శారదా సంతతి — 25 : ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc

శ్రీశారదా దయా చంద్రిక :—
31—12—2017; ఆదిత్యవారము.

శారదా సంతతి—25. ~ ఉత్కృష్ట గాన కలా యోగర్షి—ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc.

పూర్వపుణ్యవిశేషంవుంటేనే ఇటువంటి అపూర్వాపర గానయోగుల మహనీయ తపఃఫలరూపమైన, ఈశ్వర కైంకర్యభావవిలసితమైన అలౌకిక పరిపక్వ గానం విని, సంగీత రసజ్ఞులు తరించగలరు. గానకలకి, సంగీత శ్రవణకలకి సరిక్రొత్త నిర్వచనం చెప్పుకోవలసిన సందర్భంకలగజేసిన ఒకయుగగాయకుడు ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాc సాహెబ్ !

ఋషిమూలము, నదీమూలము తెలియరానివి అన్న విధంగా, ఉస్తాద్జీ పుట్టుపూర్వోత్తరాలు చరిత్రకి అందనివి. ఉత్తరప్రదేశంలోని బదౌన్ లో, వారి పెద్దల కుటుంబాలు వుండేవి. వారు పుట్టిన సంవత్సరం, 1872 నుంచి 1880 వరకు, వేరువేరుగా చరిత్రకారులు ఉదహరించేరు. మనం, మనకి లభ్యమైన వివరాల ఆధిక్యాన్ని అనుసరించి, 1872 వ సంవత్సరాన్ని వారి జనన వత్సరంగా తీసుకుందాం! ఎందుకంటే, విశ్వవిఖ్యాత పండిత్ విష్ణుదిగంబర్ పలూస్కర్ , ఖాన్సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్సాహెబ్ , అదే సంవత్సరంలో పుట్టేరు. ఉత్తరభారతీయ సంగీత సామ్రాజ్యంలో ఈ ముగ్గురు మూర్తులు నూతన సంగీత శకానికి నాందిపలికిన మహానుభావులు. ఎవరికి వారు, వారి-వారి ఘరానా సంప్రదాయాలకి సార్వకాలీన అనితర సాధ్య పూర్ణపుష్టి ప్రదానం చేసినవారే! పండిత్ విష్ణుదిగంబర్ పలూస్కర్జీ-గ్వాలియరు ఘరానాకి, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్జీ-కిరానా ఘరానాకి, ఉస్తాద్ ముష్తాక్ హుస్సేన్ ఖాన్జీ రాంపూర్ ,సెహస్వాc ఘరానాకి చేసిన సేవలు నిరుపమానమైనవి.

ముష్తాక్జీ, ఉత్తరప్రదేశ్ లోని, నవాబ్ హమీద్ ఆలీ ఖాన్జీ యొక్క రాంపూరు సంస్థానంలో, ఆస్థాన గాయకునిగావుండేవారు. నవాబ్జీ సంగీతం బాగాతెలిసిన పండితులు. వారు, ఆ కాలంలో సంగీతశాస్త్రమహావిద్వాంసుడిగా ప్రఖ్యాతి పొందిన పండిత్ విష్ణునారాయణ భత్ఖండేజీకి సన్నిహితమిత్రులు. లక్నోలోని భత్ఖండే సంగీతవిద్యాపీఠం(మొదట్లో మోరిస్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అని పేరువుండేది), విశ్వవిద్యాలయానికి, నవాబ్జీ అధ్యక్షులు(ఛాన్సలర్ )గా వుండేవారు.

ముష్తాక్జీ మొట్టమొదట, తనతండ్రి, ఉస్తాద్ కల్లన్ ఖాన్జీ వద్ద సంగీతవిద్యాసముపార్జనకి శ్రీకారం చుట్టేరు.

ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్జీ రాంపూర్ ఘరానాకి మూలపురుషుడని చెప్పవచ్చు. ఆయన సహస్వాcలో జన్మించడంవల్ల, రాంపూరుకి ప్రక్కన సహస్వాc కూడా తోడయ్యింది. గ్వాలియర్ ఘరానాలో మహాప్రసిద్ధుడైన హడ్డూఖాన్జీ ఇనాయత్జీకి, గురువు, మామగారూకూడాను! అలాగే, ఇనాయత్జీ, ముష్తాక్జీకి గురువు, మామగారూను! ఐతే, ముష్తాక్జీ, తన మేనమామ పుట్టన్ ఖాన్జీ(అట్రౌలీ), మహబూబ్ ఖాన్జీ(అట్రౌలీ)ల వద్ద కొంతకాలం శిష్యరికం చేసేరు. ఆపైన, బీన్ కార్ మొహమ్మద్ హుస్సేన్ ఖాన్జీ, ఆషిక్ హుస్సేన్ ఖాన్జీ, మొదటి మామగారైన హైదర్ ఖాన్జీ వద్దకూడా శుశ్రూషచేసి అపార సంగీతవిద్వత్తుని స్వంతం చేసుకున్నారు. రాంపూర్ ఘరానాకి చెందిన ప్రఖ్యాత విద్వాంసుడు, ఉస్తాద్ వజీర్ ఖాన్జీవద్ద, ధ్రుపదగానం, ధమార్ గానం, క్షుణ్ణంగా నేర్చుకున్నారు.

ఇంత మహావైవిధ్యభరితమైన సంగీతంనేర్చుకోవడమేకాక, ఆయన అనూహ్య ఆరాధనాభావంతో, అనన్యసామాన్య నిరంతర తపస్సుతో సంగీత సరస్వతి అపార అనుగ్రహం సంపాదించి, ధ్రుపద్ , ధమార్ , ఖయాల్ , టప్పా, తరానా, ఠుమ్రీ, రాగసాగర్ మొదలైన అనేక పూర్ణశాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీతాంశాలని పూర్తిగా రసమయంగాను, సంప్రదాయసిద్ధ శాస్త్రప్రమాణబద్ధంగాను పాడగలగడం ఆయన ఒక్కరికే సాధ్యం అనిచెప్పాలి. వివిధ సంగీత సంప్రదాయాలకి చెందిన, విభిన్న విద్వాంసుల గానశైలీ విన్యాసాలని తన హృదయాంతరాళంలో ఏకీకృతమొనర్చి, దైవదత్తమైన తన గళకౌశలానికి, తన సంగీతకలాసృజనాత్మక శక్తికి, తన ఘరానా సంప్రదాయ శాస్త్రీయతకి అనుగుణమైన రసస్ఫూర్తితో తన గానవైదుష్యాన్ని రసజ్ఞులకి సమర్పించడంలో ఆయనకి ఆయనే సాటి!

మూడు సప్తకాలలోను/ మూడు ఆక్టేవ్సులోను/ త్రిస్థాయిల లోను వారి కంఠం, తనకి సహజమైన ధాగధగ్యంతో ఒకేవిధంగావుండడం(to have uniform luminosity), అరుదైన విషయం! హలక్ తాన్ , సపాత్ తాన్ , మీండ్ ,గమక్ , లరజ్దార్ ,లయకారి, బోల్ ఆలాప్ , బోల్ తాన్ ,మొదలైన అనేకానేక రమణీయ అలంకారాలు, ఎక్కువ-తక్కువలు ఏమీలేకుండా, ఆయాసమయాలలో, ఆయా స్థానాలందు, ౘక్కగా పొదగబడినట్లు వచ్చి, వారి గళసీమా నందనవనవనంలో, పరిమళభరితంగా, అమరిపోతాయి. ఆ కంఠంలోవుండే పరిపూర్ణ పురుష దార్ఢ్యం, మంద్రస్థాయి ప్రయోగాలలోను, మధ్యమస్థాయి ప్రయోగాలలోను, తారాస్థాయి ప్రయోగాలలోను ఏమాత్రమూ చెక్కుచెదరక రసజ్ఞులని, రసమందాకినిలో ఓలలాడిస్తుంది.

వారు తొంభై సంవత్సరాలు జీవించేరు. వారి జీవితకాలం అంతా సంగీతానికే అంకితం ఐపోయింది. 65 నుండి 70 సంవత్సరాల వారి జీవితభాగం సంగీతసభలద్వారాను, రేడియో కచ్చేరీలద్వారాను, సంస్థానాలలోను, ఇతర సందర్భాలలోను ఏర్పాటుచేయబడిన వ్యక్తిగత సభల ద్వారాను లెక్కలేనన్ని గానసభల నిర్వహణకి అంకితమైపోయింది.

వారి అద్భుతగానంలో సమర్పించబడిన కొన్ని సంగీత కృతులు ఆకాశవాణివారి అపూర్వసంగీతకోశంలో, సేకరించబడి భద్రంగావున్నాయి.

మీరాబాయి కి మల్హార్ , మహక్నీ, ఝింఝోటి, జంగ్లా,జోగ్ , గాంధారి(శుద్ధ రిషభ్ ఆసావరి), బేహాగ్ , మొదలైన అనేక రాగాల కృతులు “యూట్యూబు”లో వుంటాయి.

ఆయన పొట్టిగా, పీలగావుండేవారు. చాలా మృదుస్వభావి. వినయశీలి. వివాదాలకి అతీతుడు. తన సంగీతమే తన లోకం. అది దాటి ఒక మైక్రోమిల్లీమీటరు కూడా బయటకి రాలేదు.

భారతదేశాధ్యక్షుడి సంగీత నాటక అకాడమీ బహుమతి, పద్మభూషణ్ పురస్కారం వారిని వరించేయి.

1964లో, 90 సంవత్సరాల పైబడిన వయస్సులో, వారు స్వర్గస్థులయ్యేరు. సంగీతప్రియులమైన మనం, వారికి, నతమస్తకాంజలిని సమర్పించుకుంటున్నాము!

వారి తరువాత వారి కుమారులు కొంతవరకు వారి పరంపరని కొనసాగించేరు. అనితరసాధ్యమైన వారి వ్యక్తిగత గానకలాకౌశలం ఏ గానకలాసాధకులకి ఏమాత్రమూ అందేది కాదు. అటువంటి గానం ఈ సృష్టిలో వారికిమాత్రమే సాధ్యమని విశ్వస్రష్ట విశిష్ట సంకల్పం! ఆయన దివ్యగానంవిని ఆనందించగలగడం, ఎన్నో జన్మల తపఃఫలం!

2017వ సంవత్సరానికి గౌరవంగా వీడ్కోలు చెపుతూ,
2018వ సంవత్సరానికి సాదరంగా స్వాగతం పలుకుదాం!

స్వస్తి||

You may also like...

6 Responses

  1. Kbj srinivas says:

    Thank you very much bava garu for enlightening us with so many new things.

  2. Sampath Kumar says:

    Namaskaaram guruvugaaru. Thanks for your collection of different personalities.

  3. ఉత్తర భారత దేశంలో, సంగీత ప్రపంచంలో ఉద్ధండులైన ఎం దరో కళాకారులని నువ్వు పరిచయం చేస్తున్నావు.సంగీత మనే సముద్రం లో ఈదులాడుతూ ఒకొక్క రత్నం “ఇదిగో” అని నువ్వు వెలికి తీసి చూపుతున్నావు.
    ఒడ్డు కి కూడా ఎంతో దూరంలో వున్న మాకు “ఎం దూరంలో మహాను భావులు” అని విస్మయంతో ఓ నమస్కారం చేయడం మిగిలింది.
    చాలా చాలా ధన్యవాదాలు.

  4. సి. యస్ says:

    జీవితమంతా సంగీతమయంగా , సంగీతమే జీవితంగా
    తన గానామృతవర్షంలో తను తడుస్తూ, శ్రోతలను ముంచెత్తుతూ
    గడిపిన గాన గంధర్వుడు ఉస్తాద్ ముష్టాక్ హుస్సేన్ గారి జీవిత
    గాథ రసరమ్య నాదంలా ఉంది. నీ presentation అద్భుతం!
    వారి జీవితం మొత్తమ్మీద అన్ని సంవత్సరాలు సంగీతంలోనే
    గడిపేరంటే, ఆయనని సంగీత తపస్వి లేదా గానయోగి అనకపోతే
    ఇంకేమనాలి? ఇందరు గొప్ప గొప్ప కళాకారులని ఈ తరంవారికి
    పరిచయం చేస్తూన్న ఈ గొప్ప సారస్వత, సంగీత సేవ ఇలాగే కొనసాగించాలని కోరుతూ….
    అన్నట్టు హుసేన్ గారి నిశ్చల ఛాయాచిత్రం చూస్తూంటే
    సంగీత చక్రవర్తిలా తోస్తున్నారు.

  5. వ.వెం.కృష్ణరావు says:

    U mean Sha-han-Shah of mausiqi-ke-Aalam?
    Beshaq, C.S.janaab!

  6. Devi says:

    What a magnificent and devotional voice of ustad Mushtaq Hussain khan. His life, achievements and contribution to music is amazing . This is the first time I tasted the flavour of Rampur gharana and it’s beauty and melody in ustadji’s voice takes one to unknown nostalgic worlds. Raag Gandhari ,Yaman Kalyan ,Jhinjoti are simply excellent and the depth and melody in those ragas cannot be explained but only experienced. I salute heartfully to you dear Mavayya for giving us these valuable biographies of greatest musicians of all times.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *