సినీవాలీ
శ్రీ కె.బి.జె. శ్రీనివాస్ , అంటే మా వాసుబావగారు, “సినీవాలీ” శబ్దానికి వ్యుత్పత్తిని వివరించమని కోరేరు.
అః విష్ణుః, తేన సహ వర్తతే – ఇతి సా లక్ష్మీః, సా అస్యాం ఇతి సినీ, సినీ శుక్లా బాలా, చంద్రకలా అస్యాం ఇతి – సినీవాలీ |
“అ” అంటే విష్ణువు. ఆయనతో నివసించే ఆమె లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి నివసించే విషయం కనుక “సినీ“.
సినీ శుక్లా – అంటే “సినీ” అనే పదానికి తెల్లని/ది అని అర్థం.
సినీవాలా, సినీబాలా వా చంద్రకలా అస్యాం ఇతి, సినీవాలీ – అంటే నునులేత చంద్రకలని కలిగిన అమావాస్యని “సినీవాలీ” అంటారు.
“సినీ” పదానికి తెల్లదనం అనే అర్థంవుంది కనుక, ఆమాట వర్ణసారూప్యంవలన లక్ష్మికేకాక, పార్వతికి, సరస్వతికి కూడా అన్వయించవచ్చు.
పైగా, అనేకమైన సంస్కృతపదాలకి బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులనే అర్థాలు నానార్థ నిఘంటువులలో వున్నాయి. ఉదాహరణకి, “విధి, ఈశ, విష్ణు, కామేషు పుంసి, అజః, ప్రకృతౌ స్త్రియా” అని ‘నానార్థ సంగ్రహః‘ అనే కోశంలోవుంది. అంటే, బ్రహ్మ, శివుడు, విష్ణువు, మన్మథుడు అనే అర్థాలలో అజశబ్దం పుంలింగంలోవుంటుంది. ప్రకృతి అనే అర్థంలో స్త్రీలింగంలోవుంటుంది అని అర్థం. అదేవిధంగా “ఆత్మభువు” పదానికికూడా, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు అనే అర్థంవుంది. అలాగే, స్వయంప్రభువు, శంభుడు మొదలైన పదాలకి త్రిమూర్తులు అని అర్థాలుఉన్నాయి.
“శ్రీ” అనే మాటకి, లక్ష్మి, పార్వతి, సరస్వతి అని అర్థం. “ఈ” అనేబీజాక్షరానికి త్రిమాతలు అని అర్థాలున్నాయి.
ఇంతేకాక, “మేదినీకోశః” లో, “సినీవాలీ తు దృష్టేన్దుకలామా,దుర్గయోరపి” అనివుంది. అంటే, చంద్రకలతోకూడిన అమావాస్య, దుర్గ(పార్వతి) అని, ‘సినీవాలీ’కి, రెండు అర్థాలున్నాయి. అందువలన, “సినీవాలీ” అంటే పార్వతీదేవి
(సమయ దక్షిణాచార శాక్తేయ సంప్రదాయంలో బహులచతుర్దశికి, కృష్ణాంగారక చతుర్దశికి, అమావాస్యకి, సినీవాలికి, కుహూకి మొదలైన తిథి-నక్షత్ర ప్రమేయాలతో కూడిన పర్వదినాలకి, శ్రీరాజరాజేశ్వరీ/లలితాది శ్రీవిద్యా ఉపాసనకి చెందిన గోప్యవిషయాలు గురుశిష్యపరంపరలో దీక్షితులైనవారికేతప్ప academic discussion with uninitiated persons is fully prohibited by tradition.)
స్వస్తి ||
చాలా rare & curious విషయం చాలా బాగా చెప్పావు. ఎక్కడ దొరుకుతాయో నీ కివన్నీ.
(“ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకం కేకా, భేకం బాకా” – శ్రీ శ్రీ)
“దేవీకరుణాప్రదీప్త” మయిన నీవు అన్న “శ్రీశారదామాత
కారుణ్య కలాశాలలోని ౘదువే యిది సర్వమూ!
“నీకు తెలియని విద్యయా? నీరజాక్ష!”
“ఆరుద్ర సినీవాలీ” ని చూసినప్పుడూ, ఇతరత్రా ఆ పదం విన్నప్పుడు
ఇన్నాళ్లూ ఒకే అర్థం తెలుసు. ఇంత విషయం ఉందని ఇది చదివేకా
అర్థం అయింది. భాషా సంపద కూడబెట్టడానికి ఆ ‘సినీవాలీ’ కటాక్షం కావాలి సుమీ!