సాహిత్యము-సౌహిత్యము – 41 : అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!

శ్రీశారదా దయా కౌముదీ:—
17—02—2018;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~41″.

గతవారం సమస్యాపూరణం ౘదివి, తన వ్యాఖ్యపొందుపరిచిన మా తమ్ముడు “సి. యస్ .”, సహజ రసజ్ఞత కలిగినవాడు కనుక నాకు ఒక రసమయమైన ‘కొస’ని అందించేడు. ఆ కొస యిది:

“అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే!”||

ఈ వారం సమస్య యిదే! ఇటువంటి సమస్యలకి పెద్దలు “పునరుక్తి చమత్కృతి” సమస్యలు అని పేరుపెట్టేరు. ఈ చమత్కార గతిరతులైన సమస్యా ప్రదాతల అభిరుచికి అనుగుణమైన పద్యాలని సమస్యాపూరణకర్తలు అందించేవారు. ఈ పై సమస్యకి కవిసార్వభౌముడైన శ్రీనాథుడి వయస్సు ఉంటుంది. ఈ సమస్యని ఆయనకి బాగా చిన్నవయస్సు నుంచీ సన్నిహితులైన సమవయస్కులైన, బంధు-మిత్రాదులైన స్వజనులు యిచ్చివుంటారు. ఎందుకంటే, ఈ పూరణలో శ్రీనాథుడి వేళాకోళమూ, వెట”కారమూ” శ్రోతల నసాళానికి అంటేటంత మహాఘాటుగావుంటుంది. ఈ పూరణయొక్క మూలభావం(theme)లో వారందరికీ కేటాయించబడిన పాత్రలకి వాళ్ళంతా నొచ్చుకోవడంకన్న మెచ్చుకోవడమే చేసివుంటారు. ఎందుకంటే, ఈ రూపంలోనైనా వారందరూ తెలుగుసాహిత్యచరిత్రలో శాశ్వతస్థానాన్ని, సంపాదించుకున్నారు. ఇప్పుడు, ఆ సమస్యనిచ్చిన ఆ మహామహులు సాధించిన ఆ మహనీయ స్థితిగతులేమిటో రసజ్ఞులు చిత్తగించండి:—

“కొందరు భైరవాశ్వములు, కొందరు పార్థుని తేరి టెక్కెముల్ |

కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్ |

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు, ఈ సదస్సులో |

అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే”||

“కొందరు కుక్కలు(భైరవాశ్వములు), కొందరు కోతులు(అర్జునుడి జెండాపైనున్న కపీశ్వరులు), కొందరు పందులు(ప్రాక్కిటీశ్వరులు=ఆది వరాహ అధిపతులు), కొందరు దున్నపోతులు(యమధర్మరాజు వాహనాలు), కొందరు గాడిదలు (శ్రీకృష్ణుడు పుట్టినపుడు గాడిద ఓండ్రపెట్టిందని ఐతిహ్యం)—మొత్తంమీద ఈ సభలోవున్నవాళ్ళు అందరూ అందరే! ఎవ్వరికీ ఎవ్వరూ తీసిపోరు”.

ఈ సమస్యలో ఐదు “అందరు” ఉన్నారు(యి). ఆరవది “అందరే”, అంటే,  “అందరికీ అందరే” అని నొక్కి వక్కాణించడం(emphatic expression) అని అర్థంచేసుకోవాలి. సమస్యలోని ఐదు “అందరు”కి,  మిగిలిన పద్యంలోని మూడు పాదాలలో ఐదు రకాల మహానుభావులు వర్ణించబడ్డారు!

ఈ సమస్యాపూరణానికి ౘాలాకాలం తరవాత కలిసిన పరమ ఆత్మీయులైన బాల్య బంధు-మిత్రాదులందరూ ఎడతెరిపిలేకండా విరగబడి నవ్వుకుని ౘాలాసేపు సంతోషించివుంటారు. ఎందుకంటే, ఇది, మన వర్తమానకాలంలో బాగా ప్రచారంలోవున్న “Re-union of childhood-relatives and friends” వంటి అపురూపమైన సన్నివేశంకదా!

స్వస్తి||

You may also like...

8 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    అందరందరే అంటే లోపల్లోపలే అన్నట్టుగా ధ్వనిస్తోంది, కొంటె చెవులకి :-). అవును, అందరందరే నవ్వుకున్నాను.

    • వ.వెం.కృష్ణరావు says:

      బలే!బలే!
      ఇక్కడ శ్రీనాథుడు తన బాల్యంలో వారందరితో కలిసి తాను
      చేసిన అల్లర్లు, పెద్దలు అందరినీ రకరకాలుగా వేధించుకుని తిన
      డాలు ఈ పద్యముఖంగా బయటపడినట్లే! ఆ మొత్తం అందరిలో శ్రీనాథుడు చేరిపోయివున్నాడన్నమాట!

  2. Sampath Kumar says:

    Chalabagundi guruvugaaru

  3. సి. యస్ says:

    పోయిన వారం ” సాహిత్యము – సౌహిత్యము ” లో
    వివరించిన సమస్యతో పోలికున్న మరో సమస్యని
    సూచించిన వెంటనే, ఆ సమస్యా పూరణమే ఈ వారం
    అందించావు. బాగుంది. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న
    అర్థాన్ని కాక నీదైన వివరణ ఇచ్చి, సరదాగా తేల్చి రక్తి కట్టించావు-
    చక్కటి సాహిత్య క్రీడలా.

    ఇదే సమస్యని 2003 లో అమెరికాలోని ‘ తానా’ రజతోత్సవంలో
    జరిగిన అష్టావధానంలో శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి ఇవ్వగా
    వారు పూరించిన దానిని మన చదువరులకోసం ఇక్కడ ఇస్తున్నాను.

    ఇందరు కోట్లకుంబడగ లెత్తిన వారలు పశ్చిమావనిన్
    మందిరమందు దైవము సుమా మనవారికి తెల్గు భాష; ఆ
    చందము లందగా జరుప సాగిరి సత్సభ లీసదస్సులో
    అందరు నందరే మరియు నందరు నందరె అందరందరే !

  4. వ.వెం.కృష్ణరావు says:

    ౘక్కని పద్యాన్ని ఉదహరించేవు, సి.యస్ !
    నేనిప్పుడు కొప్పరపు సోదరకవులు, “పంగిడిగూడెం ”
    సంపూర్ణ శతావనంలో చేసిన మరొక గొప్ప పూరణని
    అందజేస్తున్నాను:—
    “కొందరు సంస్కృతాన్ధ్రముల, కొందరు ద్రావిడ కన్నడంబులన్ |
    కొందరు యావనాంగ్లముల, కోవిదు లిట్టి ఘనుల్ భవత్సభా|
    మందిరమందు గౌరవసమగ్రత ఉండినవారలెన్న, ఈ|
    అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే||

  5. వ.వెం.కృష్ణరావు says:

    ౘక్కని పద్యాన్ని ఉదహరించేవు, సి.యస్ !
    నేనిప్పుడు కొప్పరపు సోదరకవులు, “పంగిడిగూడెం ”
    సంపూర్ణ శతావధానంలో చేసిన మరొక గొప్ప పూరణని
    అందజేస్తున్నాను:—
    “కొందరు సంస్కృతాన్ధ్రముల, కొందరు ద్రావిడ కన్నడంబులన్ |
    కొందరు యావనాంగ్లముల, కోవిదు లిట్టి ఘనుల్ భవత్సభా|
    మందిరమందు గౌరవసమగ్రత ఉండినవారలెన్న, ఈ|
    అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే||

  6. వ.వెం.కృష్ణరావు says:

    శ్రీమాత నాకు ప్రసాదించిన పరిమిత లఘుశక్తితో నేను
    ఇంతకు ముందు చేసిన పూరణనికూడా మన సత్సఙ్గ
    సభ్యులముందు సవినయంగా సమర్పిస్తున్నాను:—

    “సందియమేమిలేదు, మన శంకరదేవులు, పార్వతీ మహా|

    సుందరి, వారి దివ్యవరసూనులు స్కందగణేశులిర్వురున్ |

    నందియు, గఙ్గ, ఇచ్చెదరు, నాంతసుఖాదుల, భక్తకోటికై |

    అందరు అందరే మరియు అందరు అందరె అన్దరన్దరే”||

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      అవును. అందరు అందరు. కొందరే అందుతారు. కొందరు అందరు.

      అందరు అందరే, కడకు అందిరి కొందరె, కొంద రందరే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *