సాహిత్యము-సౌహిత్యము – 36 : తల్లికి ముక్కు కోసి, పినతల్లికి కమ్మలొసంగ నేర్తురే
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః |
13—01—2018; శనివారము.
“సాహిత్యము—సౌహిత్యము~36.”
16—09—2017; శనివారం, మన ఈ శీర్షిక ఐన “సాహిత్యము—సౌహిత్యము~19″లో శ్రీ కోడూరి సాంబశివరావుగారి గొప్ప సమస్యాపూరణం పరికించేం!
ఆ నాటి సమస్య:— “కరములు ఐదు పుత్రునకు, కన్నులు మూడును వాని తండ్రికిన్ “||
గణపతికి, శంకరభగవానునికి అన్వయించి, అనన్యసామాన్య ఆరధనాభావపూర్ణ విలసితమైన ఆ సమస్య మన మనస్సులని మంత్రముగ్ధం చేసింది. అది మనం మరవలేం!
ఈ నాటి సమస్య, దాని పూరణ వైభవం పరిశీలిద్దాం!
“తల్లికి ముక్కు కోసి, పినతల్లికి కమ్మలొసంగ నేర్తురే?”||
“ఎవరైనా తన సొంత తల్లి ముక్కుని కోసివేసి, పింతల్లికి ఆభరణాలుగా కమ్మలు యిస్తారా?” అని ఈ సమస్యలోని భావం.
ఈ సమస్యని కవిగారు మన మాతృభాషని, తెలుగుని, ఉపేక్షించి, పరభాషావ్యామోహంతో ఆంగ్లభాషని పిల్లలకి నేర్పించడానికి తహతహలాడే తలిదండ్రుల గర్హనీయస్థితిని తెలియజేస్తూ పూరించడం మనందరికి హర్షణీయమూ, ఆదరణీయమూ, పద్యగత సందేశం ఆచరణీయమూను. ఇది ఈ నాటి మనందరి మనస్సులని, దహించివేస్తున్న తీవ్రసమస్య. మాతృభాషాప్రేమికులమైన మనలనందరినీ నిత్యమూ కలవరపెడుతున్న సమస్య. ఎందుకంటే, ఐక్యరాజ్య సమితియొక్క అంతర్జాతీయ భాషల వర్తమాన, భవిష్య స్థితి-గతుల అధ్యయనం ప్రకారం, రాబోయే 150 సంవత్సరాలలో ప్రాంతీయంగావున్న వాడుక భాషల జాబితానుంచి అంతరించిపోబోయే భాషలలో మన మహనీయమైన తెలుగుభాష ఒకటిగా నిలవడం తెలుగుజాతి దురదృష్టం! అత్యద్భుత సారస్వత చరిత్రని కలిగిన మహావైభవమయ ఆంధ్రభాషకి ఇటువంటి దయనీయ దుర్గతి పట్టబోవడానికి కారణమైన విషబీజాలని మనమే నాటి, పెంచి, పోషిస్తున్నాం! ఇటువంటి ఈ క్లిష్టపరిస్థితిలో ఈ సమస్యాపూరణం చెప్పనలవికాని ప్రాముఖ్యతని కలిగివుంది.
ఇప్పుడు సమస్యాపూరణం చూద్దాము.
“పల్లెల, పట్టణాల చిరుపాపల బాబుల, తెల్లవారగన్
తల్లులె ఆంగ్లమాధ్యమము తప్పదు వారికటంచు, ఆంధ్రయం
దెల్లెడ బళ్ళకంపెదరదేలనొ, కమ్మని తెల్గు గిట్టకన్
తల్లికి ముక్కు కోసి పినతల్లికి కమ్మలొసంగ నేర్తురే?“||
పద్యభావం తేటతెల్లంగానేవుంది. :— “మన తెలుగునేలలో ఈ కాలంలో తల్లులందరూ తమ-తమ ఆడ,మగ బిడ్డలని ఇంగ్లిష్ మీడియం తప్పదంటూ, తెల్లవారేసరికి, పల్లెలలోను, పట్టణాలలోను అటువంటి బడులకి పంపేస్తున్నారు. కమనీయమైన మన మాతృభాషరుచి వారికి తెలియదా? వారందరూ ఎందుకిలా చేస్తున్నారు? ఇది చూస్తే “సొంత తల్లి ముక్కుని కోసి, పినతల్లికి ముక్కెర, కమ్మలు బహూకరించడంవంటి ఘోర అనౌచిత్యం కాదా? ఇలాగ లోకంలో ఎవరైనా చేస్తారా?” అని కవివర్యులు తమ గుండెలోని కలతని మనతో పంచుకుంటున్నారు.
సమయం మించిపోకుండానే మనం అందరమూ బాధ్యతాయుతంగాను, సమష్టిగాను ఆలోచించి ఒక స్పష్ట కార్యాచరణ ప్రణాళికని, ఉద్యమస్ఫూర్తితో రూపొందించుకోవాలి.
స్వస్తి ||
ఈ సారి సమస్యాపూరణంలో అతి ముఖ్యమైన సమకాలీన సమస్యని
ఎత్తుకోవడం జరిగింది.
నిజమే….ఇది భాషా ప్రేమికులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్న
సమస్య.
భాష అంతరించిపోతే సంస్కృతీ సంప్రదాయాలు కూడా మంటగలిసి
పోతాయి. ప్రభుత్వాలు ఈ విషయం మీద నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి.
అవధాని గారు సమస్యాపూరణంలో కనపరచిన ప్రతిభ మాట ఎలావున్నా
వారు తీసుకున్న అంశం మీద అందరూ దృష్టి సారించాల్సినటు వంటిది.
ప్రపంచ భాషలలో అందమైన లిపి కలిగినదిగా రెండవ స్థానం పొందిన
మన తెలుగు భాష…
మాట్లాడుతుంటే చెవికి ఎంతో ఇంపుగా ఉంటుందని చెప్పబడే మన
తెలుగు భాష…ఇప్పుడు ఆంగ్లంతో సంకరమై తన ఉనికిని కోల్పోతోంది.
దాని పరిరక్షణకు ఇలా సాహిత్యం ద్వారా మేలుకొలుపడం ఒక ఉత్తమమైన మార్గం. సందర్భానికి తగిన పద్యం అందించినందుకు ధన్యవాదాలు.
‘అమ్మకి అన్నం పెట్టడు కానీ….పిన్నమ్మకి కోక పెడతాడట’ అనేది తెలుగునాట ప్రసిద్ధిగాంచిన సామెత.
ఇంటింటా ప్రచారం చేయాలి.మన భాష యొక్క గతి తల్చుకొంటే చాలా దిగులుగా వుంటుంది.ఈ పద్యం పోస్టర్లు వేసి పంచాలి