సాహిత్యము-సౌహిత్యము – 37 : హృదయము చీల్ప రత్నములు, హేమములున్  కనవచ్చు అంతటన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
20—01—2018;  శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~37.

ఈ సారి, సహజకవి శ్రీ చోట్నీరు శ్రీరామమూర్తివర్యుల సమస్యాపూరణ సామర్థ్య ఘనతని గమనిద్దాం!

సమస్య :—

హృదయము చీల్ప రత్నములు, హేమములున్ 

కనవచ్చు అంతటన్ ” ||

“ఎదని చీల్చి చూస్తే, అంతా మణులూ, బంగారాలూ కంటపడతాయి” అని ఈ సమస్యకి అర్థం!

కవిగారి సమస్య పూరించిన విధానం చూద్దాం!

ఇది చంపకమాలవృత్తం. నాలుగు పాదాలుంటాయి.  పాదానికి 21 అక్షరాలు కలిగిన “ప్రకృతిచ్ఛందస్సు”  జాతికి చెందినది ఈ వృత్తం. ద్వితీయాక్షర ప్రాస నియమంవుంది. న-జ-భ-జ-జ-జ-ర;  గణాలుంటాయి. 11 వ, అక్షరం యతిస్థానం.

విదిత కృషీవలత్వమున, బీళ్ళను దున్నియు, 
పైడి పంటలన్ 

పొదలగ చేయు కర్షకులె భూషణమౌ ధర రత్నగర్భ నా 

విదిత యశంబు కాంచి, వసువృద్ధిని కూర్చును తత్ 
వసుంధరా 

హృదయము చీల్ప, రత్నములు, హేమములున్ 
కనవచ్చు అంతటన్ ”  ||

“నేలతల్లికి చెందిన బీడుపొలాలని దున్ని సాగు చెయ్యడం అనే కళతెలిసిన రైతులు, ఆ బీడులనుంచి అపరంజివంటి పంటలని పండిస్తారు. ఆ మణిమయ వసుంధరామాత హృదయం దున్ని, వెలికి తీసి చూస్తే, అన్నీ రత్నరాశులూ, స్వర్ణరాశులూ బయటపడతాయి. అంటే సస్యరూపం లోనూ, ఓషధీరూపంలోనూ పుడమితల్లి కడుపున పట్టే పంటంతా బంగారాలూ, మణిమాణిక్యాలే కదా!”

————————————————————————————————
విదిత కృషీవలత్వము= భూమిని సాగుచేసే నేర్పు.
పొదలగ చేయు= వర్ధిల్లచేయు.
————————————————————————————————

స్వస్తి ||

You may also like...

1 Response

  1. సి. యస్ says:

    ఈసారి సమస్యా పూరణంలో పరిచయమైన శ్రీ చోట్నీరు శ్రీరామ మూర్తి
    గారి పేరు ఆ రోజుల్లో ఆకాశవాణి వారు నిర్వహిస్తూండే ‘ సరసవినోదిని –
    సమస్యాపూరణం’ కార్యక్రమంలో ప్రతి వారం వింటూండేవాళ్ళం. క్రమం తప్పకుండా వారు ఆ సమస్యలని చక్కగా పూరణ చేసేవారు.
    ఈ పద్యంలో కవగారు చెప్పిన ‘ రత్నగర్భ ‘ నుండి వచ్చే రత్నములు, హేమములను సస్యము, ఓషధులుగా చెప్పడం అందగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *