కదంబకం — 23 : మనోధర్మరీతి
శ్రీశారదా దయా సుధ :—
03—12—2017; ఆదిత్యవారము.
కదంబకం—23.
ఈ రోజు “శారదా సంతతి—21” లో జన్మసిద్ధ సంగీత కళాప్రపూర్ణుడు శ్రీ జి.ఎన్ . బాలసుబ్రహ్మణ్యంగారి సంక్షిప్త పరిచయం చేసుకున్నాం! ఇప్పుడు వారి గానకళాప్రయోగ వైశారద్యం, వాగ్గేయకార వైదుష్యం, కవిత్వ వ్యాసంగం, శిష్య-ప్రశిష్య పరంపర, సంభాషణా చాతుర్యం మొదలైన బహుముఖ ప్రజ్ఞలలో కొన్నైనా పరిచయరూపంలో ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం!
ఉత్తరభారత సంగీతసంప్రదాయంలో గ్వాలియర్ , ఆగ్రా, రాంపూర్ -శహస్వా, కిరానా, అట్రౌలీ-జయపూర్ , పటియాలా మొదలైన అనేక ఘరానా పేర్లతో ప్రసిద్ధికెక్కిన వేరు-వేరు సంగీతం బాణీలువున్నాయి. ఐతే, ద.భా.సం. సంప్రదాయంలో, కొందరు మహాకళాకారుల వ్యక్తిగత నామాలతో వివిధ గాన-వాద్య రీతులు ప్రశస్తిలోవున్నాయి. ఉదాహరణకి-
ముసిరి-మహారాజపురం-అరియక్కుడి-చెంబై-మణి అయ్యరు-ఎం.డి.ఆర్ ., -సెమ్మంగుడి-పినాకపాణి-ఓలేటి-నేదునూరి-బాలమురళి-ఎమ్మెస్ అమ్మ-పట్టమ్మాళ్ -ఎమ్మెల్వీ-శ్రీకంఠన్ -మహానుభావుడు GNB – మొదలైన చాలా గొప్ప వారైన సుప్రసిద్ధగాయకుల వ్యక్తిగత నామధేయాలతో చాలా బాణీలు బాగా వ్యాప్తిలోను, వ్యవహారం లోనువున్నాయి. ఈ బాణీలన్నింటికీ, ఉ.భా.సం.ఘరానారీతులలోవలెనే, విలక్షణ స్వరూప, స్వభావ, ప్రవృత్తి, ప్రయోగ పరమైన అనేక విభూతులతో విలసిల్లుతూంటాయి. ప్రస్తుతం జిఎన్బీ బాణీగురించి దిఙ్మాత్రంగా పరిచయం చేసుకుందాం.
శ్రుతి, స్వరం, లయ, రాగం, తాళం, మానవగాత్రం, మొదలైన మూలద్రవ్యాలు గాయకులందరికీ సమానమే! మూలశాస్త్రం అందరికీ సామాన్య జ్ఞానాన్నే బోధిస్తుంది. కేవలం సామాన్యులు ఆ జ్ఞానాంశాలని జాగ్రత్తగా అనుసరిస్తారు.మధ్యస్థాయి అసామాన్యులు శాస్త్రజ్ఞానానికి, తమ సాధారణ సృజనాత్మకశక్తిని జోడించి ప్రత్యేక ప్రఖ్యాతిని పొందుతారు. ఉత్తమస్థాయి అసామాన్యులు, తమ శాస్త్రజ్ఞాన శాశ్వతమూలాలకి భంగం కలిగించని, అసాధారణ సృజనాత్మక ప్రతిభా ప్రకాశ ప్రసరణ సామర్థ్యంతో, వినూతన మార్గాలలో, క్రొంగ్రొత్త విలువలతో, అప్పటివరకు స్తబ్ధతతో ప్రవహిస్తున్న సంగీతకళావాహినిలో, ఒక నిర్మాణాత్మక నవీన పరివర్తనాన్ని కలిగిస్తారు. ఇది, సంగీత, సాహిత్య, వాస్తు, శిల్ప, చిత్రకళాది సర్వ సృజనాత్మక క్షేత్రాలలోనూ సంభవించేదే!
సంగీత/సాహిత్య/వాస్తు/శిల్ప/చిత్ర కళాదుల అధిదేవత శ్రీశారదాదేవి సంకల్పంరూపంగానే అటువంటి అసాధారణ మేధామూర్తులు అవతరించి, ఆయాసమయాలకి అవసరమైన, అనుగుణమైన క్రొత్త విలువలని ఆయా సృజనాత్మక క్షేత్రాలలో ప్రవేశపెడతారు. మిగిలిన వారు అభానందించి, ఆనందించి, అనుసరిస్తారు. శ్రీ జిఎన్బీ అలాంటి అసాధారణ మేధాసంపన్నుడు. ఆయన రసపూర్ణప్రజ్ఞ సంగీతంలో ప్రవేశపెట్టిన మనోధర్మరీతి మహా మనోజ్ఞమైనది. ఆ అపూర్వప్రతిభా ప్రభావం ద.భా.సం.సంప్రదాయంపైన శాశ్వతముద్రని వేసింది. వారి ఆలాపనలలోని సోపానక్రమ నిర్మాణం, కృతిగానంలోని నూత్న సాంకేతిక ప్రయోగాలు, నిరవల్ అంటే-the melodic employment of musical phraseology, which defines the individuality of a raaga, imaginatively built around a textual piece of the lyric,- కల్పనా స్వరప్రయోగం, మూడు కాలప్రమాణాలలోను, మూడు స్థాయిలలోను ఎంచుకున్న రాగవైభవాన్ని రసికహృదయాలలో సుప్రతిష్ఠితం చెయ్యడం- ఇలాగ సంగీతసభానిర్వహణకౌశలంలో వారు- అరియక్కుడి గానగంధర్వులనే చెప్పాలి.
వారు “చెంచుకాంభోజి“, “మాంజి” వంటి అనేకఅపూర్వరాగాలలోకి సంప్రదాయసిద్ధమైన క్రొత్త ఊపిరులు ఊదేరు. సుమారు 250 కృతులని, సంస్కృతం,తమిళం, తెలుగు భాషలలో, కొన్ని అపూర్వరాగాలలో కూర్చేరు. రాగం-తానం-పల్లవి ప్రక్రియ వారి గాత్రంలో నవీనఅలంకారాలతో, క్రొత్త వొయ్యారాలతో, నూత్నశోభలని పొందింది. ఎస్ . కల్యాణరామన్ , ఎం.ఎల్ .వసంతకుమారి, టి.ఆర్ . బాలసుబ్రహ్మణ్యం, త్రిచూరు వి. రామచంద్రన్ , మొదలైన అనేక ప్రత్యక్ష శిష్యులు వారి వాత్సల్యం పొందినవారే.
వారు ఆంగ్ల కవితలని, వ్యాసాలని రచించేరు. జిఎన్బీ రచించిన 11 పద్యాలు, అంటే, stanzas కలిగిన “THE GOLDEN MEAN” అనే ఖండకావ్యంలో రెండవ పద్యాన్ని, వాౘవిగా, విజ్ఞత కలిగిన మన పాఠకులముందు ఉంచుతున్నాను.
“Be strong and supple, be bold
and kind
Be rich and simple, improve
the mind
In joy, in pain, with equal grace
Your life to lead and death to face.”
దీనికి తెలుగులో అనువాదపద్యం:—
“బలమును, మృదుగుణము, కలిగి వర్తించుచు, ధైర్య, కృపలు; సంపద, సరళతలు; సౌఖ్య, దుఃఖములలొ, సామ్యమును కలుగ, బ్రతికి, విడువవలెను, ప్రాణములను!”
అలాగే 10 పద్యాలు కలిగిన మరొక ఖండకావ్యంలో, 7వ పద్యం దిగువ యిస్తున్నాను:—
“Of all self-woven ropes that bind
Our Mind and Soul, beneath,
behind
The gross shall never with The
Divine exist
Torn we are the two betwixt.”
తెలుగులో అనువాద పద్యం:—
“మనసు మత్తున పడి, మనమె తెచ్చుకొనిన జీవబంధనముల చిక్కు పడుచు స్థూలగతులు, మరియు, సూక్ష్శపదము మధ్యసాగు మనదు బ్రతుకు లూగు లాడు!” పై పద్యాలు స్వేచ్ఛానువాదాలుగా గమనించప్రార్థన.
వారు గొప్ప సంభాషణా చతురులు. వారిగురించి ఎంత వ్రాసినా, చెప్పినా చాలా తక్కువే! ఐతే, ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట విరామం యివ్వాలి. అందుకని- – – – –
స్వస్తి ||
I never knew that GNB is multi faceted. Thank you sir for the info
GNB is great.
ఈనాటి ‘కదంబం’లో సంగీత, సాహిత్య, నటనాది కళా రంగాలలో
మహోన్నత శిఖర సమానులైన శ్రీ జి.ఎన్. బి. వ్యక్తిత్వం చాలా చక్కగాఆవిష్కృతమైంది. It is a miniature representation of the character of a great personality. సంప్రదాయ పద్ధతులకి
కొంచెం భిన్నంగా, నవీన పోకడలు పోయినప్పటికీ, శాస్త్ర మూలాలకి భంగం కలిగించని రీతిలో పాడడం మెచ్చుకోతగ్గది.
ఇక వారి కవిత్వ రచన, దానికి నీ తెలుగు అనువాదం మరీ బాగుంది.
” సంగీత సాహిత్య రసానుభూత్యై
కర్ణద్వయం కల్పితవాన్ విధాతా |
ఏకేన హీనః పునరేక కర్ణః
ద్వాభ్యాం విహీనః బధిరః స ఏవ” ||
“సంగీతం, సాహిత్యం —ఈ రెండింటి రసానుభూతిని పొందడంకోసం, బ్రహ్మగారు రెండు చెవులని(మనిషికి) ప్రసాదించేరు. వీటిలో, ఒకదానియందు రుచిలేని మనిషి “ఏక కర్ణుడు”(ఒంటిచెవి వాడు) గా పరిగణించబడతాడు. అలాగకాక, రెండింటియందూ రుచిలేనివాడు, పూర్తిగా చెవిటివాడనే చెప్పాలి”.