సాహిత్యము-సౌహిత్యము – 42 : వారికి వారికిన్ మరియు వారికి వారికి వారివారికిన్

శ్రీశారదా దయా చంద్రికా :—

24—02—2018; శనివారము.

“సాహిత్యము—సౌహిత్యము~42”.

ఈ వారంకూడా మరొక “పునరుక్తి చమత్కృతి” వర్గానికిచెందిన సమస్యాపూరణం చూద్దాము. ఇప్పుడు, అమరావతిని ముఖ్యపట్టణంగాచేసుకుని, ఆంధ్రావనిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారి ఆస్థానంలో, వట్ఠెం విరూపాక్షశాస్త్రిగారి ద్వారా చేయబడిన సమస్యాపూరణ ప్రాగల్భ్యం పరికిద్దాం!

సమస్య:—

“వారికి వారికిన్ మరియు వారికి వారికి వారివారికిన్ “||

ఇటువంటి ప్రక్రియకి సంబంధించిన ఒరవడిని ఇప్పటికే పరిచయంచేసుకున్నాం! సమస్యయొక్క భావంకూడా తేటతెల్లంగానే ఉంటోంది. అందువల్ల ఇప్పుడు, విరూపాక్షశాస్త్రిగారి పూరణ తెలుసుకుందాం!

“భూరమణీ మనః కుముదపుంజసుధాంశుని, వేంకటాద్రి ల

క్ష్మీరమణావతారుని భజింతురు రాజులు తత్సుతుల్ హితుల్ |

సూరిజనుల్ తదీయులును సొంపుగ ఆ ప్రభువిచ్చు కోరికల్ ,

వారికి వారికిన్ మరియు వారికి వారికి వారివారికిన్ “||

“రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడుగారు మనభూమండలానికి ప్రభువు. ఆయన సాక్షాత్తు అపర శ్రీపతియొక్క అవతారుడు. కనుక ఆయనని ఆశ్రయించివున్న రాజులకి, రాజకుటుంబాలకి, వారి ప్రజలకి, వారి సంరక్షణలోని కవులకి, పండితులకి, వారందరికి సంబంధించినవారికి, మహారాజుని ప్రభుభక్తితో సేవించడంవలన, ఆ ప్రభువు బహూకరించే కోరికలీడేర్చు కానుకలు ౘక్కగా లభిస్తాయి”.

ఈ పద్యాన్ని, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేఙ్కటేశ్వరస్వామివారికికూడా ౘక్కగా అన్వయించి అర్థంచేసుకోవచ్చు.

స్వస్తి||

You may also like...

3 Responses

  1. బాగుంది. మంచి పూరణ.

  2. సి. యస్ says:

    విరూపాక్ష శాస్త్రి గారి పూరణ తమనేలే ప్రభువుకీ, లోకాలనేలే
    ప్రభువుకీ అన్వయం కుదిరేలా చేయడం చాలా రమ్యంగా ఉంది.
    పద్యపు నడక కూడా వయ్యారంగా సాగింది. ఈ అవధాని గారి
    పేరు వినడం ఇదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *