Fun facts – 25
శ్రీశారదా దయా చంద్రికా :—
09—12—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు~25.
1.రష్యాలోని ఉరల్ పర్వతప్రాంతంలో నిఝ్నియ్ అనేపేరున్న ఒక ఊరువుంది. ఆ ఊరిలో రోజా కులెషోవా అనే అమ్మాయివుంది. ఆమె మాస్కోలోని “సోవియట్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ “కి, తరచు వెళ్ళేది. అక్కడ పరిశీలనలలో, రోజా తన వ్రేళ్ళతోను, మోచేతితోను కూడా (కళ్ళతో చూడకుండా) తడిమి మాటలు ౘదవగలిగేది. పూర్తిగా దళసరి నల్లని వస్త్రం మడతలువేసి, కళ్ళకి గంతలు కట్టినా, ఆమె అనర్గళంగా పుస్తకంలోని పుటలలోవున్న మాటలని, వాక్యాలని ౘదివేయగలిగేదిట.
2. ప్రఖ్యాత ఫ్రెంచి ఇంప్రెషనిస్టు మానె (Manet), ఒక చిన్న సరోవరతీరంలో వున్న ఒక గ్రామంయొక్క ప్రతిబింబం ఆ సరస్సులో ఉన్నదివున్నట్లు, ఒక అద్భుత వర్ణచిత్రం రచించేడు. దానిని “న్యూయార్కు మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ” లో ప్రదర్శనలో పెట్టేరు. ఆరునెలల తరవాత, ఒక సందర్శకుడు ఆ చిత్రం తలక్రిందులుగా వ్రేలాడుతూ వుండడం గమనించి, నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ళేడు. అప్పుడు అది సరిచేయబడింది.
3. మళ్ళీ మాస్కోమహానగరమే మన వేదిక. ఆ మహానగర రాజమార్గాలలోను, విశాల వీధులలోను, సందు-గొందులలోను, ఇరుకుదారులలోను అలెక్సీ సోగ్మొరోవ్ , అలుపు మరిచిపోయి అన్వేషిస్తూనే వున్నాడు- గత 14 సంవత్సరాలుగా! హిట్లరు సైనిక దండయాత్ర సమయంలో మాస్కోలోవున్న వారిద్దరూ ప్రాణభయంతో చెరొకవైపుకీ పారిపోయేరు. అప్పటినుంచి, ఇప్పటికి 14 ఏళ్ళు గడిచిపోయేయి. ఐనా అలెక్సీ తన సోదరికోసం వెదకడం మానలేదు. ఆమె అౙ-పౙ అతనికి అణుమాత్రమూ దొరకనూలేదు. ఆ రోజుకూడా తన అన్వేషణని కొనసాగిస్తూ, అన్నివైపులకీ చూస్తూ, అలెక్సీ కాలిబాటమీద నడుస్తున్నాడు. ఉన్నట్టుండి కాలికేదో తగిలి, తూలిపడబోయి ఆపుకున్నాడు. కాలికింద ఏదోవుంది. ఒంగి చూసేడు. అది మనీ పర్సు. దాంట్లో కొద్దిగా డబ్బులు, ఒక చిరునామా కాగితమూవున్నాయి. అలెక్సీ కష్టపడి ఆ చిరునామాని వెతుక్కుంటూవెళ్ళి, ఆ యింటిముందు నిలబడి తలుపు తట్టేడు.తలుపు తెరిచిన ఆమెని పరకాయించి చూసేడు. తాను ఎవరికోసం 14 ఏళ్ళుగా ఎడతెగని తాహతహ్యంతో వెదుకులాడుతున్నాడో ఆ సహోదరి ఎదురుగా సాక్షాత్కరించింది. ఆమెకి ఎట్టెదురుగా తానువున్నాడు.
స్వస్తి||
మూడు fun facts కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
మానె modern art గురించి చదివినప్పుడు– ఒక వలయంలో
చిన్న చుక్కపెట్టి ఫ్రేమ్ లో బిగించి ఉన్న బొమ్మని చూస్తూ ఒక సందర్శకుడు “దానిని ఎటునుంచి చూడాలి” అని అడిగిన జోక్
గుర్తుకొచ్చింది.
ఎలెక్సీ సొగ్మొరోవ్ గురించి రాసింది చదువుతోంటే ‘యాదోంకీ
బారాత్ ‘ లాంటి సినిమాకథల్ని తలపింప చేసింది. విధి విచిత్రాలు
ఎప్పుడూ ఆశ్చర్యకరమే!