కదంబకం — 26 : జబ్ దిల్ హీ టూట్ గయా
శ్రీశారదా దయా కౌముదీ :—
24—12—2017; ఆదిత్యవారము.
కదంబకం—26.
ఈ వారం మనం, “శారదా సంతతి”లో శ్రీ కె.ఎల్ . సైగల్ సాబ్ ని గురించి, చాలా సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు, వారి చలనచిత్ర గానప్రతిభావైశిష్ట్యాన్ని, పార్శ్వ గాన ప్రజ్ఞానైపుణ్య వ్యవస్థకి వారు వేసిన బలమైన పునాదులు, ఆ పునాదులపైన వారు అనితరసాధ్య కళాత్మక వైదుష్యంతో చేసిన పరమ రమణీయ శాశ్వత సౌధ నిర్మాణం గురించి స్వల్పంగాప్రస్తావించుకుందాం! తరువాత, వారు మనవంటి సంగీతప్రియులకోసం యిచ్చిన గొప్ప పాటల పెన్నిధిలోని సుమారు పది పాటలని కొంచెం వివరంగా తెలుసుకుందాం
అర్దేషిర్ ఇరానీ యొక్క “ఆలం ఆరా“(1931) మొట్టమొదటి భారతీయ శబ్ద చలనచిత్రం-very first talkie film. ఈ సినిమాలో వజీర్ మొహమ్మద్ ఖాన్ పాడిన, “దే దే ఖుదా కె నాం పే ప్యారే” అనే పాట మొట్టమొదటి భారతీయ చలనచిత్ర గానంగా పరిగణింౘబడుతోంది.
“ఆలం ఆరా”లో 7 పాటలున్నాయిట! “షిరీన్ ఫర్హద్ ” (1931) లో 42 పాటలు, “ఇంద్రసభ”(1932)లో, 69 పాటలు ఉన్నాయట! ఈ పాటలు-పద్యాలు మొదలైనవాటిపైన, ఆ నాటి నాటకరంగప్రభావంకూడావుంది.
మొదట్లో నటీ-నట గాయనీ-గాయకుల కాలం కొంత నడిచినా, క్రమంగా నటీ-నటులకి, పార్శ్వ గాయనీ-గాయకుల గాన సంస్కృతి, అనతికాలంలోనే ఆరంభం అయ్యింది.
పంకజ్ మల్లిక్ , కె.సి.డే, సైగల్ , పహరీ సన్యాల్ , గోవిందరావ్ తెంబే, విష్ణుపంత్ పగ్నిస్ , కానన్ బాలా, ఉమా శశి, శాంతా ఆప్టే, జి.యం.దురానీ, సురేంద్ర, సి.హెచ్ . ఆత్మా, షంషాద్ బేగం, నూర్జహాన్ , సురైయా, ఖుర్షీద్ , అమీర్బాయి కర్ణాటకి, జొహ్రాబాయి అంబాలావాలీ, ఉమాదేవి మొదలలైనవారు ఎందరో మొదటితరం గాయనీ- గాయకులున్నారు. వీరిలోకొందరు నటీ-నట గాయనీ-గాయకులైతే, మిగిలినవారు, కేవలం పార్శ్వ గాయనీ-గాయకులు మాత్రమే. వీరందరూ ప్రతిభామూర్తులే! అందరూ సినీ గానకళకి అంతో-ఇంతో మౌలిక భాగ దానం(fundamental contribution), చేసినవారే! ఐతే, కొందరు అపార ప్రతిభామూర్తులు మాత్రం తమ,తమ అనంత గానకళావైదుష్యభరితమైన గాత్రకౌశలంతో, భారతీయ చలనచిత్ర పార్శ్వ గానకళా వ్యవస్థకి అమేయ శాశ్వత పుష్టిని, దార్ఢ్యాన్ని, కోమలతని, లాలిత్యాన్ని, రమణీయతని, కమనీయతని, ధగధగని ఈ విధంగా సర్వసద్గుణసంపదని సంక్రమింపజేసేరు వారందరిలో, కె.ఎల్ . సైగల్ సాబ్ ప్రథమగణ్యులని చలనచిత్రచరిత్రకోవిదుల ప్రగాఢ అభిప్రాయం. ఎందువల్లనంటే, వారి style of voice-production, crooning method of rendering a song, unique ability to embellish the words of the lyric with appropriate tonal registers charged with enchanting emotional content and so many other virtues that make the rendition of his each and every song find a permanent place not only in the hearts of his passionate listeners, but also in the annals of Indian film-songs.
సైగల్ సాబ్ ఏ సంగీత సంప్రదాయాన్ని అనుసరించలేదు. ఏ ఉస్తాదులు-పండితులు మొదలైనవారివద్ద ఏ శిక్షణని తీసుకొనలేదు. దైవదత్తంగా, తన తల్లిద్వారా తనకి సంక్రమించిన గానాన్నీ-గాత్రాన్నీ, గాఢశ్రద్ధతో, అనునిత్యమూ తీవ్రసాధనచేసి, ౘక్కగా తీర్చి దిద్దుకున్నాడు. భిక్షువులు, వేశ్యవాటికలు నుంచి ఉస్తాదులు,పండితులవరకు అందరి, అన్ని రీతుల సంగీతాన్ని దీక్షగావింటూ, తేనెటీగలాగ, గానమకరందాన్ని సేకరించి, రసికులహృదయాలని రంజింపజేసే అక్షయ మధుకోశం అంటే తరగని తేనెతుట్టని తన అజరామర గాత్రస్వర్ణ పాత్రలో భద్రపరచి, లోకానికి అందించి, మెల్లిగా లోకంనుంచి కనుమరుగైపోయి, కన్నీటిని మనకి మిగిల్చి, మహాప్రస్థానం చేసిన మహానుభావుడు, ఆ నిరంతర సంగీత కళా తపస్వి!
ఆయన కంఠం గొప్ప మంద్రస్థాయి కలిగిన కంఠం. మంచి పురుష కంఠం. ఆ కంఠంలో నవరసాలన్నీ నవనవలాడుతూ, అవసరానికి అనుగుణమైన ఔచిత్యకాంతిని, సాహిత్య భావ గాఢతని, సంగీతరస స్ఫూర్తిని, సందర్భశౌచంతో, నింపుకుని,రసికహృదయ రంజకంగా ప్రవహిస్తాయి. వారి స్వరంలోకాని, సాహిత్య శబ్ద ఉచ్చారణలోకాని, ఈ రెంటి సమన్వయ స్పర్శతో ఉద్భవించే భావ వ్యక్తీకరణలోకాని లవలేశమైనా”సంచలనాత్మక నాటకీయ వ్యక్తీకరణలు” అంటే melodramatic expressions, మచ్చుకికూడా కానరావు. అంత సహజమైన, సరళమైన, సౌలభ్యంతో నిండిన రసాత్మక భావవ్యక్తీకరణ కేవలం సైగల్ సాబ్ సొత్తు! ఆయన కంఠస్వరం, “అతివ్యాప్తి-అవ్యాప్తి” దోషాలెరుగని సమతౌల్యవరంతో భాసించే స్వరసంపదకి శాశ్వత సౌందర్య రస మందాకిని.
సైగల్ సాబ్ యొక్క గానమాధుర్యాన్ని చలనచిత్రగానానికి అనుగుణంగా తీర్చి దిద్దిన మహానుభావులైన సంగీత దర్శకులు ఆర్ . సి. బొరాల్ , తిమిర్ బరన్ , పంకజ్ మల్లిక్ , జ్ఞాన్ దత్ , ఖేంచంద్ ప్రకాశ్ , నౌషద్ అలీ మొదలైనవారు.
1. “Street Singer“(1938)లో, ఆర్ .సి. బొరాల్ , సంగీతదర్శకత్వంలో, భైరవిరాగంలో, సైగల్జీ పాడిన “బాబుల్ మోరా” అనే వజిద్ ఆలీ షా ఠుమ్రీ, హిందుస్తానీ భైరవి రాగాధిదేవతని, ఆరాధనాభావంతోవినే శ్రోత హృదయంలో, సాక్షాత్కరింపజేస్తుంది. ఆయన భైరవిరాగ దేవతని ఉపాసించి, ఆ దేవతానుగ్రహం పొందిన రాగరససిద్ధుడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన జన్మ భైరవిరాగదేవతా ఉపాసనకే అంకితమైపోయిందని చెప్పేరు.
2. పంకజ్ మల్లిక్ సంగీతదర్శకత్వంలోని “జిందగీ“(1940) లో, యమన్ కల్యాణ్ రాగంలో, “మై క్యా జానూ క్యా జాదూ హై” పాట ఒక అపురూపమైన గానంతో శాశ్వతత్వం పొందింది.
3. 1932లో ప్రైవేటు రికార్డింగుగా విడుదలైన పాట, “ఝూలనా ఝులావో రే“, ‘జోన్ పురి‘ రాగంలోని క్లిష్టతానగతులని అవలీలగా తనగానంలో, అసాధారణ ప్రజ్ఞతో ప్రయోగించడం గమనించిన ఉస్తాద్ ఫైయాజ్ ఖాన్సాహబ్ , “ఇటువంటి తానప్రయోగం చెయ్యడానికి, శాస్త్రీయ సంగీత గాయకులుకూడా ౙంకుతారు” అన్నారట. వారే, వేరే సందర్భంలో, సైగల్జీ పాదాభివందనం చేసి, తనకి శాస్త్రీయ సంగీతవిద్యాబోధ చేయవలసినదిగా ప్రాధేయ పడితే, సైగల్జీతో, “నాయనా! నీ సినీగానవిద్యలో నీవు మకుటంలేని మహారాజువి. నీకు సరస్వతీదేవి అనుగ్రహం వుంది. ఇంక వేరే గురుశుశ్రూష అవసరంలేదు” అన్నారట!
4. ఖేంచంద్ ప్రకాష్ సంగీతదర్శకత్వంలో “తాన్సేన్ ” (1943)లో “దియాజలావో” పాట, “దీపక“రాగంలో గొప్పపాట.
5. పై చిత్రంలోనే, “బాగ్ లగాదూc సజనీ“, పాట, మేఘరంజనిలో మధురమైన గీతం.
6. అదే చిత్రంలో, “కాహే గుమాను కరే” పాట, ‘గారా రాగం’ లో వరుస కూర్చబడినది, మహాశ్రావ్యమైన గీతం.
7. ఆ చిత్రంలోనే, ఖుర్షిద్ తోకలిసి, ఆయన పాడిన యుగళ గీతం, “మేరే బాలపన్ కే సాథీ” దేశ్ రాగంలో ప్రత్యేకమైనపాట.
8. నౌషద్ సాహబ్ సంగీతదర్శకత్వం నిర్వహించిన, “షాజహాను“(1946) చిత్రంలో, భైరవిరాగంలో, “జబ్ దిల్ హీ టూట్ గయా” పాట అజరామరమైన ఆయనగీతాలలో ఒకటి.
9. “My Sister“(1944), పంకజ్ మల్లిక్ సంగీతంతో విడుదలైన సినిమా. ‘భైరవి‘ రాగంలోనే, “ఐ కాతిబె తక్ దీర్ ముఝే ఇత్నా బతాదే” మరొక మరకతమణి.
10. 1933లో “యాహూదీ కి లడ్కీ” చిత్రానికి, పంకజ్ మల్లిక్ సంగీతాన్ని సమకూర్చేరు. ఆ చిత్రంలో, “నుక్తా చీన్ హై గమె దిల్ “, పాట, భీంపలాస్ రాగచ్ఛాయలోవుంటుంది. అది మరొక అద్భుతం అని చెప్పాలి.
ఒక ప్రత్యేక “world record“, సైగల్ సాహబ్ కి మాత్రమే స్వంతం. ప్రతి ఉదయమూ, రేడియో సిలోనులో, 7-57 నుంచి 8-00 గంటలవరకు, ఏభై సంవత్సరాలుపైగా, కె.ఎల్ . సైగల్ సాబ్ పాటని యిప్పటికీ మనం వినవచ్చు.
ఇది 26 వ “కదంబకం”. అంటే ఈ శీర్షిక మొదలయ్యి ఆరు నెలలు పూర్తయ్యిందన్నమాట. అందువల్ల, ఈ శీర్షికని ఇంక ఈ పేరుతో ముగించి, విషయం తెలుగులోవుంటే, “ఇతరములు” లోను, ఆంగ్లంలోవుంటే, “Miscellany” లోను కొనసాగింౘడం ౙరుగుతుంది. ధన్యవాదాలు.
So, this is not a total discontinuation of the feature. It’s only a merger. Thanks.
స్వస్తి||
సైగల్ సాబ్ గురించి మీరు అందించిన వివరాలు చాల ఆసక్తి కరంగా ఉన్నాయి బావ గారు. మీకు శత కోటి ధన్య వాదాలు
హిందీ చలనచిత్ర గాయకులని కె.యల్. సైగల్ కి ముందు, సైగల్
తర్వాత అని చెప్పుకోవాలేమో. ఆయన తరవాత వచ్చిన
చాలామంది గాయకులు వారి ప్రభావం నుంచి బయట పడడానికి
కష్టపడవలసి వచ్చిందని అంటారు.
ఈ వ్యాసంలో, చలనచిత్రాల్లో నేపథ్య సంగీతావిర్భావం, అలనాటి
తొలినాటి సంగీత దర్శకులు, వారు స్వరపరచి, సైగల్ పాడిన
అద్భుతమైన గేయాలూ, ఆయన పాట పాడే పద్ధతిలో ఉండే
ప్రత్యేకతా– ఎన్ని ముచ్చట్లు! ఎంత బాగా ముచ్చటించావో.
రోజూ ఉదయం 8 గంటలకి సిలోన్ లో “ఆప్ హీ కె గీత్” ప్రారంభం
అయ్యేముందు 7-57 కే సైగల్ పాట కోసం రేడియో ట్యూన్ చెయ్యడం
గొప్ప అనుభూతి.
స్థలాభావం వల్ల స్థాలీపులాక న్యాయంగా కొన్ని పాటలే ఉదాహరించావు కానీ ఏ పాట వదిలెయ్యగలం?