శారదా సంతతి — 35 : గాన గగన భాస్కరుడు~భాస్కరబువా బాఖలే
శ్రీశారదా వాత్సల్య దీప్తి :—
11—03—2018; భాస్కర(ఆదిత్య)వాసరము.
“శారదా సంతతి~35”. – “గాన గగన భాస్కరుడు~భాస్కరబువా బాఖలే”. (17—10—1869 నుండి 8—4—1922 వరకు)
అది 1920వ సంవత్సరం, జనవరినెల, 3వ తేదీ, శనివారం.అప్పటి అఖండపంజాబులోని పటియాలా రాజసంస్థానంలో “పటియాలా ఘరానా“కి, స్థాపకులైన ఉస్తాద్ ఆలీ బక్ష్ ఖాc & ఉస్తాద్ ఫతే ఆలీ ఖాcలలో ఒకరైన ఆలియా బక్షా(ఆలీ బక్ష్ ఖాc) సంగీతసభలలో గానంచేస్తూ ఆరోగ్యంగా వున్నారు. అప్పటికి వారి వయస్సు 70 ఏళ్ళు దాటిపోయింది. ఫతే ఆలీ ఖాcజీ పరమపదించి పదేళ్ళు దాటిపోయింది. ఆలియా బక్షాజీకి మహాగాయకునిగా ఎంత గొప్పపేరుందో, ఆయన మహాగర్వి అనీ, ఇతరుల సంగీతం ఏమాత్రమూ మెచ్చుకోడనీ అంత చెడ్డపేరుకూడావుంది.
రాజసంస్థానానికి రాజా దయాకిషన్ ప్రధానమంత్రిగావుండేవారు. ఆయనకి మహారాజావారి సంగీతప్రీతినిగురించి తెలియడమేకాక, స్వయంగా సంగీత ప్రేమికులుకావడంవలన, ఆ రోజు, దేశవిఖ్యాతులైన పండిత భాస్కరబువా బాఖ్లేగారి గానసభని ఏర్పాటుచేసేరు. ఆ సభలో మహారాజుగారితోబాటు, ఉస్తాద్ ఆలియా బక్షా సాహబ్ , ఇంకా ఎందరెందరో సంగీతరసజ్ఞులు అందరూ రాజదర్బారుని అలంకరించేరు. మొదట, పూరియా రాగంలో, “ఫూలనకే హరవా” విలంబితకాలప్రమాణంలోని ఖయాలుని భాస్కరబువా గానంచేసేరు. ఆ గానానికి రసజ్ఞసభ పరవశించిపోయింది. ఆ తరవాత, కామోద్ రాగంలో ఒక ౘక్కని కృతిని బువాజీ పాడి, శ్రోతల మనస్సులని దోచుకున్నారు.
ఉస్తాద్ ఆలీబక్షాసాహబ్ “దర్బారీ“రాగం పాడమని, గాయకుడిని కోరేరు. వెంటనే, భాస్కరబువా దర్బారీరాగంలోని విలంబితకాలంలో, “తూ ఐసో హై కరీం” కృతిని విస్తారంగా పాడేరు. దాని తరవాత, దర్బారీలోనే, ద్రుత కాలం(fast tempo)లో, “నైన్ సో నైన్ ” కృతిని అద్భుతంగా పాడి వినిపించేరు. భాస్కరబువా పాడుతూండగా,ఆద్యంతమూ, మెచ్చుకుంటూ, “సుబహాన్ అల్లాః” అంటూ, ఆలిబక్షాసాహబ్ ఆనందపారవశ్యంతో మెచ్చుకుంటూనే వున్నారు. “ఇది హడ్డూఖాcగారి గమకతానం. ఇక్కడ ఫైజ్ మహమ్మద్ ఖాc గారి కృతి విస్తరణ నైపుణ్యమూ, ఇక్కడ కణపూరణ సామర్థ్యమూ జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ రహిమత్ ఖాcగారి తానోత్పత్తి వైదుష్యంవుంది. ఈ అద్భుత తాన ప్రయోగంలో, ముబారక్ అలీఖాcగారి సంక్లిష్ట గాన వైశారద్యం వెలుగులు వెదజల్లుతోంది” అంటూనే భాస్కరబువా గానాన్ని, అణువణువునూ అపారహర్షంతో ఆస్వాదించేరు, ఆలీబక్షాసాహబ్ ! భాస్కరబువా తమ గానసభని ముగించగానే, ఆలీబక్షాజీ మహారాజుగారివైపు తిరిగి ఇలాగ అన్నారు:
“మహారాజా! లోకంలో అందరూ, ‘ఆలీబక్షా అహంకారి. అతడు నోరుతెరిచి ఏ ఇతర కళాకారుడినీ మెచ్చుకోడు.’ అంటారని నాకు తెలుసు. నిజానికి ఈ కళాకారులు నేను మెచ్చుకోగలిగినంత బాగా పాడనేలేరు. నేను ఇంతవరకు, ‘ఖయాలు సంగీతం అంతరించిపోతున్నకళ’ అనుకుంటున్నాను. కాని, అల్లాః అనుగ్రహంతో ఈ భాస్కరబువా బాఖలే ఖయాలుసంగీతాన్నికాపాడడానికి వచ్చినవాడని నాకు తెలుస్తోంది. ఈ నాటి మన సంగీతలోకంలోఆయనకి సాటివచ్చే గాయకుడెవ్వడూ, హిందువులలోకాని, ముసల్మానులలో కాని ఎవ్వరూలేరు. భాస్కరబువాగానం సంగీతంలోని అన్నిశాఖోపశాఖలలోను సంపూర్ణంగా పరిపక్వమైన పద్ధతిలోవుంది. అల్లాః ఆయనకి పూర్తి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని అనుగ్రహించుగాక!”
అంత అద్భుతంగా భాస్కరబువా సంగీతసభ జరిగినట్లు చరిత్రపుటలుసాక్ష్యమిస్తున్నాయి.
* # * # * # * # * # * # * # * # * # * # * # * # * # *
బరోడా రాష్ట్రంలోని ఒక చిన్నఊరైన కథోడ్ లో, 1869వ సంవత్సరం, అక్టోబరు, 17వ తేదీన భాస్కర్ జన్మించేడు. అర్థబలం అంతంతమాత్రంగానే వున్న కుటుంబం కావడంవలన భాస్కర్ విద్యాభ్యాసం, బరోడాలోని ఒక సంస్కృతపాఠశాలలో ప్రారంభమయ్యింది. చిన్నవయస్సులోనే భాస్కర్ బ్రాహ్మణకుటుంబాలలో వారాల భోజనంద్వారాను, భిక్షాటనద్వారాను తన ౘదువుని కొనసాగించవలసివచ్చింది. భాస్కర్ ౘాలా శ్రావ్యమైన, శ్రుతిశుద్ధమైన గాత్రంతో తన పాఠశాలలో సంస్కృత ప్రార్థనలని, శ్లోకాలని పాడేవాడు. తన ౘదువులో, భాస్కర్ , జన్మతః తెలివైనవాడుకనుక, కాళిదాసమహాకవి “రఘువంశమ్ ” మహాకావ్యాన్ని ౘదవ గలిగినస్థాయికి త్వరగానే చేరుకోగలిగేడు. ఆ కాలంలో విష్ణుబువా పింగ్లే అనే గొప్ప హరిదాసుగారువుండేవారు. ౘదువుమీదకన్న, హరికథలోని సంగీతమూ, పాటలూ భాస్కర్ని బాగా ఆకర్షించేవి. పాఠశాల ప్రధానాచార్యులైన రాజారాంశాస్త్రి, భాస్కర్ లో, అంతర్గతంగావున్న గొప్పసంగీతకళాకారుడిని గుర్తించేరు. తన మనస్సులోవున్న సంగీతసరస్వతీదేవి కలగజేసిన స్ఫురణ మేరకి, భాస్కర్ని, విష్ణుబువాదగ్గరకి గాత్రసంగీతం నేర్చుకోవడానికి పంపించేరు. ఆ రోజులలో, ఆ ఊరిలో పేరుప్రతిష్ఠలున్న గజానన్ భటవాడేకర్ గారి దృష్టి ఒకసందర్భంలో భాస్కర్ గానవైశిష్ట్యంమీదపడింది. ఆయన, భాస్కర్ని ఉస్తాద్ మౌలాబక్షా శాస్త్రీయసంగీతపాఠశాలలో చేర్పించేరు. ఆరునెలల తరవాత పాఠశాల వార్షికోత్సవాలు పెద్ద ఎత్తున జరిగేయి. ఆ సందర్భంలో పాటలుపాడిన భాస్కర్ గురించి స్థానికపత్రికలు ౘాలా విశేషంగా వ్రాసేయి.
అదే సమయంలో, అన్నాసాహబ్ కిర్లోస్కర్ గారి “కిర్లోస్కర్ నాటక సమాజం” (కిర్లోస్కర్ కంపెనీ)వారి నాటకాలు ఆ ఊరిలో ప్రదర్శింపబడుతున్నాయి. అన్నాసాహబ్ రచించిన క్రొత్తనాటకం, “రామరాజ్యవియోగ“లో, ప్రధాన పాత్ర ఐన ‘కైక‘ కోసం ఒక సరైన బాలనటుడిని అన్వేషిస్తున్నారు, కంపెనీ యాజమాన్యంవారు! ఆ సందర్భంలో భాస్కర్ యొక్క వార్త వారి దృష్టిని ఆకర్షించింది. అన్నాసాహబ్ కిర్లోస్కర్ , తనసంస్థలో ప్రధానపాత్రలు పోషిస్తూ, తనకి సమాజనిర్వహణలో చేదోడు-వాదోడుగావున్న అనుభవజ్ఞుడు, భావూరావు కొల్హాట్కర్ని భాస్కర్ విషయం తెలుసుకుని రావలసినదిగా పంపించేడు. భావూరావు భాస్కర్ని అన్నివిధాలా పరీక్షించి, కైకపాత్రకి భాస్కర్ని తగినవాడిగా నిర్ణయించుకుని, అదేవిషయం, తన యజమాని అన్నాసాహబ్ కి నివేదించేడు. ఆ విధంగా భాస్కర్ రంగస్థలనటుడిగా నాటకవేదికపైకి ప్రవేశించేడు. రంగస్థలనటుడిగా, ప్రధానంగా గాయకుడిగా అనతికాలంలోనే అనంతకీర్తిని ఆర్జించేడు.
ఇండోరునగరంలో నాటకప్రదర్శనకి వెళ్ళిన కిర్లోస్కరు కంపెనీవారి “రామరాజ్యవియోగ” నాటకానికి, అందునా, కైక పాత్రధారి బాలభాస్కరుడికి, అందులోనూ, అతడి పాటలకి ఊహాతీతమైన అభిమానజనులు ఏర్పడ్డారు. ఆ నగరంలోని ప్రఖ్యాత సారంగి వాద్యకళాకారుడైన ఉస్తాద్ బందేఖాcజీ ఎప్పటిలాగే, కిర్లోస్కరుకంపెనీనాటకానికి హాజరయ్యేరు. కైక పాత్రధారి, బాలభాస్కరుడు పాడిన “జో నైన చకోర్ ” పాట ఉస్తాద్జీ మనసుని దోచుకుంది. మరునాడు ఉదయం, ఉస్తాద్జీకి పాదాభివందనంచేసి, వారి అమూల్య ఆశీర్వచనాలని పొందడంకోసం నటులందరూ, వారికి నమస్కరిస్తున్నారు. వారు ఒకవంక ఆశీర్వదిస్తూనే, వేరొకవంక ‘జో నైన చకోర్ ‘ పాటని కూనిరాగంతీసి, ఆ నటులందరికీ వినిపించి, ఆ పాటపాడినవారెవరో చెప్పమన్నారు. భాస్కర్ ముందుకురాగానే, అతడిచేతిని తనఒడిలోకి తీసుకుని, ఒకనల్లదారంతో, “గండాబంధనం” కట్టి, శాస్త్రీయసంగీతంలో అతడిని తన శిష్యునిగాచేసుకుని, ఆ ఊరిలోవుండగా అతడికి కొంత శాస్త్రీయసంగీతగానం నేర్పేరు. దీని వలన అతడికి లభించిన సంగీతంకన్న,తోడినటులనుంచిపొందిన అసూయ ఎక్కువ అయ్యింది.
ఆ తరవాత, భాస్కర్ కంఠంలో, అతని పెరుగుతున్న వయస్సుప్రభావంవల్ల, మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనించుకుని, అతడు శాస్త్రీయసంగీత గానాన్ని ఎక్కువగా అభ్యసించడం ప్రారంభించేడు. అందుకోసం, ప్రత్యేకంగా ఒకగదిని అద్దెకుతీసుకున్నాడు. ఎక్కువసమయం తన గానాభ్యాసానికి కేటాయించడంవలన సంస్థ దైనికసేవలకి సమయం తక్కువగా వినియోగించే వాడు. గొంతుమారేసమయంలో నటులకి పూర్తిగా పురుషకంఠంవచ్చి, పాత్రలకి అనుగుణమైన దేహవిగ్రహమూ, గాత్రపరిణతి కలిగేవరకు, వారు తెరవెనుక ఘోరమైన చాకిరీ చెయ్యవలసివచ్చేది. భాస్కర్ శాస్త్రీయసంగీత గాయకుడిగా జీవితంలో స్థిరపడాలనే ఆదర్శంతోనే జీవన నిర్వహణని చేస్తున్నాడు. అంతేకాని రంగస్థలనటుడిగా రాణించాలనే ఆలోచన అతడికి ఏమాత్రమూలేదు. ఈ విషయం అంతా గమనించిన కంపెనీ పెద్ద, భావూరావుజీ, భాస్కర్ కి కబురుచేసేడు. భాస్కర్ వచ్చేడు. వారిద్దరిమధ్య నడిచిన సంభాషణ యిది:
భావూరావు:— నేను ఈ మధ్య నిన్ను గమనిస్తున్నాను. నీవు నాటకాలకి సంబంధించిన రిహార్సల్స్ కి, భోజనానికి మాత్రమే హాజరవుతున్నావు. ఇదివరకులాగ మిగిలిన పనులని చేయడంలేదు. ఒకవైపు గణేశచతుర్థి దగ్గరౌతోంది. పని ఒత్తిడి పెరుగుతోంది. మిగిలిన పనులన్నీ చెయ్యకుండా నీవు వెలగబెట్టే రాౘకార్యాలేమున్నాయి?
భాస్కర్ :— అయ్యా! అన్యధా భావించవద్దు. క్రమంగా నా కంఠంలోమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకని నేను నా గాత్ర సంగీతవిద్య కొనసాగించడానికి, తీవ్రమైన సాధనచేసుకుంటున్నాను. నా ఏకాంతసాధన కోసం ప్రత్యేకంగా గదిని అద్దెకు తీసుకున్నాను.
భావూరావు:—ఆరినీ అసాధ్యం కూల! నువ్వొక గొప్ప గాయకుడివి కాబోతున్నావా? ఆ వంకతో నీ పనులు ఎగవేసే పదకం పన్నేవన్నమాట!
భాస్కర్ :— అయ్యా! మీరు పెద్దవారు. అలాగ నన్ను అనరాని మాటలనడం భావ్యంకాదు. శాస్త్రీయసంగీతగాయకుడినవ్వాలన్నది నా జీవితాదర్శం. ఎవ్వరేమన్నా, అనుకున్నా నాకు పరవాలేదు. నా ఆశయ సాధనే నాకు ప్రధానం!
భావూరావు:—నీ మొహంచూస్తేనే తెలుస్తోంది, నీవెంతటి గొప్ప గాయకుడివి కాగలవో! ఇవన్నీ సోమరిపోతులు చెప్పే మాటలు! నేను నీలాంటివాళ్ళని ౘాలామందిని చూసేనోయ్ !అధికప్రసంగం ఆపి నీ పనులు చేసుకో!
భాస్కర్ :— నా వంటి బాలకళాకారులపట్ల మీకువున్న ఆదరణ ఇదన్నమాట! నేను శాస్త్రీయసంగీతగాయకుడిని కాలేనని నా ముఖంచూసి ఎలాచెప్పగలరు? ఏది ఏమైనా నేనింక మీవద్ద పని చేయలేను. నేను సంగీతగాయకుడిగా మన్నన పొంది, అందరిచేత “బువా”(సంస్కృతంలో ‘పండిత్ ‘ లేక , ఉర్దూలో ‘ఉస్తాద్ ‘ అనే గౌరవవాచకాలవంటిదే మరాఠీభాషలో ‘బువా’ అనే గౌరవపదం) అని అనిపించుకున్నతరవాతే మళ్ళీ మన సంస్థలో అడుగు పెడతాను.
అని శపథంచేసి భాస్కర్ సంగీతవిద్యాభ్యాసంకోసం అష్టకష్టాలూ పడ్డాడు. బరోడా రాజసంస్థాన గాయకుడైన ఉస్తాద్ ఫైజ్ మొహమ్మద్ ఖాcసాహబ్ వద్ద పడరాని పాట్లన్నీ పడి, ఆయనకి ఎన్నోసేవలుచేసి, అల్పకాలంలోనే గాత్రసంగీతంలోని సూక్ష్మాతిసూక్ష్మాంశాలన్నీ ఆకళింపుచేసుకుని, యుక్తవయస్సు వచ్చేసరికి మహామధుర గాయకుడిగా భాస్కర్ పరిణతిచెందేడు. ఆ సంవత్సరం గణేశచతుర్థికోసం బరోడా మహానగరం ముస్తాబు ఔతోంది. ఒకరోజు సాయంత్రంఒక ఇంటిలో భాస్కర్ యొక్క గానసభ ఏర్పాటుచేయబడింది. భాస్కర్ తన సంగీతసభని ఒక మహనీయమైన బడాఖయాల్ని, తన మృదుమధుర కంఠంలో ఆలపించడం ఆరంభించేడు. ఆ ప్రక్కనే, గణేశచతుర్థి ఉత్సవాలకోసం, వేరొక పెద్దవిడిదిలోవున్న కిర్లోస్కర్ కంపెనీకిచెందిన భావూరావుగారి చెవులని ఆ మహామధురగానం తాకింది. ఆ గానమాధుర్యానికి వశీభూతుడైన భావూరావుజీ మంత్రముగ్ధుడిలాగ సంగీతసభలోకి ప్రవేశించి, రసజ్ఞసభ్యుల మధ్యనుంచి నడుచుకుంటూవెళ్ళి, వేదికపైకూర్చుని గానంచేస్తున్న ఆ గంధర్వగాయకోత్తముడిని పరిశీలనగా చూసేడు. ఈ లోపుగా ఆ మొదటి కృతి ముగింపుకొచ్చింది. సదస్యులందరూ ఎడతెరిపిలేకండా కరతాళధ్వనులు చేసేరు. ఆ అందరిమధ్యనిలబడిన పెద్దాయన అందరికన్న ఆనందంగానూ, ఆప్యాయతతోనూ, అధికఆదరణతోనూ తన కరతాళధ్వనులని కొనసాగిస్తూ, భాస్కర్జీవైపుతిరిగి ఇలాగ అన్నాడు.
“భాస్కర్ మహాశయా! నీవు గొప్ప గాయకుడివి కాకండా మన సంస్థలో అడుగు మోపనని ప్రతిన పూనేవు. నీవు నీ మాట ప్రకారమే మహాగాయకుడివయ్యేవు. ఇక్కడినుంచి నేనే నిన్ను, “భాస్కరబువా” అని సంబోధిస్తున్నాను. ఇంక లోకమంతా నిన్ను “భాస్కరబువా” అంటూనే సంభావన చేస్తుంది. గతంలోజరిగినదానిని మరిచిపోయి, మన సంస్థలోకి వచ్చి మన మిత్రులందరినీ పలకరించు. మేమంతా నీకోసం ఎదురుచూస్తున్నాం.”
భావూరావుజీ మాటలువినేసరికి భాస్కరబువా రెండుకళ్ళూ అశ్రుపూరితాలు ఐపోయేయి. రెండుచేతులతోను వినమ్రంగా నమస్కరించి, భాస్కరబువా ఈ విధంగా స్పందించేరు. “భావూరావుజీ! ఇదంతా మీ మాటల ౘలవే! మీరు ఆరోజు ఆ మాటలు అనకపోతే నాలో అంతటి గాఢనిశ్చయబుద్ధి, తీవ్రనిశ్చలసహనశక్తి దృఢమై ఉండేవి కావేమో! నేను తప్పనిసరిగా నా గతకాలమిత్రులని కలవాలని తహతహలాడుతున్నాను. మీ అందరితో నా అనుభవాలన్నీపంచుకుంటాను.”
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
1911వ సంవత్సరంలో భాస్కరబువా మొదటిసారి పంజాబులో తమ సంగీతసభాయాత్రని నిర్వహించేరు. ఆ సంవత్సరం డిసెంబరు, 26వ తేదీన, జాలంధరనగరం(జలంధర్ )లో నిర్వహించబడిన సంగీతసభలో తమ మధురగానాన్ని రసజ్ఞులకి వినిపించేరు. హమీర్ రాగంలో, విలంబితకాలంలో, ఖయాల్ కృతి, “సురజే రహి“ని సర్వాంగసుందర విపుల వైభవమయంగా పాడి, ద్రుతకాలంలో “మెందెరె యార్ ” చీజ్ ని, పాడి, తరవాత ఒక “తరానా“ని మనోజ్ఞసుందరంగా వినిపించి, విభిన్న సంగీత ప్రక్రియలలో వేరు-వేరు స్థాయిలలో అభిరుచులు కలిగిన సభలోని రసికవరిష్ఠులందరినీ పండిత్ భాస్కరబువా ఏ విధంగా అలరింపజేసేరో పండిత్ దిలీప్ చంద్ర వేది, వారి ప్రత్యక్షానుభవాన్ని, ఇలాగ వర్ణించేరు.
“ధ్రు(వ)పద సంగీత గాయకులు, భాస్కరబువాజీ పాడిన విలంబిత ఆలాపీని విని ఆనందపారవశ్యంలో ములిగిపోయేరు. ఆయన గానంలోని అనాయాస త్వరిత తానప్రయోగ వైదగ్ధ్యానికి ఖయాల్ – గాయకులు ముగ్ధులైపోయేరు. “పఖవాజ్ “/తబలా వాద్యవిద్వాంసులు బువాసాహబ్ గానంలోని పరిపూర్ణ లయనైపుణ్యం(లయ్కారి-rhythmic virtuosity)పరికించి, పరవశించిపోయేరు. సంక్షిప్తంగా చెప్పాలంటే సంగీతంలో వివిధ విభాగాలలోను ప్రత్యేక ప్రకర్ష కలిగిన పండితోత్తములందరూ వారి-వారి శాఖలకి సంబంధించిన ఉత్కృష్ట గుణ సంపదని అంతా బువాజీగానంలో అనుభవించి ఆనందమగ్నులైపోయేరు. అందరూ బువాజీ గానంవింటూ, మాటిమాటికీ “సుభాన్ అల్లాః” అంటూ మురిసిపోతూ మంత్రముగ్ధులైపోయేవారు.”
— — — — — — — — — — — — — — — — —
పంజాబులో మొదటిసారి భాస్కరబువా సంగీతసభానిర్వహణయాత్ర చేసిన సందర్భంలో జరిగిన మరొక వృత్తాంతం ఇక్కడ ప్రస్తావయోగ్యమైనదివుంది. ఇది వారి కరాచీ సంగీతసభకి సంబంధించిన విషయమని నా ఊహ. అప్పటికి వృద్ధులైన ఉస్తాద్ గమన్ ఖాcసాహెబ్ జీవించివున్నారు. భాస్కరబువా గానాన్ని సభాముఖంగా స్వయంగావిని ఆనందించి అభినందించిన మహానుభావుడాయన. వారిద్దరికి పరస్పర సంగీత స్నేహానుబంధం ఏర్పడింది. ఉస్తాద్జీకి ముగ్గురు కొడుకులు. వారు ముబారక్ ఆలీ ఖాc, మురాద్ ఆలీ ఖాc, బిబ్బే ఖాc. ముగ్గురూ తండ్రివద్ద పూర్తిగా సంగీత విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, ముగ్గురూకలిసి పాడుతూ, ఆ కాలంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ మరునాడు రాత్రి ఆ ఊరిలో భాస్కరబువా సంగీతసభవుంది. ఆ సభకి ఉస్తాద్ గమన్ ఖాcజీ వెళ్ళదలుచుకున్నారు. ముగ్గురు కొడుకులనీ పిలిపించి, వారితో, ఆయన ఇలాగ అన్నారు.
“రేపు మన ఊరిలో మహారాష్ట్రకిచెందిన పండిత్ భాస్కరబువా బాఖలేసాహబ్ గాత్రసభవుంది. మీరు ముగ్గురూ నాతోబాటువచ్చి, ఆయన గానం వినాలి. అసలు-సిసలైన మన సంగీతస్వరూపాన్ని సరసులకి సాక్షాత్కరింపచెయ్యడంలోఆయన సంగీతరససిద్ధుడు. అందువలన మీరు తప్పక వారిని వినాలి.”
ముబారక్ ఆలీ ఖాc ఈ మాటలు తండ్రినోటవిని చిరాకుతో తన అసహనాన్నిఇలాగ ప్రదర్శించేడు.
“ఒక హిందూ పండితుడా? అందులోనూ, మహారాష్ట్రనుంచి వచ్చినవాడా? అటువంటివాడు, అసలుసంగీతమేమిటో మనకి ప్రదర్శిస్తాడని స్వయంగా మన తండ్రిగారే మనకి సెలవిస్తున్నారు! ఈ పెద్దాయనకి వృద్ధాప్యంవల్ల అసంగతమైన ఆలోచనలు వస్తున్నాయి.”
అన్నదమ్ములు ముగ్గురూకలిసి, మరునాడు మధ్యాహ్నం, భాస్కరబువా రాత్రి పాడబోయే వేదికమీదే తమ సంగీతసభాకార్యక్రమం ఏర్పాటుచేసి, బువాజీనికూడా సభకి ఆహ్వానించేరు. ప్రేక్షకులలో, మొదటివరసలో, ఉస్తాద్జీ, పండిత్జీ పక్క-పక్కని కూర్చుని గానసభని ఆద్యంతమూ విన్నారు. అన్నదమ్ములు ముగ్గురూ తానప్రయోగ ప్రవాహవేగంతో సభ్యులందరి మన్ననలని పొందేరు. సభపూర్తికాగానే, ఉస్తాద్జీ, బువాజీ అభిప్రాయం అడిగేరు. బువాజీ ఇలాగ అన్నారు.
“గమన్ ఖాcజీ! మీరు పరిపూర్ణ గానవిశారదులు. మీ కుమారులకి మీ అద్భుతమైన సంగీతశిక్షణ లభించడంవల్ల, వారి గానవిద్యాబోధనలో ఏ లోటూలేదు. వారి అభ్యాసంకూడా ఉన్నతశ్రేణిలోవుంది. ఇంకా మీ వంటి మహామహులవద్ద అధ్యయనమూ- అభ్యాసమూ కొనసాగిస్తే, వారందరూ భవిష్యత్తులో గొప్పవిద్వాంసులు కావడంలో ఏ సందేహమూ లేదు.”
దొంగచాటుగా ఈ మాటలువిన్న యువ గాయకుడు, ముబారక్ ఆలీఖాcకి బువాజీ పలుకులు నచ్చలేదు. అందువల్ల, ఇంతగొప్ప సలహా ఇచ్చిన ఈ మహానుభావుడు, ఏమంతగొప్ప పాటగాడో చూద్దామని, తమ్ముళ్ళతో కలిసి, ఆ రాత్రి, బువాజీ సంగీతసభకి హాజరయ్యేడు. ఏమాత్రం ఎక్కడ తేడావచ్చినా ఎద్దేవాచెయ్యాలన్న ఆలోచనతో ముబారక్ ఆలీ, ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆయన స్వయంగా చెప్పిన మాటలనే ఇక్కడ జరిగినది-జరిగినట్లు చర్వితచర్వణం చేసుకుందాం!
“భాస్కరబువా సామాన్యమైన ఎత్తు, శరీర సౌష్ఠవం కలిగినవారు. సువిశాల సభా మండపానికి సమీపించే ఆయన బాహ్య స్ఫురణకి దూరమైన భావప్రపంచంలోవున్నట్టు కనిపించేరు. ఆయన వేదికపై ఆసీనులౌతుండగానే, తంబూరా శ్రుతినాదం పక్వస్థాయిని అందుకుంది. వారి మౌఖికభావాలలో సూక్ష్మ భావ వైచిత్రి ద్యోతకమయ్యింది. తంబూరాలు శ్రుతిశౌచంతో నినదిస్తూంటే, వారు ఒక విలక్షణ ఆనంద జగత్తులోకి ప్రవేశించేరు. సభాసీనులమైన మా శ్రోతలవైపుచూస్తూ ఒక్కసారి బువాజీ నవ్వడంతో, మమ్మల్నందరినీ మహామహిమోపేతమైన ఇంద్రజాలజగంలోకి ఆయన తీసుకువెళ్ళిపోయినట్లనిపించింది. హమీర్ రాగంలోని కృతియొక్క పల్లవి, “సుర్జారహీ“ని ఆయన ఆరంభించేరు. ఆ ఎత్తుగడలోనే వారు, నిషాదస్వరం నుంచి ధైవతస్వరానికి చేరుకునే మెత్తని ౙారు ఆ అద్భుత కంఠంలోంచి ఎంత మృదుమనోహరంగా వినిపించిందంటే, ఒళ్ళుతెలియని స్థితిలోవున్న మేమంతా పారవశ్యంతో “సుభానల్లాః” అనేసేం! తెలిసి, అనాలని కాదు! మంత్రముగ్ధులమై అనేసేం!
ఆ విధంగా ఆ సభ ఆరంభంలోనే, మా తండ్రిగారు, పండిట్జీని ఎందుకంత ప్రశంసించేరో అర్థమైపోయింది. ఆ కచేరీ పూర్తైపోయిన తరవాత, నేను కేవలం పిచ్చివాడిలాగ ఆయన వెంట తిరిగేను. షికర్పూర్ లో వుండగా, ఆయన అనుమతి తీసుకుని, వారి తలకి నూనె(తేల్ మాలిష్ చేయడం) రాసేను. అలాచేసినందుకు నేను సిగ్గుపడలేదు. నాకు ఆ సేవాభాగ్యాన్ని వారు అనుమతించడం ఒక గొప్ప సదవకాశంగా నేను భావిస్తున్నాను.”
= = = = = = = = = = = = = = = = = = = = = =
సింద్ ప్రాంతానికి చెందిన గోపాల్జీ పంజాబీ చెప్పిన వృత్తాంతం మనం తప్పక తెలుసుకోతగ్గది. ఆ ప్రాంతంలో జరిగిన ఒక సంగీతసభలో, తబలా విద్వాంసుడు ౘాలాౘక్కగా పక్కవాద్యం వాయించేడట! ఆతడి వాద్యవైదుష్యానికి ఆనందించిన బువాజీ అతడిని ఏంకావాలో అడగమన్నారట! వెంటనే ఆ కళాకారుడు, “అయ్యా! నా జీవితంలో ఇప్పటివరకు నా కళ్ళతో నూరురూపాయలనోటు చూడలేదండి”! అన్నాడట. భాస్కరబువా అర్థక్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా, తన జేబులోనుంచి, వందరూపాయల నోటు తీసి అతడికి ప్రదానంచేసేరుట. అంతేకాదు. వారి ప్రక్క వాద్య కళాకారుల రాక-పోకల రూకలు బువాజీయే ఖర్చుచేసేవారట! అంతటి ఔదార్యవంతులు బువాజీ!
@ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @
బువాజీ అపార గురుభక్తిగురించి వారి సహాధ్యాయి, రాజారత్న దాజీసాహెబ్ తాంబేజీ ఒకసందర్భంలో ఇలాచెప్పేరు.
“ఉస్తాద్ ఫైజ్ మహమ్మద్ ఖాcసాహబ్ సంగీతం పాఠం చెపుతున్నారు. నేను, భాస్కర్ మొదలైన విద్యార్థులం శ్రద్ధగా నేర్చుకుంటున్నాం. అకస్మాత్తుగా, ఖాcసాహబ్ పెద్దగా దగ్గువచ్చి, శ్లేష్మంతోసహా ఉమ్మువచ్చింది. దగ్గరలో ఉమ్ముతొట్టిలేదు. భాస్కర్ ఒక్క క్షణమైనా ఆలస్యంచేయకుండా, తన దోసిలి పట్టగా, ఖాcసాహబ్ అందులో ఉమ్మువేసేరు. భాస్కర్బ యటకివెళ్ళి, చేతులు శుభ్రంచేసుకునివచ్చి, పాఠంనేర్చుకోవడంలో నిమగ్నమైపోయేడు.”
తాంబేజీ అది చూసి అసహ్యించుకుని సంగీతవిద్యాభ్యాసం విరమించుకున్నారు. తరవాతకాలంలో, భాస్కరబువా పరమపదించినపిమ్మట, తాంబేజీ, ఆ సంఘటనని నెమరువేసుకుంటూ, ఇలాగ అన్నారు.
“అటువంటి అనితరసాధ్యగురుభక్తికలిగిన నా గురు-భ్రాత(co-disciple of same Guru) సంగీతప్రపంచంలో మహానుభావుడయ్యేడు. అటువంటి గురుభక్తి, దైవభక్తికి భిన్నమైనదికాదు. ఆయన తన ఇష్టదైవంలో లీనమైపోయేరు. అంతకంటె వేరుగా దైవత్వంవుందని నేననుకోను.”
& & & & & & & & & & & & & & & & & & & &
శాస్త్రీయ గాత్ర సంగీతం, స్వర-లయాత్మక గాత్రభావశబలితమైవుంటుంది. ఇందులో, మళ్ళీ, స్వరం-తాళం-గాత్రధర్మం ఈ మూడింటినీ సూక్ష్మ విభజన చేస్తే అనేకానేక సుసూక్ష్మాంశాలు వాటిలో నిబిడీకృతమైవుంటాయి. వీటన్నింటి లోనూ ఏ ఒక్క గాయకుడూ పూర్ణప్రజ్ఞావంతుడైవుండడు. కాని, వీటిలో కొన్నింటియందు ప్రావీణ్యంసాధించినవారు మహనీయ కళామూర్తులై లోకంలో శాశ్వతంగా ప్రఖ్యాతిని పొందుతారు. అటువంటి అనేక విభాగాలలో, అత్యధిక పరిపూర్ణతపొందిన చారిత్రక మహాపురుషుడు పండిత భాస్కరబువా బాఖలే అని ఉత్తరభారత సంగీత చరిత్రకారులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఉస్తాద్ ఫైజ్ మహమ్మద్ ఖాcజీ, తాను నేర్పగలిగినవిద్యనంతా బోధించి, బువాజీని ఉస్తాద్ నత్థన్ ఖాcసాహబ్ వద్ద ప్రత్యేకవిద్యకోసం పంపించేరు. నత్థన్ ఖాcజీ వారు చెప్పగలిగినదంతాచెప్పి, ఖాcసాహబ్ ఉస్తాద్ అల్లాదియాఖాcసాహబ్ వద్దకి ఇంకా ఉన్నతవిద్యకోసం బువాజీని పంపేరు. అల్లాదియాఖాcజీకూడా బువాజీకి బోధించవలసినదంతా బోధించేరు. అంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య వరకు ఫైజ్ మహమ్మదుఖాc, డాక్టరేటువిద్యని నత్థన్ ఖాc, పోస్ట్ డాక్టొరల్ విద్యని అల్లాదియా ఖాcల వద్ద బువాజీ అధ్యయనంచేసి, అభ్యసించినట్లుగా, ఇంచుమించు, మనం భావించవచ్చు. సంగీతజగత్తులో ఇటువంటి సంఘటనలు ౘాలా అరుదైనవి అని చెప్పాలి.
® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ® ®
ఇటువంటి అపురూపమైన శారదాతనయుడు, 1922వ సంవత్సరం, ఏప్రిల్ , 8వ తేదీన ల్యూకేమియా వ్యాధితో పరమపదించేరు. వారి మరణవార్తవిని, “నేనింక ఎవరికోసం పాడాలి?” అంటూ అల్లాదియాఖాcసాహబ్ భోరుమని విలపించేరు. దేవాస్ కి చెందిన రజబల్లీఖాcజీ “భారతదేశం మేమందరమూ గౌరవించే ఒకేఒక భాస్కరబువాని మనకి ప్రసాదించింది” అన్నారు. “పండిత్ భాస్కరబువా సంగీతాన్ని, ఒక్క అల్లాదియాఖాcసాహెబ్ మాత్రమే అర్థంచేసుకోగలరు” అని కేసరబాయి కేర్కర్ అన్నారు.
అటువంటి గానగగనభాస్కరులైన భాస్కరబువా బాఖలేగారికి సాష్టాంగ దండప్రణామం ఆచరిస్తున్నాను.
స్వస్తి||
భాస్కరబువా బాఖలేజీ సంగీతమయ జీవితమంతా
నిరుపమాన శతాధిక అద్భుత సంఘటనలతో
నిండిపోయి, ఒక మహాకావ్యం నిర్మించదగిన
ఉత్కృష్ట వృత్తాంతాలతోను, అపురూపమైన గాథలతోను
లోకోత్తరంగా గడిచిపోయింది. అందువలన,
స్థలపరిమితిని దృష్టిలోవుంచుకుని, అతిముఖ్య
సంఘటనలలో, ౘాలా కష్టపడి, కొన్నింటిని మాత్రమే
ఎంపికచేసి, రసభావుకులైన సత్సంగసభ్యులకు
నివేదించడం జరిగింది. ఎన్నెన్నో ప్రధానవిషయాలని,
అంటే, వ్యక్తిగతజీవితవివరాలని, శిష్యపరంపరని,
శాస్త్రీయసంగీతంతోబాటు, ప్రత్యక్షంగా మరాఠీ
నాటకరంగానికి, పరోక్షంగా చలనచిత్ర సంగీతసీమకి
వారుచేసిన సేవలని ప్రస్తావించడానికి వీలులేకపోయింది.
అందువలననే, సామాన్యపద్ధతిని విడిచి, బువాజీ
జీవితసంఘటనలని కొన్నింటిని, కాలక్రమనియతిని
పాటించకుండా, విడి-విడిగా అంశాలు(sections)గా
ఈ వ్యాసాన్ని అందించడం జరిగింది.
ఈ లోటు-పాటులనన్నీ మనసార మన్నింౘమని వేడుకుంటున్నాను.
Chala goppa visleshana guruvugaaru.bhasker buva gariki pranaamamulu. Sampathkumar ghorakavi
ఈ వారం శారదా సంతతిలో విఖ్యాత సంగీత విద్వాంసులు
శ్రీ భాస్కర బువా బాఖలే వారి గురించి సమర్పించిన కథనం
పరమాద్భుతంగా ఉంది. ఆ ఘట్టాలను, ఆ విశేషాలను తెలియజేస్తూ
రసరమ్యంగా వివరించిన విధానం అసాధారణంగా ఉంది.
సంగీతకారుడిగా అత్యున్నత స్థాయికి చేరిన వీరు – ఒక మహోన్నత
వ్యక్తిగా కూడా పరమోత్కృష్టమైన జీవితం గడిపారు.
ఇలాంటి కలయిక చాలా అరుదుగానే చూడగలం.
చదువులో, నటనలో, గానంలో, వినయ విధేయతలలో
భాస్కర బువా గారిని పరమ ప్రమాణంగా పరిగణించాలి.
ప్రక్క వాయిద్యం వాయించిన కళాకారుడికి ఆయన వంద
రూపాయల కాగితం బహూకరించిన సందర్భం చదివినప్పుడు
తోడి మనిషి పట్ల ఆయనకున్న సహానుభూతి ఎంతటిదో కదా
అనిపించి, కళ్ళనీ గుండెనీ తడి చేసింది.
అల్లాదియాఖాన్ వంటి హిమశిఖర సమాన సంగీతకారుడు
భాస్కర బువా గారికి అర్పించిన నివాళి చాలు… బాఖలే గారి
ఔన్నత్యాన్ని అర్థం చేసుకునేటందుకు.
భగవంతుడి సృష్టిలో మనిషి విలువ కట్టలేని అనర్ఘ సంపదలెన్నో
ఉన్నాయి. అలాంటి అమూల్య సంపదల్లో శ్రీ భాస్కర బువా భాఖలే
ఒకరు.
సంగీతరంగంలో తరతరాలుగా కొనసాగుతున్న గురుభక్తి
పారమ్యానికి, భాస్కరబువా బాఖలేజీ జీవితంనుంచి
ఒక ప్రబల సంఘటనని ఉదహరించుకోవాలి. వారు
ఒకటి-రెండుసార్లు ఒక మహాగౌరవంగా సభాముఖంగా
చెప్పుకున్న విషయం ఒకటివుంది. ఆయన అనిన విషయం
ఇది.
“నన్ను సామాన్యగియకుడిగా పరిగణించకండి. నేను
సభాముఖంగా ఉస్తాద్ బందే ఖాcసాహెబ్ చేత చెంపదెబ్బ
తిని సభాగౌరవం సాధించుకున్నవాడిని!”
అనేవారట వారు. అంతటిది ఆయన గురుభక్తి!
సవరణ:—
పైనుంచి 10 వ వరుస(లైన్ )లో “సామాన్యగాయకుడిగా”
అనివుండాలి.
సవరణ:—
పైనుంచి 10 వ వరుస(లైన్ )లో “సామాన్యగాయకుడిగా”
అనివుండాలి.
సవరణ:—
పైనుంచి 10 వ వరుస(లైన్ )లో “సామాన్యగాయకుడిగా”
అనివుండాలి.