సాహిత్యము-సౌహిత్యము – 34 : అమవసనాటి వెన్నెలలహా! తలపోయగ అద్భుతం బగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—

30—12—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~34.

శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయవర్యుల సమస్యాపూరణ ఘనతని ఈ వారం తెలుసుకుదాం!

సమస్య:—

“అమవసనాటి వెన్నెలలహా! తలపోయగ అద్భుతం బగున్ ” ||

“అమావాస్యనాటి వెన్నెలలని తలుచుకుంటే, ఆహా! అద్భుతంగా వుంటుంది”. అని ఈ సమస్యకి అర్థం. అమావాస్య నాడు, మన అనుభవం ప్రకారం, కన్ను పొడుచుకున్నా కనిపింౘని కటిక చీకటివుంటుంది. మచ్చుకి కూడా పిసరంతైనా వెన్నెల వెలుగుండదు. మరి కవిగారు చేసిన చమత్కారం ఏమిటో పూరణలో పరికిద్దాం! ఇది చంపకమాలవృత్తం.

“అమర వనంబు సాటి యిది
అప్పటికిప్పుడు రాక, యీ నికుం

జములును, కేళికూళులును, చంద్ర
శిలల్ , మన కేళి భూములై |

కమలముఖీ! తనర్చినవిగా అల పున్నమి నాటిరేయి, నే

డమవస—నాటి వెన్నెల లహా!
తలపోయగ అద్భుతంబగున్ ” ||

ఇప్పుడు ఈ పద్యభావం చూద్దాం!

ఒక ప్రియుడు, తన ప్రేయసితో– వారిద్దరి పూర్వ విహారానుభవాలని స్మరిస్తూ– చెప్పిన పద్యంగా ఒక కమనీయ సందర్భాన్ని, కవిగారు కల్పించి, పై పద్యపూరణ చేసేరు. ఆ ప్రియుడు, తన ప్రేయసితో ఇలాగ అంటున్నాడు.

“ఓ కమల వదనా! ఇప్పుడు మనం విహరిస్తూన్న భూమి స్వర్గలోకంలోని నందనవనంతో సమానమైనంత అందమైనది. అప్పుడెప్పుడో కలుసుకున్నాం. ఆ తరవాత ఇక్కడికి, యిదే నీ రాక! అప్పుడు, ఈ పూపొదలు, ఈత కొలనులు, చంద్రశిలావేదికలు, మన యిద్దరి ఆటలకి అందమైన నెలవులయ్యేయి. ఆ నాటి పున్నమిరేయి మన కేళీవిలాసాలతో అతిశయించింది. ఈ రోజు అమావాస్య! ఐతేనేమి? ఆ నాటి వెన్నెలలు మన తలపులలో నేటికీ మసలుతూ, ఈ రాత్రినికూడా అద్భుతావహం చేస్తున్నాయి కదా!”

ఆంగ్లలోకోక్తి యిక్కడ ౘక్కగా సరిపోతుంది. అది యిది:

“God gave us memory, so that
we can have roses in December”.

స్వస్తి ||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    ‘నెమరేసిన మెమొరీస్’ అని ముళ్ళపూడి వెంకట రమణ గారు చెప్పినట్టుగా జ్ఞాపకాలకి అంత శక్తి ఉంది. అవి గతకాలపు అనుభవాలని ఇవాళ్టికీ కళ్ళముందు కట్టి పడేయగలవు .
    ఈనాటి సమస్యలో ఇచ్చిన ‘అమవసనాటి వెన్నెలల’ని
    అవధానిగారు, నేడమవస– (కాని) నాటి పున్నమి వెన్నెలలని ఈనాటి వెలుగులుగా గత అనుభవాల దొంతరలోంచి బయటకి తీసి, ప్రేయసీ ప్రియులని వెన్నెల విహారం చేయించిన కల్పనాచాతుర్యం అద్భుతంగా ఉంది.

  2. Kbj srinivas says:

    Lovely pooranam bava garu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *