కదంబకం — 25 : రజనీ ఆత్మకథా విభావరి
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
17—12—2017; ఆదిత్యవారము.
కదంబకం~25.
ఈ వారం “శారదా సంతతి“లో శ్రీమతి బాలాంత్రపు సుభద్ర-కళాప్రపూర్ణ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు దంపతి గురించి చాలా సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం!
ఈ వారం “కదంబకం“లో, మా రజనీచిన్నాన్న రచించిన “రజనీ ఆత్మకథా విభావరి” నుంచి, కొన్ని విశిష్ట విషయాలని, యథాతథంగా తెలుసుకుందాం!
1.
“బాలాంత్రపు” అనే తమ ఇంటిపేరు ఎలా వచ్చిందో వివరించే ఒక శార్దూల విక్రీడిత పద్యం, మా రజనీచిన్నాన్న రచించినది:
“బాలాయంత్రము పూజ చేసెనట, మా వంశస్థుడేనాడొ, ఆ
బాలాయంత్రమె యింటిపేరయెనుగా, మా గ్రామనామంబుగా,
బాలాంత్రంబయె మాకు స్ఫూర్తి,సకుటుంబంబందె జన్మించుటన్
బాలాంత్రానికి మున్సబుల్ వరుసగా మాల్పూడి*వంశస్థులే“|
*మాల్పూడి=మల్లెపూడి.
2.
మా రజనీచిన్నాన్నగారు పుట్టిన కాస్సేపటికి, తమ తల్లిగారు, తండ్రిగారికి, పసిబిడ్డని చేతులకి అందిస్తూ, “కావ్యకుసుమావళి” లోని, ‘షట్పది’లోవున్న పంక్తులని పాడుతూ, అందించేరట! ఆ పంక్తులు యివి:
“నల్లనల్లనివాడె, నగుమోమువాడె!
చిన్నివేణువునూదు చిరుగొల్లవాడె!
ప్రణయసంగీతంబు పాడుచున్నాడె!
ప్రేమమీరగ నిన్ను పిలుచుచున్నాడె!
చిన్నారి సిరిగొమ్మ సిగ్గేటికమ్మ?
కన్నారగనవమ్మ! కదలిరావమ్మ!”
3.
మా రజనీచిన్నాన్నకి రెండేళ్ళ పసి వయస్సులోనే, మాతృవియోగం కలిగింది. “కావ్యకుసుమావళి”, తృతీయభాగంలో అచ్చైన “విరహసంగీతం” (1922), అనే ఖండకావ్యంలోని భార్యావియోగబాధ తమ తండ్రిగారిదేనని చెపుతూ, చిన్నాన్న, తన ఈ పుస్తకంలో ప్రచురించిన ఆ విషాదగేయంలో నుంచి కొన్ని పంక్తులు:
“చిలుక పలుకులేవొ, చెలువంపు కోకిల
పదములేవొ, తేటి పాటలేవొ,
మాటలేవొ నన్ను మరపించి, మరపించి,
నా వసంతలక్ష్మి, నన్ను బాసె!
అదియె సుమధుర దివ్యగానానుభవము,
అదియె సుమధుర మందానిలానుభవము,
అదియె సుమధుర పుష్ప గంధానుభవము,
కాని నా వసంతేందిర కానరాదు!”
4.
కవిరాజహంస, కవికులాలంకార వేంకట-పార్వతీశ్వరకవుల విశ్వవిఖ్యాత కావ్యం, “ఏకాంతసేవ” లోనించి, రజనీచిన్నాన్న తన పుస్తకంలో పొందుపరచిన సుప్రసిద్ధపంక్తులు:
“విరిదండ మెడలోన వేయుటేగాని, కన్నార నీ మూర్తి గాంౘనేలేదు,
ప్రణమిల్లి అడుగుల బడుటయేగాని, చేతులారగ సేవ చేయనేలేదు,
వెలుగులో చీకటి విరిసెగాబోలు, మనసులో తెలివిలో
మరపులు తోచె,
ఆనందమందుటే అపచారమనుచు, మదినెంచి యీ రీతి
మాయలుసేయ భావ్యమై తోచెనే ప్రాణేశ, నీకు!”
5.
1936లో పిఠాపురం ఊరిబైట, వేపూరి వేణుగోపాలదాసు గారి “ఫాం”లో అసెంబుల్డ్ రేడియోలో తాను విన్న పాటలు, సంగీతం గురించి, రజనీచిన్నాన్న ౘదువరులతో పంచుకున్న ముచ్చటలు భలే గమ్మత్తైనవి. అవి ఆయన మాటలలోనే తెలుసుకుందాం:
“.….ఖుర్షిద్ , రఫిక్ గజ్నవీ వంటి బొంబాయి సినీ కళాకారుల పాటకచ్చేరీలను హిందీ(సినిమా పాటలే) వినేవాళ్ళం. హిందుస్థానీ కచేరీలు, అప్పుడప్పుడు మద్రాసు, మ్యునిసిపల్ రేడియో నుంచి కర్నాటక సంగీత కచేరీలు వినేవాళ్ళం. ఉత్తరాది కచేరీలలో హీరాబాయి బరోడ్కర్ , ఖాన్సాహెబ్ అబ్దుల్ కరీంఖాన్ , ఓంకార్నాథ్ ఠాకూర్ల కచేరీలు వినేవాళ్ళం. మద్రాసు రేడియోనుంచి చెంబై వైద్యనాథ అయ్యర్ , మహారాజపురం విశ్వనాథ అయ్యర్ల కచేరీలు(జయతి జయతి మంత్రం జన్మసాఫల్యమంత్రం), ఖాన్సాహెబ్ అబ్దుల్ కరీంఖాన్ పాడిన “జమునా కే తీర్ “(లాహోర్ నుంచి), “పియాబిన్ నహీc ఆవతచైన్ “, వంటి పాటలను మొదట విన్నది అలా సమకూర్చిన రేడియో లోనే! నేను “సింధ్ కాఫీ” రాగంలో రచించిన “మరునిముసమె మనదో, కాదో”, అప్పుడు రచించి, వరుస అమర్చినదే! సైగల్ పాడిన “లగ్ గమేc ఛోట్ ,హాయ్ రామ్ రామ్ “, కూడా ఆ పాట వరుసలో కలుస్తుంది.”
6.
ఇప్పుడు, ఇక్కడ చాలా-చాలా గొప్పముచ్చటని మనం హృదయంగమంగా పంచుకోబోతున్నాం! ప్రాచీన ఆర్ష దాంపత్య ధర్మనిర్వహణకి సమగ్ర నిర్వచనరూపమైన ఫలరసామృత ప్రాయమైన పరిపూర్ణ దివ్యభావం, మా రజనీచిన్నాన్న ఎదనుంచి పలుకుల పాల కడలి అలగా, కదలాడే కలగా, కనులముందు కళగా, తళతళగా, ఇలాగ వెలుగులు చిందింది; మన పుణ్యంవల్ల మనకీ అందింది:
“పిల్లలందరిమీద సమానమైన ప్రేమతో ఇలా మా ఆవిడపై వ్రాశాను:—
ఓసి నా మేనత్త కూతురా! ఓ
సోసి మాబావ మురిపెపు చెల్లెలా!
ఓసోసి మా చెల్లాయి చిననాటి ఆటపాటల చెలిమికత్తెవై
చెట్లెక్కు చిలిపి చేష్టల చిట్టి మరదలా! నా
తొలినాటి తీయపాటల దోర గొంతులో తన గొంతు
కలిపి పాడే కిన్నెరా! నా
అనుదిన స్వప్నాల, అనునిశాస్వప్నాల అనునిమేషము, నాదు
భావవృక్షము నల్లుకొను కల్పవల్లీ! నా
అయిదుగురు రత్న మాణిక్యాల బంగారు
అనుగు బిడ్డల కన్నతల్లీ……..”
7.
మరొక ప్రముఖ వృత్తాంతం, మనందరికీ ముచ్చటగొలిపేది, చరిత్రకారులకి కుతూహలం కలిగించేది, ఇప్పుడు ప్రస్తావించుకోబోతున్నాం!
“నే పాల్గొన్న మొదటి రేడియో కార్యక్రమం, శ్రీశ్రీ వ్రాసిన “మోహినీరుక్మాంగద”. రేడియోవారికి నేను పరిచయం అయిన వారంలోనే ఆ కార్యక్రమం వచ్చింది. అందులో నా పాత్ర ‘బ్రహ్మ’! రెండో కార్యక్రమం, నా నాటకం, “చండీదాస్ “. అది, 1941 ఫిబ్రవరి, 21 న, రేడియో ప్రసారం అయింది. నాటకం, దాని సంగీతం, నేనే కూర్చాను. ఐతే, దీని సంగీతదర్శకత్వాన్ని సాలూరి రాజేశ్వరరావుకి అప్పగించారు. ఆయన ….. సజ్జనుడు గనుక, “సంగీతం అంతా ఆయనే కూర్చాక, నా పేరు పెట్టారేమిటి?” అంటూ, ప్రకటనలో ముందు పేరు తనది ఉండరాదని ఎంచి, “సాహిత్య, సంగీత రచనలు రజనీ” వే, అని చెప్పించారు. తన పేరు దర్శకత్వానికి మాత్రమే అని చెప్పించుకున్నాడు. సంగీతశాస్త్రపరంగా, నిజానికి రజని,రాజేశ్వరరావుల హృదయం, సంప్రదాయం వంగమానస పుత్రత్వం. “మల్లీశ్వరి” సంగీతాన్ని శ్రీ రాజేశ్వరరావు ఆంధ్ర జనులందరూ మెచ్చేటట్టుగా కూర్చాడు.”
8.
మా రజనీచిన్నాన్న, బహుముఖ ప్రతిభాశాలి అని తెలుసుకున్నాం! అందువలన సాహిత్యరంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన మహానుభావులతో ఆయనకి సన్నిహిత పరిచయాలుండడం సహజమే! అటువంటి ఒక సన్నివేశం చూద్దాం:
“నేను మద్రాసులోవున్నప్పుడు, ‘లలిత సంగీత విభాగం’ చేసే రోజుల్లో, సంస్కృత కార్యక్రమాలకు కూడా నేనే అధికారిని. ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి, ఆచార్యులు డా.॥టి.రాఘవన్ వంటి సంస్కృత విద్వాంసులు ఇంకా ఇతర సంస్కృతకళాశాలల అధ్యాపకులు వచ్చేవారు. వారందరిలో గణనీయుడు మద్రాసు విశ్వవిద్యాలయ సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ కున్హన్ రాజా. ఈయన వేదాల గురించి, ఆర్యులగురించి ఆంగ్లగ్రంథాలు వ్రాశారు. ఇరాన్ లో ఓ యూనివర్సిటీకి అధ్యాపకులుగానూ వెళ్ళారు. ఆయన చిరపరిచితులు. నా కార్యక్రమాలలో కొన్నిటికి ఆయనని వక్తగా పిలిచి గౌరవించేను.”
9.
మా రజనీచిన్నాన్న మాటలలోనే శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారికి సంబంధించిన ఒక ముచ్చట, ప్రధానంగా సంగీత ప్రియులకోసమూ, మరీ ముఖ్యంగా శ్రీ ఓలేటివారి అమృతగానఝరిలో పరవశించే నాబోటి ఓలేటివారి మహాభిమానులకోసమూను:
“బడేగులాం ఆలీఖాన్ మద్రాసులో కచ్చేరి చేస్తున్న రోజులవి. శ్రోతలు ఎవరో చెప్పగా ఓసారి బడేగులాం ఆలీఖాన్ సాహెబ్ ఓలేటిని పిలిపించుకుని కొన్నిపాటలు, భజనలు విన్నారు. ఆయనే ఓలేటిని “ఛోటేగులామాలీ ఖాన్ ” అని పిలిచేరు.”
10.
మా రజనీచిన్నాన్న, తన తండ్రిగారైన, కవిరాజహంస,కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వెంకటరావుగారు, 27—10—1971వ తేదీన, చెన్నైలో, నిర్యాణంచెందిన విషాద సందర్భంలో, ఆకాశవాణి-చెన్నైవారు, ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో, శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రిగారు సమర్పించిన కన్నీటి విడ్కోలుని, తమ గ్రంథంలో యిలా పొందు పరిచేరు:
“నాకు ఈ మహాకవితో దాదాపు 64 సంవత్సరాల ప్రియబంధం. రూఢమైనదీ, అత్యంత సన్నిహితమైనదీనూ!
వీరి కవిత్వప్రభావం నా చిన్నతనంలో 1922 నుండి చాలా గాఢంగా ఏర్పడింది. వీరి పద్యకృతులేకాదు, వీరి నవలలు కూడా ఎంత వెర్రిగా ౘదివేమో! ఆ నవలల్లో, కథల్లోకన్నా కూడా, నా వంటి వారికి వానిలో వచ్చే గీతమాలికలు, గేయాలు అంటే మతి పోయేది.
గురజాడ వెనువెంట వచ్చిన వైతాళికులు వారు!”
స్వస్తి ||
రాబోరు తనను పోలిన
బాబాయిలు నేటిభూప్రపంచమునందున్
నా బాలవందనమ్ములు
బాబూరజనీకి చేర్చు బాలాంత్రపు హే!
శతపత్రసుందరీ వరు
డతి మెత్తని అంతరంగహంసాసనుడున్
శ్రుతిలయల కపరవాచ
స్పతి యగు రజనిన్ నుతింతు బాలాంత్రపు హే!
గజవాగ్గేయకృత్ అనఘుడు
వ్రజనాథుని మురళివంటి బాబూ-రజనీ!
రజనీగంధము లలితము
భజనీయము గాయకులకు బాలాంత్రపు హే!
‘రజనీ ఆత్మకథా విభావరి ‘ లో నువ్వు ఉల్లేఖించిన విశేషాలు
అత్యంత రమణీయం!
ఒక సాహిత్య సద్గోష్ఠి లాగ, ఒక లలిత సంగీత విభావరి లాగ —
వెరసి సంగీత సాహిత్య సుమధుర సమ్మేళనంలా సాగింది.
ఆకాశవాణిలో ఎన్నో ప్రయోగాలు చేసి, తనదైన ప్రత్యేకతను చాటుతూ
ఆ సంస్థ గౌరవాన్ని ఇనుమడింప చేసిన రజనీ ప్రాతఃస్మరణీయులు.
శారదా సంతతిలో మహాద్భుత ప్రతిభా సంపన్నుల జీవిత విశేషాలను
అందిస్తూన్నందుకు ధన్యవాదాలు.
Chaalaa vishayalu raseevu. Mallee mallee chadavaali anipinstunnayi