సాహిత్యము-సౌహిత్యము – 32 : వాలిని పెండ్లియాడె హరిబాణుడు, సర్వజగద్ధితంబుగన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
16—12—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~32.

ఈ వారంకూడా శ్రీ కనుమలూరి వెంకటశివయ్యగారి సమస్యాపూరణమే చూద్దాం.

“వాలిని పెండ్లియాడె హరిబాణుడు,
సర్వజగద్ధితంబుగన్ ” ||

హరి అంటే విష్ణువు. బాణుడు అంటే (నర్మద)బాణరూపం కలిగిన శివుడు. వీరిద్దరూకలిసి వాలిని పెళ్ళిచేసుకోవడం, దానివల్ల లోకానికి మేలుకలగడం ఇదంతా మహా గందర గోళంగావుంది. శివయ్యగారు పరమ మనోజ్ఞస్థాయిలో పద్యపూరణం చేసి, ఈ అయోమయం అదృశ్యం అయ్యేలాగ సాహిత్య ఇంద్రజాలాన్ని ప్రదర్శించేరు. చిత్తగింౘండి!

“పూల లలిన్ సిగన్ తురిమి, భూధర
కన్య, విభూతిరేఖలన్ ,

ఫాలమునందు తీర్చి, శివభర్తృక
భావము కోరి, దీక్ష, షట్

కాలములన్ శివున్ కొలువ, కాయజ
సూను సమాను తత్ సినీ

వాలిని పెండ్లియాడె హరిబాణుడు,
సర్వజగద్ధితంబుగన్ ” ||

సర్వలోక మంగళప్రదాయకమైన పార్వతీ-పరమేశ్వరుల కల్యాణఘట్టం ఇతివృత్తంగా చేసుకుని, అసంబద్ధంగా కనిపించిన సమస్యని, సంపూర్ణ అర్థవంతంగా కవిగారు పద్యాన్ని మలచి మనకి బహూకరించేరు. ఇప్పుడింక భావాన్నిచూద్దాం:

“పరమపావనరూప పార్వతీదేవి, శంకరభగవానుని భర్తగా పొందాలని కోరుతూ, ౘక్కగా తన కేశపాశంలో సొగసులువిరిసిన పూలదండలని అలంకరించుకుని, లలాటమందు విభూతిరేఖలని ధరించి, శివదీక్షతో ఆరు కాలాలలోను అనన్య అనురక్తితో ఆయననే ఆరాధించింది. మహాసౌందర్యవంతుడైన మహేశ్వరుడు సర్వవిశ్వ శ్రేయస్సుకై  ప్రసన్నుడై పార్వతీదేవిని పరిణయం చేసుకున్నాడు”.

సందర్భ కోశం-Glossary :—
పూల లలిన్ =సొగసైన పూలతో,
భూధరకన్య=పర్వతపుత్రి=పార్వతి,
కాయజసూను సమాను=మన్మథ సౌందర్యశాలి,
సినీవాలి=పార్వతీదేవి,
హరిబాణుడు=శంకరుడు. ||

స్వస్తి ||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    తెలుగు వాళ్ళకే సొంతమైన అష్టావధానాలు క్రమేణా మరుగున పడిపోతున్నాయి. ఇక్కడ ఉదహరిస్తున్న సమస్యా పూరణాలు చూస్తూంటే, ఎంతటి ప్రతిభావంతులైన పద్య కవులు– అందునా బహుముఖ ప్రజ్ఞను కనపరిచిన అవధానులు మన తెలుగు నేలమీద పుట్టారో తెలుస్తోంది. ఇలా మళ్ళీ రాయడం ద్వారా ఈ
    తరం వాళ్ళకి కూడా ఈ అవధాన ప్రక్రియ పరిచయమౌతుంది . మంచి సారస్వత సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు.

  2. Kbj srinivas says:

    Samasyaa puranam chala chaala baagundi. Kavi prathibaki addam pattela undi. Cinevali maataki vyutpatti ardham chappamani naa request.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *