నివేదన
శ్రీశారదా వాత్సల్య చంద్రికా దర్శనం |
14—01—2018; ఆదిత్యవాసరము. భోగి పండుగ.
“ఇతరములు”.
మకరసంక్రాంతి మహాపర్వ పుణ్యమయ సమయ సందర్భంలో శ్రీమతి బాలాంత్రపు జ్యోతిష్మతి—శ్రీ బాలాంత్రపు నళినీ కాంతరావు మహోదయుల దంపతి దివ్యశోభా వైభవం నేటి “శారదా సంతతి” శీర్షికలో దిఙ్మాత్రంగా పరిచయం చేసుకుని, వారికి సభక్తికంగా మనకి చేతనైన రీతులలో అలతిపలుకుల చిన్ని పూలతో లఘుపూజని సమర్పించుకున్నాం.
ఇప్పుడు వారిద్దరిగురించిన కొన్ని ముచ్చటలని,
మా నళినీచిన్నాన్నగారి “నివేదన—నళిని గీతికలు” పుస్తకం నుంచి ఒకటి-రెండు కవితాంశాలని చెప్పుకుందాం.
ముందుగా, కొన్ని ముచ్చటలు చెప్పుకుందాం! అయితే, వీటివిషయంలో, నేను,” కాలక్రమ నియతి“ని, అంటే, chronological order ని పాటింౘడంలేదు. నాకు జ్ఞాపకంవచ్చిన క్రమంలో, ఈ ముచ్చటలని మీతో పంచుకుంటున్నాను.
l). 1). నళినీచిన్నాన్నకి, జ్యోతిపిన్నికి మా కుటుంబం అంటే ఎప్పుడూ ప్రత్యేక అభిమానంవుండేది. మీదుమిక్కిలి, మా చెల్లాయి “బేబి“అన్నా, నేనన్నా వారిద్దరికి విశేష వాత్సల్యంవుండేది. కాకినాడచుట్టుప్రక్కల ఏ పనివున్నా, వారిద్దరూ వచ్చి మాయింటే విడిదిచేసేవారు. ఆ విధంగా మా చెల్లెలికి, నాకు వారిద్దరినీ సేవించుకునే అవకాశం అనేక సందర్భాలలో కలగడం మా సుకృతఫలం.
వారిద్దరూ కొంతకాలం విశాఖపట్టణంలో, అన్ని ఆధునిక సదుపాయాలతోను, వివిధ సేవలకి ఏలోటు కలగడానికి వీలులేని మనిషిసాయం ఏర్పాట్ల తోను, లాసన్స్ బే కాలనీలో, ఒక rich ambienceలో, “సౌదామిని” అనే అందమైన apartments-complexలోని విశాలమైన ఒక well-ventilated 3-bedroom flatని, నివసించడానికి వీలుగా వారి పెద్దబ్బాయైన చి. కిరణ్ సుందర్ , పెద్దకోడలు చి.సౌ. సుగుణ మిగిలిన కుటుంబ సభ్యులతోడ్పాటుతో ఏర్పాటు చేసేరు. స్థానికంగా వారి మూడవ అమ్మాయి చి.సౌ.లావణ్య, ఆమెభర్తగారు శ్రీ గాదె శ్రీనివాస్ బావగారు(S.B.I.లో ఉన్నతోద్యోగి) ఎదుటి అపార్టుమెంట్లలో నివసిస్తూ శ్రద్ధాసక్తులతో మాచిన్నాన్న-పిన్నిల సంక్షేమాన్ని చూసుకునేవారు.
ఆ రోజులలో, నేను, చెల్లాయి నాలుగైదుసార్లు, విశాఖ వెళ్ళినప్పుడల్లా, “సౌదామిని”కి వెళ్ళి, మా పిన్ని- చిన్నాన్నలతో గడిపి వచ్చేవాళ్ళం. తిరిగి వచ్చేసే ప్రతిసారి, చిన్నాన్న-పిన్ని మా ఇద్దరి పాదాభివందనాలనీ దయతో స్వీకరించి, మమ్మల్నిద్దరినీ, దీవించేవారు. చిన్నాన్న మమ్మల్ని సాగనంపడానికి కళ్ళనీళ్ళ పర్యంతం ఐపోయేవాడు. ఒకసారైతే, మా చెల్లాయి చేతులని తన రెండుచేతులలోకి తీసుకుని, మాచెల్లాయిమొహంలోకిచూస్తూ, “మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ఏడుపు వచ్చేస్తోంది” అని బొటబొటా కన్నీరు కారుతుండగా, మేము త్వరలోనే మళ్ళీ వస్తామన్న మాటతీసుకునిమరీపంపించేడు మమ్మల్ని! అంతటి శైశవ అమాయక ప్రేమమూర్తి, మా చిన్నాన్నగారు! ఒకటి-రెండు సార్లు, వేసవికాలంలో “కొత్తపల్లి కొబ్బరి” మామిడిపండ్లు వారిద్దరికి ౘాలాయిష్టం కావడంవలన, తీసుకువెళ్ళి, ఆ దివ్యదంపతికి సమర్పించుకోగల అదృష్టం మాకు కలిగింది.
2). మరొకసారి, మేము విశాఖ వెళ్ళినప్పుడు, ఒకపూట వారిద్దరితో గడపడానికి, “సౌదామిని”కి వెళ్ళేం. మహాపతివ్రత ఐన మా పిన్ని, నన్ను ఆశ్చర్యచకితుడిని చేసిన ఒక గొప్ప ప్రశ్నవేసింది.
మనకి తెలిసిన పతివ్రతలందరూ సౌమంగల్యంతో, భర్త బ్రతికివుండగానే తనువు చాలించాలని గట్టి పట్టుతోవుండడమే నాకుతెలుసు. అదే పుణ్యం అనే భావనతోవుంటారు. దానినే “పుణ్యస్త్రీ/పునిస్త్రీ గా మరణించడం” అని శాస్త్రాలుకూడా శ్లాఘించడం మనందరికీ సుపరిచితమైన విషయమే!
కాని, పతివ్రతా ఆదర్శానికే మకుటస్వరూపిణి ఐన మాపిన్నిగారు నన్ను అడిగిన ప్రశ్న యిది. “కృష్ణా! నిన్ను యిలాంటి ప్రశ్న అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మిగిలిన గృహిణులు అనుకునేది, నీవంటివాడిని అడిగేది వేరు. అందరూ భర్తచేతిలో కడతేరాలనుకుంటారు. కాని నేను అలాగ అనుకోవడం లేదు. నేనులేని ఆయన జీవితాన్ని ఊహించలేను. మొదటినుంచీ ౘంటిపిల్లవాడికన్న ఎక్కువగా నామీద ఆధారపడిపోయివున్నారు. అందుకని నేను దగ్గరవుండి ఆయనని ౘక్కగా ఏ లోటూరాకండా చూసుకుంటూ, నా చేతులమీదుగానే సాగనంపాలని నా కోరిక. ఈ కోరిక పాపమో, పుణ్యమో నాకు తెలియదు. అది నేనే అనుభవిస్తాను. కాని చివరివరకు ఆయనకి తోడుగావుంటాను. ఆ తరవాత, మరుక్షణంలో అయినాసరే, నేనేమైపోయినా నాకుబాధలేదు. అందుకని మా యిద్దరి చేతులుచూస్తావో, జాతకాలుచూస్తావో నాకు తెలియదు. ఇది మాత్రం దాౘకండా నాకు చెప్పాలి”.
అంతకిముందుకూడా కొన్ని సందర్భాలలో నాచేత ఇలాగ జాతకాలు చూపించుకుని, చెప్పించుకోవడం మా యిద్దరికీ అలవాటే. అందుకని మా పిన్ని చెయ్యి చూసి- ” నీ సంకల్పబలం గొప్పది. దేవుడు, నీవు అనుకున్నట్టే చేస్తాడు. నా దృష్టిలో నీవు ఉత్తమోత్తమ పతివ్రతవి. నీ మాంగల్యంమీద నీకువున్న ప్రీతికన్న, చిన్నాన్నతో చివరివరకూ సహధర్మచర్యం చేస్తూనే, ఆయన సౌకర్యం చూడడం విడిచిపెట్టకూడదనే నీ గంభీర అంకిత భావన పూర్తిగా నిరుపమానమైనదీ,ఉదాత్తమైనదీను!” అంటూ మా పిన్ని పాదాలకి భక్తితో నమస్కరించేను.
3). ఈ సారి వేదిక మదరాసు. నేను మా ఊరైన రామచంద్రపురం వెళ్ళి, మదరాసు తిరిగివచ్చేను. ఆ తరవాత, ఒకరాత్రి, తొందరగా Y.M.I.A.మెస్ లో భోజనంచేసేసి, చిన్నాన్నని, పిన్నిని చూడడానికి “జ్యోతిష్మతి”కి వెళ్లేను.
“మనవాళ్ళందరూ అక్కడ బాగానేవున్నారా, కృష్ణా?” అని పిన్ని అడిగింది.
చిన్నాన్న భోజనంచేస్తున్నాడు. నేను ఆ మాటా- ఈ మాటా చెపుతూ “అంతా బాగానేవున్నారు పిన్నీ! ఐతే అమ్మమ్మ, నల్లూరు అమ్మమ్మ, నరిసిపిన్ని మొదలైన మనవాళ్ళ మడి-తడి-ఆచారాలుమాత్రం తట్టుకోలేకపోతున్నాం. ఒకరి మడి మరొకరికి సరిపడడంలేదు. ఆ విషయంలో మాత్రం ఔను-కాదు అని అనేక వివాదాలు వస్తున్నాయి. ఎవరి ప్రమాణాలు వాళ్ళు ఏకరువు పెడుతున్నారు. ఊళ్ళో వకీలుగా సుమారు 50 సంవత్సరాల న్యాయవాదవృత్తిలో పేరున్న మా తాతయ్యగారుకూడా వాళ్ళ “మడి” వివాదాలని పరిష్కరింౘలేకపోతున్నారు”, అన్నాను నవ్వుతూ! అనగానే, చిన్నాన్న, భోజనం చేస్తూనే సన్నగా నవ్వుతూ,
“అంటే, ‘ఉమ్మడి’ లేదన్నమాట!”
అన్నాడు. అందరం ఆనందంగా నవ్వుకున్నాం. మిగిలిన అన్నివిషయాలలోలాగే చిన్నాన్న హాస్యభాషణలాస్యం కూడా సంక్షిప్తంగానూ, మళ్ళీ-మళ్ళీ తలుచుకుని ఆనందించేవిధంగానూవుండేది. ఎవ్వరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేటట్లు ఉండేదికాదు.
4). ఈ సారి కూడా వేదిక మదరాసే! ఒక సాయంత్రం, చిన్నాన్న, నేను ట్రిప్లికేను బీచికి బయలుదేరేం. పిన్నికూడా ఏవో కబుర్లుచెప్తూ గుమ్మంవరకువచ్చి, మమ్మల్ని వెళ్ళి రమ్మంది. నేను “జ్యోతిష్మతి” అనివున్న ఇంటి పేరు పైకి ౘదివేను. వెంటనే చిన్నాన్న నవ్వుతూ, “మీ పిన్ని పేరు కాదు, కృష్ణా!. సరస్వతీనది పాయ పేరు” అన్నాడు. వెనువెంటనే పిన్ని స్క్రిప్టు సిద్ధంగావున్నదానిలాగ, తడుముకోకుండా,
“మీరేమీ షాజహాను పాదుషా కాదు, నేనేమీ ముంతాజుబేగమూ కాదు. దేని పేరైనా మొత్తానికి మన ఇంటికి మంచి పేరేపెట్టేరు. ఈ ఒక్క మీ సొంత ఆలోచనకి సంతోషం” అంది.
నాకు నవ్వాగలేదు. చిన్నాన్నవైపుచూసేను. సన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తను బీచివైపు దారితీసేడు. నేను పిన్నికేసి admirationతో చూస్తూ, చిన్నాన్నని అనుసరించేను.
5). మరోసారి మదరాసులోనే ఇలాగే ధనుర్మాసం రోజులు. ఆ రాత్రి పిన్ని అద్భుతమైన చేతివంటతిని, పిన్నివెనకే కబుర్లు చెపుతూ తిరుగుతున్నాను. రాత్రి గం.11—30 ఔతోంది. మా చిన్నాన్న నళినీకాంతుడు(సూర్యుడు) కనక ఆ ఇంట్లో సూర్యాస్తమయం ౙాడలు ౘాలా ఆలస్యంగా అగపడేవి. అందరూ ఇంకా ఎవరి పనులలో వారున్నారు.
పిన్ని వంటిల్లంతా శుభ్రంచేసుకుని, తెల్లవారుజామున ధనుర్మాసంపూజకి మడిచీర సిద్ధంచేసుకుని, చేతిలోకి ముగ్గుడొక్కుని తీసుకుని, వీధిలో, గుమ్మంముందు నెలముగ్గుపెట్టడం ప్రారంభించింది. నేను వీధి గడప మీద కూర్చున్నాను. మా పిన్నిగారి అద్భుతమైన పవిత్రదినచర్యదీక్షని చాలాకాలంనుంచి గమనిస్తున్నాను కనక ఉండబట్టలేక అనేసేను.
“ఏమిటి పిన్నీ? అలుపుతెలియని భూమాత భ్రమణంలాగ ఎప్పుడు చూసినా, ఏదో ఒక పనిచేస్తూనేవుంటావు. ఒక్క క్షణంకూడా విశ్రాంతి తీసుకోవు. ఇంత పొద్దుపోయేక, అంత పెద్దముగ్గు మొదలు పెట్టే వెందుకు? ఏదైనా చిన్నముగ్గు పెట్టెయ్యలేకపోయేవా? రాత్రి 12 గంటల సమయం దాటిపోతోంది. పైగా తెల్లవాజామున 4—30 కైనా లేవాలికదా? ఇలాగైతే నీకు కనీసవిశ్రాంతికూడావుండదు”, అన్నాను.
వెంటనే పిన్ని తన అందాలుచిందే స్ఫుటమైన సన్నని ముగ్గుపోతనుంచి దృష్టి మళ్ళించకుండానే, “చూడు, కృష్ణా! ఇవన్నీ చిన్నప్పటినుంచి నాకున్న సరదాలు. నువ్వంటున్న అలసట నాకేమీలేదు. సంవత్సరాల తరబడి ఈ పనులు చేస్తున్నాను. నాకు ఇంతవరకు ఆ పార్థసారథిస్వామి దయవల్ల ఏ అనారోగ్యమూ లేదు. హాయిగా వున్నాను. అందుకని ఇంతకన్న విశ్రాంతికూడా నాకు అక్కరలేదు. నా పనిలోనే నాకు శాంతీ, విశ్రాంతీను. పైనుంచి చూసే నీకు ఇదంతా శ్రమ అనిపించవచ్చు. నాకుమాత్రం శ్రమ ఏమీలేదు. కావాలంటే మీ అమ్మనికూడా అడుగు. తనూ నాలాగే ఇల్లే సర్వం అన్నట్టేవుంటుంది. మా యిద్దరికీ ఇల్లే సర్వస్వమూను! పైగా, మన చుట్టుప్రక్కలవున్న అన్ని గుమ్మాలముందువున్న ముగ్గులకన్న మనగుమ్మంముందుముగ్గు ప్రత్యేకంగావుండాలి” అంది. నేను అవాక్కయ్యేను. మనసులో, “చిన్నాన్నకి తగిన పెర్ఫెక్షనిస్ట్ , అందరినీమించిన ప్రేగ్మేటిస్ట్ “, అనుకుని ఆనందపడ్డాను.
ll). ఇప్పుడు, “నివేదన” లోని, “మాయూరము” అనే ఖండకావ్యం చూద్దాం. ఇది సంగీత-సాహిత్య-నాట్యాల సమ్మేళనాత్మకమైన అపురూప రూపకం(opera). “మయూరాణాం సమూహః—మాయూరమ్ ” అని ఆ పదానికి వ్యుత్పత్తి. అంటే “నెమళ్ళ గుంపు” అని అర్థం. ఆకాశంలో మేఘసందోహం. భూతలంపై మయూరసమూహం. మబ్బులగుంపుని గమనించగానే నెమళ్ళు నాట్యంచేస్తాయని కవిసమయం(poetic convention of the ancient Indian Aesthetics and Poetics).
లలితాశ్రీమాతకి “భక్త చిత్త కేకి ఘనాఘనా” అని లలితాసహస్రనామాలలో ఒక గొప్ప నామం ఉంది. “భక్తుల మనస్సులనే మయూరాలని ఆనందంతో నర్తింపచేసే ఓ నల్లని నీటిమబ్బు” అని ఆ పేరుకి అర్థం. అటువంటి నాట్యమయూర సమూహ వైభవం మా చిన్నాన్నగారి “మాయూరము”లో మనోహరంగా శబ్దబద్ధం చేయబడింది. వృత్తబద్ధం చేయబడింది. కావ్యబద్ధమూ, రసమయ సంగీతరూపక బద్ధమూ చేయబడింది.
ఈ రూపకంలో ప్రత్యేకతవుంది. దీనిలో ఆరు అపూర్వ వృత్తాలున్నాయి. రెండు నృత్తభాగాలున్నాయి. చివర భరతవాక్యముంది. ఆరువృత్తాలలో, ఐదు మయూర భేదాలు; ఒకటి మాత్రం భిన్నమైనదిగావుంది. ఐతే, ఈ ఆరు వృత్తాలకీ ద్వితీయాక్షరప్రాసనియమంవుంది. అది అన్నింటికీ సమాన ధర్మమే! కనక, మిగిలిన విశేషాలు ఆయావృత్తాలగురించిన వివరణలలో పరికిద్దాం! ఒక్కొక్క పద్యమే సంగ్రహంగా సమీక్షిద్దాం!
1) మొదటి పద్యం “మత్త మయూరం” వృత్తంలో వ్రాయబడింది. ఇది నాలుగు పాదాల వృత్తం. ప్రతిపాదానికి 13 అక్షరాల కూర్పు కలిగిన “అతిజగతీచ్ఛందము” జాతికి చెందినది. ఈ వృత్తంలో మ-త-య-స-గ- గణాలుంటాయి. ప్రతిపాదంలోను, 8—వ అక్షరానికి యతి మైత్రిని కూర్చాలి. లక్షణగ్రంథాలలోనేకాక, విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో, కిష్కింధలో ఈ పద్యానికి ప్రయోగంవుంది. కవి, ఛందశ్శాస్త్రవిధిని అనుసరించి ఈ పై నియమాలని పాటించడంతోబాటు, అన్ని పాదాలకి “అంత్యప్రాస”ని ప్రత్యేకంగా అలంకరించి పద్యశోభని పరమ రమణీయం చేసేరు.
ఈ ఒక్క పద్యాన్ని, మూలానుసారంగా ఉదహరించి, కొన్ని సొగసులని రసజ్ఞులముందుంచే ప్రయత్నం చేస్తాను. చిత్తగించండి.
“శ్రీశర్వాణీ నందను శ్రీవాహన మీవే,
శ్రీశౌరి శ్రీమౌళికి శృంగారమ వీవే,
శ్రీ శాహంశాహీ వర సింహాసన మీవే,
శ్రీశుంభత్ జాతీయ విశిష్టద్విజ మీవే ||
“ఓ నెమలీ! పార్వతీదేవి కొడుకైన కుమారస్వామియొక్క అందమైన వాహనం నీవే! శ్రీకృష్ణుని తలపై సుందర అలంకారశోభనిచ్చేదీ నీవే(నీ పింఛమే!). శాహన్ శాహ్ షాజహాను ఆసీనుడైన గొప్ప సింహాసనము నీవే! (the universal glory of the peacock-throne of the Mogul empire is captured here in brilliant enchantment). గొప్పకాంతితో ప్రకాశించే భారతదేశ జాతీయపక్షివి నీవే!”
పై పద్యంలో భారతదేశ సనాతన సంస్కృతి విభవమూ, గతచరిత్ర ఘనతా, వర్తమాన జాతీయభావ స్ఫురణతో కమనీయ కాంతిపూర్ణం చేయబడ్డాయి. మన జాతి మూల లక్షణమైన “భిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం” తత్త్వానికి కవివరులు పెద్దపీట వేసేరు.
పై పద్యంలో నాలుగు పాదాలూ “శ్రీ”కారంతోనే ఆరంభం అయ్యేయి. కాని, నాలుగు “శ్రీ”లకి నాలుగు అర్థాలున్నాయి.
“శర్వ”శబ్దం లయకారక తత్త్వాన్ని ప్రతిపాదిస్తుంది(శౄ -హింసాయాం – ౘంపుట; to kill – అని ధాత్వర్థం). ఆ లయకారక తత్త్వంయొక్క ఆచరణశక్తి విభూతి— శర్వాణి. ఇక్కడ “శ్రీ” మంగళప్రదత్వాన్ని సూచిస్తుంది.
“విషం సుధాయతే యస్మాత్ , మరణం మంగళాయతే|
భూతిః భూషాయతే వందే, తం శివం విశ్వశంకరమ్ “||
“ఎవరివలన విషం అమృతప్రాయం ఔతుందో, మరణం మంగళత్వాన్ని పొందుతుందో, బూడిద అలంకారయోగ్యతకి అర్హమౌతుందో అటువంటి విశ్వమంగళ కారకుడైన శివభగవానునికి నమస్కరిస్తున్నాను”.
అదే శంకరత్వమూ, శాంకరీ తత్త్వమూను! ఆయన సర్వమంగళమయుడు- ఆమె సర్వమంగళ! అంతేకాదు. “శ్రీ” అంటే విషం. విషాన్ని లయింపచేసే తల్లి ఆమె!
“శ్రీకంఠార్థ స్వరూపిణి”!
మహేశ్వరకంఠంలోని విషాన్ని, ఆయన అర్థనారీశ్వరుడైనందున, భువనేశ్వరీదేవి, ఆమె, అర్థాంగి అయినందున, ఏకకంఠంలో, ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. భార్యాభర్తలు దాంపత్యంలో కష్టసుఖాలు పాలుపంచుకోవడం అంటే యిదే! విషాన్ని అయ్య తీసుకుంటే, విషశక్తిని అమ్మ తీసుకుని భువన భవ్యతని సంరక్షించింది. ఎందుకంటే, ఆమె “భవానీ” కనుక!
మరొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించబడుతోంది.
“శ్రుతిః మాతా లయః పితా” అని సంగీతశాస్త్రం. సంగీతంలో శ్రుతి తల్లి. లయ తండ్రి. అంటే సంగీతం శ్రుతిలోపుట్టి లయలో లీనమైపోతుంది. శ్రీ అంటే లక్ష్మి. స్థితికారుడైన శ్రీమహావిష్ణువుయొక్క భార్య కనుక ఆమె స్థితి శక్తి. శ్రుతి స్వరూపం.
“శ్రీ” అంటే పార్వతీదేవి. శర్వుడు అంటే శివుడు. శర్వుడి అర్థాంగి కనుక పార్వతీదేవి శర్వాణి అయ్యింది(శివుడు—శివాని, రుద్రుడు—రుద్రాణి లాగే శర్వుడు—శర్వాణి). అందువలన ఆమె లయశక్తి. ఆ శ్రుతిని తనలో లీనంచేసుకుంటుంది. లక్ష్శీ-గౌరిల సమ్యక్ సంగమరూపమే సంగీతం.
రెండవ “శ్రీ” కి, లక్ష్మి అని అర్థం. ఇక్కడ శౌరి అంటే శ్రీహరిరూపుడైన శ్రీకృష్ణుడు.
మూడవ “శ్రీ”, కేవల గౌరవ వాచకపదం.
నాలుగవ “శ్రీ”, సర్వసంపత్ ప్రదాయక శబ్దం.
2) రెండవ పద్యం, “బంభర గాన” వృత్తంలో రచింౘబడింది. దీనికికూడా 13 అక్షరాలు కలిగిన 4 పాదాలుంటాయి. అందువలన ఇదికూడా “అతిజగతీచ్ఛందస్సు“కి చెందినది. న-న-భ-భ-గ, గణాలుంటాయి. 8—వ అక్షరం యతి. దీనికికూడా అంత్యప్రాసల అదనపు అలంకారాలున్నాయి.
మిగిలిన ఐదువృత్తాలు మయూరశబ్దప్రయోగ సారూప్యం కలిగివున్నాయి. ఇది ఒక్కటీమాత్రం “బంభర గానం”. అంటే ‘తేటి పాట‘. ‘తేనేటి పాట’.తుమ్యెదచేసే శ్రావ్య ఝంకారధ్వని.
నెమలి నృత్యానికి మబ్బుల ఉరుముల తాళవాద్యంవుంది. తుమ్మెదల ఝంకారగానం, అంటే, “బంభర గానం”, నట్టువాంగం, పదవర్ణం, పదం మొదలైనవి పాడడానికి “బంభర గానం” ప్రకృతిమాతచేత ఏర్పాటుచెయ్యబడింది అన్నమాట! అంటే తాళ-వాద్య, గానసమేతమైన మయూరనృత్యం ఇక్కడ ఈ కావ్యాదర్శంలో మనందరికీ మనోరమ దర్శనీయ కళాస్వరూపవైభవం!
“గీతం, వాద్యం, తథా నృత్యం, త్రయం సంగీతసంజ్ఞకమ్ “|| గీత, వాద్య, నృత్యాలు మూడూకలిపి “సంగీతం” అని పిలవబడుతోంది, అని శాస్త్రవాక్యం. దీనినే సాంకేతికంగా “తౌర్యత్రికం” అంటారు. దేవాలయాలలో తౌర్యత్రిక వినియోగం ఆగమోక్తవిధిగా నేటికీ నిర్వహించబడుతూ వస్తూన్న మన ప్రాచీనదేవాలయ సంస్కృతిలోని చారిత్రకసత్యం.
విశ్వమే దేవాలయంగా కవిగారి “మాయూరము” విశ్వనాథుని, ఈ తౌర్యత్రికసేవతో అర్చించుకోవడమే ఇందలి అంతరార్థం.
“ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయం |
ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ “||
అన్న “అభినయదర్పణ”కారుని దివ్య నాట్య దర్శన విభూతి గ్రహించినవారికి, కవివర్యుల ఈ కావ్యఖండిక లోని అంతరార్థం బోధపడుతుంది.
3) మూడవ పద్యం, 14 అక్షరాలు పాదానికిగల “శక్వరీ” చ్ఛందోజాతికి చెందిన, “వనమయూరం”, వృత్తం. భ-జ-స-న-గగ గణాల కూర్పు కలిగినది. 9—వ అక్షరం యతి. అంత్యప్రాసాలంకరణ కవివర్యుని ప్రత్యేక ప్రతిభ.
“కవిత్రయ భారతం”, ఆదిపర్వం—పంచమాశ్వాసంలో, 261వ పద్యం, అంటే ఆశ్వాసాంత పద్యంగా, నన్నయ్య గారు, రాజరాజనరేంద్రుడి గుణగణాలని శ్లాఘిస్తూ ఈ “వనమయూరం” వృత్తంలో రచించబడినది, మనకి పూర్వకవి ప్రయోగంగా లభిస్తోంది. ఆ ఆశ్వాసానికి ఇది చివరి పద్యం. దీనితరవాత ఆశ్వాసాంత గద్యమే!
4) నాల్గవ పద్యం, “మయూరసారి(ణీ)“వృత్తం. “పంక్తిచ్ఛందస్సు” జాతికిచెందినది. పాదానికి 10—అక్షరాల కూర్పు. ర-జ-ర-గ, గణాలుంటాయి. 7—వ అక్షరం యతి. అంత్యప్రాసతో పద్యం అందగించింది.
5) ఐదవ పద్యం, “వికృతిచ్ఛందస్సు” జాతికి చెందిన, ప్రతిపాదానికి 23 అక్షరాలు కలిగిన “మయూరగతి” వృత్తం. భ-భ-భ-భ-భ-భ-భ-గగ, గణాలతో, అంటే, 7 “భ” గణాలు+ 2 గురువుల కూర్పు. 7—13—19 అక్షరాలకి యతిని పాటింౘాలి.
(సంస్కృతంలో దీనికి 4—గణాలతరువాత, 12—11 అక్షరాలమధ్య యతి ఉంటుంది. సంస్కృతంలో యతి అంటే కేవలం విరామమే! సంస్కృతంలో దీనిని “మదిరా”వృత్తం అనికూడా పిలుస్తారు.
తెలుగుభాషలోని వృత్తాలలో స్వర-వ్యంజన ప్రయోగానురూపమైన మైత్రిని కూర్చడం, ‘యతి’గా పాటించబడుతోంది. అందువలన, తెలుగులో పద్యంవ్రాయడం ౘాలా కష్టం అని చెప్పాలి. అందునాపాదంలో మూడు యతిస్థానాలంటే మరీ కష్టం. కాని కవివరుల సామర్ధ్యం, ప్రజ్ఞ అనన్యసామాన్యమైనవి. యతిమైత్రి అలవోకగా కూర్చబడింది).
6) ఆరవ పద్యం, “అత్యష్టిచ్ఛందస్సు” జాతికి చెందిన, పాదానికి 17 అక్షరాలుగల “ఘనమయూరం” వృత్తం. ద్వితీయాక్షర ప్రాసనియమంతోబాటు, చతుర్థాక్షర ప్రాస అదనపు ఆభరణంగా భాసిస్తోంది. న-న-భ-స-మ-లగ, గణాలుంటాయి. 7—13 అక్షరాలకి యతి మైత్రిని కూర్చాలి. అంత్యప్రాసల సొబగులు అనుభవైక వేద్యాలు.
1, 3 పద్యాలకితప్ప మిగిలినవాటికి రంగరాట్ఛందము, అనంతుని ఛందస్సు వంటి లాక్షణిక గ్రంథగత ఉదాహరణలే కాని, మరొకచోట అంటే కావ్య-ప్రబంధాదులలో నాకు ప్రయోగాలు కానరాలేదు.
అన్నింటినీమించి, యిందులోని భావుకత, రమ్యశైలి కవిత్వధర్మంలో లీనమై, రసరమణీయమై హృద్యంగావుంటాయి. కవివర్యుల పదప్రయోగ శైలి (style of diction and poetic syntax in the verses and lyrics intended for performing a dance-ballet) అనుపమలాలిత్యంతో, అన్వయసౌలభ్యంతో అలరారుతూ ఉంటాయి. ఈ సందర్భంలో, Mathew Arnold, John Milton గురించి అన్న మాటలు గుర్తొస్తున్నాయి.
“In the sure and flawless perfection of his rhythm and diction, he is as admirable as Vergil or Dante”.
ఇందులో సంగీతశాస్త్ర సంబంధమైన షడ్జ జననం గురించిన ప్రస్తావనవుంది.
అంతేకాదు. ఈ “మాయూరము” ఖండకావ్యాన్ని, సంగీత-వాద్య-గాన-నాట్యాభినయాదుల మేళవింపుతో అధ్యయనం చేయగలిగితే కవివర్యుల ప్రతిభ బాగా ఆవిష్కృతమౌతుంది.
ఈ ఖండకావ్యంలో ఒక ఎం.ఫిల్ . అధ్యయనపత్రం (thesis) సిద్ధం చేయజాలినంతటి గ్రంథంవుంది.
7) My uncle, Sri B.Nalinikantarao garu is an ideal epitome of perfectionism while my aunt Smt. Jyotishmati garu is an eloquent embodiment of propriety. But both of them are the two-sides of the same coin of conducting household-life in an inspiring manner as envisioned by the perennial Vedic wisdom of our ancient sages.
8) శ్రామికుల అంతర్జాతీయ గీతాన్ని(communist internationale), తెలుగు భాషలోకి మొట్టమొదట అనువదించిన ఘనత శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావుగారికే చెందుతుందని, శ్రీ ఆరుద్రగారు, తమ “సమగ్ర ఆంధ్ర సాహిత్యం”లో ప్రముఖంగా పేర్కొన్నారు. శ్రీ ఆరుద్రగారు తమ “వ్యాసపీఠం”లో కూడా, ఈ విషయాన్ని ప్రకటించేరు. ఈ వివరాలనన్నీ “విశాలాంధ్ర”వారు, తమ పత్రికలో వివరంగా ప్రచురించేరు.
“ఆకలి మంటల మలమల మాడే
అనాథలందరు లేవండోయ్ “!
అనే పల్లవిలో, ఈ “అంతర్జాతీయ సామ్యవాద గీతం”, ఉత్తేజ ఔజ్జ్వల్యంతో ఆరంభం ఔతుంది.
9) నళిని+రజనిల అన్యోన్యత, “నివేదన”లో సంగ్రహంగాను, రజని రచించిన “ఆత్మకథా విభావరి” లోని “మా అన్నయ్య “నళిని”—మహాప్రస్థానంలో విపులంగాను ఉన్నాయి. “నివేదన”లో
“భావ నీల మేఘానికి పాట మెరుపు నేనే!
రావపు పెను వాడి వేడి రవులు ఉరుము తానే!”
అని నళినీచిన్నాన్న అన్నాడు.
“నా చిన్నతనంలో నేను మొదలుపెట్టిన చాలా వ్యాసంగాలకి మా అన్నయ్యే మార్గదర్శకుడు.” అని తన “రజనీ—ఆత్మకథా విభావరి”లో, 119వ భాగంలో రజనీచిన్నాన్న వ్రాసేడు.
ఇలాగ ఎంత వ్రాసినా, ఎన్నివ్రాసినా తరగవు. ఎక్కడో ఒకచోట నేను ఆగాలి. అందుకని ఇక్కడ విరామం పెడతాను.
10) నా జీవితంలో నేను దర్శించిన మహాప్రజ్ఞావంతులలోను, సంస్కృతాంధ్రాంగ్ల సారస్వత కోవిదులలోను మా నళినీచిన్నాన్నగారు మొదటికోవకి చెందిన శ్రీశారదాతనయులు.
వారు నివురుగప్పిన నిప్పు. ఇటువంటివారి అద్భుత జీవన యాన గమన ప్రౌఢతని గమనించి, అధ్యయనం చేయగలిగినవారికి, అపురూపమైన ఈ దిగువ శ్లోకంయొక్క భావం బోధపడుతుంది.
“శకునీనాం ఇవాకాశే జలే వారిచరస్య చ |
పథం యథా న దృశ్యేత తథా జ్ఞానవతాం గతిః” ||
“ఆకాశంలో పక్షుల గమనం లాగ, నీటిలో జలచర గతి లాగ, జ్ఞానుల రాక-పోకల ౙాడలు అదృశ్యమైనవి”.
అంటే ఇటువంటి అరుదైన పరమపావనమయ జీవినవిహంగాలు ఇహలోకసంబంధమైన పేరు-ప్రఖ్యాతుల పరిమిత పంజరాలలో బంధింపబడడం అసాధ్యం. అది దైవనిర్ణయం.
స్వస్తి ||
గళమెత్తి సన్నుతింతును
నళినీకాంతాఖ్య ఘనుని, నాన్నన్ స్మరణా
వళితో ఆరతు లిడి, ఆ
ఫళముగ పడి మోకరిల్లి బాలాంత్రపు రే!
ఆ”మాయూరము” లో ఇన్ని classical రహస్యాలున్నాయని నాకు తెలీనే తెలీదు. Thanks కృష్ణా, చాలా అద్భుతంగా వ్రాసిపెట్టావు.
నళినీ చిన్నాన్న, జ్యోతి పిన్నిలతో నీకున్న అనుబంధాన్ని, వారితో నీ
‘ అనుభవాలూ- జ్ఞాపకాల’ని అందరికీ అందంగా పంచావు.
కొత్తపల్లి కొబ్బరి మామిడిపండ్ల రుచి ఆస్వాదించ గలిగినవారు కనకనే
వారి కవిత్వంలో ఆ మాధుర్యం అనుకుంటా.
ఇక జ్యోతి పిన్ని నీతో జరిపిన చర్చ చూశాకా భారతీయ దాంపత్య
బంధంలో స్త్రీమూర్తుల ఉదాత్తత, భర్త బాగోగుల గురించి నిరంతరం
వాళ్లు పడే ఆరాటం ఏమిటో తెలుస్తుంది.
శ్రీరమణ మిథునంలో సృష్టించిన స్త్రీ పాత్రకి ఇలాంటి వారే ప్రేరణ
అనుకుంటాను.
ఇక నళినీ చిన్నాన్న హాస్య చతురతతో పాటు వారిద్దరి సరదా సంభాషణలు కూడా చక్కగా ముచ్చటించడంతో పాటు, ఆయన
“మాయూరము” ఖండకావ్య వైశిష్ట్యాన్ని వివరించిన తీరు అమోఘం.
Me too agree with your aunty in all the ways.thank you for sharing your sweet memories with us