినట్లు మాట్లాడేవారు.

అల్లాదియాజీ, తమ పినతండ్రికి బదులుగా, వారి అదేశంమేరకి, అజయగఢ మహారాజావారి సంస్థానంలో పాడి ఎంతో ధనాన్ని, ఎన్నో బహుమానాలని, అన్నింటినీ మించిన పేరు ప్రఖ్యాతులని సంపాదించుకున్నారు. అప్పటినుంచి శాస్త్రీయ సంగీత గానాన్ని వృత్తిగా స్వీకరించి, ఆ విధంగానే జీవితంలో స్థిరపడ్డారు. దేశంలోని పెద్ద పట్టణాలలో ౘాలాచోట్ల సభలలో వారు గానంచేసేరు. నేపాలుదేశ మహారాజుగారి సర్వసేనాధిపతివారి ఆహ్వానం స్వీకరించి, నేపాలు రాజసభాసదస్యులందరినీ సంగీతరసాంబుధిలో ఓలలాడించేరు. రాజావారి అభీష్టం మేరకి రెండేళ్ళు నేపాలు ఆస్థానగాయకపదవిని అలంకరించేరు.

నేపాలునుంచి తిరిగిరాగానే, వారి సన్నిహితబంధువు చమ్మన్ ఖాcగారి అమ్మాయిని వివాహంచేసుకుని, రెండు-రెండు సంవత్సరాల విరామంతో ముగ్గురు మొగపిల్లలకి తండ్రి అయ్యేరు. పెద్దకొడుకు నసీరుద్దీనుఖాc(బడేజీ), మధ్యకొడుకు బద్రుద్దీను(మంజీ)ఖాc, చివరికొడుకు షంషుద్దీను(భుర్జీ)ఖాc నామధేయాలతో వారు ప్రసిద్ధులయ్యేరు. రెండవ, మూడవ కుమారులిద్దరూ వారి వద్ద పూర్తిగా సంగీతవిద్యని అభ్యసించేరు. ఐతే, 1888లో పుట్టిన మంజీఖాc 1937లో మరణించడం అల్లాదియాఖాcజీని బెంగతో క్రుంగదీసింది. 1990లో పుట్టిన భుర్జీఖాc 1950లో మరణించేరు. 1855లో పుట్టిన అల్లాదియాఖాcజీ 1946లో తొంభైసంవత్సరాల పూర్ణజీవితాన్ని అనుభవించి బొంబాయిలో పరమపదాన్ని చేరుకున్నారు.

వారి శిష్యులలో వారి తమ్ముడు హైదర్ ఖాc, మొట్టమొదటివారు. తరవాత మంజీఖాc, భుర్జీఖాc, హైదర్ ఖాcజీ కుమారుడు, నత్థన్ ఖాc మొదలైనవారు వారి బంధువర్గంలోని శిష్యవర్గం. ఐతే, వారికి-వారి ఘరానా గాయకీకి విశ్వవిఖ్యాతి తెచ్చినవారు, పండిత్ భాస్కరబువా బాఖలే, సుర్ శ్రీ కేసర్బాయి కేర్కర్ , గానతపస్విని మోగూబాయి కుర్డీకర్ , మహారాష్ట్ర కోకిల శంకరరావు సర్నాయక్ మొదలైనవారంతా కేవలమూ ప్రత్యక్ష శిష్యవర్గీయులేకాని, బంధువులు కాదు. ఇంక ఆ పరంపరలో వచ్చిన మహావిద్వత్కళాకారులు/కళాకారిణులు గోవిందరావు తెంబే, మాస్టర్ కృష్ణారావు ఫులాంబ్రికర్ , బాపూరావు కేత్కర్ , మల్లికార్జున మంసూర్ , కిశోరీ అమోన్కర్ , గులూభాయి జస్దన్వాలా, వామన్రావ్ సదోలీకర్ , శ్రుతి సదోలికర్ కాట్కర్ , నివృత్తిబువా సర్నాయక్ , మానిక్ భిడే, అశ్వని భిడే దేశ్పాండే, ధోందూతాయి కులకర్ణి మొదలైనవారు వందల సంఖ్యలోనేవుంటారు.

ఇక్కడ ఒక ప్రధానవిషయం చరిత్రకారులద్వారా మనకి అందుతోంది. “జయపూర్ – అట్రౌలీ” ఘరానాగా సంగీతప్రపంచంలో అత్యద్భుతంగా ప్రకాశిస్తూన్న ఈ మహాపరంపరని “అల్లాదియా గాయకీ” అనికూడా కొందరు పెద్దలు వర్ణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవిషయం ఆ వర్ణనని ౘాలా సమంజసమైన విషయంగా రుజువుచేస్తుంది. అల్లాదియాజీకి సుమారు నలభైఏళ్ళ ప్రాయంలో, అమ్లతా సంస్థానాధిపతి ఐన రాజాగారితో స్నేహం ఏర్పడింది. రాజావారు సంగీతరసికులేకాక, స్వయంగా మంచి గాయకులుకూడాను. వారు అల్లాదియాజీని తమ సంస్థానంలో రెండేళ్ళపాటు సకలమర్యాదలతోను, రాజలాంఛనాలతోను పోషించేరు. నిత్యమూ ఉదయవిభాగంలో నాలుగుగంటలపైన, సాయంకాల విభాగంలో మూడు-నాలుగు గంటలు అల్లాదియాజీచేత హాయిగా వివిధ ప్రసిద్ధరాగాలని పాడించుకుని వినడమేకాక, అప్రసిద్ధ-అపూర్వ రాగాలని కూడా తనివితీరా పాడించుకుని, పరవశంతో రాజుగారు వినేవారు. ఇలాగ ౘాలా శ్రమతో గాఢ గాత్రశక్తిని వెచ్చించి, రెండు సంవత్సరాలపైగా పాడేసరికి, అల్లాదియాఖాcగారి కంఠం పూర్తిగా బొంగురుపోయింది. పోయిన ఆయన కంఠం ఎంతకాలమైనా, ఏమిచేసినా మామూలు స్థాయికి రాలేదు. దానితో ఆయన తన కంఠానికి విశ్రాంతినిచ్చి, తగిన చికిత్సచేయించుకుని, తన పూర్వగాత్రం యథాతథంగా పొందడానికి జోధ్పూరుకి మకాం మార్చేసేరు. అక్కడ నమాజు చేసుకుంటూ భగవత్కృపకోసం గాఢతపస్సుచేసేరు.

“ఛిన్నోsపి రోహతి తరుః క్షీణోsప్యుపచీయతే చంద్రః” (చెట్టుని కొట్టేసినా, మళ్ళీ అది పైకి ఎదుగుతుంది. ఒకసారి క్షీణదశలోవున్నచంద్రుడు మరొకసారి వృద్ధిస్థితిని పొందుతాడు)

అని భర్తృహరి చెప్పినట్లు, అల్లాదియాజీ తనకి కలిగిన ఆపదనిచూసి భయపడక, ఓర్పుతోను, నేర్పుతోను, తన సమస్యకి పరిష్కారం కనుగొనడమే కాక, ఆ సమస్యని ఆయుధంగా మలచుకుని, లోకంలోకి లోకోత్తరగానరీతిని ప్రవేశపెట్టేరు. వారికి యుక్తవయస్సునుంచి నలభైఏళ్ళప్రాయంవరకువున్నకంఠం మూడున్నర సప్తకాలలోనూ, షట్కాలాలలోనూ, పురుషగాత్రనాదపూర్ణ మాధుర్యంతో సంగీతమయ సంచారంచేసేది. అటువంటి మహనీయగాత్రం పూర్తిగా ఆయన గానజీవనాన్ని విడిచి వెళ్ళిపోయింది. అటువంటి గొప్ప కఠం స్థానంలో అనేక పరిమితులకి లోబడిన క్రొత్తగాత్రం పాదుకుంది. పోయినది ఎంత గొప్పదైనా అది ఇంక తిరిగి రాదు. వచ్చినది ఎంత అల్పమైనదైనా స్థిరంగా తోడువుండేది అదే! తన విద్య, విద్వత్తు, కళాపారమ్యవైదగ్ధ్యము మొదలైన తననుంచివేరుచేయబడని సంపదలన్నింటినీ లోకానికి అందించడానికి యోగ్యమైన మాధ్యమానికిమాత్రమే మార్పువచ్చింది. అందుకని ఆయన తను కష్టపడి సంపాదించుకున్న సంపదని భద్రపరచడానికి, దానిని ౘక్కగా వ్యక్తంచెయ్యడానికి అన్ని విధాలా అనువైన సరిక్రొత్త సంగీత యానకాన్ని పునాదులనుంచీ పునర్నిర్మించగలిగిన సృజనాత్మక-నిర్మాణాత్మక సామర్థ్యాన్ని సమకూర్చుకోగలిగేరు. ఆ అపూర్వ నవీన రసజ్ఞ సమ్మోహనకర సంగీత యానకం (a unique and fresh music-medium which enchants the connoisseurs) పేరే “అల్లాదియా గాయకీ”/ “జయపూర్ -అట్రౌలీ” ఘరానా! అంటే, అల్లాదియాజీ వంటి మహాపురుషులకి వ్యక్తిగతకష్టం కలిగినా, అటువంటి సందర్భంకూడా, లోకహితానికి, ప్రజోపకారానికి దారితీస్తుందని ఇటువంటి సంఘటన నిరూపిస్తుంది. వత్తి తాను మండుతూ లోకానికి కాంతినిస్తుంది.  అలాగే, అగురువు తాను కాలిపోతూ, ప్రపంచానికి పరిమళాలు ప్రసరింపజేస్తుంది. ఈ రీతిగా ఒకేఒక మహనీయ జీవిత సంగీత కేంద్రం నుంచి ఇంతటి అఖండ, అనంత రసధుని ప్రవహిస్తూ భారతీయ సంగీత కేదారాన్ని నిరంతర సస్యశ్యామలం చేస్తోంది. ఇటువంటి సంఘటన ఇంతకుముందుకాని, ఆ తరవాతకాని సంగీతజగత్తుకి పూర్తిగా అపరిచిత విషయమే!

అల్లాదియాఖాcసాహబ్ 1896వ సంవత్సరంనుంచి సుమారు 25 ఏళ్ళపాటు కొల్హాపూరు మహారాజా శ్రీ శాహూమహరాజుగారి సంస్థానంలో, ఆస్థానగాయకులుగా వున్నారు. వారితోబాటు, వారి తమ్ముడు హైదరుఖాcజీకూడా అక్కడేవుండేవారు.

అల్లాదియాఖాcసాహబ్ పూర్వులు భారతీయ ఆద్య గౌడ ప్రాచీన బ్రాహ్మణ పరంపరకి చెందినవారని వారే స్వయంగా అనేకసందర్భాలలో చెప్పేవారు. వారు యజ్ఞోపవీతాన్ని ధరించేవారు.అసిత – దేవల – శాండిల్య త్రయార్షేయ ప్రవరాన్విత శాండిల్యగోత్రజుడను” అని వారు వివరించేవారని గ్రంథస్థం చేయబడింది.

అటువంటి మహనీయ పుణ్యశ్లోకులగురించి, విలంబి సంవత్సరాది పర్వదిన శుభసందర్భంలో, మనం సంక్షిప్తంగా పరిచయంచేసుకోగలగడం మన సౌభాగ్యవిశేషం. ఆ అద్భుత శారదాతనయుడి పాదాలవద్ద వినమ్ర అంజలి ఘటిద్దాం.

స్వస్తి||

You may also like...

4 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    అంజలి.

  2. వ.వెం.కృష్ణరావు says:

    ఆ కాలంలో, ఆగ్రా ఘరానాకి చెందిన అగ్రశ్రేణి గాయకుడు,
    ఉస్తాద్ నత్థన్ ఖాc సాహబ్ , ఒక సందర్భంలో ఉస్తాద్
    అల్లాదియాఖాcసాహబ్ గురించి ఇలాగ అన్నారు.

    “సోదరా! మీ గాత్రమాధుర్యం అందుకునే ఆకాశం అంచుల
    సీమలోకి, కనీసం నా ఊహాశక్తికూడా ప్రవేశించలేదు”!

    * * * * * * * * * * * * * * * * * * *

    “పండిత్ గోవిందరావ్ తెంబేజీ, తన జీవితకాలంలో ఏ ఇతర కళాకారుడిముందు, తనతలని ఒంచలేదు. కాని అల్లాదియాఖాcజీని ఆయన ఎక్కడ, ఏ సందర్భంలో
    చూసినా, ఉస్తాద్జీ పాదాలని స్పృశించి, నమస్కరించకుండా
    వుండలేదు.”
    “అదే విధంగా బాలగంధర్వజీ, అంతేకాక ఎందరెందరో
    పెద్ద సంగీతకళాకారులుకూడా చేసేవారు. గోవిందరావు
    తెంబేజీ వంటి మహానుభావులు అలాగ చెయ్యడంచూసి,
    అప్పటికి నాకు ఉస్తాద్జీగురించి ఏమీ తెలియకపోయినా,
    నేనుకూడా ఖాcసాహబ్ పాదస్పర్శ చేసేవాడిని”.
    అని వామనరావ్ దేశ్పాండేజీ తమ
    “Between Two Tanpuras”
    అనే సంగీతరచనలో వివరించేరు.

    # # # # # # # # # # # # # #

    “సంగీత సమ్రాట్ “, “సంగీతలోక గౌరీశంకర శిఖరం”
    వంటి బిరుదులతో ఆనాటి రసజ్ఞ ప్రపంచం ఆయనని
    సంభావించింది.

    వారి శిష్య-ప్రశిష్యాది పరంపరలో, పద్మభూషణ-
    విభూషణాది బిరుదులతో సమలంకృతులైనవారు
    ఉన్నారు, ఇంకా ఎందరో అటువంటి మహానుభావులు
    రాబోతున్నారుకూడాను. అందువలన, అల్లాదియాఖాcజీని,
    శాశ్వత పద్మభూషణ-పద్మవిభూషణ ఆభూషిత విరాజితులు
    అని మనం వర్ణించుకోవాలి.

  3. సి.యస్ says:

    గత మూడు వారాలుగా పరిచయం చేస్తూ వస్తూన్న
    సుర్ శ్రీ కేసరి బాయి కేర్కర్, మోగూబాయి కుర్డీకర్,
    భాస్కర బువా బాఖలే వంటి అత్యున్నత శ్రేణి సంగీత
    కళాకారుల్ని ఈ లోకానికి అందించిన ప్రతిభామూర్తి– మహోజ్వల సంగీత విద్వాంసులు ఉస్తాద్ అల్లా దియా ఖాన్ వారి పేరు పదే పదే వినడం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కేసరి బాయి కేర్కర్ వ్యాసంలో
    వారి వ్యక్తిత్వం గురించి కొంత తెలుసుకోవడమూ
    జరిగింది
    అంతటి గురూత్తముడి గురించి ఈ ఉగాది పూట
    నీ వ్యాసం ద్వారా తలుచుకోవడం నిజమైన పండగలా ఉంది.
    ఉస్తాద్ ముబారక్ అలీఖాన్ సాహిబ్ ని వారు
    మనసా వాచా గురుతుల్యునిగా భావించడం,
    సమయం వచ్చినప్పుడల్లా, వారి పేరు ప్రస్తావించడం
    –నిరూపమానమైన వారి వినమ్రతకీ, అచంచలమైన
    వారి గురు భక్తికీ నిదర్శనం.
    ‘జయపూర్–అట్రౌలి’ ఘరానా (అల్లా దియా గాయకీ) ఆవిర్భావాన్ని గురించిన సంగతి అపూర్వంగానూ, ఒక అద్భుతంగానూ ఉంది.
    అంతే కాదు….వారు శాండిల్య గోత్రోద్భవుడన్నది
    ఒక చారిత్రక అంశమే అయినా వారు దాన్ని పదిలంగా కాపాడుకుంటూ రావడం కూడా వారి
    ఔన్నత్యానికి గీటురాయి. సంగీతానికి మతంతో
    పనిలేదు అని చెప్పడానికి అల్లాదియాఖాన్ వారి
    జీవితం ఉదాహరణ.

  4. Devi says:

    The most awaited Alladiya khan saheb’s episode is finally in our blog which gives a completeness to our musical journey so far. This Sangeeta yogi and Rishi who has dedicated his entire life solely to music has a permanent place in the history of Indian music and a special place in the hearts of music lovers which can never be replaced. The article is so well presented that each word shows your reverence and love for Khan saheb. Although His recordings are not available we have an ample collection of his disciples’ music in which we can hear Him to our heart’s content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *