శారదా సంతతి — 27 : అతులిత జాయాపతి—శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి+ శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావు.

శ్రీశారదా వాత్సల్య దీపిక : —

14—01—2018; ఆదిత్యవారము—భోగి పండుగ.

శారదా సంతతి—27.

మకరసంక్రాంతి పర్వదిన ప్రత్యేక వ్యాసం.

అతులిత జాయాపతి—శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి+ శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావు.

నేను మదరాసు మహానగరంలో “ఉషా” కంపెనీలో ఉద్యోగంచేస్తున్న రోజులవి(1973-1979). మైలాపూరులోని లజ్ లో, కామధేను థియేటర్ ఎదురుసందులో, శ్రీ దొరైరాజ్ గారి యింట్లో మేడమీద, ఒక గదిలో(ఒక్కడినే), అద్దెకు వుండేవాడిని. కపాలేశ్వరుడు, కర్పగంబాళ్ గుడికి, శ్రీరామకృష్ణపరమహంసగురుదేవులు, శ్రీశారదామాత, శ్రీ వివేకానందస్వామి వారల దేవాలయానికి తరచు వెళ్ళేవాడిని.

చెన్నై, తిరువళ్ళిక్కేణి(ట్రప్లికేన్ )లో శ్రీ పార్థసారథిస్వామి వారి సన్నిధి నాకు మొట్టమొదటి పవిత్ర దర్శనీయ దివ్యక్షేత్రమైతే, బి.వి.నాయుడువీధిలోని “జ్యోతిష్మతి” నిలయం, నాకు బహువార సేవ్యధామంగావుండేది. బయటనుంచి చూడడానికి, అనేక పూర్వకాలీనగృహాల వరుసలో అదికూడా ఒకటి అనిపించేది. కాని, లోగిలిలోకి అడుగుపెట్టగానే అది ఒక పవిత్రసరస్వతీనిలయంగాను, అతిథులకి, అభ్యాగతులకి ప్రేమధామంగానూ, వుండేది. కవిరాజహంస, కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వెంకట రావుగారు(మా వెంకావుతాతయ్య), వార్ధక్యప్రభావంవల్ల విశ్రాంతి తీసుకుంటూండేవారు. అమ్మమ్మగారు(శ్రీ పెద్దాడ రామస్వామిగారిభార్య, మా జ్యోతిపిన్నిగారి తల్లిగారు) అక్కడేవుండేవారు. వారిద్దరినీ దర్శించుకుని, వారి ఆప్యాయపు పలకరింపులతోకూడిన ఆశీస్సులు తీసుకుని, కుడివైపు గదిలోకి వెళ్ళగానే మా నళినీచిన్నాన్నగారి దర్శనం లభించేది నాకు. చిన్నాన్న నిరంతర సారస్వత తపస్వి. ఇహలోకంతో మానసికసంబంధం ఏమీవుండేదికాదు. ఆంధ్రాంగ్లసంస్కృత వాఙ్మయ నందనవనంలోని కల్పతరుప్రసూనగత అలౌకిక చిన్మయమకరందధారలని నిరంతరం సేవించే మధుకరదీక్షలో వుండేవాడు. ఒక మహాప్రజ్ఞతో గుండెనిండిన ముగ్ధబాలకునివంటి మహానుభావుడు మా చిన్నాన్నగారు.

మా జ్యోతిపిన్ని, “తత్ జాయా, జాయా భవతి యత్ అస్యాం జాయతే పునః” అన్నట్లుగా వుండేది. అంటే, “తన భర్తకి పుత్రరూపంలో పునర్జన్మనివ్వడంవలన, భార్య, ‘జాయ’ అనేపేరుతో వ్యవహరింపబడుతోంది” అని అర్థం. మా జ్యోతిపిన్ని, మాచిన్నాన్నని, తన ఐదుగురు బిడ్డలతోబాటు ఆరవ ఆత్మీయశిశువుగా సాకే తల్లి లాగ కనిపించేది, నాకు. అంతేకాదు! మా వెంకావు తాతయ్య, అమ్మమ్మలు మరిద్దరు బిడ్డలు, మా పిన్నికి. అంతటితో ఐపోలేదు. కిరణ్ మిత్రులు కామేశ్ మొదలైన వారు, నేను ఇలాగ మరెందరో బిడ్డలం ఇంకావుండేవాళ్ళం. చిన్నాన్నది పసి పిల్లవాని మనస్తత్త్వంకావడంవలన సంసారం అన్నా, లోకవ్యవహారాలన్నా ఏమీ తెలియదు. లౌక్యమంటే పూర్తిగా అపరిచిత వ్యవహారం. నెలసరిజీతం మా జ్యోతిపిన్నిగారి చేతిలో పెట్టేస్తే తన బాధ్యత తీరిపోయినట్లే! హాయిగా తన తపోభూమిలోకి వెళ్ళిపోయి, అవిరళ వాఙ్మయ వరివస్యలో లీనమైవుండేవారు.

శ్రీ బి.వి.సింగరాచార్యగారో, నేనో, అప్పుడప్పుడు తీర్థం శ్రీధరమూర్తిగారు, అటువంటివాళ్ళం ఆ తపోవాటికలోకి అడుగు పెట్టేవాళ్ళం! సింగరాచార్యగారు గొప్ప సాహితీవేత్త. మంచి వాగ్మి! సంస్కృతాంధ్ర పండితులు. కవి. విమర్శకులు. గంభీర వ్యక్తిత్వం కలిగిన ఉదాత్త స్నేహశీలి. సాధారణంగా వారే ఏదో ఒక చర్చ ప్రారంభించి, ౘక్కగామాట్లాడేవారు. చిన్నాన్న అరుదుగా పెదవి విప్పేవాడు. చిన్నాన్న మాటలు సంక్షిప్తంగాను, సప్రమాణంగానూ, సహేతుకంగానూ, లలితమనోహరంగానూ వుండేవి. ఎంతటి ప్రామాణిక విషయాన్నైనా assertiveగా కాని, aggressiveగా కాని చెప్పడం నా దృష్టికి రాలేదు. “అనుద్వేగకరం వాక్యం” అనే గీతాచార్యుని బోధకి ఆచరణరూపం అన్నట్లు వుండేవాడు. వివాదం వస్తే తాను చెప్పిన మాటకి ప్రమాణం చెప్పేసి, ఊరుకునేవాడు. నేను మౌనప్రేక్షకుడిని. సంపూర్ణ ఔత్సుక్యంతో వినే శ్రోతని.

అప్పుడప్పుడు వాకిట్లోనుంచి, వెంకావుతాతయ్యగారి సుప్రీంకోర్టుతీర్పుల్లాంటి సవరణలు, దిద్దుబాట్లు వుండేవి. అదంతా ఒక అలౌకిక అనుభవమయ దివ్యజగత్తు!

ఇంక, మా జ్యోతిపిన్ని ఆ “జ్యోతిష్మతి”ధామంలోని “శ్రీమాత“. అక్కడవున్నవారందరికి కల్పతరువు. గృహిణీధర్మ సేవా పరాయణత్వానికి పరమాదర్శవంతమైన ప్రతిరూపం.

న గృహం గృహం ఇతి ఆహుః | గృహిణీం గృహం .ఉచ్యతే”(కేవలం ఇంటిని ఇల్లు అనరు. గృహిణిని “ఇల్లు” అని అంటారు. అంటే, గృహానికి, గృహత్వనైజం, గృహిణి వలననే కలుగుతుంది.) అనే శాస్త్ర గదిత లక్షణానికి, సమగ్ర లక్ష్య స్వరూపంగా మా పిన్ని వుండేది.

అలవిమీరిన సవాలులు ఎడతెగకండా వుండేవి. బంధుమిత్రులు తెరిపిలేకండా వచ్చివెళ్ళే ఉమ్మడికుటుంబవ్యవస్థ. పెద్దల, చిన్న-పెద్ద ఆరోగ్య సమస్యలు, సమయబద్ధమైన వారి సేవ, అలాగే పిల్లలని, భర్తని సమయాతీతం కాకండా తెమిల్చి పంపవలసిన నిత్యబాధ్యత, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే, పరోపకార నిర్వహణ, అన్ని సమయ-సందర్భాలనీ అనుసరించి ఔచిత్యభంగంలేకండా ముద్దు-ముచ్చటలు తీర్చేసరదాలు ఇలాంటి ఎన్నో పనులుచేస్తూనే, సంప్రదాయ బద్ధమైన దేవతార్చన, సమయానుసారమైన పూజలు, పండగలు, పర్వదినాలు అనుసరించి స్థానిక దేవాలయ దర్శనాలు, ఇలాగ, అనేక సహస్రావధానాలని మా జ్యోతిపిన్ని అలవోకగాను, విజయవంతంగాను నిర్వహించేది. ఆ ఓర్పు, నేర్పు, నిత్యనూతన ఉత్సాహం, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, సంపూర్ణ సఫలప్రదాయక ప్రయత్న వైదగ్ధ్యం, అన్నింటినీమించి నిత్యసాదర దరహాసశోభతో అందరికీ అన్నీ సమకూర్చడం మొదలైన అనేక విషయాలలో మా పిన్నినిచూచి ఈనాటి గృహిణులెందరో ఎన్నో నేర్చుకోవాలి. ఇంకొక ప్రత్యేకవిషయం ఏమిటంటే, ఇంట్లో పనివారిని, తన కుటుంబసభ్యులతో సమంగాచూడడం, మా పిన్ని ప్రగాఢ మానవతాస్ఫూర్తికి మచ్చుతునక!

వనరులన్నీ పరిమితం! గృహవైభవం మాత్రం అపరిమితం! ఎప్పుడూ, దేనికీ, ఏలోటూ లేదు. మాజ్యోతిపిన్నియొక్క గృహనిర్వహణదక్షత, సమస్యాపరిష్కార సామర్థ్యం, ఐదుగురు బిడ్డల జీవన ధావన క్రమాన్ని తీర్చిదిద్దగలిగిన అసాధారణకౌశలం, కష్టనష్టాలని ఎదుర్కొని నిలువరింౘ గలిగిన హిమవన్నగతుల్యమైన స్థైర్యం, నష్టంకలిగితే ఆ నష్టశిథిలాలనుంచే పూర్వశోభని పునర్నిర్మించగల శక్తి మొదలైన ఆదర్శగృహిణియొక్క గార్హస్థ్యధర్మనిర్వాహ నైపుణ్యం గమనించిన నాకు “పురంధ్రీ” అనే సంస్కృత శబ్ద మూలార్థం(etymology) గుర్తుకి వస్తూంటుంది. “పురం గృహం ధరతి ఇతి పురంధ్రీ“, అంటే పురాన్ని, అనగా గృహాన్ని భరించే గృహిణి అని అర్థం. మా జ్యోతిపిన్ని నాకు మహాకవయిత్రి లేక రచయిత్రి అనిపిస్తుంది. ఆమె ఐదుగురు బిడ్డల కలలని కని, ఐదు+ఐదు, అంటే పది పరమరమణీయ జీవితాలని విధాతలాగ విరచించింది, వినిర్మించింది.

ఈ సంక్షిప్త పరిచయం పునాదిగా మిగిలిన విషయాలు చాలా సంగ్రహంగా మీముందువుంచుతాను.

మా నళినీచిన్నాన్న, కవిరాజహంస, కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వేంకటరావు-వేంకట రమణమ్మ దంపతికి 09—05—1915; ఆది(త్య)వారం, నిడదవోలులో, శ్రీ సూర్యభగవానుడి అనుగ్రహ రూపంగా, మొదటి బిడ్డగా జన్మించేడు.

వారి పినతండ్రి శ్రీ బాలాంత్రపు సూర్యనారాయణరావుగారు, వంగరాష్ట్రానికిచెందిన శ్రీ నళినీకాంత సాంఖ్యతీర్థయతి వర్యులవద్దనుంచి శ్రీవిద్యామంత్రదీక్షని పొందేరు. నళినీకాంతసాంఖ్యతీర్థస్వామి మా వెంకావుతాతగారు, వారి తమ్ముడు సూర్యనారాయణరావుగారు, నిడదవోలులో వున్నప్పుడు, వారింటికి వేంచేసేరు. వారి పేరునే మా చిన్నాన్నగారికి ‘నళినీకాంతరావు’ అని నామకరణం చేసేరు. డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు, శ్రీ నళినీకాంతరావుగారికి తమ్ముడు. శ్రీమతి బుద్ధవరపు కనకదుర్గ వారికి చెల్లెలు. మా చిన్నాన్నగారికి, తమ ఏడవ ఏట మాతృవియోగం కలిగింది.

మా చిన్నాన్న ఉన్నతపాఠశాలా విద్యాభ్యాసం పిఠాపురం లోను, కళాశాలా విద్యాభ్యాసం కాకినాడలోను జరిగేయి. మదరాసు క్రిస్టియన్ కళాశాలలో, M.A.,(Eng.-Lit.) పట్టభద్రులయ్యేరు. వారి విద్యావ్యాసంగం అంతా ఉత్తమశ్రేణిలోనే జరిగింది. అలాగే ఆటలన్నింటిలోనూ కూడా ఉత్తమస్థాయిలోనేవుండేవారు. ఆరు అడుగులపైన ఎత్తు, ౘక్కని దేహసౌష్ఠవం, మిరిమిట్లుగొలిపే మిసిమిచాయ, “పుంసాం మోహనరూపాయ” లేక “సాక్షాత్ మన్మథ మన్మథః” అన్నట్టు యౌవనంలో వుండేవారని మా కుటుంబాలలో పెద్దలు చెప్పగా విన్నాను. వారి దేహ దార్ఢ్యాన్ని, శరీరస్వరూపాన్ని వారు చిట్టచివరివరకు అలాగే కొనసాగించడానికి వలసిన regular walking exercise ని వారు తగిన shoes ధరించి ఒక్కరోజూ విడవకుండా చేయడం నాకు గుర్తుంది.

నేనుమాత్రం, మా నళినీచిన్నాన్నగారు, మంచి యౌవనంలోను, ప్రౌఢవయస్సులోనువున్నప్పుడు, గొప్ప స్ఫురద్రూపవంతులైన Rudolph Valentino, Cary Grant, John Wayne, Rock Hudson, Gregory Peck వంటి ఆదర్శవంతమైన పురుష విగ్రహమూ, సౌందర్యమూ, సౌష్ఠవమూ కలిగిన ఆ పూర్వకాలంనాటి హాలీవుడ్ నటులవలె ఉండివుంటారని ఊహించుకునే వాడిని.

ఆ సందర్భంలో తిక్కనగారి కవిత్రయభారతంలోని, “విరాట పర్వం”లో ద్రౌపదీదేవి, నకులుడి అందాన్ని గురించి చెప్పే ఈ సీసపద్యపాదం నాకు గుర్తు వస్తూనే వుండేది.

తన ఒప్పెదురు కన్న తగిలి ఎవ్వరికైన

మలగి క్రమ్మర చూడ వలయువాడు” (అతడి, -అంటే నకులుడి- అందాన్ని ఎదురుగా వచ్చేవారు ఎవరైనా చూస్తే, వారు ఆకర్షితులై, వెనుతిరిగి మళ్ళీ-మళ్ళీ చూడాలనిపించేటట్లువుంటాడు–అనిఅర్థం!).

27—12—1947వ తేదీన, శనివారం, భీమవరంలో మా చిన్నాన్నగారు మా జ్యోతిపిన్నిల వివాహం యిద్దరి కుటుంబ పెద్దలు, ఆత్మీయులైన బంధువులు, మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. దైవానుగ్రహంవలన వారిద్దరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు కలిగేరు.

మదరాసులోని “ఆంధ్ర మహిళా సభ“లో ఉద్యోగం ప్రారంభించేరు. తదుపరి, మద్రాసు మెయిల్ పత్రికవారి సంపాదకవర్గంలో ఉద్యోగించేరు. చెన్నై, సుంకురామచెట్టి వీధిలోని ఎం. శేషాచలం & కొ వారి “ఎమెస్కో” పోకెట్ బుక్స్ విభాగానికి ప్రధానసంపాదకునిగా, ప్రాచీనగ్రంథ పరిష్కర్తగా, ప్రాచీనగ్రంథ పీఠికా రచయితగా అనుపమాన ఆంధ్ర సారస్వతసేవ చేసేరు. ఆ సందర్భంలోనే ఆంధ్రపంచకావ్యాలని ప్రామాణికంగా ప్రచురింపచేసేరు. వాటితోబాటుగా బాగా ప్రచారంలోవున్న పింగళి సూరన్న కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, ముక్కుతిమ్మన పారిజాతాపహరణము మొదలైన గ్రంథాలనేకాక, పెద్దగా ప్రచారంలోలేని కనుపర్తి అబ్బయామాత్యుని అనిరుద్ధచరిత్రము, వినుకొండ వల్లభరాయకవి క్రీడాభిరామము, శేషము వేంకటపతి శశాంకవిజయము, సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసము మొదలైన గ్రంథాలనికూడా వెలుగులోకి తెచ్చేరు.

ఆ పిమ్మట దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి అముద్రిత రచనలనన్నీ పరిశీలించి, తమ సంపాదకత్వంలో నాలుగైదు సంపుటులుగా వెలువరించేరు.

తమ తండ్రిగారు, శ్రీ బాలాంత్రపు వేంకటరావుగారి అముద్రిత సీసపద్యాలని పరిశీలించి, స్వయంసంపాదకత్వం లో “భావసంకీర్తన సీసత్రిశతి” ని ప్రకటించేరు.

2005లో, సద్గురు శ్రీ శివానంద మూర్తిగారి సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్టు వారు, “శ్రీరామనవమి ప్రతిభాపురస్కార్ ” తో శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావుగారిని సమ్మానించి, ప్రఖ్యాపన పత్ర ప్రదానంతో గౌరవించేరు.

నివేదన“—నళిని గీతికలు,” వజ్రాల దిన్నె “—పిల్లల రేడియో నాటికలు, “వృక్ష జగత్తు“(యునెస్కో), “పంచతంత్ర కథలు” (యునెస్కో), “తెలుగు చాటువు“—పుట్టు పూర్వోత్తరాలు (శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుతో కలిసి) శ్రీ నళినీకాంతరావుగారి రచనలు. వీటిలో “నివేదన“లోని ఒకటి-రెండు రచనల వైశిష్ట్యాన్ని నేటి “ఇతరములు”లో ౘవిచూద్దాం!

మా పిన్నిగారు శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి, కాకినాడలో, 28—02—1925, శనివారంనాడు పుట్టేరు. తండ్రిగారు శ్రీ పెద్దాడ రామస్వామిగారు, “శాంతినికేతనం” లో ఎం.ఏ. పట్టభద్రులు. కాకినాడ పి.ఆర్ . కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసేరు. వారు అసాధారణ ఆంగ్లభాషా వక్తృత్వ విశారదులు. రవీంద్రుల గీతాంజలిపై “Geetaanjali—An Attempt at Interpretation” అనే ఆంగ్లగ్రంథరచన చేసేరు. అహ్మదాబాదులో, అంబాలాల్ సారాభాయిగారి పిల్లలకి కొంతకాలం ఆంగ్లబోధ చేసేరు. ఆ పైన భీమవరం కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసేరు. శ్రీమతి శేషమ్మగారు వారి ధర్మపత్ని. వారిద్దరికి ఐదుగురు రత్నమాణిక్యాలవంటి బిడ్డలు. వారిలో చిట్టచివరి చిట్టి, చిన్నిబిడ్డ మా జ్యోతిపిన్నిగారు. పిల్లలందరికీ ఆదర్శవంతమైన ఉత్తమ సంస్కారాలని అందించిన ఆ మహాతల్లి ఐదుకుటుంబాలని ఫలవంతంచేసిన తన బంగారు బిడ్డల త్యాగపూర్ణజీవితాలకి మౌలిక ఆశ్రయస్థానంగా నిలిచేరు.

మా చిన్నాన్న+పిన్నిలు ఒకరికొకరు, సరిసాటైన ౘక్కని ౙంట అని మా కుటుంబాలలో అనుకునేవాళ్ళం. (made for each other couple).

మా నళినీచిన్నాన్నగారు, మాజ్యోతిపిన్నిగారు ఆదర్శపూర్ణ గార్హస్థ్య ధర్మ నిరతితో సంపూర్ణ ఆదర్శవంతమైన ఐదుగురు పిల్లలకి జన్మనిచ్చి వారంతా ఉత్తమ స్థితి-గతులలో స్థిరపడేటట్లు వారి జీవితాలని తీర్చిదిద్దేరు.

పెద్దకొడుకు శ్రీ కిరణ్ సుందర్ , పెద్దకోడలు శ్రీమతి సుగుణల సేవలని స్వీకరిస్తూ మా చిన్నాన్న-పిన్ని ఇద్దరూ ఫలవంతమైన గార్హస్థ్య ధర్మం ౘక్కగా నిర్వర్తించి, పిదప సంతృప్తితో ఆదర్శవంతమైన వానప్రస్థ ఆశ్రమ నిర్వహణ ముగించి చెన్నైలో దివంగతులయ్యేరు. మా చిన్నాన్నగారు 90 సంవత్సరాలు పూర్తికానుండగాను, మా పిన్నిగారు 86 సంవత్సరాలు పూర్తిచేసి, ఇద్దరూ శాస్త్రోక్తమైన సహస్రచంద్రోదయ దర్శనం ఐన తరువాత, సనాతన సంప్రదాయవిధిగా, పెద్దకొడుకు-పెద్దకోడలు సమక్షంలో అక్షయపుణ్యలోకాలకి వెళ్ళిపోయేరు.ఆ ఇద్దరి నిండైన సంపూర్ణ దాంపత్యధర్మనిర్వహణ సనాతన ధర్మ అనుయాయులందరికి ఆరాధనీయమూ, ఆచరణీయమూ, అనుదిన స్మరణీయమూను.

వారి ఐదుగురు బిడ్డలు, చెన్మైలోనే స్థిరపడి ఆదర్శప్రాయమైన అన్యోన్యతతో, భగవదనుగ్రహంతో వారివారి గార్హస్థ్య జీవితాలని, ప్రచేతసులైన వారి తల్లితండ్రులందించిన ఉత్తమ సంస్కారాలని, కుటుంబగౌరవ ప్రకాశాన్ని విడవకండా ౘక్కగా, సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు.

రేపు మకరసంక్రమణం. మహాపర్వదినం. ఈ పుణ్యమయ సమయంలో, ఈ దంపతి ధర్మనిర్వహణనిరతి ఘనతని సంగ్రంహంగానైనా తెలుసుకోగలగడం ఒకానొక మహాభాగ్యఫలం. శ్రీశారదామాత ముద్దుబిడ్డలైన వారిద్దరికి నతమస్తకులమై అంజలి ఘటిద్దాం.

ఈ సంక్షిప్త జీవన రేఖాచిత్రణకి వలసిన వివరాలని కొన్ని శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ — మా పిన్ని-చిన్నాన్నల పెద్దకొడుకు—అందించేడు. మిగిలినవి, మా రజనీచిన్నాన్న గారి “ఆత్మకథా విభావరి“నుంచి తీసుకున్నాను. ఈ ఉభయులకీ నా హార్దిక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.

రేపటి “మకర సంక్రాంతి” పర్వదిన శుభసందర్భంలో మన సత్సంగ సభ్యులందరికీ మా శుభాకాంక్షలు ఇలాగ అందజేస్తున్నాం.

దేవానాం చైవ పితౄణామ్ పూర్ణానుగ్రహ కారణాత్ |

యుష్మాన్ మకరసంక్రాంత్యాః దివ్యవైభవమాప్నుయాత్“||

దేవతలయొక్క, పితృదేవతరయొక్క సంపూర్ణ అనుగ్రహం వలన, మీ మకర సంక్రాంతి పండుగ దివ్యమైన వైభవాన్ని పొందుగాక!“.

స్వస్తి ||

You may also like...

6 Responses

  1. Kiran Sundar Balantrapu says:

    చెమ్మంగిల్లెను నాదు కన్ను లివిగో, చిత్తమ్ము ప్రక్షాళితా
    భ్రమ్మై పర్వెను వాక్కులన్ కడచు దివ్యానందసంభూతమై
    సమ్మానమ్ముగ ప్రేమగా చెపితి వీ సంస్మారకోక్తమ్ము మా
    అమ్మానాన్నల గూర్చి ఇంత యిదిగా, కృష్ణాయ తుభ్యం నమః!

  2. Kiran Sundar Balantrapu says:

    పై నాలుగవపాదంలో నీవే యతివి ! యతిస్థానం నీదే! ఖాళీ లే దక్కడ.

  3. వ.వెం.కృష్ణరావు says:

    శ్రీశ్రీ తమపద్యములో “ర” కి, “ఠ”కి, యతి వేసేరట, ఒకసారి. అదేమిటని అడిగితే, “నేత్రయతి” అన్నారట!
    అలాగే నీది, ఆత్మీయయతి”. దానికి తిరుగులేదు.

  4. సి. యస్ says:

    మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరంచుకుని మహనీయ ఆదర్శ దాంపత్య జీవితం గడిపిన నళినీ చిన్నాన్న జ్యోతి పిన్నిల గురించి
    వెల్లడించిన సంగతులు – ఇక ఈ పండగకి పిండివంటలు అవసరం లేకుండా చేశాయి. ఆ మనుషులు ఇంటినిండా బంధు
    మిత్రుల్లా తిరుగుతున్నట్టే అనిపిస్తోంది.
    అప్పటి సంగతులు వింటూంటే, ఆ మనుషులు ఎంతటి సజ్జనులు, సౌజన్యమూర్తులు, సరళ హృదయులో అనిపిస్తోంది.
    ఆనాటి నీ పరిచయాల్ని, బంధుత్వాలనీ అక్కడితో వదిలేయక వాటిని
    మధురమైన జ్ఞాపకాలుగా మలిచి, పదిలంగా భద్రపరిచి ఈనాడు మా
    అందరికీ పంచుతూ, ఆ సమయంలో ఆ ఇంట్లో మేమూ ఉన్నామా అన్నంతగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవు.
    ఏదో matter of fact లా కాకుండా మనసుకు హత్తుకున్నాయి నీ
    చెప్పిన మాటలు.
    చాలామందికి ప్రముఖ సాహతీవేత్తగానే తెలిసున్న నళినీ చిన్నాన్న గురించీ, ఆయన భార్యగానే తెలిసిన జ్యోతిపిన్ని గురించీ అందరూ
    తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో స్పృశిస్తూ రాసిన ఈ వ్యాసం
    పరమ రమణీయం.

  5. Devi says:

    I have no words to express my happiness and appreciation for this week’s article on Nalini tatagaru and Jyoti ammagaru. Their entire life is so ideal and inspiring that each and every couple should follow them for a successful married life. Your presentation of the article is very natural and we can visualize all events as they are. Our hearty salutations to the best couple of Balantrapu family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *