సాహిత్యము-సౌహిత్యము – 31 : రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
09—12—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~31.
ఈ రోజు సమస్యాపూరణం శ్రీ కనుమలూరి వెంకట శివయ్య వరేణ్యులు. వారికి యివ్వబడిన సమస్య యిది:—
“రాయలు కేలదాల్చె సతి రత్నసమంచిత నూపురమ్ములన్ ” ||
“శ్రీకృష్ణదేవరాయలువారు, వారి భార్య యొక్క రత్నమయశోభతో నిండిన కాలి అందెలని, తన చేతికి ధరించేడు” –అని ఈ సమస్య భావం. పూర్తిగా అనుచితంగావుంది. దానిని తొలగిస్తూ, కవిగారు ఎంత ఔచిత్యసంపన్నంగాను, లలితశృంగార రసబంధురంగాను పద్యపూరణం, సద్యఃస్ఫూర్తితో నిర్వహించేరో రసజ్ఞులైన మన సత్సంగ సభ్యులు గమనిస్తారు.
“పాయక తాల్చుమంచు పతి భార్య
కొసంగెను, ముద్దుటందియల్ ,
పాయక తాల్చు భార్య, పొరపాటున
తాల్చదదొక్క శార్వరిన్ ,|
జాయపయిన్ , కడున్ కనలె, చాన
ధరించెను, తల్లి పల్కె, రా
రా! యలు కేల? తాల్చె సతి, రత్న సమంచిత నూపురమ్ములన్ ” ||
ఇక్కడ కవిగారు కమనీయమయ ఇతివృత్తం కూర్చి ఈ పరమరమణీయ పద్యోపహారాన్ని మనకి అందించేరు. దీనిలో సుతిమెత్తని, ధర్మబద్ధమైన, దాంపత్యనిర్వహణలో భాగమైన, నవయౌవనంలోనున్న పతి-పత్నుల శృంగారాన్ని రసమయ కావ్యభాషలో నిబద్ధంచేసి, మనకి అందించేరు. పద్యభావం యిది:—
“(నవయౌవనవతి,సౌందర్యవతి)ఐన తన భార్యకి, యువభర్త మణిమయకాంతితో మెరుస్తున్న (బంగారు)నూపురాలని-అంటే- కాలి అందెలని కానుకగా యిచ్చేడు. ముద్దుగా తాను ఆమెకి యిచ్చే సమయంలోనే తన ముచ్చటని కూడా వెలిబుచ్చేడు.ఆ అందెలని తప్పక ఆమె రోజూ ధరించి, అతడికి కనువిందు చెయ్యాలి. ఆమె సంతోషంతో అంగీకరించింది. ఒక రాత్రి ఆమె అందెలు ధరించడం మరచిపోయింది. దానితో భర్తగారికి కోపం వచ్చేసింది- భార్యమీద, మాటా-మంతీ లేకుండా అలిగి కూర్చున్నాడు. ఆయనని సరదియ్యడం ఆమెవల్ల కాలేదు. ఈ వరసంతా గమనిస్తూనేవున్న అత్తగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. అప్పుడు అత్తగారు తన కొడుకుకి నచ్చచెపుతూనే, కాస్తంత మందలింపు ధోరణిలో యిలాగ అంది: “రారా! నాయనా! ఎంతసేపు అలుగుతావు? నీ భార్య నీ మాటనిఅనుసరించి, నీ ముద్దూ-ముచ్చటా తీర్చడానికి రత్నాల అందెలు ధరించి, అందాలు చిందేలాగ అలంకరించుకుని నీవద్దకువచ్చి, నిన్ను సంతోషపెట్టడానికి ఎదురుచూస్తోంది“.
స్వస్తి ||
కవితా వధూటికి అవధానిగారు సమర్పించిన ఈ ఉత్పలమాల
పరిమళభరితంగానూ, మనోహరంగానూ ఉంది. ఇంతకుముందు
వినని కవులపేర్లూ, వారు అవధానాలలో పూరించిన గొప్ప పద్యాలూ ఇక్కడ పరిచయం అవుతున్నాయి. ఈ పద్యపూరణ రసరమ్యంగా ఉంది. భావ వివరణ కూడా హృద్యంగా ఉంది.
చాలా బాగుంది. సమస్యాపూరణం అంత తేలికైనటువంటి విషయం కాదని తెలుస్తోంది