సాహిత్యము-సౌహిత్యము – 45 : భారతార్థంలో నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

శ్రీశారదా కారుణ్య కౌముది|
17—03—2017;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~45″. ~ “పునరుక్తి చమత్కృతి” పరంపరలో ఈ వారంకూడా క్రితంవారం ‘చంపకమాల‘ పద్యపాదసమస్యనే పరికిద్దాం. పూరణచేసిన కవిగారుకూడా శ్రీ మోచర్ల వెంకన్నగారే!సమస్యని మళ్ళీ ఇక్కడ సౌలభ్యంకోసం ఉదహరించుకుందాం.సమస్య:—“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “|

ఇది ఇక్కడ భారతార్థంలో పూరించబడింది.

“అనఘ, సురాపగాతనయ! అర్కతనూజ! విచిత్రవీర్యనం

దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర 

మ్మనుమనె రాజసూయము యమాత్మజుడిప్పుడు చేయబూని, తా

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “|

ధర్మరాజు రాజసూయయాగం చేయబోతున్నాడు. ఆ సందర్భంలో,  నకుల,సహదేవులని హస్తినాపురానికి పంపిస్తూ అక్కడ రాజసభలో వేంచేసివున్న మహామహులందరినీ రాజసూయానికి సాదరంగా ఆహ్వానించవలసినదిగా ధర్మనందనుడు ఆదేశించేడు. ఆ ఆదేశం మేరకి మాద్రినందనులైన నకుల-సహదేవులు హస్తినాపురం చేరుకుని, కౌరవ రాజసభకివెళ్ళి, ఆ సభని అలంకరించిన పెద్దలందరిని పేరు-పేరునా ఈ విధంగా సగౌరవంగా రాజసూయానికి స్వాగతిస్తున్నారు.

“పుణ్యపురుషుడవైన ఓ భీష్మా(గంగాతనయా)! సూర్యతనయుడవైన ఓ కర్ణా! విచిత్రవీర్య చక్రవర్తి నందనుడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా!  గురుపుత్రుడవైన ఓ అశ్వత్థామా! ఓ ద్రోణాచార్యవర్యా! ఓ కృపాచార్యా!  హస్తినాపుర సామ్రాజ్యానికి రారాజువైన ఓ దుర్యోధనా! ఓ దుశ్శాసనా! యమధర్మరాజు వరప్రభావంవలన జన్మించిన మా అన్నగారు, ధర్మరాజు రాజసూయయాగం చేయబోతున్నారు. ఆ యాగసందర్శనానికి,  మిమ్మల్నందరినీ, పేరు-పేరునా పిలవ వలసినదిగా ఆజ్ఞాపించి, వారు మమ్మల్ని యిక్కడకి పంపించేరు”.

భాగవతార్థంలో ఈ సమస్యాపూరణాన్ని వచ్చేవారం తిలకిద్దాం!

స్వస్తి||

You may also like...

2 Responses

  1. జోగన్న says:

    ఒకే సమస్యని వివిధ ఇతిహాసాల ఆధారంగా మనోహరంగా పూరించడం ఒక్క తెలుగు భాషలోనే సాధ్యమేమో.చక్కగా పూరించేరు.ధన్యవాదములు.

  2. సి. యస్ says:

    క్రిందటి వారం పూరణ లాగే ఈ వారం భారతార్థ పరంగా శ్రీ మోచర్ల వెంకన్న అవధానిగారు పద్యాన్ని బాగా నడిపించారు.
    ముఖ్యంగా ఇవి చదవడం వల్ల భీష్మాదులకుండే పర్యాయ పదాలు తెలుస్తున్నాయి. ఎక్కడి నుంచో పట్టుకుని ఇటువంటి
    పద్యరత్నాలని మాకు అందిస్తున్నందుకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *