శారదా సంతతి — 31 : శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)
11—02—2018; ఆదిత్యవాసరము.”శారదా సంతతి—31″ ~ శ్రీ త్యాగరాజ ఆశీర్వచన ఫలస్వరూపుడు— శ్రీ మహావైద్యనాథ శివన్ (1844-1893)
అది 1830ల ప్రథమార్థం. త్యాగరాజస్వామివారి ఊరైన తిరువైయారులో, తిరుమంజనవీధి-దక్షిణ దేవాలయవీధిల కూడలి. త్యాగయ్యగారి ఇంటికి సమీపప్రాంతం. ఉదయం త్యాగయ్యగారు తమ ప్రాతఃకాల అనుష్ఠానం పూర్తిచేసుకుని, పోతనగారి భాగవతం ౘదువుకునే సమయం. సరిగా అదే సమయంలో, ఒక గొప్ప భజనమండలివారు బ్రహ్మాండంగా ఒక భజనని పాడుతున్నారు. అది త్యాగయ్యగారు ‘శంకరాభరణం‘ రాగంలో స్వరపరచి, ఆదితాళంలో కూర్చిన“నా పాలి శ్రీరామా! భూపాలక స్తోమ!
కాపాడ సమయము నీ పాదములీరా!”అనే ఉత్సవ సంప్రదాయకృతిని పరమశ్రావ్యంగాను, భక్తిరసావేశంతోను పాడుతున్నారు. త్యాగయ్యగారిని ఆ భక్తిరసమయగానం, భాగవత పఠనం నుంచి బయటకి తీసుకువచ్చింది. పంచనద అయ్యరు(దొరైస్వామి అయ్యరు అసలుపేరు) అనే యువ ప్రధాన గాయకుడు, త్యాగయ్యగారిని చూడగానే వారి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామం చేసేడు. వెంటనే త్యాగయ్యగారు పంచనదయ్యరుని పైకిలేవదీసి, ఆలింగనంచేసుకుని, “నీకు, సంగీతంలో కీర్తి-ప్రతిష్ఠలు తెచ్చే ఇద్దరు కొడుకులు పుడతారు” అని ఆ శీర్వదించేరు. మహాత్ముల మాటలు అమోఘమైనవి. పంచనదయ్యరుగారి రెండవకొడుకు రామస్వామిశివన్ (1839—1897), మూడవ కుమారుడు మహావైద్యనాథ అయ్యరు(1844—1893) గొప్ప కర్ణాటక శాస్త్రీయసంగీత గాయకులు. వారిద్దరిలో, మహావైద్యనాథయ్యరు, త్యాగయ్యగారి పూర్తి ఆశీర్వాదబలంతో పుట్టినవాడు. అటువంటి మహాగాయకుడు, గొప్ప వాగ్గేయకారుడు వేయి సంవత్సరాలకి ఒకడు పుట్టడంకూడా అబ్బురమేమో!మహావైద్యనాథయ్యరు, తంజావూరువద్ద, వైయాచేరిగ్రామంలో, 1844లో, కౌండిన్యగోత్రులైన తమిళ స్మార్త బ్రాహ్మణకుటుంబంలో జన్మించేరు. బాల్యంలో, అనై-అయ్యగారివద్ద సంగీతంనేర్చుకున్నారు. అనై అయ్యగారు గొప్పగాయకులే కాక, సంస్కృత, తమిళ, తెలుగు భాషలలో చేయితిరిగిన వాగ్గేయకారులు. ఆ తరవాత, మహావైద్యనాథయ్యరు, త్యాగయ్యగారి శిష్యుడు(బావమరిదికూడా), మానాంబుౘావడి వెంకటసుబ్బయ్యరు గారివద్ద సంగీతవిద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు.
7వ ఏటనే ” రాగం-తానం-పల్లవి ” పాడగలిగిన మనోధర్మ సంగీత పరిణతిని పొందిన వైద్యనాథయ్యరు, “బాల మేధావి“, అంటే, “child prodigy“! ఆయనకి 12 ఏళ్ళ వయస్సులో ఒక అరుదైన గొప్ప సంఘటన జరిగింది. 1856వ సంవత్సరంలో, తిరునల్వేలిజిల్లాలోని కల్లిడైకురుచ్చిగ్రామంలోనున్న “పండర సన్నిధి మఠం” లో, వైద్యనాథయ్యరుగారి సంగీతసభ మహావైభవంగా జరిగింది. వారి తలిదండ్రులు, వారికి పెట్టినపేరు, “వైద్యనాథయ్యరు” అని మాత్రమే. కాని ఆ మఠంలో ఈ బాలమేధావి సంగీతసభ జరగడానికి కారణం, “వార్షిక గురుపూజా మహోత్సవం” అంటే ఆషాఢపూర్ణిమ లేక గురుపూర్ణిమ మహాపర్వదిన శుభసందర్భం కావడమే! ఆ రోజు, ఆ సభలో వివిధ రంగాలలో, ఆ కాలంలో సుప్రసిద్ధులైన మహానుభావులెందరో పాల్గొన్నారు. సంగీతరంగంలో పేరొందిన ఘనులలో ముఖ్యులైన పెద్ద వైద్యనాథయ్యరు, చిన్న వైద్యనాథయ్యరు కూడావున్నారు. అటువంటి సభలో మన బాల వైద్యనాథయ్యరు “న భూతో న భవిష్యతి” అన్న స్థాయిలో పాడేసరికి, సదస్యులందరూ పరవశించిపోయేరు. ఆ మఠానికి ప్రధాన ధర్మాధ్యక్షాధికారి అయిన శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులవారు,బాల వైద్యనాథుడికి, అంతకిముందుకాని, ఆ తరవాతకాని ఎవ్వరికీలేని, “మహా” అనే బిరుదాన్ని, ప్రదానం చేసేరు. అప్పటినుంచి వారు, “మహావైద్యనాథయ్యరు“గా విశ్వవిఖ్యాతులయ్యేరు. ఆ సభలో ఆ రోజు “చక్రవాకరాగం” ప్రధానంగా తీసుకుని, ఆనాటి రసజ్ఞుల జన్మలన్నీ సఫలమయ్యే విధంగా ఆ రాగమాధుర్యభావాన్ని, శ్రోతలని సమాధిస్థితిలోకి తీసుకువెళ్ళ జాలిన తాదాత్మ్యాన్ని తాననుభవిస్తూ, అందరినీ అనుభవింపచేస్తూ గానం చేసేరని రసార్ద్రమైన చరిత్రపుటలు తెలియపరుస్తున్నాయి.
వారు, గాయకులేకాక, “హరికథా భాగవతులు” కూడాను. అందువలన, వారి అభిమానులు, వారినెప్పుడూ రెండురోజుల సభకి ఆహ్వానించేవారు. మొదటి రోజు గాత్రసంగీతసభ. రెండవరోజు “హరికథా కాలక్షేప సభ”.
వారి “శారీరం”, అంటే, “TIMBRE”, అంటే, కంఠస్వర వైశిష్ట్యం వర్ణనాతీతమైన దివ్యశోభతో, అపూర్వ మాధురీమహిమతో, అలౌకిక సంగీత రస భావ పుష్టితో, మూడున్నర ఆక్టేవుల(three and half octaves)తో,(అంటే, మన భారతీయ సంగీత పరిభాషలో “స్వర సప్తక శ్రేణి“) విలసిల్లేది. అంటే, “అనుమంద్ర పంచమ స్వర ప్రయోగ స్థాయి” నుంచి, “అతి తారా షడ్జ ప్రయోగ స్థాయి” వరకు, వారి ఆదర్శ పురుష కంఠం, అవలీలగా, కంఠస్వర ప్రయోగ ధాగధగ్యమూ, సంగీత భావాభివ్యక్తి వైపుల్యమూ, ఏకసమాన కంఠ విస్తృతి(uniform voice-volume)లతో సంచరిస్తూ, రసపిపాసువులకి సంగీత రస పీయూష ప్రదానం చేస్తూవుండేది.
వారి అనన్యసాధ్యమైన త్రికాల సంధ్యోపాసనా విధి నిర్వహణ, మహా మనోరమమైనది. ఆయన వృత్తిపరమైన గాయకుడు(professional vocalist). అందువలన వేరు,వేరు గ్రామ-నగరాదులలో సంచరిస్తూ, సంగీతసభలని, కథాకాలక్షేపసభలని విసుగు-విరామం వినా, నిర్వహించవలసివచ్చేది. అయినా ఎప్పుడూ, ఏ సందర్భంలోను వారి సంధ్యోపాసనకి అంతరాయం రాలేదు. ఉదయ, మాధ్యాహ్నిక సంధ్యావిధి అనుష్ఠానాలకి ఎప్పుడూ, ఏ విధమైన ఇబ్బందీవుండదు. సాయంసంధ్య విషయంలో, వీలైనంతవరకు సంధ్యాసమయానికి అనుకూలమైన సభాసమయాలనే అనుసరించేవారు.
తప్పనిసరి సందర్భాలలో, ఉదాహరణకి, ఐదుగంటలకి సభ ప్రారంభమైతే, సాయం సంధ్యాసమయానికి, సూర్యాస్తమయ సమయంలో 15—20 నిమిషాల వ్యవధితీసుకుని, సంగీతసభకి విరామమిచ్చి, సంధ్యోపాసనానంతరం, మరల సభని కొనసాగించేవారు. విరామకాలంలో, వేదికమీద, వారి శిష్యులు తంబూరాశ్రుతిని విడవకండా మీటుతూ వుండేవారు. ఆ విధంగా, సభా నిర్వహణకి అంతరాయంలేకుండాను, వారి ఆజన్మ సంధ్యోపాసనా దీక్షకి భంగంకలగకుండాను వారి స్వరార్చన, గాయత్రీమంత్రోపాసన, రెండూ నిరాఘాటంగాను, నిర్మోఘంగాను నిర్వహించబడ్డాయి. ఆయన మహానిష్ఠా శ్రేష్ఠతకి ఒక ఉదాహరణ వారి చరిత్రలోవుంది. వారు ఒకసారి, తిరువారూరుకి సమీపంలోని ఒక ఊరిలో ఒక పెద్దింటికిచెందిన పెళ్ళిలో సభచెయ్యవలసి వచ్చింది. ఆయన “పూజా మంజూష” అంటే, దేవుడు, అర్చన సామగ్రివుండే పెట్టెని ఆయన తమతోబాటు, వారి శిష్యుడు, కొడగనల్లూరు సుబ్బయ్య భాగవతరు, తీసుకువస్తున్నారు. వారు రైలుబండిలో ప్రయాణంచేస్తూ, దిగవలసినచోటచూసుకుంటే, ప్రమాదవశాత్తు, సుబ్బయ్యగారు వేరేబండిలోఎక్కడం వలన,మహావైద్యనాథయ్యరు, వారి అన్నగారు రామస్వామి శివన్లతో దిగలేదు. ఆ సంఘటన వారి మనసులో అలవిమీరిన ఆవేదనని కలిగించింది. వారు, ఎవరెంత సర్దిచెప్పినా సమాధాన పడలేకపోయేరు. ఆ పూజ పెట్టెకోసం భరింౘలేని బెంగ పెట్టేసుకున్నారు. ఏ పనిమీదా మనస్సుని లగ్నంచేయలేకపోయేరు. ఆ ఎడబాటుయొక్క బాధ సామాన్యుల భావపరిధికి అతీతమైనది, అందువలన అర్థంచేసుకోలేనిది. అది, శ్రీవిష్ణుపురాణంలోని, ప్రహ్లాదులవారికే తెలిసినది. వారు,(శ్రీవిష్ణుపురాణం—l : 20 : 19వ శ్లోకంలో) ఇలాగ అన్నారు:—
“యా ప్రీతిః అవివేకానాం విషయేష్వనపాయినీ|
త్వాం అనుస్మరతః సా మే హృదయాత్ మా>పసర్పతు”||
“అవివేకులైన మానవులకి, లౌకికవిషయాలపట్ల ఎటువంటి అవిచలిత ప్రీతిభావంవుంటుందో, అటువంటి గాఢ, గంభీర, నిరంతర ప్రేమభావం నాకు నీయందు కలిగి, అనునిత్యమూ నిన్ను స్మరించుకునే నా హృదయంనుంచి, ఆ ప్రేమభావం ఏ మాత్రమూ వైదొలగకుండుగాక!”
తన ఇష్టదైవంయందు అంతటి అపారభక్తిభావం కలిగిన మహావైద్యనాథయ్యరు గారికి, సామాన్యులెవ్వరూ గ్రహించలేని గాటమైన కల్లోలం ఆ పెట్టెకోసం కలిగింది. ఆ రోజు పగలంతా, వారు ఉపవసించేరు. సాయంత్రం సభని రద్దుచేసుకున్నారు. రాత్రిపొద్దుపోయేక సుబ్బయ్యభాగవతరు, గురువుగారి పూజాసామగ్రి పెట్టెతో, ఆదరా-బాదరాగా ఆయాసపడుతూ వచ్చేడు. అంత వరకు అభోజనంగా తన ఇష్టదైవమైన శివభగవానుడికోసం పడిగాపులుపడుతూ ఎదురు చూసిన వైద్యనాథయ్యరుగారు, బ్రాహ్మీముహూర్తకాలంలోనే స్నానాదికాలు ముగించుకుని, మహానందంగా తమ అనుష్ఠానాన్ని యథావిధిగా పూర్తి చేసుకుని, సాయంత్రం సంగీతసభలో అద్భుతమైన తన సంగీతగానంతో, తన ఇష్టదైవాన్ని ఆరాధించుకుని, తనకి ఆతిథ్యమిచ్చిన గృహయజమానులని సంతృప్తులనిచేసి, సంగీతరసజ్ఞులకి రససిద్ధిని కలిగించేరు.
వారు యౌవనంలోనే, ఆ కాలంలో, శైవవేదాంతవిద్యావిశారదులు-జీవన్
సంగీతం విషయంలో వారుచేసిన సేవ రాశిలో తక్కువైనా, వాసిలో వన్నెకెక్కినదే! దీక్షితులవారి “వాతాపి గణపతిం”(హంసధ్వని రాగం), “శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే”(కాంభోజి రాగం), “చింతయ మాకందమూల కందం“(భైరవిరాగం) కృతులలోని, సుప్రసిద్ధ సంగీత సంగతులు(musical phrases) అన్నీ వారి సృజనాత్మకమైన కూర్పులే!
72 మేళరాగమాలిక కర్ణాటక సంగీత సంప్రదాయానికి తలమానికమైనదీ; సంగీతకృతులన్నింటిలోను అత్యంత దీర్ఘమైనదీ; రామస్వామి దీక్షితులవారి కృతికి దీటైనదీను! వారి 108 రాగ”తాళ”మాలికని వారు ఒక వారంరోజుల వ్యవధిలోనే పూర్తిచేసేరు. ఈ కృతి సంగీతప్రపంచ చరిత్రలోనే ఏకైక రచన. ఈ రచనని సంగీతశాస్త్రమర్మజ్ఞులైన ప్రొఫెసర్ పి. సాంబమూర్తివంటివారు మహావైద్యనాథశివన్ గారి “ప్రముఖ రచన“(magnum opus)గా గుర్తించి, ఈ రచనని లక్షణ-లక్ష్యాత్మక ఏకైక కృతిగా అభివర్ణించేరు. (This is described as a unique composition of both the definition and the demonstration at once in the history of the Music of the Human World).
కానడ రాగం, సింహనందనతాళంలోని, “గౌరీనాయకా!” తిల్లానా ఒక అద్భుతకృతి. కాంభోజిరాగం, ఆదితాళంలోవున్న, “పంకజాక్షిపై” అనే వర్ణం వారి సంగీత-సాహిత్య రచనా వైశారద్యానికి అంటే, సాంకేతింగా చెప్పాలంటే, “ధాతు—మాతు” కల్పనాదక్షతకి, స్వరాక్షర ప్రయోగ సౌందర్యానికి, యతుల కూర్పుయొక్క వైదగ్ధ్యానికి దానికి అదే సాటి. జనరంజనిరాగంలో, ఆదితాళంలోని “పాహి మాం శ్రీ రాజరాజేశ్వరీ” అనే సంస్కృత కృతిలోని చిట్టస్వరాలకూర్పుద్వారా వారు ఆ కృతి యొక్క మనోహర సంగీతాకృతికి చేసిన ఆభూషణాలంకరణలు అనుభవైకవేద్యాలు.(ఈ కృతిని కొందరు రామస్వామిశివన్ గారి రచనగాకూడా పరిగణిస్తారు).
ఇప్పుడు, వారి జీవితంలోని ముఖ్యమైన ప్రత్యేకాంశాలు కొన్ని తెలుసుకుందాం!
1. ఇది ఒక ప్రధానవృత్తాంతం. అది 1891వ సంవత్సరం. చెన్నపట్టణం (అంటే యిప్పటి చెన్నై, ఒకప్పటి మదరాసు)లో మాసిలామణి మొదలియారు అనే గొప్ప సంగీతవిద్వాంసుడుండేవాడు. ఆయనకి మహాప్రజ్ఞావంతుడైన వేణు అనే శిష్యుడు మంచి పేరుగడించివున్నాడు. ఆ శిష్యుడికి మహావైద్యనాథయ్యరుతో పోటీపడి, ఆ నాటి సంగీతవిద్వాంసులందరిలో తానే గొప్పవాడినని మహాసభాముఖంగా అనిపించుకోవాలని ఉబలాటం కలిగింది. ఆలోచన వచ్చినదే ఆలస్యంగా అనుకుని, మహావైద్యనాథశివన్ గారిని పోటీకి పిలిచేడు. ఆ కాలంలో ఇటువంటివన్నీ అతిసామాన్యమైనవే! అందువల్ల శివన్ గారు అంగీకరించేరు. ఆ పోటీకి చెన్నైలోని జార్జిటౌనులోవున్న , నట్టు పిల్లైయార్ కోయిల్ వీధిలోని, తిరువణ్ణామలై మఠం భవనాన్ని వేదికగా నిర్ణయించేరు. మాసిలామణి మొదలియారుని న్యాయనిర్ణేతగా నియమించేరు. ఖరారైన తేదీరోజున శివన్ గారు, వయొలిన్ వెంకోబారావుని తోడుగా తెచ్చుకున్నారు. బ్రహ్మాండమైన సభ ఏర్పాటయ్యింది. సభలో, ముందువరసలలో, పల్లవి శేషయ్యరు, కందస్వామి మొదలియారు, ముత్తుస్వామి నట్టువనారు మొదలైన దిగ్దంతులు ఆసీనులయ్యేరు. వేణు తోడి, మాయామాళవగౌళ, భైరవి, కాంభోజి, నాటకురంజి, శంకరాభరణం, కల్యాణి వంటి ఆ నాటి సర్వజనాదరణకలిగిన కొన్ని గొప్ప రాగాలలో ౘాలా జటిల తాళగతుల ప్రయోగాలునిండిన “రాగం-తానం-పల్లవి” లని సంపూర్ణంగా సాధనచేసి, వాటితో పోటీసభకి సిద్ధమైవచ్చేడు. మహావైద్యనాథశివన్ కేవలం సంపూర్ణ సంగీత విద్వాంసుడుమాత్రమేకాదు. ఒక మహా సంగీతకళాప్రతిభాసంపన్నుడు కూడాను! సంగీతప్రయోగవైదుష్యంతో బాటు, ఊహాతీతమైన మనోధర్మగానం ఆయనయొక్క ప్రత్యేక ప్రజ్ఞ. అంతేకాదు. వారికి, సంగీతసభలలో బాగా ప్రచారంలోవున్న రాగాలన్నింటిపైన ఎంతటి ప్రభుత్వంవుందో, అరుదైన అపరిచితరాగాలన్నింటియందుకూడా, అంతటి కూలంకష కోవిదత ఉండేది. మొదట ఎవరు పాడాలి అనే విషయంగురించి చర్చరాబోతుండగానే, వేణు, తెలివిగా, శివన్ గారే మొదట పాడాలని కోరేడు. అతగాడి ఉద్దేశ్యమేమిటంటే, ప్రాచుర్యంలోవున్న రాగాలలో ఏదోవొకటి శివన్ గారు పాడితే, ఆ వెంటనే తన “అక్షయతుణీరం“నుంచి తాను కష్టపడి తయారుచేసుకున్న క్లిష్టమైన పల్లవి పాడి, పోటీలో తాను నెగ్గేయవచ్చుకదా అని! ఇటువంటి లౌకికవిషయాలలో శివన్ అమాయకులు. కాని వెంకోబారావుగారు వీటిలోకూడా దిట్టే! అందువల్ల, శంకరాభరణం పాడబోతున్న శివన్ని వారించి, వారిద్దరికిమాత్రమే తెలిసిన “రాధామంగళం లేక పాండవభాష“లో, “నారాయణగౌళరాగం” పాడవలసినదిగా సూచన చేసేరు. విషయం అర్థంచేసుకున్న మహావైద్యనాథశివన్ , అపూర్వరాగమైన నారాయణగౌళలో ౘాలా విస్తారంగా ఆలాపనచేసి అత్యద్భుత మనోధర్మ భావగాంభీర్యంతో గానంచేసి పండితులకి, పామరులకి సమానమైన మనోరంజకత్వాన్ని కలిగించేరట. ఆ అపూర్వరాగంలో తాను ఏమీ తయారుచేసుకుని రానందున వేణు ఓటమిని అంగీకరించవలసివచ్చింది. న్యాయనిర్ణేత మాసిలామణి మొదలియారుగారు మహావైద్యనాథశివన్గారి గెలుపుని సభాముఖంగా ప్రకటించేరు.
2. ఇది కూడా అపూర్వరాగ గానానికి సంబంధించిన విషయమే! ఐతే, వేదిక మేల(ర)ట్టూరు.(“ప్రహ్లాదచరితమ్ ” మొదలైన యక్షగాన భాగవతుల పరంపరకిచెందినవారి స్వగ్రామంగా లోకవిదితమైనది.) ఇక్కడ పోటీయేమీ లేదు. ఆ రోజులలో అపసవ్య అరుణాచలయ్యరు అనే మహా సంగీతశాస్త్ర మర్మజ్ఞుడు, విమర్శకుడు ఉండేవాడు. శివనయ్యగారి సభకి ఆయన వచ్చేరు. సాయంత్రం ఐదుగంటలకి సభప్రారంభమయ్యింది. అపూర్వరాగమైన “రసికప్రియ“ని విస్తారంగా పాడవలసినదిగా అరుణాచలయ్యరు, శివన్గారిని కోరేరు. ఆయన ఐదుగంటలకే సభని ప్రారంభించి ఒక గంటపైగా రసికప్రియ రాగాలాపనని అనేక అద్భుత మృదుమధుర సంచారాలతో, మూడు స్థాయిలలోను అలవోకగా చేసేరు. ఇంతలో సాయంసంధ్యాసమయం ఆసన్నమయ్యింది. శిష్యులు తంబూరాశ్రుతిని కొనసాగిస్తూండగా, అయ్యవారు సంధ్యోపాసనకివెళ్ళి, సుమారు ఇరవై నిమిషాల వ్యవధిలో తిరిగివచ్చి, తానమూ, పల్లవీ పాడి, మూడుగంటలపైగా సభంతా మైమరచిపోయేలాగ రసికప్రియలోని రసాన్నంతా రసజ్ఞులకి తనివితీరా పంచేరు.
3. 1887లో, మదరాసు హైకోర్టు రిటైర్డు జడ్జిగారైన వి.వి. శ్రీనివాసయ్యంగారి బంధువుల ఇంటిలో పెళ్ళికి, తిరుచానూరు(తిరుపతి వద్ద) నుంచి మహావైద్యనాథ శివన్ గారికి సంగీతసభ నిర్వహించడానికి, ఆహ్వానం వచ్చింది. వారి సంగీతప్రియులైన ఆ యజమానులయింట వరసగా ఆరు రోజుల సభలని, వారి అభ్యర్థనమేరకి శివన్ గారుకొనసాగించేరు. ఇటువంటి సంఘటన కర్ణాటకసంగీతచరిత్రలో మరొకటిలేదని పెద్దలు అంటారు. వరసగా ఆరురోజులపాటు, ఒకే సదస్సులో, ఆ సదస్యులముందే పాడినది పాడకుండా సుమారు 20 నుంచి 25 గంటల మొత్తం సభానిర్వహణవ్యవధిని పూర్తిగా రసజ్ఞులందరికి రక్తికట్టేవిధంగా గానంచేయగలగడం ఆయనకే చెల్లింది.
4. ఒకసారి పాల్ఘాటులో వారి సంగీతసభ జరిగింది. ఆ రోజు ఆయన పాడిన “హంసధ్వని రాగం“లోని, దీక్షితులవారి కృతి, “వాతాపి గణపతిం భజేsహం” రసజ్ఞులని ఎంత రంజింపజేసిందంటే, అదే కృతిని రసికుల అభ్యర్థనమేరకి, వారు, సభ మధ్యభాగంలో రెండవసారి, చివరభాగంలో మూడవసారి పాడవలసివచ్చిందని చరిత్ర చెప్పిన ముచ్చట!
5. ఆ కాలంలో మైసూరు, తిరువాన్కూరు, కొచ్చిన్ , రామ్నాడ్ పాలకుల పిలుపులని గౌరవించి, వారిని, వారి సంస్థాన రసికవరులని ఆయన తన అలౌకిక సంగీత రసాంబోధిలో తనివితీర ఓలలాడించేరు. వారినుంచి లెక్కకి మిక్కుటమైన, ౘాలా విలువైన బహుమతులని ఆయన స్వీకరించేరు.
ఈ విధంగా శ్రీ మహావైద్యనాథశివన్ వర్యులు, సంగీతశారదని అనుపమానంగా సేవించి, వారి 49 ఏళ్ళ వయస్సులో శివైక్యం చెందేరు. ఆ గానగంధర్వ గంగాధర ఉపాసకుడికి నతమస్తకులమై నమస్కరిద్దాం.
13—02—2018వ తేదీన “మహాశివరాత్రి పర్వదిన సందర్భం“లో, పరమశివ భక్తాగ్రేసరులలో ఒకరైన, వాగ్గేయకార, గాయకోత్తములు శ్రీ మహావైద్యనాథశివన్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర పరిచయం సమర్పించబడింది.
స్వస్తి||
మహా వైద్యనాధశివన్ గారిని సాక్షాత్కరింప చేసినందుకు కృతజ్ఞతలు .
Maha vaidyanatha sivan not just a great musician but an ardent devotee of lord Shiva, his disciplined spiritual life and his excellent skills in composing musical phrases of popular kritis, your elaborated presentation on this super human born with Tyagaraja’s grace and blessings is beyond words and has filled our hearts with extreme happiness. Thanks a lot for introducing Him to us on the eve of this Maha sivaratri.
Very inspiring life presented in lucid and gripping style. Pranams guruji
మహా కవులూ, మహామహా గాయకుల గురించి పరిచయం
చేస్తోన్న ఈ శారదా సంతతిలో, పేరులోనే ‘మహా ‘ కలిగిన
మహా గాయకోత్తముడు శ్రీ మహావైద్యనాథ శివన్ వారిని
గురించిన విశేషాంశాలు ….పావన కర్ణాటక శాస్త్రీయ
సంగీత వియద్గంగను పట్టితెచ్చి అందించినట్టుగా ఉంది.
” నా పాలి శ్రీరామ ” చూడగానే పాతరోజుల్లో భక్తిరంజని
జ్ఞాపకానికొచ్చింది.
త్యాగరాజంతటి మహానుభావుని పవిత్ర ఆశీర్వాద ఫలంతో
కారణ జన్ముడైన శ్రీ వైద్యనాథ శివన్ — అటు సంగీతాన్ని, ఇటు
నైష్ఠికతని జీవితాంతం సమానంగా అత్యున్నతస్థాయిలో సాధన
చేస్తూ సాగించిన పుణ్యమయ జీవనం ప్రాతఃస్మరణీయం.
వారిని గురించి వివరించిన విశేష సంఘటనలు, వృత్తాంతాలు
ఆశ్చర్యం కలిగించేయి.
మహా శివరాత్రికి మహాప్రసాదం..శ్రీ మహా వైద్యనాథన్ వారి రసమయ
జీవిత చరిత్ర.
నాదో పాసకులకు మృష్టాన్న భోజనం. జయశీలరావు
Very many thanks bava garu for giving us such a valuable information. Are there any recordings available of such a great person?
Request you to share with us in case of availability.
During those days recording was not available in India.
Once, when Sivanji gave his extraordinary performance
in Mysore Royal palace, the Maharaja is reported to
have recorded a short piece on a wax cylinder, secretly,
and played the same to the utter amazement and thrill
of Sivanji. But unfortunately it is lost in a fire-accident
that occured in the Royal palace susequently.