శారదా సంతతి — 23 : గార్హస్థ్య రసపూర్ణ ఆదర్శ దంపతి—శ్రీమతి బాలాంత్రపు సుభద్ర + శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
17—12—2017; ఆదిత్యవాసరము.

శారదా సంతతి~23 — గార్హస్థ్య రసపూర్ణ ఆదర్శ దంపతి—శ్రీమతి బాలాంత్రపు సుభద్ర + శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు.

ఈ వారం మా సుభద్రపిన్ని, మా రజనీచిన్నాన్నల గురించి మన “శారదా సంతతి” శీర్షికలో వ్రాయగలిగిన యోగ్యత నాకు సిద్ధింౘడం, నా అనేక జన్మల నిరవధిక తపఃపుణ్య ఫలంగాభావిస్తున్నాను. శ్రీశారదామాత అనుగ్రహం అపారంగా, ఆ తపఃఫలంగా లభింౘడంవలన, నాకు ఈ అర్హత కలిగింది.

మా సుభద్రపిన్ని, 13—04—1926వ తేదీన, ఆలమూరు (తూర్పు గోదావరి జిల్లా)లో, శ్రీమతి బుద్ధవరపు మహాలక్ష్మి, శ్రీ బుద్ధవరపు వెంకట సుబ్బారావు దంపతికి జన్మించింది. పిఠాపురంలో, మేనమామగారింట్లోవుండి, ఉన్నత పాఠశాల విద్యని ౘదువుకుంది. చిన్నప్పటినుంచి చాలా సున్నితమైన, సంస్కారవంతమైన, నమ్రతతోకూడిన, సభ్యజన మాన్యమైన, సూక్ష్మగ్రహణబుద్ధి కలిగిన మా సుభద్రపిన్ని వివిధ తరాలకి చెందిన మా అందరి కుటుంబాలలోని పెద్దల ఆదరణని, సమవయస్కుల సంప్రీతిని, పిన్నల గౌరవాభిమానాలని పొందింది.

మా రజనీచిన్నాన్న, 29—01—1920లో, నిడదవోలులో,  శ్రీమతి బాలాంత్రపు వెంకట రమణమ్మ, కవిరాజహంస, కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వెంకటరావు దంపతికి,  రెండవ కుమారుడుగా జన్మించేరు. పత్రికా-గ్రంథ సంపాదకులు, ప్రాచీనాంధ్ర గ్రంథ పరిష్కర్త, పీఠికా రచయిత, కవి, ఆంధ్రాంగ్లసారస్వతనిధి, విమర్శకులు, రచయిత ఐన శ్రీ బాలాంత్రపు నళినీకాంత రావు, అంటే మా నళినీచిన్నాన్న, మా రజనీచిన్నాన్నకి, అన్నగారు, నిర్మాణాత్మక ప్రోత్సాహకుడు.

ప్రాథమిక విద్యాభ్యాసం పిఠాపురంలోను, ఉన్నత పాఠశాలావిద్యాభ్యాసం కాకినాడ పి. ఆర్ . కళాశాలలోను పూర్తి ఐంది. తెలుగు-సంస్కృత భాషలు, ప్రత్యేక అధ్యయన విషయాలుగా, ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖ పట్టణంలో, బి,ఏ.,(ఆనర్సు)లో, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేరు. రజనీచిన్నాన్న, పిఠాపురంలో ఉండగానే, వీణ సంగమేశ్వరశాస్త్రిగారి శిష్యులైన మండ కృష్ణమూర్తిగారివద్ద, తరువాత, కాకినాడలో ౘదువుకునే కాలంలో, శిష్టు సర్వశాస్త్రిగారివద్ద సంగీతవిద్యని అభ్యసించేడు.

14—05—1940వ తేదీన, మా సుభద్రపిన్ని, మా రజనీచిన్నాన్నల వివాహం జరిగింది. వారికి ఐదుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.హేమచంద్ర, శరత్ చంద్ర, రామచంద్ర(వెంకోబ్ ) మగపిల్లలు. వారు ముగ్గురూ నాకు ఆత్మీయులు. రామచంద్రని అందరమూ “తమ్మూ” అని పిలుస్తాం, ముద్దుగా. రజనీచిన్నాన్న గానకళాంశ తమ్మూలోవుంది. నేను తమ్మూచేత తాను చిన్నపిల్లవాడిగావున్నప్పుడు, అవకాశం చిక్కినప్పుడల్లా అనేకగేయాలు పాడించుకుని, విని, పరవశించేవాడిని. మృదంగం నేర్చుకునే క్రొత్తలో, చాలా సున్నితంగా, సలక్షణంగా మృదంగం వాయించి నాకు వినిపించిన తమ్మూ యిప్పటికీ నా కళ్ళముందు ఉన్నాడు. అతని గాత్రమాధుర్యం, అమాయకపు మొహంలో అతడు పాటపాడేసమయంలో కనిపించే సున్నిత భావోద్వేగాలు నామనసులో సజీవంగా దోగాడుతూ ఉంటాయి.

రజనీచిన్నాన్న ఆకాశవాణి-మదరాసు కేంద్రంలో, ప్రొగ్రాం ఎక్జిక్యూటివ్ గా, అంటే, కార్యక్రమ నిర్వహణాధికారిగా, ఉద్యోగంలో చేరేడు. 1947, ఆగస్టు, 15 అర్థరాత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూగారి ఆకాశవాణి ప్రసంగం పూర్తి కాగానే, స్వతంత్ర భారత ఆకాశవాణిలో మొట్టమొదటి తెలుగుపాట ప్రసారమయ్యింది. “మ్రోయింపు జయభేరి” అనే ఆ పాటిని రజనీచిన్నాన్న రచించి, దానికి ౘక్కని సంగీతంకూర్చి, టంగుటూరి సూర్యకుమారిగారిచేత పాడించేడు. ప్రథమ స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భంగా, “మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి” అనే పాటని రచించి, సంగీతంకూడా కూర్చి, రజనీచిన్నాన్న,ఆ పాటని, టంగుటూరి సూర్యకుమారిగారిచేతనే, పాడించేడు. తదుపరికాలంలో, విజయవాడ ఆకాశవాణి, కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేసేడు. మొట్టమొదటిసారిగా, ఆకాశవాణి-విజయవాడలో, చెప్పలేనంత జనాదరణ పొందిన “భక్తిరంజని” కార్యక్రమ ప్రసారానికి, రజనీచిన్నాన్న, స్వయంగా శ్రీకారం చుట్టేడు. ఆ తరువాత, అనేక ఆకాశవాణి కేంద్రాలలో, వివిధ స్థాయిలలో తన సృజనాత్మక సేవలందించి, ఉద్యోగవిరమణ చేసేడు. ఆ తరువాత, రాజమహేంద్రి, తెలుగు విశ్వవిద్యాలయంలోను, అటు పిమ్మట, తిరుపతి, టి.టి.డి. వారి శ్రీ వేఙ్కటేశ్వర కళాపీఠంలోను, ఉన్నత పదవులు అలంకరించి, ఆ యా సంస్థలకి తమ అమూల్య సేవలని అందించేరు.

తెలుగు, సంస్కృతం, ఆంగ్లం భాషలలో అపార పాండిత్యమే కాక, బెంగాలీ, తమిళ, హిందీ, కన్నడ మొదలైన భాషలలోకూడా మంచి పట్టువుండేది, మా రజనీచిన్నాన్నకి.

ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. మదరాసులోవుండగా, “స్వర్గసీమ“, “గృహప్రవేశం“, “మానవతి“, “పేరంటాలు“, “లక్ష్శమ్మ కథ“, “రాజమకుటం“, “బంగారుపాప” చలన చిత్రాలకి సంగీతరచన చేసేరు. కొన్ని చిత్రాలకి పాటలు వ్రాసేరు. అవి ఎంతో ప్రజాదరణపొంది, ఈ కాలానికికూడా, కొన్ని పాటలు, సర్వజనామోదంలో షష్టిపూర్తినేకాదు, సప్తతి పూర్తినికూడా చేసుకుని సరసుల మనసుల పల్లకిలో ఊరేగుతూనేవున్నాయి! ఉదాహరణకి, “ఓహో పావురమా!”, “ఓహో తపోధన సుందరా!” మొదలైనవి.

బహుముఖ ప్రతిభా సంపన్నుడైన రజనీచిన్నాన్న, నా దృష్టిలో ఒక వ్యక్తికాదు. శ్రీశారదామాతయొక్క అనేకానేక దివ్యవిభూతులలోని, కొన్ని విశిష్ట విభూతుల సమాహార శక్తిగా, శ్రీమాత ప్రత్యేకానుగ్రహంవలన, మా గోత్రర్షుల ఆర్షసంకల్పంవలన, మా అందరి పూర్వుల పుణ్య పరిపాకస్వరూపమై మా రజనీచిన్నాన్న సంభవించేడు. ఆయన సర్వతోముఖ ప్రతిభాపూర్ణ జీవితవైభవ విలాసం పరికిస్తే, Dr. Samuel Johnson, Oliver Goldsmithని గురించి అన్నమాటలు, మా రజనీచిన్నాన్నకికూడా పూర్తిగా అన్వయిస్తాయి.

“He(Goldsmith) left nothing untouched.
He touched nothing which he did not adorn.”

“ఆయన దేనినీ స్పృశింౘకుండా వదిలి పెట్టలేదు.
ఆయన స్పృశించినదానిని దేనినీ అలంకరింకుండా వదిలిపెట్టనూలేదు!”

“ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము”, “శతపత్రసుందరి”, “విశ్వవీణ”, “క్షేత్రయ్య”, “రామదాసు”, “త్యాగరాజు”, మొదలైనవి, వారి కొన్ని అమూల్య రచనలు.

1980లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు, “కళాప్రపూర్ణ” గౌరవ డాక్టరేట్ పట్టాతో రజనీచిన్నాన్నని సత్కరించేరు. ఆయన అనేక రంగాలలో చేసిన సేవలకి, గుర్తింపుగా, అనేక బిరుదులు, సత్కారాలు, సమ్మానాలు, బహుమానాలు అందుకున్నారు. అవన్నీ అంతర్జాలంలోని “గూగుల్లో” గమనింౘవచ్చు. వారిగురించిన ఎన్నో వివరాలు, విశేషాలు, “వికిపీడియా”లో భద్రంచెయ్యబడ్డాయి. అభిరుచి కలవారువాటిని సందర్శించవచ్చు.

ఇంక, మా సుభద్రపిన్ని నా దృష్టిలో, ఈ ఇలాతలంపైన సంచరించిన ఒక అనుపమ దేవతామూర్తి. ప్రేమాదరాలు, ఎప్పుడూ చెరగని చిరునవ్వు, అరమరికలు తెలియని ఆప్యాయత, కేవలం బంధుమిత్రులకి మాత్రమే పరిమితంకాని అతిథిసత్కారనిరతి, అందరికి వండి, వడ్డించడంలో అన్నపూర్ణాదేవి ఆరాటం — ఇవన్నీ రాశీభూతమైన  మాతృదేవతారూపమే మా సుభద్రపిన్ని. వారు రోజూ చేసే వంట నిత్యనూతనంగావుండేది. వారు పెట్టిన ఊరుగాయల రుచులు, దేశంలోని అన్ని ప్రాంతాల వారికి, దేశాంతరవాసులకి కూడా అందుతూవుండేవి. మా సుభద్రపిన్ని ఎంతో ప్రీతిభావంతో వండడమేకాక, అంతకిమించిన ప్రేమాభిమానాలతో కొసరి-కొసరి వడ్డిస్తూ, మంచి-మంచి కబుర్లు చెపుతూ, భుక్తాయాసం  వచ్చేవరకు అన్ని పదార్థాలనీ దగ్గరవుండి తినిపించి, సంతోషించేది. ఆ వంకాయ కారంపెట్టినకూర, ఆ గోంగూర పచ్చడి, ఆ టొమేటో ఊరుగాయ, ఆ కందిపప్పు పులుసు, ఆ పెరుగు అవన్నీ వాటికి అవే సాటి. అవి ప్రత్యేక రుచులతో మాటి-మాటికి సుభద్రపిన్ని పెట్టే భోజనానికి నన్ను ఆకర్షించేవి. నేను బాగా పరిమితమైన మోతాదులో భోజనంచేసే భోజనప్రియుణ్ణి. “ముఖే ముఖే సరస్వతీ” అన్నట్లుగా, “హస్తే హస్తే హ్యన్నపూర్ణా“, “హృది హృది హ్యన్నపూర్ణా“, అని ఈ విషయంలో నా అనుభవ పాఠం!

మా సుభద్రపిన్ని, నిడుమోలు జగన్నాథంగారి దర్శకత్వంలో, తెరకెక్కిన “తారుమారు“, “భలేపెళ్ళి” చలనచిత్రాలలో పార్శ్వగానం చేసేరు. అనేక సందర్భాలలో, రజని గేయాలు,  రబీంద్రసంగీతం, రజనితోకలిసి యుగళ/సహకార గానం అందించేరు.

15—07—2003వ తేదీన,స్వభానునామ సంవత్సర, ఆషాఢ బహుళ తృతీయ(తదియ)నాడు, మా సుభద్రపిన్ని, వైయక్తిక భౌతిక మాతృరూపాన్ని పరిత్యజించి, తన మౌలిక విశ్వ మాతృ స్వరూపంలోకి విలీనమైపోయింది.

నేను, మదరాసులో ఉద్యోగంచేసే రోజులలో, మా రజనీచిన్నాన్న, చెన్నై వచ్చేవాడు. మా నళినీచిన్నాన్నఇంట్లో, తిరువళ్ళిక్కేణిలోని, బి.వి.నాయుడువీధిలో, విడిది చేసేవాడు. మాకిరణ్ , చిమ్మీ, లావణ్య, బాబి, వాళ్ళమిత్రులు, నేను, కలకండపలుకు చుట్టూ చేరే ౘలిచీమలలాగ, రాత్రి భోజనానంతరం, రజనీ చిన్నాన్న చుట్టూ చేరిపోయేవాళ్ళం. “హాయిలో నేల ఎదకింత హింస? తీయపాటలో బాధేల వంశీ?”, “ననుజూచీ, నవ్వేరే! నాసఖులీ వ్రజభామినులు!”, “స్వైరిణి అన్నారు, నన్ను, శ్యామసుందరా!”, “ఓ విభావరీ! ఓహో విభవరీ!”, మొదలైన అనేక గేయాలు-గీతాలు, రజనీ చిన్నాన్న, ఆకాశవాణికోసం, సంస్కృతంలో రచించి, సంగీతం సమకూర్చిన “మేఘసందేశం” సంగీతరూపకంలోని అనేక అద్భుత గీతాలు, మొదలైన మా “ఫర్మాయిష్ ” పాటలని, ఏ ఒక్కరినీ కాదనకుండా పరమాద్భుతంగా పాడి మాకువినిపించి మా రజనీ చిన్నాన్న, మహాగానగంధర్వుడు, సకల స్వర విన్యాస సామ్రాజ్య చక్రవర్తి, ఆ “జ్యోతిష్మతి” ధామంలో తనగానసామర్థ్య త్రివిక్రమ స్వరూపంతో, మమ్మల్నందరినీ , మహిమాన్వితమైన శ్రావ్య మాధుర్యలోకంలో విహరింపజేసి, మంత్రముగ్ధుల్ని చేసేసేవాడు. అప్పుడప్పుడు, అలాగ, కొన్ని మహనీయ రజనీ సమయాలు, రజనీకాంతుని అలౌకిక గానరస స్పర్శతో ద్రవీభవించి నా హృదయకేదారంలో సంగీతమందాకినులై, ఇప్పటికీ ప్రవహిస్తూనేవున్నాయి. ఇది దైవదత్తమైన మానవ నైజ స్మృతిస్మరణప్రజ్ఞయొక్క పరమ ప్రయోజన ప్రద వైభవాలలో ఒక విలక్షణ దీప్తి విలాసం!

మా రజనీచిన్నాన్న, “రజనీ ఆత్మకథా విభావరి” ఒక అపురూపమైన రసమయ రచన! తెలుగు ఆత్మకథా సారస్వతంలో, నూతనాధ్యాయానికి మార్గదర్శకంగా ఆవిర్భవించిన అనల్ప శిల్ప మనోజ్ఞమైన ఆ మహనీయగ్రంథంలోని కొన్ని గొప్ప అంశాలని, ఈ వారం “కదంబకం” లో మనం అందరం కలిసి పంచుకుందాం!

https://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao

స్వస్తి ||

You may also like...

5 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    _/\_.
    అజరామర్త్య యువాంతరంగసదనుం, డాబాలగోపాల సా
    ధుజనానందకరుండు, సజ్జనుడు, వాధూలార్షగోత్రుండు, సా
    ర్వజనీన శ్రుత భక్తిరంజకుడు, మా బాలాంత్రవంశేందుడౌ
    రజనీకాంతుని వాగ్విభూతి వలచెన్ రాగమ్ములున్ తాళముల్!

  2. PURUSHOTHAM SRIKAKULAPU says:

    బహుముఖ ప్రఙ్ఙాశాలి తెలుగుతల్లి ముద్దుబిడ్డ బాలాంత్రపు రజనీకాంతరావుగారు మావూరులో జన్మించడం మాకు గర్వంగా ఉండేది. వారు మీ పినతండ్రి గారని వారిప్రతిభను అద్భుతం గా తెలియచేసారు. చాలాచాలా సంతోషం. మీ రచనాశైలి సమకాలీన సమాజం లో అత్యంత అరుదైన సాహితీవిన్యాసం

  3. Sampath Kumar says:

    Good style of presentation guruvugaaru.

  4. సి. యస్ says:

    రజనీ చిన్నాన్న, సుభద్ర పిన్నిలను గురించి సమర్పించిన ఈ జీవన
    చిత్రం రసరమ్యంగానూ , సప్తవర్ణ శోభితంగానూ ఉంది.
    వారిపట్ల నీకుగల గౌరవ, ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తూ , నీ
    హృదయపు లోతుల్లోంచి వచ్చిన ఈ రచన, నేరుగా చదువరి
    మనసుకి హత్తకునేలా సాగింది.
    ఆయనతో నీ గత స్మృతుల పరంపరని అందంగా అలంకరించింది —
    నీ భాషా కుసుమం.
    ఎంతటి గొప్ప పాటలు అవన్నీను! రజనీ, ఎస్. రాజేశ్వరరావుల కలయికలో మహాద్భుతమైన లలితగేయాలు రూపు దిద్దుకున్నాయి.
    సుభద్ర పిన్ని పాడేదని తెలిసి, ఆశ్చర్యం, ఆనందం కలిగేయి.
    జాతి గర్వించదగ్గ ఇంతటి గొప్ప వాగ్గేయకారునికి, మన అంధ ప్రభుత్వాలు ఇచ్చిన విలువ తలుచుకుంటే మనసు చివుక్కుమంటుంది.

  5. Devi says:

    We all are very grateful to u Mavayya for presenting the biography of Sri Rajani tatayyagaru and Ammammagaru, the most privileged couple of Balantrapu clan in today’s episode. I was thrilled and overjoyed reading about them which made me feel surprised that our family has a great literary,poetic and musical background . Your reverence and warmth towards them is evident in each and every line of the article. Rajani tatagaru’s multi faceted personality is very awesome and inspiring to the present generation. We all are fortunate to learn about great people and their lives in this blog.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *