సాహిత్యము-సౌహిత్యము – 38 : సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్
శ్రీశారదా వాత్సల్య దీపికా |
“సాహిత్యము—సౌహిత్యము~38.
27—01—02018; శనివారము.
ఈ వారంకూడా శ్రీ బేతవోలు రామబ్రహ్మవర్యుల అనుపమాన సమస్యాపూరణ ధౌరంధర్యాన్ని, మరొకమారు ౘవిచూద్దాము!
సమస్య:— “సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్ ”
“శ్రీరాముడు మంచి హడావుడిగా, ఆంజనేయుడిని ‘సారా’ అంటే తెలుగు గ్రామ్యభాషలో, మత్తుపానీయం, తీసుకురమ్మన్నాడు” అని ఈ సమస్యకి అర్థం. ఇది ఘోరమైన అనౌచిత్యదోషంకదా! ఇంతటి దారుణ సమస్యని కవివరులు ఎంత అద్భుతంగా పూరించేరో రసజ్ఞులు గ్రహించండి.
ఛందస్సు, మనకి సుపరిచితమైన “శార్దూలవిక్రీడితం“.
సమస్యాపూరణ పద్యం ఇది :—
ఆ రక్షఃపతి పుత్రుడేసిన విషవ్యాసక్త బాణౌఘముల్ |
శ్రీరామానుజు తాక, యీతడదెమూర్ఛిల్లెన్ , సుషేణుండు హ
స్తారూఢిన్ గమనించి పల్కినగతిన్ సంజీవి నూటాడి, దో
స్సారా! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమేపారగన్ ||
సమస్యని రామాయణకథాఘట్టపరంగా కవిగారు పూరించేరు.
“మేఘనాథుడు(రక్షఃపతి పుత్రుడు=రావణునికొడుకు) వేసిన విషపూరిత బాణపరంపరయొక్క ప్రయోగానికి గురయిన లక్ష్మణుడు(శ్రీరాముడి అనుజుడు) సొమ్మసిల్లి (రణరంగంలో) నేలకి ఒరిగిపొయేడు. వానరవైద్యుడైన సుషేణుడు, మూర్ఛలోవున్న లక్ష్మణుడి చేయి పట్టుకుని నాడిచూసి “సంజీవి వేరు” వలన మూర్ఛవ్యాధి నయమై పోతుందని చెప్పేడు. వెంటనే రాములవారు హనుమంతునితో, “ఓ మహా బాహుబలసంపన్నా! నీవు వెళ్ళి, ఆ సంజీవి వేరుని నేలనుంచి వేరుచేసి తీసుకుని రావయ్యా!” అని ౘాలా కంగారు పొంగారుతుండగా అన్నారు.”
స్వస్తి ||
ఇంతకీ దోస్సారా అంటే ఏమిటైనట్టు? ఓ మహా బాహుబల సంపన్నా అనా? ఎలాగ? వ్యుత్పత్తి చెబితే బావుంటుంది.
“దోస్ —బాహౌ ” ; “సార —బలే ” అర్థాలని “దోస్సార” అనే
సమాసములోని రెణ్డు మాటల మౌ లికార్థాలని గ్రహిఞ్చి ,
“బాహుబలా !” అని అన్వయిఞ్చాలి.
Thank you !
Superb ga undi pooranam
బేతవోలు రామబ్రహ్మం గారు మాటల మాంత్రికుడు.
మంచి చమత్కారి. గొప్ప ప్రతిభా సంపన్నుడు. ఆయన అవధానాలు
చెయ్యడమే కాక, చాలా అవధాన కార్యక్రమాలకి సంచాలకులుగా
వ్యవహరించారు కూడా. వారు ఉంటే, అవధాని పని సులువవుతుంది.
( అని పెద్దలంటారు) ఇందులో ఉన్న సమస్యని హనుమంతుడిని
పట్టుకుని అతి లాఘవంగా దాటేశారు.