శారదా సంతతి — 26 : నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ
శ్రీశారదా వాత్సల్య నర్మదా :—
07—01—2018; ఆదిత్యవాసరము.
శారదా సంతతి—26. నాదప్రణవోపాసనా ధురంధరుడు— పండిత్ ఓంకారనాథ ఠాకుర్జీ.
“పండిత్ ఓంకారనాథఠాకుర్జీ ఒక్క పాటద్వారా సాధించగలిగినదానిని, నేను అనేక ఉపన్యాసాలద్వారాకూడా సాధించలేను“- అని గాంధీజీ అన్నారట! అంటే ఠాకుర్జీ గానమహిమయొక్క ఔన్నత్యం అంతటిది! ఒక్కసారి వారి గానాన్ని విన్నవారు ఆయన గానంలోని వైశిష్ట్యాన్ని, వెంటనే గ్రహించగలగడమేగాక, ఆయన పాటని మళ్ళీ, మళ్ళీ వినాలని ఉవ్విళ్ళూరుతారు. అంతేకాదు. ఆయన గళనాదాన్నీ, గానపద్ధతిని ౘాలా సులువుగా గుర్తుపడతారు. ఆయన సంగీతం ఒక వినూత్న, విశిష్ట ముద్ర! వారు సంగీత ప్రపంచంలో ప్రాచ్య పశ్చిమ సంగీత రీతులకి సేతుస్వరూపుడు. పాశ్చాత్య సంగీతాంశాలలోవున్న ఒకటి-రెండు అంశాలని తన గానంలో పొందుపరిచి ఆయన ప్రయోగించేరు.
పూణే/ముంబై,”రిథం హౌస్ “వారు,”టైటాన్స్ ఆఫ్ మ్యూజిక్ ” శీర్షికలో విడుదలచేసిన మూడు కేసెట్ల ప్రత్యక్షసంగీతసభలో, ఠాకుర్జీ పాడిన, ఛాయా నాట్ రాగం(విలంబిత, ద్రుత ఖయాలులలో, సుమారు 48 నిమిషాల గానం), ఆయన సంగీతవైభవానికి ఒక మహాప్రతిభావంతమైన ప్రబల నిదర్శనం! అలాగే సుమారు 35 నిమిషాల బేహాగ్ రాగం, సుమారు 43 నిమిషాల దర్బారీ కానడా, “జోగీ! మత్ జా” భైరవి రాగంలో అద్భుతమైన భజన్ (20 నిమిషాల పైన); హుసేని కానడ రాగంలో కబీర్ దాస్ భజన్ ; వున్నాయి. మరొక లైవ్ కచేరీలో భీంపలాస్ రాగం, జయజయవంతి రాగం, మొదలైనవి వున్నాయి; అలాగే HMV వారి కేసెట్లలో, దేశీతోడి రాగం, దేవగిరి బిలావల్ , ముల్తానీ, బెంగాలీకాఫీ, తోడి, దేశ్‌కార్ , సుఘరాయి, తంకేశ్రీ, తిలంగ్ , నీలాంబరి, చంపక్ , శుధ్ధకల్యాణ్ , శుద్ధనాట్ మొదలైన రాగాలు నా సంగ్రహాలయంలోవున్నాయి, ఇవి కాక, AIR వారి మాల్కౌcస్ , మరికొన్నిభజనలు నేను స్వయంగా రేడియోప్రసారాలనుంచి రికార్డ్ చేసుకున్నవివున్నాయి. ఇందులో ప్రతిగానమూ అమూల్యమైన ఆణిముత్యమే! అజరామరమైన అనుపమసేకరణే! రసజ్ఞలోక హర్షప్రదమూ, హృదయంగమమూను!
శ్రీ ఓంకారనాథఠాకుర్జీ, 1897, జూన్ , 24న, గుజరాతులోని జహాజ్ గ్రామంలో పుట్టేరు. వారి తండ్రి, గౌరీశంకర్ ఠాకుర్ . వారి తల్లి, ఝవేర్బా. తల్లి,తండ్రులకి ఓంకార్జీ నాలుగవ సంతానం. ఓంకార్జీకి, బాలకృష్ణ, రవిశంకర్ అనే ఇద్దరు అన్నలు, పార్వతి అనే ఒక అక్క వున్నారు. వారి తాత-తండ్రులు రాజసంస్థానాలలో గొప్ప పేరుపొందిన యుద్ధవీరులు. అందువల్ల ఒకసమయంలో మంచి స్థితి-గతులున్న వారే! ఐతే కాలక్రమేణ ఆర్థికంగా చితికిపోయేరు. తండ్రిగారు మొదటినుంచి గొప్ప దైవభక్తితత్పరత, యోగసాధన, ఆధ్యాత్మికాన్వేషణ కలిగినవారు. ఆయన, అలోనిబాబా అనే గురువుదగ్గర “ప్రణవోపాసనా దీక్ష” ని తీసుకుని, నర్మదానదీతీరంలో, ఒక పర్ణకుటీరంలోవుంటూ, అధ్యాత్మ విద్యాసాధన చేసుకునేవారు. ఆ కారణంగానే, ప్రణవం అంటే ఓంకారమని అర్థంకనుక, ఆ సమయంలో పుట్టిన తన చివరి కొడుకుకి “ఓంకార్ నాథ్ ” అని పేరుపెట్టేరు.
శ్రీ గౌరీశంకర్జీ అన్నగారు, ఝవేర్బా నగలని, జరీచీరలని, తనవద్దపెట్టేసుకుని, మరదల్ని, ఆమె నలుగురు బిడ్డలని, వీధిపాలుచేసేరు. ఝవేర్బా ధైర్యమూ, దక్షతా, దేహ దార్ఢ్యమూ, సమయస్ఫూర్తి కలిగిన గృహిణి కావడంవల్ల, పంటపొలాలలోను, గృహస్థుల ఇళ్ళలోను పని చేస్తూ బిడ్డలని పెంచి, పోషించుకునేది. బాల ఓంకారనాథుడు కూడా తన శక్తియుక్తులకి అనువైన పనులని చేస్తూ, తన తల్లికి చేదోడు-వాదోడుగావుండేవాడు. ఇటు ఇంటివద్ద, తల్లిగారికి, అటు ఆశ్రమంలోవున్న తండ్రిగారికి అవసరమైనసేవలన్నీ నిత్యమూ చేస్తూనే, రకరకాల రోజువారీ పనులు బయటచేసి, తను సంపాదించిన ఆదాయం, అంతో-ఇంతో, అమ్శచేతిలోపెట్టేవాడు- బాల ఓంకారనాథుడు! అందువల్ల, చిన్నతనంనుంచి అన్నిరకాలపనులు చెయ్యడమూ, దేహశ్రమ విషయంలో వెనుకంజ వేయకపోవడమూ ఓంకార్జీకి అలవాటై పోయింది. నిత్యమూ తండ్రిగారివద్ద యోగాభ్యాసమూ, ఓంకారనాదోపాసనా శ్రద్ధగానేర్చుకుని జీవితాంతమూ వదలకుండా సాధనచేసేరు. అంతేకాక, ఆరోజులలో సుప్రసిద్ధ మల్లవిద్యానిపుణుడైన “గామా“గారివద్ద, కుస్తీపట్లు నేర్చుకుని ఒంట్లో ఓపికవున్నంతకాలమూ మల్లవిద్యని కొనసాగించేరు. చిన్నతనంనించీ సంగీతం పాడడమంటే, వల్లమాలిన మక్కువ వుండేది. అంతో-ఇంతో సంగీతంవచ్చినవారినుంచి, పాడడం నేర్చుకోవడానికి ఎంతప్రయత్నించినా, సాధ్యంకాలేదు. వారి తండ్రి, తన ప్రియపుత్రుడి శక్తియుక్తులు, సంగీతవిద్యా కుతూహలమూ తెలిసినవారు. ఒకసారి ఓంకార్జీ నోరు తెరిపించి, తమలపాకుని నిలువుగాచుట్టి, దాని కొనతో, ఓంకార్జీ నాలుకపై మంత్రపూతమైన బీజాక్షరసంపుటిని వ్రాసి, తన కుమారుడిని లోకోత్తర విద్వత్కళాకారుడు ఔతాడని దీవించేరు
జన్మతః వారికి సంగీతం పాడడం అంటే వల్లమాలిన ప్రేమవుండేది. అది ఒక obsession అని, లేక భరించలేని ఒక మహా”పిచ్చి” అని వాడుక భాషలో చెప్పాలి. దమ్మిడీ చేతలేనివాడికి సంగీతం ఎవరు నేర్పుతారు? అలాంటి స్థితిలో, దగ్గర ఊరిలోకి బాగా పాటలు పాడే ఒక సాధుమహాత్ముడు వచ్చేడని బాల ఓంకార్ విన్నాడు. కాని, ఆయనవున్న ఊరు, నర్మదానదికి అవతలి ఒడ్డునవుంది. ఐతే ఓంకార్ అప్పటికే ఈతలో ఆరితేరినవాడు. ఆ పైన, భయం లేనివాడు. తన సంగీతవిద్యానురక్తియొక్క గాఢ ప్రభావంవలన, నర్మదానదిని, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈది ఆ గ్రామం చేరుకుని, ఆ సాధువుని తనకి సంగీతం నేర్పవలసినదిగా ప్రాధేయపడ్డాడు. కాని ఆయన అంగీకరించలేదు. తడిబట్టలతోను, చెమ్మగిల్లిన కళ్ళతోను, దీనమైన మనస్సుతోను, ఓంకార్జీ ఇల్లుచేరుకున్నాడు. పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్జీ వంటి విశ్వవిఖ్యాత, గ్వాలియర్ ఘరానా గాయకమహర్షి, ఓంకార్జీకి గురుస్థానీయుడుగా ఉండదగిన వాడు అని శారదామాత సంకల్పమైవుండగా, అల్పగాయకులు, ఆయనకి ఆచార్యులుగా ఎలాగ కాగలరు?
సంగీతంపట్ల ఆయనకివున్న అపార ఆసక్తి, తండ్రిగారి ఆశీర్వచనము, జన్మాంతర సుకృతము అన్నీ కలిసి శారదామాత పరమానుగ్రహమై, వారి ఊరిలోనేవున్నసేఠ్ షాపూర్జీ మంఛేర్జీ దూంగాజీ అనే పేరు కలిగిన ఒక పార్సీ ధనవంతుడు, మహాదాత ఐన మానవోత్తముని మనస్సులో ప్రవేశించింది. ఆయన, ఓంకార్జీకి 13 ఏళ్ళ వయస్సుండగా, అతడిని, పండిత్ విష్ణుదిగంబర్ పలూస్కర్ గారి నిర్వహణలోవున్న, బొంబాయిలోని, సుప్రసిద్ధ గ్వాలియర్ ఘరానా సంప్రదాయానికి చెందిన, “గాంధర్వ మహావిద్యాలయ“లో చేర్పించి, శాస్త్రీయ సంగీత విద్యని నేర్పించేరు. ఓంకార్‌నాథ్ కి, తలిదండ్రులసేవ చిన్నతనంనుంచి అలవాటేకనక గురుశుశ్రూషని ఎంతో ప్రీతిభావంతో చేసేరు. ఆరు సంవత్సరాల గురుశుశ్రూషలో ఓంకార్జీ పరిణత శాస్త్రీయ సంగీతగాయకుడిగా అవతరించేడు. అప్పటికి అతడికి 19 సంవత్సరాలు పూర్తి అయ్యి, 20వ సంవత్సరం ప్రవేశించింది. అతడి విద్యా వైదుష్యానికి, శాస్త్రీయగాననైపుణ్యానికి పూర్తిగా సంతోషించిన పలూస్కర్జీ, 1916లో, లాహోరులోవున్న “గాంధర్వ మహావిద్యాలయ” శాఖకి, సంస్థాసారథ్యనైపుణ్యం కలిగిన, ఓంకార్జీని ప్రిన్సిపాలుగా నియమించేరు. ఆ బాధ్యతని వారు, పరిపూర్ణ అంకితభావంతో నిర్వహించి, వారి సంస్థకి ౘక్కని ప్రసిద్ధిని కలిగించేరు.
1918లో వారు మహారాజా శాయాజీరావు గైక్వాడ్ గారి బరోడా సంస్థానానికి, పరీక్షాధికారిగా వెళ్ళేరు. అక్కడ, ఆయనరాజుగారిని, దివాను మొనుభాయ్ ని, తన సంగీతవిద్యా కౌశలంతోను, ఆజానుబాహువైన తన స్ఫురరద్రూపంతోను, పూర్తిగా ఆకట్టుకున్నారు.
ఆ సంవత్సరంలోనే, జాలంథరనగరం(పంజాబు)లోని, సుప్రసిద్ధ “హరవల్లభ సంగీత సభ” లో పాల్గొన్నారు. ఆ రోజులలో, ఉత్తరభారత సంగీతగానంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న పండిత్ భాస్కరబువా బాఖ్లే గారు పాడినరోజునే, ఓంకార్జీకూడా పాడేరు. ఐతే, అప్పటికే “తారాపథం“(stardom)లో ప్రథమశ్రేణిలో వెలుగులు వెదజల్లుతున్న భాస్కరబువాజీతో, యించుమించు సమాన ప్రజాదరణని పొందగలగడం, ఓంకార్జీ సంగీతకళా వైదుష్యానికి సప్రమాణ సంకేతం అని చెప్పాలి. ఇదంతా యిలా జరగడానికి దైవదత్తమైన అనూహ్యప్రతిభ ఒకవైపు, తల్లిద్వారా సంక్రమించిన అసమానస్థైర్య,ధైర్యాలు, తండ్రి నుంచి లభించిన అనుపమాన అధ్యాత్మశక్తి, గురుకృపా ప్రసాదిత నిరంతర నాదోపాసనాతపోనిష్ఠ, మొదలైనవాటి ఫలస్వరూప వ్యుత్పత్తి రెండవవైపు కారణమై, ఓంకార్నాథ్జీని, సాటిలేని మేటి గాయకసార్వభౌముడిగా తీర్చి దిద్దేయి.
ఆయనకి 25 సంవత్సరాల వయస్సులో, 1922లో, వివాహంజరిగింది. వారి భార్యపేరు ఇందిరాదేవి. ఆమె, సూరత్ నగరానికిచెందిన సంపన్న గృహస్థు అయిన సేఠ్ ప్రహ్లాద్జీ దలసుఖరాం భట్టు గారి కుమార్తె!
27 సంవత్సరాల వయస్సులో వారు,నేపాలు మహారాజా, చంద్ర షంషేర్జంగ్ బహదూర్ గారి ఆహ్వానంమీద, ఖాట్మండూ వెళ్ళేరు. రాజాస్థానంలో వారి అద్భుత గానకళకి, రాజుగారు, ఇతరసంగీతప్రియులు మంత్రముగ్ధులైపోయేరు. రాజుగారు, ఓంకార్జీకి, 5,000/- రూపాయల నగదు కానుక, ఇతరబహుమతులు సమర్పించి, సమ్మానించేరు. అంతేకాక, నెలసరి రూ.3,000/-ల జీతంతో నేపాలు రాజ్య సంస్థాన గాయకునిగా వారు ఉండాలని రాజుగారు కోరేరు. కాని భారతదేశం వదిలి వెళ్ళలేక వారు రాజావారికి తమ సమస్యని విన్నవించుకుని, ఆ అవకాశాన్ని త్యజించేరు. తమకి లభించిన నగదుకానుకని, ఇతర బహుమానాలని, తమ తల్లిగారికి సభక్తికంగా సమర్పించుకున్నారు. తన కుమారుడు తమ కుటుంబానికి తెస్తూన్న పేరు-ప్రఖ్యాతులని చూసి మాతృహృదయం ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోయేది. అంతేకాక, ఇంక, వారింట లేమికి చోటులేకుండాపోయింది.
33 ఏళ్ళ ప్రాయంలో, మరొకసారి నేపాలు మహారాజావారి ప్రత్యేక ఆహ్వానంమీద, రెండవవిడత ఓంకార్జీ, ఖాట్మండూ వెళ్ళి, తమ మహనీయగానప్రతిభతో, రాజాస్థాన సదస్యులని పరవశులని చేసేరు. ఈ తడవ, రాజావారు, ఇంకా అధికమైన ధనబహుమానంతోను, మరిన్ని కానుకలతోను, ఓంకార్జీని సత్కరించేరు. వాటినన్నింటిని, ఈ తూరి, తమ గురుదేవులైన పండిత్ విష్ణుదిగంబర్ పలూస్కర్జీ పాదపద్మాలముందు ఓంకార్జీ సాష్టాంగ దండప్రణామంతో సమర్పించుకున్నారు. గురువుగారు ఆనందంతోను, గర్వంతోను మహాప్రతిభావంతుడైన శిష్యుణ్ణి లేవదీసి, తమ హృదయానికి హత్తుకుని అమితవాత్సల్యబాష్పాలతో, ఓంకార్జీని ఆశీర్వదించేరు.
అదిమొదలు ఓంకార్‌నాథ్ ఠాకూర్జీ జీవితమే సంగీతము, సంగీతమే జీవితమూ అయిపోయి, దేశం ఎనిమిది వైపులా అన్ని ముఖ్య సంగీతసభలు, అన్ని ప్రధాన పట్టణాలు వారి సురస్వరజాహ్నవీఝరితో పునీతం ఐపోయేయి! ఆ రోజులలో, వారు పాల్గొనని ప్రసిద్ధసంగీత విద్యా సమావేశాలు లేనేలేవు!
సంగీతవిద్యాశాస్త్రవైదుష్యంతోపాటు, వారి అనేక భాషా పాండిత్య ప్రజ్ఞని పరికిస్తే, మనం అవాక్కైపోవడంతప్ప, ఇంకేమీ చేయలేం! గుజరాతీ, సంస్కృతం, మరాఠీ, ఉర్దూ,నేపాలీ, బెంగాలీ, పంజాబీ, ఆంగ్లం, అవధి మొదలైన భాషలు వారికి కరతల ఆమలకం అని చెప్పాలి. చెప్పుకోతగిన పాఠశాలావిద్యాశిక్షణలేని వ్యక్తికి, వివిధభాషలలోను, అసమానసంగీతవిద్యాపాండిత్యంలోను, తులసీరామాయణం లోను, యోగాభ్యాసంలోను, మల్లవిద్యలోను, ప్లవనవిద్య లోను(నీటిలో ఈతకొట్టడం), ఉపాసనావిద్యలోను, గురు శుశ్రూషలోను, సంగీతవిద్యాబోధనంలోను, సభారంజకత్వం లోను, వక్తృత్వంలోను, సంభాషణాచాతుర్యంలోను, పాకవిద్యలోను, గృహనిర్వహణకళలోను, సంయమనంలోను, అన్నింటినీమించి, జీవితం పూర్తిగా వ్యతిరేకదిశలో ప్రయాణం చేసేసమయంలో అనంతసహనశీలతలోను , ఇటువంటి అనేకవిషయాలలో ఆయనకి ఆయనే సాటి. జీవితం ఆయనని పాతాళానికి నెట్టివేసినా, సత్యలోకానికి ఎత్తివేసినా, రెండింటినీ సమానంగా అనుభవించి దృఢంగా నిలబడగలిగిన స్థితప్రజ్ఞతతో ఇనుమడించిన ఇటువంటి అబ్బురమైన వ్యక్తిత్వం జనబాహుళ్యజీవనవిధానానికి, ఒక గొప్ప జీవననిర్మాణ పాఠశాల అని చెప్పవచ్చు.
1933లో, ఇటలీదేశంలోని, ఫ్లారెన్స్ నగరంలో, “అంతర్జాతీయ సంగీత సమావేశం” జరిగింది. దానికి, పండిత్ ఓంకార్‌నాథ్ ఠాకూర్జీకి, ప్రత్యేక ఆహ్వానం అందింది. అప్పటికి, ఇటలీదేశం, ఇటాలియన్ నియంత, ‘ముస్సోలిని‘, పరిపాలనలోవుంది. ముస్సోలిని నిద్రలేమి(Insomnia) వ్యాధితో బాధపడుతూండేవాడు. ఫ్లారెన్స్ లో, భారతీయసంగీతానికిసంబంధించిన వైశిష్ట్యాన్ని, తన లెక్చర్ – డిమాన్స్ట్రేషన్ ద్వారా విదేశీయులకి ఆయన నిరూపించేవారు. ఆ సందర్భంలో, కొన్ని సంగీతం కచేరీలని కూడా వారు నిర్వహించేరు. ఆసభలలో శ్రోతగా పాల్గొనిన ముస్సోలిని యొక్క నిద్రలేమిసమస్యగురించి ఓంకార్నాథ్జీకి తెలిసింది. అప్పటికే భారతీయసంగీత సిద్ధాంత-ప్రయోగాలకి సంబంధించిన అనింద్రియ గోచరమైన అనేక ప్రాచీన సంగీత శాస్త్రగ్రంథాలలో విశదంచెయ్యబడిన గుప్తవిషయాలమీద ఓంకార్నాథ్జీ, విశేషపరిశోధనలు చేస్తున్నారు. పీలూ, భీంపలాస్ , కీరవాణి, బిలావల్ (కర్ణాటకబాణీలోని కీరవాణి, శంకరాభరణం, రీతిగౌళ, ఆనందభైరవి, నారాయణగౌళ, నీలాంబరి) మొదలైనరాగాల అనుమంద్ర/మంద్రస్థాయి ఆలాప్ వలన, విలంబితకాలనిబద్ధ కృతిగానం వలన ౘక్కని నిద్రని కలిగించవచ్చు. అప్పటికే ముస్సోలిని, అనేక దేశీయ, అంతర్దేశీయ వైద్య ప్రముఖుల నిష్ఫలమైన ఔషధ సేవనం చేసివున్నాడు. ఐతే ప్రాచీన భారతీయ సంస్కృతి పట్ల గాఢ అనురక్తి, శ్రద్ధ కలిగినవాడు. తన సమస్యని ఓంకార్జీకి తెలియజేసి, ఏదైనా పరిష్కారంవుందేమో ప్రయత్నించమని కోరేడు. ఓంకార్జీ సానుకూల స్పందనతో, రాజప్రాసాదంలోని ముస్సోలినీ శయనమందిరంలో ఓంకార్జీ తన గానమాధుర్యం ద్వారా అతడి నిద్రలేమి మొండిజబ్బుని పూర్తిగా నయం చేసేరు. ఈ సంచలనాత్మకమైన విషయం, వార్తా మాధ్యమాల ద్వారా ఆ రోజులలో ఇటలీలో బహుళప్రాచుర్యం పొందింది. దానివలన రాగాత్మకసంగీతానికి(music in melodic system of raagas) వ్యాధి చికిత్సనశక్తి(therapeutic efficacy) ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పిమ్మట, ఆయన, లండన్ , వేల్స్ , స్విట్జర్లేండ్ , ఫ్రాన్స్ , జర్మనీ, నీదర్లేండ్స్ , ఆఫ్ఝనిస్థాన్, మొదలైన దేశాలు పర్యటించి భారతీయసంగీతవైశిష్ట్యాన్ని, నేల నాలుగుచెరగుల వ్యాపింపజేసేరు.
విదేశయానంలోవుండగా, వారి భార్య, ఇందిరాదేవి శిశుజననసమయంలో హఠాత్తుగా మరణించేరు. ఆయన, వారి ప్రయాణాలని, అర్థాంతరంగా ఆపివేసి, వెను వెంటనే ఇంటికిచేరుకుని, భార్యావియోగదుఃఖాన్ని భరించలేక క్రుంగిపోయేరు. 36 సంవత్సరాల వయస్సుకేదాంపత్య జీవితం మూడునాళ్ళ ముచ్చటగా ముగిసిపోవడం తట్టుకోలేక ఆయన ఏకాంతంలో వుండిపోయి, సంగీతసభల్లో కొంతకాలం పాల్గొనలేకపోయేరు. అర్థాంగిలేని జీవితం, ఆయనకి అర్థరహితంగా కనిపించినా, బంధుమిత్రుల ఒత్తిడినికూడా భరించి, పునర్వివాహం చేసుకోవడానికి నిరాకరించేరు. తమ ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రునిలాగే ఒకేమాట, ఒకేభార్య, ఒకే ఆధ్యాత్మిక జీవితాదర్శం అనివారు తమవారందరికీ తెలియపరిచేరు. అంతేకాక తమ జీవితభాగస్వామిని, సహధర్మచారిణి ఐన ఇందిరాదేవి స్థూలరూపంలో అందరికి కనిపించకపోయినా, సూక్ష్మరూపంలో తన హృదయమందిరంలో నిరంతరమూ నెలవుకొనివుందని అని ఆయన భావించేవారు. మెల్లిగా ఆ బాధని దిగమింగికొని, కొంత కాలానికి, తన ఆరాధ్య దైవమైన సంగీతశారదామూర్తిని, యథాపూర్వంగా నిత్యసాధనద్వారాను, శిష్యగణానికి బోధచెయ్యడంద్వారాను, దేశవ్యాప్తంగా సంగీతసభలలో గానం చేసి, రసజ్ఞలోకాన్ని పరవశింపచెయ్యడంద్వారాను, సంగీతశాస్త్ర గ్రంథరచనా ప్రణాళికా నిర్మాణంద్వారాను, సంగీతశాస్త్ర సదస్సులలోచురుకుగా పాల్గొని, శ్రోతలకి లోతైన అవగాహన కలిగించడంద్వారాను, అంకితభావంతో అర్చిస్తూ మానసికమైన గాయాన్ని క్రమంగా మాన్పుకోగలిగేరు.
1950లో, బెనారసు హిందూ విశ్వవిద్యాలయంలో, ప్రత్యేక ఉత్తరభారతీయ శాస్త్రీయసంగీతవిభాగం ప్రారంభించబడింది. ఆ విభాగానికి, అప్పటికి 53 సంవత్సరాల వయస్సు కలిగిన ఓంకార్‌నాథ్ ఠాకూర్జీ అధ్యక్ష-ఆచార్యుడిగా నియమించబడ్డారు. ఈ గురుతర బాధ్యతని వారు భగవద్దత్తమైన తమ అమేయసామర్థ్యంద్వారా అలవోకగా నిర్వహించేరు. 60 సంవత్సరాల వయస్సు పూర్తికాగానే ఉద్యోగవిరమణ చేసేరు. అంటే సుమారు 7 సంవత్సరాల అత్యల్ప వ్యవధిలో BHU యొక్క సంగీత విభాగాన్ని మనదేశంలోనేకాక, అంతర్జాతీయస్థాయిలోకూడా ఉత్కృష్టస్థితికి చేర్చేరు. “ప్రణవ్ భారతి” అనే సంగీత సిద్ధాంత బోధనచేసే మూడు భాగాల హిందీ గ్రంథం, “సంగీతాంజలి” అనే సంగీతశిక్షణని బోధించే ఆరు భాగాల హిందీగ్రంథం పరమ ప్రామాణికంగా రచించేరు.
డా. ఎన్ . రాజం, డా. ప్రేమలతాశర్మ, శ్రీమతి సుభద్రా కులశ్రేష్ఠ, నళినీ గజేంద్రగడ్కర్ , శ్రీమతి వీణా సహస్రబుద్ధే, ఫిరోజ్ దస్తూర్ , బల్వంతరాయ్ భట్ , శివకుమార్ శుక్లా, అతుల్ దేశాయ్ , యశ్వంత్ రాయ్ పురోహిత్ , కనక్రాయ్ త్రివేది, బిజోన్బాలా ఘోష్ దస్తీదార్ , పి.ఎన్ . బార్వే, రాజాభావు సోంటక్కే మొదలైన వారు వారి ప్రముఖ శిష్యవర్గంలోని ప్రసిద్ధ సంగీతకళాకారులు, సంగీతశాస్త్రవిద్వాంసులుగా పేరు పొందినవారుగా చరిత్ర పుటలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
వారు లాహోరులోవుండగా స్థానిక జంతుప్రదర్శనశాలలోని ఒక సింహం బోనులోనుంచి భయంకరంగా గర్జిస్తూ, సందర్శకులని భయభ్రాంతులకి గురిచేసిందిట. ఈ విషయం తెలిసిన 20-ఏళ్ళ నవయువకుడైన ఓంకార్నాథ్జీ, ‘జూ’ కి వెళ్ళి, గొంతు చించుకుని, సింహగర్జన స్థాయిని మించి చాలా గట్టిగా అరిచేసరికి, క్రమంగా, ఆ సింహం తన గర్జనస్థాయిని తగ్గించి, మామూలుగా ఐపోయిందిట!
1944 నుంచి 1948 వరకు, 4ఏళ్ళపాటు సూరత్ లోను, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోను దారుణమైన కరువు ఏర్పడింది. ఓంకారనాథులు, తపతీనదీతీరంలో మూడు రోజులు,ఎడతెరిపిలేకుండా గానంచేసేరుట! మూడురోజుల తరువాత కుంభవృష్టి పడడం, అక్కడ ఎండిపోయిన నేల సశ్యశ్యామలంగా మారడం చారిత్రక సత్యంగా ఆ నాటి వార్తా పత్రికలద్వారా తెలుస్తోంది.
ఒకసారి, ఓంకార్నాథ్జీ “వందే మాతరం” పాడుతూవుండగా, అదే సభలోవున్న భారతదేశ ప్రధాని నెహ్రూజీ, అడిగినవారికి అందరికీ ఆటోగ్రాఫులు యిస్తున్నారుట. అది గమనించిన ఓంకార్జీ “పండిట్జీ! నేనిక్కడ జాతీయగీతం పాడుతున్నాను, మీరక్కడ ఏంచేస్తున్నారు?” అని, నెహ్రూజీతో అని, ప్రధాని మనస్సుని, “వందే మాతరం” వైపుకి మళ్ళించేరు.
ఓంకార్నాథ్జీ నేపాలు రాజావారి ఆహ్వానంమేరకి ఖాట్మండూ వెళ్ళడం మనం ముందు తెలుసుకున్నాం! ఆ సమయంలో, నేపాల్ రాజాస్థానంలో, ఆస్థాన గాయకుడిగావున్న పండిత్ బాలప్రసాద్జీ, పండిత్ విష్ణుదిగంబర్ పలూస్కర్జీ సంగీతాన్నివిమర్శించేడట! అంతేకాక తన ఇంట్లో వంటమనిషిపేరుకూడా ఓంకారేనని, ఓంకార్‌నాథ్ ఠాకూర్జీని వెటకారం చేసేడుట. దానితో రాజావారే కళాకారులిద్దరికీ పోటీపెట్టి, ఆ పోటీలో,ఓంకార్నాథ్జీ గెలుపొందినట్లు, ప్రజాసమక్షంగా తీర్మానించేరట!
ఒక మహాకావ్యనాయకుడిలాగ, ఓంకార్ నాథ్ ఠాకూర్జీ జీవితం సప్తవర్ణమయశోభలతో అలరారింది. ఐతే వారి జీవితం, ప్రారంభంలోను-అంత్యదశలోను ఘోరబాధలని వారు అనుభవించేరు! He lived the life of an extraordinary tragic hero of epic dimensions. దుఃఖాంత దృశ్యకావ్య మహోన్నత కావ్యనాయకుడు ఓంకార్ నాథ్ ఠాకూర్జీ!
1955లో భారతప్రభుత్వం, వారికి “పద్మశ్రీ” బిరుదం యిచ్చింది. కలకత్తా సంస్కృత మహావిద్యాలయంవారు “సంగీత మార్తాండ” బిరుదంతోను(1940), నేపాలు ప్రభుత్వం “సంగీత మహామహోదయ“(1930) బిరుదంతోను, శ్రీ మదనమోహన మాలవ్యగారు “సంగీత ప్రభాకర” బిరుదంతోను వారిని సమ్శానించేరు.
1957లో వారు బనారసు హిందూ యూనివర్సిటీ, సంగీతవిభాగాధ్యక్షపదవినుంచి రిటైర్ ఐనతరువాత ఆయన ఎక్కువభాగం బొంబాయిలో సంగీతశిక్షణనియిస్తూ గడిపేరు.
1965లో, బొంబాయిలోవుండగా వారికి పక్షవాతవ్యాధి వచ్చింది.
ఆ తరువాత మరణపర్యంతమూ, వారు మంౘంపట్టి, కదలలేనిస్థితిలో, స్మృతిరాహిత్యంలో, మూడు సంవత్సరాలు అనామకజీవితం జీవించి, 29—12—1967 న రోగగ్రస్త శరీరంవిడిచి, సంగీతశారదామాతలో లీనమైపోయేరు.
వారి పాదాలచెంత అంజలి ఘటిద్దాం!
స్వస్తి||
వారి పాదాలచెంత అంజలి. అద్భుతమైన వ్యాసం రాశావు, అమృతంలాంటి తెలుగులో. ఇంతకన్న గొప్ప అంజలి ఏముంటుంది ఓంకార్ నాథ్ జీ స్మృతికి? పరపరా చదివించేశావు, పరగడుపునే.
Thank you sir
ఈ మహా విద్వాంసుని పేరు వినడమే తప్ప వివరంగా తెలియదు.ఏమి జీవితం! తలెత్తి ఓ హిమవత్పర్వతాన్ని తిలకించి తలవంచి నమస్కరించాలి.నమ్మశక్యంకాని కఠోర దీక్ష.వింటూవుంటే ఎలాంటి మహానుభావులు పుట్టిన దేశం ! అనిపించింది.
https://youtu.be/aZ1Hx69hlSk
మహా గాయక శిఖామణి పండిట్ ఓంకారనాథ్ ఠాకుర్ గాత్రం విని
ఎటువంటి దివ్యానుభూతికి లోనవుతామో, అదే గొప్ప అనుభూతి,
అనుభవం ….నువ్వు చేసిన వారి ఈ అద్భుత జీవితపరిచయ వ్యాసం
చదవడం ద్వారా కలిగించేవు. సంగీతానికి మనోధర్మం లాగ నీ రచనలోని
పదప్రయోగాలు, భాషా సంపత్తి ఈ వ్యాసానికి వన్నె పెట్టేయి.
ఓంకార్జీ నిండైన విగ్రహం, గంభీర కంఠస్వరం, హిందూస్తానీ సంగీత
శాస్త్రంలో వారి అసమాన ప్రజ్ఞ కళ్లకి కట్టినట్టుగా వివరించబడ్డాయి.
దైవము, తల్లీ , తండ్రీ, గురువు— ఈ నలుగురి కటాక్షవీక్షణాలు,
ఆశీర్వచనబలం వల్ల లభించిన ప్రతిభా పాటవాలతో పాటు వారి
స్వయంకృషితో లోకం నాలుగు దిక్కులా ఠాకుర్జి పొందిన ఎనలేని
కీర్తి ప్రతిష్ఠలు భారతీయ సంగీతానికే తలమానికం.
ఎంతటి వైవిధ్య భరితమైన జీవితం వారిది! ఆ సంగీత మేరునగ
ధీరునికి వందన సహస్రాలు.